డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన మాడుగుల

డజనున్నర కథల్లో  మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన  మాడుగుల

చక్కని వాచికం ,స్వరం లో అన్ని భేదాలు ,రసాలు పండించే చాతుర్యం ,సుమనస్కత ,మూర్తీభవించిన సౌజన్యం ,సంస్కారం ,సకలకళా రహస్య వేతృత్వం ,నిష్పక్షపాత నిర్ణయ సాహసత్వం ,నిజాయితీ ,భేషజం లేని నడవడి,చిరునవ్వుకు చిరునామా అయిన  ముఖం ,కలుపుకోలు తనం ,సోషియాలజీ ,జర్నలిజ౦ లో స్నాతకోత్తర పాండిత్యం ,విజయవాడ ఆకాశ వాణి లో వివిధ హోదాలలో 36ఏళ్ళ విధి నిర్వహణ లో తనదైనముద్ర ,సృజనాత్మక రూపక నాటకాల నిర్వహణలో జాతీయ పురస్కార విజేత , రంగస్థలం పై సులలిత వ్యాఖ్యానత్వం ,మునిమాణిక్యం ,గురజాడ ,కందుకూరి, పుచ్చా ,ముళ్ళపూడి, శ్రీరమణ ల ప్రేరణ ,’’హాస్య కస్తూరి’’ ,వంగర ,రేలంగి రమణారెడ్డి ,సూర్యకాంతం నటనల నిశిత పరీక్షలో ఆరి తేరిన తీరు ,సుత్తి ,రెండు చింతల ,’’’’చిన్న’’ కోట’’ ,విన్నకోట ల హాస్య నాటికలలో నటించిన అనుభవం తో రాసి, మురిపించిన హాస్య నాటికల, కథల విహార౦  వెరసి శ్రీ మాడుగుల రామ కృష్ణ . ఈ కళా మూర్తి  ప్రతిభ గుర్తించి సుమారు ఆరేళ్ళ క్రితమే ఆయనకు  సరసభారతి పురస్కారం అందించి గౌరవించి సత్కరించి ఆత్మీయుడిని చేసుకొన్నది సరసభారతి .నవంబర్ 15 విజయవాడ టాగూర్ లైబ్రరీ లో జరిగిన కవి సమ్మేళనం లో పాల్గొనటానికివచ్చి, నాకు  ఏడాది క్రితం ముద్రించిన ,తన ‘’డజనున్నర హాస్య కథలు ‘’పుస్తకం ఇచ్చి ‘’చదివి అభి ప్రాయం తెలియ జేయండి ‘’అని కోరటం ,నేనేదో పనుల్లో ఉండి చదవకపోవటం ,నిన్న ఉదయం ఫోన్ చేసి ‘’పుస్తకం చదివారా గురువుగారూ !’’అని సుతిమెత్తగా అంటే ‘’ఇవాళ చదువుతానండి ‘’అనటం జరిగింది .మాట నిలబెట్టుకోవటానికి నిన్నమధ్యాహ్నం ,సాయంత్రం రాత్రి చదివి పూర్తి చేశాను  .ఐతే ఏం రాయాలి ,ఎలా రాయాలనే దుగ్ధ పట్టుకొన్నది .’’హాస్య మధ్యాహ్న రవి ‘’తేజస్సుకు దివిటీ పట్టినట్లుగా ,చల్లని హాస్య చంద్రునికి నూలు పోగు వేసినట్లుగా ఉంటుందేమో అని సందేహం లో పడి, శీర్షిక కోసం బుర్ర పగలకొట్టుకొని  అది తటాలున స్పురిస్తే   ఇప్పుడే రాయటం మొదలు పెట్టాను .

    ఇందులోని కథలు డజనున్నర అంటే 18.అన్నీ చదివాక 18పర్వాల’’ హాస్య తెలుగింటి భారతం ‘’అని పించింది .దేనికదే సాటి .సునిసిత హాస్యం తొణికిసలాడింది.మధ్యతరగతి మందహాసానికి ప్రతి రూపమై౦ది .వికృతత్వం ,పైత్యం లేని సరదా జరదా హాస్యం .ప్రతి కథలో అండర్ కరెంట్ గా నీతి ఉంది .భేషజాలకు పోయి నడుం విరక్కొట్టుకున్నవాళ్ళు ,’’ఆఫీసర్ కుక్క’’కు మొహపాటపడి’’ ఏదో’’ చేయించుకొన్నవాడు ,మూడు లక్షలు కట్నం తీసుకొన్న అల్లుడికి బుద్ధి చెప్పటానికి అమ్మాయి గారింట్లో తరచూ అత్తమామలు తిష్టవేసి ,దాన్ని ఖర్చురూపం లో రాబట్టిన మామ ,అర్ధరాత్రి వచ్చే కలలను ఆపుతానని డబ్బు గుంజి చివరికి చేతులెత్తేసిన డాక్టర్ ,ఎనిమిదో వ్యసనమైన సన్మాన భాగవతం ,నవ్వితే బతుకులు బండలౌతాయని స్వానుభవంతో ఎలుగెత్తి చాటిన హాస్యానంద స్వామి ,గరిటేగతి అయిన సీతాపతి  ,డబ్బుకోసం కోటి మోసాలు చేసి బాధపెట్టిన  భర్తను’’కనపడక్కరలేదు ‘’అని పేపర్ ప్రకటన ఇచ్చిన భార్య ,కీర్తి కోసం ,’’గిన్నెల రికార్డ్ ‘’ లో చోటు చేసుకోవటానికి ఆరాటపడి చేతి చమురు వదిలి౦చు కొన్న’’కీ,కా.లు ‘’అంటే కీర్తి కాంక్ష కలవారు. ఆఫీసుకు జీతనస్టం  సెలవుపెట్టి గోదారి పుష్కరాల్లో పుష్కలంగా డబ్బు పీక్కోవచ్చని పురోహితుడి వేషం వేసి ,పుష్కరం పెట్టించుకొనే వారు లేక ,ఇంటికి బంధు జనం పుష్కలంగా వచ్చి లక్షలు అప్పు చేసిన అత్యాస ఉద్యోగి ,అతి ప్రవర్తనకు  విరుగుడు మంత్రాలు వేసి ఆదుకొన్న స్నేహిత బంధుగణం   ,దేవుడిని  ఏ వరం కోరుకోవాలో తెలీక పనికి మాలినవి కోరి, కొరివి నెత్తి కెత్తుకొన్న  బడుద్ధాయి ,చివరాఖరికి ముసలి బామ్మ కోటి రామకోటి రాసి ,వెయ్యి సమూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించి ,ఏటి కేదడాది నోములు వ్రతాలు గుళ్ళల్లో జరిపించి,తనకెందుకు డాక్టర్ ఇవ్వరని పోట్లాడి ప్రయత్నించిన  బామ్మ  కూడా డాక్టరేట్ కోసం ఆరాట పడి,భంగపడి ,ఆ బాధలు పడలేక’’ వంటింటి ,పెరటి వైద్యం ‘’తో అందరికీ దగ్గరై ‘’డాక్టర్ బామ్మ ‘’అని పించుకున్న  ముసలావిడ ,చండిక తత్త్వం తో సంసారం చిద్రం చేసుకొని బుద్ధి వచ్చి ఆ  ,వారసత్వం కూతురుకు కూడా రావటం తో అవాక్కైన మహిళ,కాశీలో చద్దామని విశ్వ ప్రయత్నం చేసి ,ఆఖరికి ఖాజీ పేట లో యాక్సిడెంట్ లో చచ్చిన వాడు ,విమానం ఎక్కితే గండం అని  ఇంటివాళ్ళు, జ్యోతిష్యుల హెచ్చరికతో రైలు ప్రయాణం చేసి ప్రమాదం లో చావు తప్పి కన్ను లొట్టబోయి విమానం లో పంపగా ఇంటికి చేరిన వాడు –ఇలా వెరైటీ కేరక్టర్లతో పుస్తకం అంతా హాస్య రస స్పోరకం గా ఉంది .గోదారి వరద లాగా హాస్యం పొంగి పారింది .హాట్సాఫ్ రామ కృష్ణగారు .హాస్యం ఆయన వంటిలో  జీర్ణించి పోయి ,స్నిగ్ధమై ,ముగ్ధ మనోహరంగా వెలువడింది .ఇది ప్రయత్నపూర్వక హాస్యం కాదు  .స్పాంటేనియస్ హ్యూమర్ .ఇది అందరికీ అబ్బదు .ఇలాంటివారికి, కేఆర్కే మోహన్ గారికి ,హాస్యబ్రహ్మ  భమిడిపాటి వారికి జంధ్యాల వంటి కొద్దిమందికి మాత్రమె అబ్బినకళ.మాడుగులవారు సార్ధకం చేసి రుచి చూపించారు .

  మాడుగుల వారు పాత్రలకు పెట్టిన పేర్లు బహు విచిత్రంగా ,పాత్రల స్వభాలను తెలియ జేసేవి లా ఉన్నాయి .కథా శీర్షి కలూ వింతగా విడ్డూరంగా ఆకర్షణీయం గా ఉండటం ప్రత్యేకత .’’మాడుగుల మార్కు’’ప్రస్పుటంగా  కనిపిస్తుంది .నామకరణ మహోత్సవం చూద్దాం –మన్మధం,శనీశ్వర్,సన్మానాల్రావ్,మీన లోచనం ,గండాలమ్మ , పాప నాశనం తాతయ్య ,మత్శ్యావతారం బాబాయి ,వెరైటీ సుబ్రహ్మణ్యం వంటివి .భమిడి పాటి  వారి సార్ధక నామదేయాలు గుర్తుకొస్తాయి .ఆఫీసరు గారి కుక్కకు షార్ట్ నేం ఆఫీసరు కుక్క.జోగిలో మార్పు వస్తే జోగి అడుగుతూ తిరుపతికి వెళ్ళటం ,’’సరస శృంగార రచయిత’’అని సంబోదించి నిరసనలు ఎదుర్కొన్న కాకారాయుడు .నవ్వండికాని ,నవ్వులపాలు కాకండి అన్న నీతి.’’మా ఆవిడ కాలు జారింది ‘’అని నోరుజారి దెబ్బతిన్నవాడు  .ఇలా ఎన్నని చెప్పను ?నూజి వీడు రసం మామిడి పండు టేస్టు ,అదేదో కథలో నవాబు గారి పీచుగడ్డానికి పంచదార బెల్లం తేనే ,చింతపండు కలిపి పేస్టు చేసి పూసి ఇంకోడెవడి నో నాకి, రుచి  చూసి చెప్పమంటే ఎలా ఉంటుందో ,ఈ హాస్య రస మాధుర్యం  ఆస్వాదించాలంటే  అంతే, అందరు చదివి అనుభూతి పొందాల్సిందే .మాటలకు అందని హాస్య మాధుర్యం మాడుగుల వారి కథల్లోఉంది .

వారి సెల్ నంబర్ -93,47,16,40,10

E-mail –madugulark@gmail.com

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-19-ఉయ్యూరు

   

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.