శ్రీ శంకరుల దేశ పర్యటన

శ్రీ శంకరుల  దేశ పర్యటన

ఆతర్వాత శంకర  యతీ౦ద్రులు దేశం నలుమూలలా అద్వైత మతాన్ని స్థాపించటం కోసం  శిష్య గణం తో  భారత దేశమంతా పర్యటన ప్రారంభించారు .అన్ని రాష్ట్రాలపాలకులు శంకరుని గౌరవంగా ఆహ్వానించి అద్వైత ప్రచారానికి బాగా తోడ్పడుతున్నారు .ముందుగా మాహిష్మతి నుంచి ,మహారాష్ట్ర మీదుగా దక్షిణాప్రయాణమయ్యారు .మహారాష్ట్రలో మల్లరులు ,కాపాలికులు ,భైరవారాధకులైన తాంత్రికులు న్నారు..వీరి మత సిద్ధాంతాలను అనుష్టానవిధానాలను ఖండిస్తూ ,వారిఅనుచరులను మార్చి ,శిష్యులను చేసుకొని దిగ్విజయ యాత్ర చేశారు .శంకర వాద విధానం లో   ఒక సామరస్యం ఉన్నట్లు ఆనందగిరి రాశాడు .ఒక చోటుకు చేరగానే శంకరులు ఆదేశం లోని పండితులను  సమావేశానికి  ఆహ్వానించి,వారి మతవాదాన్ని దాని సాధనా విధానాన్ని వారితోనే చెప్పించి శ్రద్ధగా వినేవారు .తర్వాత ఆ మత వాదం పై వారితో సాకల్యం గా చర్చించి ,ముందుగా అందులో తనకు అంగీకారం అయిన  విషయాలను చెప్పి , తర్వాత అంగీకారం కాని విషయాలపై తీవ్రంగా వారితో చర్చించి ,తన సిద్ధాంతాన్ని సమర్ధించి ,వారి సిద్ధాంతం లోని దోషాలను ఎత్తి చూపటం తో ప్రత్యర్ధులు సులభంగా శంకర భావ ధారకు లొంగి ,అనుచరులు శిష్యులవటం ముఖ్య విశేషం .

   ఈ ప్రయాణం లో మహారాష్ట్రలో ఒక చోట ఒక కాపాలికుడు కుటిల ప్రయత్నాల చేత చంపాలని భావించాడు .’’Man’s  unhappiness comes of his greatness ‘’తన ప్రతిష్టవల్లనే మానవుడికి దుఖం కలుగు తుంది అనే మహాకవి కార్లైల్ నానుడి ననుసరించి శంకరుని కీర్తి ప్రతిష్టలు చాలామందికి అసూయకు కారణమయ్యాయి .ఈకాపాలికుడు మూఢ౦గా తెగించటం చేత అతని పేరు లోకానికి తెలిసింది కానీ ,ఇంకా యెంత మంది ఉన్నారో తెలీదు .వీడు అంతా నిద్రించే సమయంలో శంకరుని తల నరకటానికి వచ్చాడు .వాడికి మించిన శక్తి సామర్ధ్యాలున్న పద్మపాదునికి తెలిసి .వచ్చి వాడి చేతిలోకత్తిలాగేసి వాడిని చంపేశాడు .దీనికి భిన్నంగా కాపాలిడు ఒకసారి శంకర సన్నిధానానికి వచ్చి ఒక మహాత్ముని శిరస్సు కాళికా దేవికి అర్పించాలను కొన్నాననీ అమహాత్ముడు శంకరుడే అని ,శిరసు ఖండించిన మాత్రం చేత ఆత్మ అవిచ్చేద్యం కదా అని ఆయనకే బోధించగా శిష్యులు లేని సమయంలో వచ్చి తల తీసుకోమని శంకరులు చెప్పగా వాడు వచ్చి తల తెగేయ్యటానికి సిద్ధమై పద్మపాడుడిని నిద్రలేపగా , పద్మపాదుడు ఆ కాపాలికుని  వధించాడని కథనం.ఈ సంఘటన మన శ్రీశైలం లోనే జరిగిందని పలువురి నమ్మకం .

  శ్రీశైలం నుంచి కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రం చేరి స్వామిని దర్శించి ,శ్రీ వల్లిఅనే చోటుకు శంకరులు వచ్చారు .ఇక్కడ మూఢుడు లాగా ఉండే ఒకడు వచ్చి శిష్యుడయ్యాడు .ఇక్కడ కాదు ప్రయాగలో ప్రభాకరుడు అనే బ్రాహ్మణుడు శంకరుని వద్దకు తనమూఢ కుమారుని తీసుకొనివచ్చాడని వాడిని అనుగ్రహించి కొన్ని ప్రశ్నలు అడిగితె పృధ్వీ ధరుడు అనే ఆ బాలుడు తన నిజతత్వాన్ని తెలుపుతూ అద్వైత ప్రసంగం చేశాడనీ ,అందరూ ఆశ్చర్యపోయారనీ ,అతడు చెప్పిన శ్లోకాలకే  శంకరులు ’’ హస్తామలకం ‘’ అనే వ్యాఖ్య రాశారని అతడిని శిష్యుడిని చేసుకోన్నారనీ ఉంది .మొదట్లో ఇతడి పేరు ఉదంకుడు అనీ ,కానీ సన్యాసం స్వీకరించి హస్తామలకాచార్యుడై ప్రసిద్ధి పొందాడని చరిత్ర .ఇతడి తండ్రి ప్రభాకరుడే మీమాంసా చార్యుడైన ప్రభాకర మిశ్ర అన్నారు .కాలం లో చాలా తేడా ఉంది కనుక ఇది నిజం కాదన్నారు శ్రీ అనుభవానందులు.

   కాశీలో మణికర్ణికా క్షేత్రం లో శంకరులు ఉండగా అక్కడే ఉంటున్న విశ్వనాథాధ్వరి కొడుకు కలానాథుడు శంకర దర్శనం చేసి ,మనోహరమైన తోటక వృత్తాలతో గానం చేసి ,శుశ్రూష చేసి శిష్యుడై ,సన్యాసం తీసుకొని తోటకాచార్యునిగా పిలువబడ్డాడు .ఇతడి పూర్వనామం గిరిలేక ఆనంద గిరి .ఇతడు శంకర భాష్యపాఠాలకు,ఆలస్యంగా వచ్చినా అతడికోసం ఆగి ,వచ్చాకనే చెప్పేవారు .అతడు మందమతి అతడికోసం ఎదురు చూడటం దండగ అని ఇతర శిష్యులు ఫిర్యాదు చేయగా ,అతనిపైప్రత్యేక దయ చూపించి అనుగ్రహించగా క్రితం సారి చెప్పిన పాఠాలను తోటక వృత్తం లో శ్లోకాలుగాచేప్పి అందర్నీ విస్మయాన౦ద భరితుల్ని చేశాడు .ఈవిధంగా పద్మపాద సురేశ్వర ,హస్తామలక ,తోటకాచార్యుడు అనే నలుగురు ముఖ్య శిష్యులు ఏర్పడ్డారు .

  తర్వాత దక్షిణాభి ముఖంగా ప్రయాణించి,తుంగభద్రానదీ తీరం చేరి ,అక్కడి ప్రకృతి సౌందర్యం ,ప్రశాంత వాతావరణానికి సంతోషించి శంకరులు ఆనందంతో అక్కడ శృంగేరి లో ఒక మఠాన్ని స్థాపించి ,అందులో శారదా దేవిని ప్రతిష్టించి ,వీర సేనమహారాజు సాయంతో దేవాలయం నిర్మించి ,అఖండ విద్వత్ వరుడైన సురేశ్వరుని పీఠాధిపతి గా నియోగించారు .

  అప్పటికే తాను రాసిన భాష్యాది గ్రంథాలు అందరూ అర్ధం చేసుకోవటానికి కష్టంగా ఉన్నాయని గ్రహించిన శంకరులు వాటికీ వివరాలు అవసరమని భావించారు .ఒక రోజు శిష్యులను పిలిచి ,తన సంకల్పం చెప్పి ,తన రచనలలో మణిపూస లాంటి’’ బ్రహ్మ సూత్ర భాష్యం ‘’కు వార్తికం రాయమని సురేశ్వరునికి అప్పగించారు .మిగిలినవారికీ పనులు అప్పగించారు. కానీ సురేశ్వరుడు సమర్దుడుకాదని అతడు కర్మిష్టి అనీ గురువుకు విన్నవించారు .ఏక భావం రానందున పద్మ పాడునికి ఆబధ్యత అప్పగించి ,సురేశ్వరునికి బృహదారణ్యకం మొదలైన వాటికి వార్తికాలు రాయమన్నారు.అతడు వాటిని రాసి చూపించి అంగీకారం పొందగా శంకరులు అతడిని ఒక అద్వైత రచన చేయమని ఆదేశించారు .అతి తక్కువకాలం లోనే  ‘’నైష్కర్మ సిద్ధి ‘’అనే గ్రంథాన్నిరాసి అద్వైత భావ గరిమతో శంకరుని మనసు దోచుకొన్నాడు .

  పూర్వం కాశీలో పద్మపాదుడు ప్రభాకరుని మీమాంసా శాస్త్రంను అధ్యయనం చేసిన వాడు అవటం చేత ,దాన్ని అనేకరకాలుగా ఖండిస్తూ భాష్య వివరణం రాశాడు .గుర్వాజ్ఞతోదాన్ని తీసుకొని తన స్వగ్రామం చిదంబరం,అక్కడినుంచి రామేశ్వరం దర్శించాలని బయల్దేరి చిదంబరం లో పిన తండ్రి  ఇంట్లో ఉంచి వెళ్ళగా ,అతడు ప్రభాకరుని అభిమాని అవటం తో దాన్ని తగలబెట్టాడు అసూయతో .యాత్రనుంచి తిరిగివచ్చి తనగ్రంధం విషయం అడిగితె అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం లో దహనం చెందిందని మొసలి కన్నీరు కార్చాడు పినతండ్రి .దుఖభారంతో శృంగేరిలో ఉన్న శంకర గురువును దర్శించి జరిగినది వివరించాడు .శిష్యుని ఓదార్చి పూర్వం ఆగ్రంథాన్ని తనకు చదివి వినిపించాడు కనుక దాన్ని స్మరించి అయిదు పాదాలు మాత్రమె చెప్పగా పద్మపాదుడు మళ్ళీ రాసి లోకానికి అందించాడు ,అది ‘’పంచపాదికా వివరణం ‘’అనే పేరుతొ లోక ప్రసిద్ధమైనా ఇప్పుడు అదీ దొరకక బ్రహ్మ సూత్రాలలో మొదటి సూత్రాచతుష్టయం లో మాత్రమె పద్మపాదుని వివరణ మిగిలి ఉంది .ఇందులో శంకర అధ్యాస భాష్యం చాలా విపులంగా ఉండి,దీనికి అనేక వృత్తులు,టీకలు కలిగి ప్రఖ్యాతి పొందింది .ఇదే శంకర భాష్యానికి మొదటి వివరణ గ్రంధం మాత్రమేకాదు శంకరుని ప్రియశిష్యుడు పద్మపాదాచార్య కృతం కూడా  .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.