గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం )
106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం
నారద మహర్షి బ్రహ్మ దేవుని పావన గౌతమీ నది గురించి సంక్షిప్తంగా మళ్ళీ చెప్పమని కోరాడు .పూర్వం కమండలం లో ఉన్న గంగ ,తర్వాత విష్ణుమూర్తి పాదాలనుంచి ఉద్భవించి ,మహేశ్వరుని జటాజూటం చేరి ,గౌతమమహర్షి తపో ఫలం చేత బ్రహ్మగిరి చేరి,అక్కడి నుంచి పూర్వ సముద్రం చేరింది .సముద్రునితో సంగమమై సర్వ తీర్ధ స్వరూపంగా ,మానవుల సకల కోరికలను ఈడేర్చేదానిగా ఉన్నది .ముల్లోకాలలో దీనికి మించిన తీర్ధం లేదు .నిజంగా గంగానది పరబ్రహ్మ స్వరూపమే .భక్తి తోనే ఇదంతా చెప్పాను’’ అని చెప్పాడు .నారదుడు ‘’తండ్రీ !నీవు సకల శాస్త్ర వేద,పురాణ పారంగతుడవు .ఛందో రహస్య వేత్తవు.తీర్దాలు ,దానాలు ,యజ్ఞాలు తపస్సులు దేవతలు ,మంత్రాలు ,ఉపాసనలలో ఏది సర్వ శ్రేష్టం ? ‘’అని ప్రశ్నించగా బ్రహ్మ ‘’ఉత్తమమైన పవిత్రమైన రహస్యమైన ధర్మం చెబుతా విను .తీర్దాలు నాలుగు ,యుగాలు నాలుగు ,గుణాలు మూడు ,సనాతన దేవ పురుషులు ముగ్గురు ,స్మృతులతో కలిపి వేదాలు నాలుగు .ధర్మార్ధ కామ మోక్షాలు అనే పురుషార్ధాలు నాలుగు .వాణి నాలుగు రకాలు .సమత్వంతో గుణాలు నాలుగు .ధర్మం సర్వత్రా సామాన్యమైనదీ సనాతనమైనది. సాధ్య సాధన భావాల చే ధర్మం అనేక రూపాలు .ధర్మానికి దేశం ,కాలం ఆశ్రయాలు .కాలాశ్రయ ధర్మం ఒక్కో సారి క్షీణించి ,మళ్ళీ వృద్ధి చెందుతుంది .యుగాలను బట్టి ధర్మం ఒకో పాదం లోపిస్తుంది .దేశాశ్రయ ధర్మం క్షయం ,వృద్ధి అని రెండురకాలు .కాలాశ్రయ ధర్మం నిత్యం దేశం లో ప్రతిష్టితమై ఉంటుంది .యుగాలు క్షీణించినా క్షీణి౦ చదు. .రెండు చోట్లా ధర్మానికి హ్రాసం ఏర్పడితే దానికి అవభం కలుగుతుంది .కనుక దేశాశ్రిత ధర్మం నాలుగు పాదాలతో స్థిరంగా ఉంటుంది .
దేశాశ్రయ ధర్మం తీర్ధాలలో నిలిచి ఉంటుంది .కృత యుగ ధర్మం దేశ ,కాలాలలో వ్యాపించి ఉంటుంది .త్రేతాయుగం లో ఆ ధర్మం ఒక్క పాదం కోల్పోయి దేశం లో ఉంటుంది. ద్వాపర యుగం లో రెండు పాదాలు క్షీణించి ,రెండుపాదాలతో ఉంటుంది .కలి యుగం లో ఒక్క పాదమే మిగిలి సంకటం అవుతుంది .ధర్మ స్థితి తెలిసినవాడిలో ధర్మం క్షీణి౦చదు.యుగాలను బట్టి గుణాలు ,గుణ కర్తలవలన జాతి భేదాలు కలిగి ధర్మ స్థితి అనేక రూపాలో ఉంటుంది..గుణాలను బట్టే సృష్టి లయాలు ఏర్పడుతాయి .తీర్దాలు వేదాలు ,వర్ణాలు ,స్వర్గ మోక్షాల ప్రవృత్తి కూడా అదే రూపం లో ఉంటుంది .అదే విశేషం గా ఉంటుంది .కాలం ప్రకాశకం .దేశం ప్రకాశ్యం .కాలం ప్రకాశ రూపం ధరించినపుడు కాలమే ప్రకాశిస్తుంది .
యుగాలను బట్టి కర్మల తీర్దాల ,జాతుల ఆశ్రమాల యొక్క వైదిక దేవతలమూర్తులు ఏర్పడుతాయి .సత్యయుగం లో తీర్ధం త్రి దైవతంగా పూజింప బడుతుంది .త్రేతాయుగం లో ద్విదేవ మయ పూజ ,ద్వాపరం లో ఏకదైవ పూజ ,కలియుగం లో ఏదైనా రూపంగా పూజింపబడుతుంది .కృతయుగం లో దైవ తీర్ధం ,త్రేతాయుగం లోఅసుర తీర్ధం ,ద్వాపరం లో ఆర్ష తీర్ధం ,కలియుగం లో మానుష తీర్ధం పూజ నీయాలు .గంగానది శివుని శిరసున చేరి ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైంది .మహాదేవుని ఇష్టం ప్రకారం మూడు లోకాలకు అధినాయకి ,జగన్మాత ,లోక హితంకరి ,శాంత ,శ్రుతి గా ఖ్యాతి చెందింది .ఒకసారి గజాననుడు తల్లి పార్వతి తో ‘’నేను ఏమి చెయాలొఆదేశిస్తే దాన్ని చేస్తాను ‘’అనగా తల్లి ‘’మీతండ్రి జటాజూటంలో పవిత్ర గంగ ఉంది .నువ్వు ఆమెను దింపాలి. కానీ మీతండ్రికి ఆమె పై అనురాగం ఎక్కువ జాగ్రత్త ‘’అన్నది వినాయకుడు మళ్ళీ ‘’అది నాకు అసాధ్యం .గంగను వేరు చేయకుండా దేవతలను మరల్చటం కుదరదు .పూర్వం గౌతామహర్షి గంగను భూమిపైకి తెచ్చాడుకదా .అప్పుడు శివుడు సంతోషించి వరం కోరుకోమన్నాడు .ఆయన జటాజూటం తోసహా గంగను తనకిమ్మని కోరగా ,తనకోసం కాక లోకోపకారం కోసం కోరినందున మరో వరం కోరుకొమ్మన్నాడు. శివ దర్శనమే జనాలకు దుష్కరం .నీ కృప చే నీ దర్శనం ఇవాళ నాకు సిద్ధించింది .లోకం కోసమే అడిగావు నీకేం కావాలో అడుగు అనగా ‘’గంగానది బ్రహ్మగిరి నుండి బయల్దేరినది మొదలు సాగరం చేరేవరకు నువ్వు గంగలో ఉండాలి ‘’అనికోరగా శివుడు సంతోషం తో ‘’ఎవరు గౌతమిలో ఏదో ఒక చోట ,ఏదో ఒక యాత్ర కాని ,స్నానం దానం పితృతర్పణం ,స్మరణం,పఠనం చేస్తాడో అతనికి సప్తద్వీపాలతో ఓషధులు సముద్రాలు రత్నాలు పర్వతాలతో సహా భూమిని దానం చేసినంత ఫలం, ధర్మం లభిస్తుంది .ఈ ఫలితం గౌతమి ధ్యానం వలన కూడా కలుగుతుంది .గంగా సాగర సంగమం లో సూర్య ,చంద్ర గ్రహకాలం లో భక్తితో విష్ణు ధ్యానం చేస్తే ,దూడతో గోదానం చేస్తే అతని పుణ్యం చెప్పనలవి కాదు .కనుక లోక శ్రేయస్సుకోసం గంగను తీసుకు వెళ్ళు ‘’అన్నాడు గౌతమునితో శివుడు అన్నాడని ఈ విషయం తానూ విన్నానని ,శివుని మరల్చటం ఎవరికీ సాధ్యం కాదని ,ఒకపని మాత్రం చేస్తాను గోదావరి దగ్గరలో ఉన్నా అక్కడికి వెళ్లరు శివునికిమస్కరించరు అని తల్లికి చెప్పాడు గజాననుడు .అప్పటినుంచి మానవులకు ఏదో ఒక విఘ్నం కలిగిస్తున్నాడు .ఆయన్ను పూజిస్తే విఘ్నాలు కలగకుండా చూస్తాడు , గంగ ప్రభావాన్ని సాక్షాత్తు శివుడే చెప్పలేడు.నాకు సాధ్యమా ?ఏదో సంక్షిప్త్తం గా చెప్పాను .బ్రహ్మాండ పురాణం లో ఒక శ్లోకం ,ఒకపదం చదివినా ముక్తి కలుగుతుంది .’’గంగా గంగా’’ అని ఉచ్చరిస్తే చాలు యెంత దూరం లో ఉన్నా ఫలితమిస్తుంది .వెయ్యి అశ్వమేధాలు ,వంద వాజపేయాలు చేస్తే కలిగే ఫలితం ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ వింటే కలుగుతుంది .ఈ పురాణం ఉన్న ఇంట్లో కలి భయం ఉండదు .శ్రద్ధా శక్తులకు శాంతులకు ,విష్ణు భక్తులకు ,మహాత్ములకు మాత్రమే దీన్ని చెప్పాలి .’’లిఖిత్వా పుస్తక మిదం బ్రాహ్మణాయ ప్రయచ్చతి –సర్వ పాప వినిర్ముక్తః ,పునర్గర్భం న సంచి శేత్ ‘’.ఈ పురాణం రాయించి బ్రాహ్మణుడికి దానమిస్తే సర్వపాప విముక్తికలిగి ,జన్మరాహిత్యమై ముక్తి పొందుతాడు ‘’అని బ్రహ్మ నారదునికి ఉపదేశించాడు .
గౌతమీ మహాత్మ్యం సంపూర్ణం
ఆధారం –వేద వ్యాస కృత బ్రహ్మాండ పురాణా౦తర్గత ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ను డా. వెల్మకన్నెహనుమాన్ శర్మ ,గారు బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథ శర్మగారు అనువదించగా,విశ్వనాథ శర్మగారు అభిమానం తో మేము ధర్మపురిసందర్శించినపుడు నాకు విలువైన కానుకగా 28-10-2018న వారింట ఆతిధ్యమిచ్చి అందజేసిన అపురూప గ్రంథం. రాసిన వారికీ ,అందజేసిన కొరిడే వారికి ధన్యవాదాలు .
మనవి- గౌతమీ మహాత్య్మం ను 2018కార్తీకమాసం లో అంతర్జాలంలో తేలిక భాషలో ముఖ్య విషయాలు మాత్రమే తెలియ జేస్తూ రాయటం ప్రారంభించి కొంత వరకు రాసి, మాఘమాసం లో కొనసాగించాను .మళ్ళీ ఈ 2019 కార్తీక మాసం లో ప్రారంభించి ఈ రోజుతో పూర్తి చేశాను .ఇది నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను .ఇందులోని దోషాలన్నీ నా అవగాహనా రాహిత్యం వలన ఏర్పడినవే అనీ ,గుణాలన్నీ శర్మ ద్వయం వారివే నని, సవినయంగా మనవి చేస్తున్నాను .చదివి ఆదరించినవారందరికీ పుణ్య ఫలప్రాప్తి కలగాలని కోరుకొంటున్నాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-19-ఉయ్యూరు

