అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం )
స్త్రీలకు సన్యాసాశ్రమ౦ -2 చివరి భాగం )
ఆనాటి బ్రహ్మవాదినులు పొందిన విద్యా వైదుష్యాలు,ప్రతి వాదం చేసే నేర్పు ,రచనా కౌశల్యం ఆశ్చర్యం కలిగిస్తాయి .వారిలో ముఖ్యంగా ‘’గోధా ఘోషా విశ్వవారా పాలోపనిషత్ –బ్రహ్మ జాయా జాహుర్నామా గన్తవ్య స్వ సాధితిః-ఇంద్రాణి చేంద్రమాతా చ సరమా రోమ శోర్వరీ ,లోపముద్రా చ సద్యశ్చయామీ నారీ చ శాశ్వతీ –శ్రీ ర్లాక్షా సర్వ రాజ్ఞీ వాక్ శ్రద్ధా మేదాచ దక్షిణాః-రాత్రిం సూర్యాచ సావిత్రీ బ్రహ్మవాదిన్య ఈరితాః’’అని ‘’బృహద్దేవతః’’ లో చెప్పబడింది .గోధా ,ఘోషా ,విశ్వవారా ,ఆపాల ,ఉపనిషత్ ,బ్రహ్మపత్నీ ,,అగస్త్య సోదరి ,జుహూ ,ఇంద్రాణి ,ఇంద్రమాతా సరమా ,రోమశ ,ఊర్వశీ ,లోపాముద్రా ,సదలయామీ ,నారీ ,శాశ్వతీ, లాక్షా సర్వరాజ్నీ వాక్ ,శ్రద్ధా ,మేధా దక్షిణా ,రాత్రి ,సూర్యా ,సావిత్రి మొదలైన వారంతా బ్రహ్మవాదినులే .వీరిలో గోదా తపస్విని యై ఋగ్వేద మంత్రాలను 10,134-7 కర్త్రిగా స్తుతి౦పబడింది ,,క్షత్రియ కుమారి ఘోషా బ్రహ్మ చర్యం లో ఉంటూ తనకున్న కష్టు రోగాన్ని కొన్ని మంత్రాలతో నివారించుకొన్నది ఆమంత్రాలే10-39,40-1,117-7 రుక్కులయ్యాయి . అత్రి మహర్షివంశానికి చెందిన విశ్వవార యజ్ఞాలు చేస్తూ ,చేయిస్తూ , ఆరు రుక్కులకు 5,28,3కర్త్రి అయిన మహా మేధావిగా పేర్కొనబడింది ఆత్రి ముని కూతురు ఆపాల అనే బ్రహ్మవాదిని వివాహం చేసుకొని బొల్లి ఉండటం చేత భర్త పరిత్యజిస్తే ,జనకరాజు ను ఆశ్రయించి ,తపస్సు చేసి ,ఇంద్రుని స్తుతించి ఆయన అనుగ్రహం తో బొల్లిని పోగొట్టుకొన్నది .ఆ వ్యాధి నివారక మంత్రాలు 5-28,3-8,30-7వేదం లోకి చేరాయి .యజ్ఞాలు నిర్వహించటం లోనూ ఆమె ప్రతిభ అగణితమే సోమయజ్ఞంచేసి స్త్రీల యజ్ఞాదికారత్వాన్ని సుస్తాపితం చేసింది అగస్త్యముని సోదరి జుహూ బ్రహ్మవాదిని భర్త బృహస్పతి చేత త్యజి౦పబడి ,తన తపో బలం తో మళ్ళీ భర్తను చేరింది .బ్రాహ్మవాదినిగానే జీవితం గడిపింది ఈమె ప్రార్ధనలు 10,11-6 రుక్కులయ్యాయి .
ఇంద్రుని తల్లి అదితి ,ఇంద్రుని భార్య శచీ దేవి ఇద్దరూ బ్రహ్మవాదినులే అని ఋగ్వేదం లోని 10,49,153,10-145,2 తెలియ జేస్తున్నాయి. రోమశ కూడా ఋగ్వేద మంత్రాలు 1,125-7కు కర్త్రి అగస్త్యమహర్షి ధర్మపత్ని లోపాముద్ర చేసిన స్తుతులు రుగ్వేదంలో ప్రఖ్యాతాలైనాయి .అంగిరస మహర్షి కుమార్తె శాశ్వతి కూడా ప్రముఖ ఋగ్వేద 8-1,34మంత్ర కర్త్రి-,సర్వ రాజ్ఞి బ్రహ్మవాదిని అగ్ని సూత్ర మంత్ర -10,1899నిర్మాత .ఈమె యజ్ఞ యాగాదులకు అధ్యక్షత కూడా వహించేది అ౦భ్రిణ మహర్షి కుమార్తె వాక్ అనే బ్రహ్మవాదిని ఋగ్వేదం లో జీవ బ్రాహ్మైక్యాన్నిప్రతిపాదించే మంత్రాల నిర్మాత. ఆమె సూక్తాలలో దేవీ సూక్తం ముఖ్యమైనది-10-125,1,4 .ఈమె సాక్షాత్తు సరస్వతీ స్వరూపం కనుక వాగ్దేవి అనే పేరుతొ పిలువబడేది ఋగ్వేదం -10-151,1.శ్రద్ధాళువైనఒక బ్రహ్మవాదిని మంత్రాలను దర్శించి శ్రద్ధా అనే పేరుపొందింది .ప్రముఖ సన్యాసిని అయిన ఈమె యజ్ఞాలు చేస్తూ చేయిస్తూ ఉండేది .
రాత్రి సూక్తాన్ని రచించిన బ్రహ్మవాదిని రాత్రి అనే పేరుతోనే ప్రసిద్ధమైంది .రుగ్వేదంలో 10-85రుక్కు కు కర్త్రి సూర్యా .సుకన్య ముసలి వాడిని పెళ్ళాడి బ్రహ్మవాదిని అయి ,విరాజిల్లింది .శచీ పౌలోమి ఋగ్వేదం 10-159 మంత్రం కర్త్రి అయిన బ్రహ్మవాదిని ..బృహదారణ్యక ఉపనిషత్ లో ప్రశస్తి పొందిన మైత్రేయి ,కాత్యాయని ,గార్గి ఉన్నారు .యాజ్ఞ్య వల్క్య మహర్షి భార్యలైన మైత్రేయి ,కాత్యాయని భర్త ఆశ్రమ సంరక్షకులు కూడా .మైత్రేయి శిష్యుల విద్యా విషయాలను పర్యవేక్షిస్తూ భర్తకు శ్రమ తగ్గించేది. గార్గి శ్రేష్ఠ బ్రహ్మవాదిని అని జగద్విదితమే .పడవా పాత్రి దేయం అనే బ్రహ్మవాదిని ,శాండిల్యముని పుత్రిక స్వయం ప్రభ గొప్ప తపస్వినులు .దేవశ మహర్షి కుమార్తె సువర్చల శ్వేతకేతుడిని పెళ్ళాడి బ్రహ్మవాదినిగా పేరు పొందింది .
ఈ విధంగా శంకరా చార్యకు పూర్వమే అనేకమంది బ్రహ్మవాదినులు ఉండేవారు. కొన్ని చోట్ల భర్తల పేర్లు ఉన్నప్పటికీ ఆ భర్తలు సన్యసించటం కాని ,చనిపోవటం కానీ జరిగి సన్యాసం తీసుకొని ఉంటారు .స్త్రీలకూ ఋషులతో పాటు సర్వాధికారాలు ఉన్నట్లు విదితమౌతోంది .పతంజలి మహర్షి స్త్రీసన్యాసినులకు శ్రమణా,పరివ్రాజితా ,తాపసి ,కుమారాశ్రమణా అనే పేర్లు పెట్టాడు శంకరానంతరం కూడా స్త్రీలు .సన్యాసాశ్రమాన్ని తీసుకొని ,విద్యాధ్యయనం చేసినట్లు చరిత్ర ఉన్నది .జ్ఞాన స్వరూపమైన వేద శాస్త్రాలు ‘అభేద దర్శనం జ్ఞానం ‘’అనే మైత్రేయ ఉపనిషత్ సూక్తి చేత పక్ష పాత దృష్టితో వ్యవహరించకుండా ‘’వర్ణాశ్రమ మాచార యుతావిమూఢాః-కర్మాను సారేణఫలం లభంతే-వర్నాది ధర్మం హి పరిత్యజంతః స్వానంద తృప్తాః పురుషా భవంతి’’అని మైత్రేయ ఉపనిషత్ లో చెప్పినట్లు వర్ణాశ్రమ ఆచారం తో ఉన్న మూఢులు కర్మాను సార ఫలితాలను పొందుతారు వర్ణాదులను త్యజించిన వారు తృప్తులై బ్రహ్మాన్ని పొందుతారు అంటే జ్ఞానాస్వాదనానికి అందరూ అర్హులే అన్నారు శ్రీ అనుభవానంద స్వామి .
ఆధారం –శ్రీఅనుభవాన౦ద స్వామి రచించిన –‘’సకల సిద్ధాంత సౌరభం ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-5-21-ఉయ్యూరు

