భారత మాత దివ్య స్వరూపం
భారత మాత పూర్వం ఎలా ఉందో,ఏమి చెప్పిందో గ్రహించటానికి దేశ కాలాలలో చాలాదూరం ప్రయాణం చేస్తే కాని ఆ మాతృ స్వరూపాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేము .చారిత్రిక విధానం లో ఉన్న పాక్షిక దృష్టి కాక ,పరిణామాన్ని తటస్థ దృష్టి తో చూసి, ఈ సంస్కృతి వ్యక్తి నిత్య జీవితం,సంఘం ,ప్రజాబాహుళ్య0 లో ఎలా ప్రవేశించి మార్పు తెచ్చిందో గ్రహించాలి .అందుకోసం మనం ముందుగా సంస్కృతి అంటే ఏమిటో అర్ధం చేసుకోవాలి .
‘’ఒక జాతి సంస్కృతి దాని సర్వ సామాన్య వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది ‘’అన్నాడు ధీరేంద్ర నాథ్.అంటే జాతికి సంస్కృతి జీవగర్ర అని భావం .ప్రజానీకం యొక్క బాహ్య అభ్యంతర పురోగమనాన్ని కలుగ జేసే సంపూర్ణ నాగర వ్యవస్థలో అప్రత్యక్షంగా ,సర్వ వ్యాపకం గా ఉన్న తత్వమే సంస్కృతి అన్నాడాయన ., సంస్కృతి కున్న సంబంధం ఏమిటి ?ప్రత్యేకతలతో వేషభాషలలో అనేక మార్పులు కలిగించి ,భూసారం పెంచి సస్యశ్యామలం చేసి మానవ జీవితాలలో బాహ్యమైన మార్పులు కలిగించేది సంస్కృతి .దీని వలన భూ గర్భం లో ఉన్న అనేక లోహజాతులు రూపాంతరం చెంది ,మానవులకు ఉపయోగకారకాలై మానవ జీవితాన్ని సున్నితం చేస్తుంది .ఈ సంస్కృతీ బలం తో కిందికి ప్రవహించే జలాలు పైకి ఎగసి ప్రజోపకారం గా మారతాయి .అనేక ప్రకృతి శక్తులు మానవాధీనాలై దుఖం తగ్గించి సుఖాన్ని పెంచటానికి తోడ్పడతాయి .దీనినే లౌకిక సంస్కృతీ అంటారు .
సంస్కృతిలో రెండవభాగం ధార్మికం అంటే నైతికం అంటారు .మొదటిదానిలో ప్రకృతి శక్తులు ద్వారా సంపద పెరిగి మనిషి అనుభవించి సుఖిస్తాడు .రెండవ భాగం అతడి స్వేచ్చా విహారానికి కొన్ని అడ్డకట్టలు వేస్తుంది .స్వార్ధాన్ని తగ్గిస్తుంది స్వాతంత్రానికి హద్దులేర్పరుస్తుంది .అనుభవించే అధికారం ఉన్నా వనరులకు ఆటంకం కలిగించరాదని శాసిస్తుంది .ఇతరులను బాధించ రాదని ,నివారిస్తుంది .అందరికీ అనుభవించే హక్కు ఉందని బోధిస్తుంది .ప్రకృతి సంపదానుభవం మనిషికి లాగానే ఇతర ప్రాణులకు అధికారం ఉందనే ఎరుకతో మానవ సమాజం జీవిస్తోందని పండిట్ నెహ్రు అన్నాడు .’’భారత దేశం ప్రాచీన పురుషుల్ని విస్మరిస్తే ,అది భారత భూమిగా ఉండదు .తనకు ఆనందం గర్వకారణం అయినది అంతా అదృశ్యమౌతాయని నెహ్రు పండితుడే విస్పష్టంగా చెప్పాడు .గతాన్ని ద్వేషించకుండా అందులోని మంచిని, వర్తమాన భావిష్యత్తులకు ఉపయోగ పడేట్లు చేయాలి .’’భూతకాలాన్ని వర్తమానానికి అనుసంధించి ,భవిష్యత్తుకు మేళవించి ,ఉపయోగ పడని వాటిని వదిలేసి ,భావన, ఆచరణ కోసం సచేతనం చేయటమే శ్రేయస్కరం ‘’అన్నాడు నెహ్రు .
‘’ The philosophy of a country is the cream of its culture and civilization ‘’అంటే దేశ సంస్కృతి,నాగరకతలకు ఆదేశ తత్వ శాస్త్రం వెన్నలాంటిది .అందుకే భారత దేశ ఔన్నత్యం అనాది గురు పరంపరాగత ఆధ్యాత్మిక విద్యా వైభవం మూలంగానే వ్యక్తమౌతాయి .ఆమెకు ఆధ్యాత్మిక విద్యయే జీవ గర్ర ..ఆమహిమ వలన భారత దేశం ఒక్కటే భగవంతుని గ్రహించిందని ,దివ్యాతి దివ్య ఆధ్యాత్మిక సంప్రదాయానికి కారకం అనీ ,ప్రపంచం లోనే అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి అనీ ,ప్రపంచానికి హృదయ స్థానమని ,మానవ పరిణామానికి అధినేత అనీ ,ప్రపంచానికి శిరస్సు అనీ ,జగన్మాత అనీ ప్రఖ్యాతి పొంది ,పవిత్ర చరిత్రయై భారతి స్వార్ధ పరం కాకుండా ఈశ్వర నిమిత్తంగా లోక సంగ్రహణం కోసం ఉందని ,అలౌకిక యశో నిదానంగా ప్రకాశిస్తోందని అవిలినో ,లూయిస్ రెనాన్ ,కెన్నెత్ వాకర్ ,శిరీష్ కుమార్ మిత్ర ,స్వామి రామ తీర్ధ ,అరవిందులు ,చెప్పిన విలువైన మాటలను మనం మననం చేసుకొంటూ అర్ధం చేసుకోవాలి .
ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –సర్వ సిద్ధాంత సౌరభం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-21-ఉయ్యూరు


శ్రీ గబ్బిట దుర్గాప్రసాదు- సరసభారతి వుయ్యూరు గారికి ఇతోధిక వన్దనములు. భారత మాత దివ్య స్వరూపం సమాచారము చాలా గొప్పగాయున్నది.
భవదీయుడు,
ఆర్. వి. యస్. చౌదరి, హైదరాబాదు
LikeLike