గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘’
స్వతహాగా తెలుగు పండితుడు , కవి సరసభారతికి, నాకూ దశాబ్ద కాలం గా పరిచయము న్నవాడు ,మా కార్యదర్శి శ్రీమతి శివ లక్ష్మి తమ్ముడు, చి .యల్లాప్రగడ వెంకట రామరాజు లోకాన్ని తనకళ్ళతో చూసి అనుభూతి పొంది రాసిన శతకం ఇది .మనకూ అలాగే కనిపిస్తుంది సత్యవాక్కులే అన్నీ .జాతిఖ్యాతికి తెగులు మనిషి మెదడుకు పగులు దాన్ని నివారించేది దేశ భక్తి ,భాష భావం వెన్న ,గద్య బంధం మిన్న ,చిన్న విజయం అన్నింటికీ మిన్న ,బతుకు అల్పం కాదు ,ధన్యజీవిగా కదులు ,బలము బుద్ధినితేదు,తపనను నిలిపేది గెలుపు,దివ్యమైనది నవ్వు ,మనిషిని ఒంపేది యావ ,ఉన్నతికి అహము విడుచుట హద్దు ,దారి తప్పి వగచి ప్రయోజనం లేదు ,ఎవరైనా కూటికోసమే వేట చేస్తారు ,డబ్బు చప్పుడే వారికి బాట ,గుడీ ,బడీ మింగే వాడు సంఘజీవి కాడు,మమత చూపని మనసు లోతు తెలియని సరస్సు ,శ్రమ తోనే వెలుగు సాధ్యం, యువత మమత పంచాలి ,విద్య వినయాలు మిన్న ,ముఖం మెరుపుకు నవ్వు ,కనుల ఆనందానికి పువ్వు ,నవ్వును మాత్రం ఎప్పుడూ తవ్వుతూనే ఉండు ,ప్రాయం, కాయం అంతమొందేవే కనుక సాయం తో చిరంజీవి కావాలి ,తెలుగు వెలుగుతూ ఉంటె చీకట్లు తొలగి ,ధైర్యం కలుగుతుంది అనే అనేక విషయాలను లయబద్ధంగా ,క్రాంత దర్శకంగా , ప్రబోధాత్మకంగా ,ఆరుద్ర కూనలమ్మ పదాల్లా కూర్చి’’ మన్ పసంద్ ‘’ చేశాడు తిల్లానాల్లా యల్లా ప్రగడ . వేదనా, ఆవేదన ,సానుభూతి, తపనా ఉన్న ముక్తకాలు .ఆవేశం ఆక్రోశం లేనివి .మనసు లోతుల్లోంచి వచ్చినవి .కనుకనే ఆణిముత్యాల్లా, సొగసుగా, సుందర బందుర౦గా , వీనులకి౦పుగా ఉన్నాయి . మరింత సాహితీ సేవలో రాణించాలని రామరాజు నిజంగానే’’ సాహిత్య విజయ రామరాజు ‘’కావాలని ఆశిస్తూ, ఆశీర్వ దిస్తున్నాను .
గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-20-ఉయ్యూరు