క్లిష్ట పద ప్రయోగ హాస్యం
యమక ,అనుప్రాస లతో వాక్యానికి శబ్ద వైచిత్రి సాధింఛి హాస్యం పుట్టించవచ్చు .చేకానుప్రాస ,లాటాను ప్రాసలను సంధించి ,హాస్యం రాబట్ట వచ్చు .’’మిష్టర్ కిష్టాయ్ కష్టపడి చదివి ,ఎష్టాగో అష్టా మేష్ట్రిక్లేషన్ ఫష్టున పాసై ,అష్టకష్టాలు పడి ,ఆగష్టులో జష్టుపక్షం రోజులుండే మాష్టరీ పని అతి కష్టం మీద సాధించి ,,పనిలో చేరి శిరో వేష్టనంధరించి డష్టరు చేత్తో పుచ్చుకొని ,దిష్టి బొమ్మలాగా తయారయ్యాడు’’ అని ఉదాహరించారు మాష్టారు మునిమాణిక్యం గారు .ఇందులో శబ్దాల గడ బిడ తప్ప వేరే ఏమీ ఉండదు .చాటుపద్యాల్లో ఇలాంటి హడా విడి చాలా ఉంది .ఒక ఉదాహరణ – ‘’నీళ్ళకు నిర్రి తోళ్ళకును ,నేతికరెళ్ళకు దొడ్డ యుత్తరేరేన్-వ్రేళ్ళకు,దర్భ ముళ్ళ కును , వేదపు నోళ్లకు .,సన్న కుట్టు వి -స్తళ్ళకు రావి పేళ్ల కనిశంబును ,మళ్లకు పప్పు కూర పచ్చళ్ళకు ,రాగి బిళ్ళలకు సంతత మందుదురాంధ్ర వైదికుల్ ‘’.ఇందులో ఏముంది దేవటానికి అనుకొంటే ఏమీ ఉండదు. రచనలో చమత్కారం చూడటానికి ఆసక్తి ఉండాలి .అసలు అర్ధం చేసుకొనే కోరిక ముఖ్యంగా ఉండాలి .చంద్రుడిని చూసిసముద్రం ఉప్పొంగినట్లు ,వికృత దర్శనం తో రసవాహిని పొంగిపోరలెత్తెస్వభావం ఉండాలి అన్నారు అనుభవంతో మాష్టారు .ఇందులో యమకాదులు హాస్యానికి ఉపయోగపడ్డాయి శబ్దాశ్రయ హాస్యం లో ఇది ఒక అంతర్విశేషం అన్నారు మునిమాణిక్యం .అలాగే శ్రీనాధుని ‘’చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు –నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు –సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును , తేళ్ళు –పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు’’చాటువుకూడా .ఇందులో అక్షరా వృత్తి తీసేస్తే పేలవమై పోతుంది .శబ్దాల హడావిడే తప్ప సరుకు లేదు .చిన్న పిల్లల పాట ఒకటి ఇలాగే నడుస్తుంది –‘’అక్కల కర్ర ,ముక్కల పీటకూర్చో వదినా కూచో –వేప చెక్క వెల్లుల్లి గడ్డ పోక తమ్మి వేసుకో –కాకి బొచ్చు గచ్చర కాయ మెక్కి విందు తీర్చుకో –అల్లి తుట్ట మర్రి రొట్ట పైట వేసి కట్టుకో –ఉల్లి పూలు నువ్వు చేరుకొప్పునిండా పెట్టుకో –అత్తమాట కొత్తకుండ సవతి పోరు దిద్దుకో –ఆలగోలు బాలగోలు రవ్వ వదిన మాన్పుకో ‘’ .అర్ధం లేకుండా కూడా శబ్దాన్ని ఆవృతం చేయవచ్చు .ఉదాహరణ –నిరక్షర కుక్షీ గండ భేరుండ పక్షీ .శీతాంశు కులావతంస సీతమ్మ మొగుడా.ఆకర్నాంత విశాల నయనా – వల్లభ రసాయనా ‘’వగైరా .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-21-ఉయ్యూరు