అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్
ఆకాశం అనే గ్రహ అంతరాల ప్రదేశం అంతా కాంతి ప్రసారానికి ఉపయోగపడే ఈధర్ అనే అతి సూక్ష్మ పదార్ధం తో నిండి ఉందని ,దానివల్లనే కాంతి సెకనుకు 1,86,284 మైళ్ళ వేగం తో ప్రయణిస్తుందని ,కానీ ఆ సూక్ష్మ పదార్ధం సైన్స్ కు అందని అజ్ఞాత విషయమని న్యూటన్ మొదలైన వారు సిద్ధాంతీకరించారు .ఈ ఈధర్ లోనే అసంఖ్యాక నక్షత్ర గోళాలలో భూమి తన చుట్టూ తానూ గంటకు వెయ్యి మైళ్ళ వేగం తో తిరుగుతూ ,సూర్యుడిని సెకనుకు 20మైళ్ళ వేగం తో చుట్టి వస్తుంది .భూమి ,చంద్రులు ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతున్నారు .సూర్యుడు తన గ్రహ కూటమి తో సహా మిల్కీవే లో కనిపిస్తూ ,బ్రహ్మ నక్షత్రం’’ వెగా ‘’చుట్టూ ,సెకనుకు 13మైళ్ళ వేగంతో తిరుగుతాడు .ఈ బ్రహ్మ నక్షత్ర కూటం అంతా నక్షత్ర వీధి –పాలపుంత ను సెకనుకు 200మైళ్ళ వేగం తో చుడుతుంది .ఈ నక్షత్ర వీధి అతి దూరంగా ఉన్న మరో నక్షత్ర కూటాన్ని సెకనుకు 100మైళ్ళ వేగం తో చుట్టి వస్తుంది .వీటన్నిటికి మధ్య భాగం లో మానవ దృష్టికి కనిపించని మూల కేంద్రకం ఒకటి ఉంటుందని న్యూటన్ భావించాడు .కానీ ఈ అసంఖ్యాక గోళాలకు ఆధార మైన స్పేస్ అనేది భౌతిక మైన సద్వస్తువు .అది అతి నిశ్చలంగా అచంచలంగా ఉందని ,అది ప్రకృతిలో ఈశ్వరుని సర్వ వ్యాపకత్వాన్ని నిరూపించే పదార్ధం అని న్యూటన్ విశ్వసించాడు..
న్యూటన్ తర్వాత కాలం లో ఈధర్ వాదాన్ని శాస్త్ర వేత్తలు త్రోసి పుచ్చారు .కారణం ఏమిటి అంటే ఈధర్ లో భ్రమణం చేసే భూ మండలం నుంచి అనుకూల వ్యతి రేక దిక్కులకు ప్రసరింప చేసిన కాంతి వేగాల్లో తేడాలు కనిపించటమే .కనుక ఈధర్ అనేది పదార్ధ భావం కాదు అని తేల్చారు .ఈధర్ పదార్ధ భావం కాదు అన్న ఈ సిద్ధాంతాన్ని అయిన్ స్టీన్ –భూ భ్రమణం వలన మాత్రమె కాక ,సూర్యాది ఇతర గ్రహ భ్రమణ విశేషం వలన కూడా కాంతికి ఎలాంటి అంతరాయం ఏర్పడదు అని తీర్మానించాడు .ఈ సిద్ధాంత ఫలితంగా స్పేస్ కు దిక్కులు కాని అవధులు కాని లేవని, దేశ ,కాలాలు ఇంద్ర ధనుసు రంగులు లాగా కల్పితం అన్నాడు .అన్ని వస్తువులకు అవకాశం ఇచ్చేదే స్పేస్అని ,ఈ స్పేస్ లో జరిగే కార్య పరంపరను సూచించేదే కాలం .దీని గణనకు సెకను నిమిషం గంట ఏర్పడ్డాయి .అభావం అయిన కాలానికి ఈ సూచనలే ఆధారం వస్తువులునికి తెల్పే స్పేస్ లాగే ,వస్తువు యొక్క కార్య సంఘటన క్రమాన్ని మాత్రమె కాలం సూచిస్తుంది .పరాపరాలు ముందు వెనుక రూపం లో దేశ అంటే స్పేస్ కాలాలు ప్రవర్తిస్తాయి .స్పేస్ కు ఒకరకమైన కొలతలు ,కాలానికి వేరే రకమైనకొలతలు కావాలి .అంటే అనిర్వచనీయం ,సర్వవ్యాపకం అయిన దేశ కాలాలను కృత్రిమమైన కొలతలతో స్థూలం చేస్తున్నామన్నమాట .ఈ కొలిచే విధానం సూర్య గ్రహ కూటాలకు మాత్రమె సంబంధించినవి .ఇతర చోట్ల ఉపయోగ పడవు .ఆకాశం లో సూర్యుడు 15డిగ్రీలులో ఉంటె గంట అనీ ,సూర్యుడిని ఒకసారి భూమి చుట్టివస్తే సంవత్సరం అంటాం .కానీ బుధ గ్రహాన్ని చూస్తె అది సూర్యుడికంటే భూమికి దగ్గరగా ఉండటం వలన 88రోజుల్లో సూర్యుడిని చుట్టి సంవత్సరం పరిమాణాన్ని తగ్గించింది .తన చుట్టూ తానూ తిరగటానికి 88రోజులు పడుతుదికనుక రోజుకు, సంవత్సరానికి మానం లో తేడా ఉండదు .శుక్రుడికి 225రోజుల సంవత్సరం .కొన్ని వారాల రోజు ఉంటుంది .అంగారక గ్రహం భూమి కంటే దూరంగా ఉంటుంది కనుక అక్కడ సంవత్సరానికి 687రోజులు ,రోజుకు 24గంటల 55నిమిషాలు ఉంటాయి .బృహస్పతి జూపిటర్ కు 9గంటల 55నిమిషాలు ఒక రోజు .శనికి 10గంటల 14నిమిషాలు ఒక రోజుకు .ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కో కాలమానం ఉంటుంది .మన దేశం లో సూర్యోదయమైతే అమెరికాలో రాత్రి అవుతుంది .దేశాకాలపరిస్థితులను బట్టి మాన విధానం మారుతుంది .ఈకాలమానాలు మనం కల్పించుకొన్నవే కదా .వీటిని కాదంటే ,దేశకాలాలు సువిశాలాలు ,నిర్వికారాలు,నిరవదికాలు అవుతాయి .ఇదే వాటి సహజ స్వరూపం .ఇక్కడ ముందు వెనకలు, పైనా కిందా లేనేలేవు .మనిషి తన సౌకర్యం కోసం వీటిని కల్పించి ,అనుభవిస్తున్నకాలం వర్తమానం అనీ ,దానికి ముందుది భూతకాలమని ,దాని తర్వాతది భవిష్యత్ కాలం అని భావిస్తున్నాడు .అంటే అఖండ కాలానికి ఖండత్వం కల్పిస్తున్నాడు .అభిన్నమైన దేశం అంటే స్పేస్ లో లోపల బయట అనీ ,దూరం,దగ్గర అనీ కల్పించుకొని జీవిస్తున్నాడని అయిన్ స్టీన్ మహాశయుని సిద్ధాంత తాత్పర్యం.
పై విషయాలను మరింత లోతుగా సూక్ష్మ౦గా ఆలోచిస్తే దేశ ,కాలాల మధ్య తేడా తగ్గించి space-time –continuum అంటే దేశకాల ప్రవాహం అనీ ,అంతా దేశ కాలనిబద్ధమని ,ఈ ద్వయం అభిన్నమని అంటే కాల మానాలు నిజానికి దేశ మానాలే అనీ ,అవి పరస్పర అపేక్షికాలని ,ఐన్స్టీన్ సిద్ధాంతీ కరించాడు .అంటే ప్రకృతిలో ఈ రెండు ఒక్కటే అని ,కనిపించే భిన్నత్వం కల్పితమని ఆయన భావం .ఆయన సిద్ధాంతం ప్రకారం పాంచ భౌతిక వస్తుజాలం అంతా దేశ ,కాల బద్ధాలై నాలుగు కాలమానాలు కలిగి ఉంది .అందులో మూడు దేశానికి అన్వయిస్తే ,ఒకటి మాత్రం కాలానికి .పొడవు వెడల్పు ఎత్తు అనేవి దేశానికీ ,ఎప్పుడు అనే ప్రశ్న కు సమాధానం కాలానికి చెందుతుంది .వ్యక్తికి సంబంధించిన దేహ పరిమాణం దేశానికి ,వయస్సు కాలానికి అన్వయిస్తుంది .ఇలాగైనా దేశకాలాలు అభిన్నాలు అని అయిన్ స్టీన్ సిద్ధాంతం .ఆధునికకాలం లో యెంత దూరం అనే ప్రశ్నకు రైలులో కొన్నిగంటలు విమానం లో కొన్ని నిమిషాలే కదా .దేశ మానం లో అంగుళం మొదలైనవి మూడు కొలతలకు అంటే పొడవు వెడల్పు ఎత్తు లకు సరిపోతే ,కాలం మాత్రం క్షణాధికానికి అన్వయిస్తోంది .దేశ,కాలాల సంకోచ వ్యాకోచాలు మానవా ధీనాలు కానీ కాలాన్నే వేగ వంతం చేయటం కాని ,నెమ్మదిని చేయటం కాని వెనక్కు తిప్పటం కానీ మనకు సాధ్యం కాదు .సర్వ చరాచరాలు పరాధీనం అయి ,భూతకాలం నుంచి వర్తమానానికి, దానినుంచి భవిష్యత్తుకు సాగిపోవాల్సిందే కానీ ,మార్గాంతరం లేదు .దేశాకాలాలలో కొంచెం తేడా కనిపించినా అవి కల్పితాలే అని భావించి ,ఏకం చేసి ,కాలాన్ని నాలుగవ మానం గా చేర్చి ,సమన్వయ పరచి ,విజ్ఞాన లోకానికి నూతన భావ ధారను అయిన్ స్టీన్ కల్పించాడు .హాట్సాఫ్ టు హిం .ఇది కణాదుల వైశేషిక న్యాయానికి దారితీసింది .
ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-21-ఉయ్యూరు

