24-పేరడీ కవిత్వ హాస్యం
ఉదయ రాజు రాఘవ రంగారావు గారి ‘’మత్కుణోపాఖ్యానం’’దేవీ ప్రసాద్ ‘’భక్షేశ్వరీ శతకం ‘’,జరుక్ శాస్త్రి అనబడే శ్రీ జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి కృష్ణ శాస్త్రి గారి పేరడీ కవిత్వం పేరడీ కవిత్వం లో ముందు వరుసలో ఉన్నాయి .కాళోజి నారాయణరావు గారు కూడా ‘’ఏదేశమేగినా ఎందుకాలిడినా చూడరా నీ బొజ్జ పూడు మార్గంబు ‘’అని రాయప్రోలు వారి కవిత్వానికి పేరడీ రాశారని మునిమాణిక్యంగారువాచ .కొత్త పెళ్ళికూతుర్ని అత్తారింటికి పంపేటప్పుడు తలిదండ్రులు ఎన్నోజాగ్రతలు చెబుతారు .దీనికీ పేరడీ పిసిగాడోకవి –మొగుడితో ఎలా ప్రవర్తించాలో చెబుతూ ‘’నీ మాట వినబడ్డ నిమిష౦బు నందు అడలిపోయే-ట్లు అతని భయపెట్టు –పతికోప్పడిన పడియు౦డబోకు-అంతకు పది రెట్లు అతని మర్దించు -ఇరుగు పొరుగువారు ఏమైనా అంటే –ఏడవక వేయి రెట్లు దుమ్మేత్తిపోయ్యి-భర్తను వంచుకోగల భార్యగౌరవ మెన్న-రారాజులకు నైన రమణి రో లేదు –ఇవి ఎల్ల మరువక ,ఏమాత్రము అలయక సుఖ పడు చుండుమో సొగసు పూదీగ ‘’.
ఒక యువకవి సుమతీ శతకానికిపేరడీ గుప్పించాడు –‘’తినదగు నెవ్వరు పెట్టిన –తినినంతనే తేన్పులిడక స్థిమిత పడదగున్ –తిని రుచియు నరుచియు నెరిగిన మనుజుడే పో మహిలో సుమతీ ‘’-‘’ఎప్పటి కకెయ్యేది దొరికిన ఆ తిండి తినుచు –అన్యులతోన్ –చెప్పించక తా చెప్పక –తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ ‘’-‘’అప్పచ్చులతోడ సుష్టుగ భోజనము పెట్టు ఇల్లో, హోటలో –చొప్పడిన యూర నుండుము-చొప్పడ కున్నట్టి యూరు చొరకుము సుమతీ ‘’-‘’అక్కరకు రాని బస్సును –చక్కగ సినిమాకురాక సణిగెడి భార్యన్ –ఉక్కగ నుండెడు యింటిని –గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ ‘’.
వచనానికీ చక్కని పేరడీ రాసినవారున్నారు .శ్రీరమణ,జొన్నవిత్తుల మొదలైనవారు .విశ్వనాథ వారి వచనానికి ఎలా పేరడీ పచనం చేశాడో ఒక తుంటరి చూడండి –‘’వాడు మానిసి .కర చరణాదులున్నవి.కనులు మూసుకొని నిద్ర పోవు చున్నట్లున్నది.నిద్ర యనగా పంచేంద్రియ వ్యవహారోప సంహృతి .నిద్రలో అతని మనసు ఆడుచునే యున్నది .ఇది ఇంద్రియ విషయిక నిద్రాస్థితి .జీవుడు మేల్కొని యున్నాడు .సర్వ వ్యవహారములకు యోగ్యుడై యున్నాడు .కాని వ్యవహారము నిర్వహించ లేడు.నిద్ర పోవుచున్నట్లు అతనికి తెలియునా ?తెలియదు ,తెలియునుకూడా .మేల్కొనగానే నిద్రించిన అభిజ్ఞ అతనికి కలిగినది .అనగా పూర్వముకూడా అతనికావిషయము తెలిసియె యుండవలయును .నిద్ర పోవునట్లతనికి నిద్రలో కూడా తెలియునా ?తెలియును తెలియదు.ఇది ఒక చమత్కారము ‘’ఇది చదివి మనకు వచ్చే నిద్రకూడా దూరమౌతుందేమో ఏమో అదోచమత్కారము .(చమత్కారమన్న నేమి?చమస్సులో కారమా ?కారములో చమస్సా ? ఏదైననూ కావచ్చును కాకపోవచ్చును ఇలా ఏడిసింది మన తెలివీ.అసలు తెలివి యన్నది ఒక బ్రహ్మ పదార్ధము దాని విషయము కాళిదాసుకు తెలుసు భవ భూతికి తెలుసు దిగ్నాగునికి మూడు వంతులు ,నన్నయ్యకు అర్ధభాగం తెలియును .తెలియుటలోనే తెలివి యున్నది .తెలివి తెలివి నీ తెలివి తెల్లవారినట్లే యున్నదిలే అఘోరించుము ) ఈ బ్రాకెట్ లోని దంతా నాపైత్యం క్షమించండి .
మూలం లోని పద్య పాదాన్ని అనుకరణ చేసిన పాదం తోకలిపితే ఒకరకమైన హాస్యం వస్తుందన్నారు మాష్టారు –ఉదాహరణ ‘’సదమల మణిమయ సౌద భాగంబుల ‘’అనే పద్య పాదాన్ని ‘’సద్దల్లో మన్ను వోయ సుద్దా భాగ౦బుల ‘’అని మారిస్తే హాస్యం చిప్పిలుతున్దన్నారు సారూ .
సంధ్యావందనం లో ‘’ఉత్తమే శిఖరే జాతే ‘’అనే దాన్ని ఒక పారడిష్టు ‘’ఉత్తమే శిఖరే జాతే –కోన్ జాతే బులావురే ‘’అని అనుకరించాడట.’’అమృతాభిదానమసి-రౌరవే పుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం –అర్ధినాముదకం దత్తం అక్షయ్య ముపతిష్టతు’’అనే భోజనానంతర మంత్రానికి –‘’అమ్మితే వృధా అదన్తమసి అంబు గజము పట్టుకోన్నదే –అరచి చచ్చినా నిన్ను విడువదే-అచ్చమ్మా ఇక తిట్టకే ‘’ అని పేరడీ పెసరట్టు వేశాడొకడు అన్నారు మాష్టారు .ఇప్పటిదాకా మనం చెప్పుకొన్నది అంతా’’శబ్దాశ్రయ హాస్యం ‘’.
రైలుబండిలో వైతాళికులు అనే ప్రహసనంలోనిది:
శ్రీశ్రీ వంతు వచ్చింది. టిక్కెట్ లేదు. పైగా అందరికీ భరోసా ఇవ్వడం కూడాను. ఇదంతా గమనించి-
“ఎవరు మీరు” అన్నాడు టి.వాడు
“భూతాన్ని
యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్య గీతాన్ని నేను”
“కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా” అన్నారెవరో.
“నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది”
“కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారు వారిది” అన్నాడు టి.టి.ఇ.
“మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను…”
“అవచ్చు. కాని ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు”
“ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం”
అనేసి శ్రీశ్రీ సీటుమీద కూచుని, నిట్టూర్చి మళ్ళీ హరీన్‌ఛట్టో లోకి వెళ్ళిపోయారు.
‘కోయకుమీ సొరకాయలు/ వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్/ డాయకుమీ అరవఫిలిం/ చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా’’- ఇది శ్రీ శ్రీ పేరడీ
తొలి పేరడీ కవిగా తెనాలి రామకృష్ణుడినే చెబుతారు. శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయలును పోల్చుతూ మొల్ల చెప్పిన ‘‘అతడు గోపాలకుం డితడు భూపాలకుం/ డెలమినాతని కన్న నితడు ఘనుడు/ అతడు పాండవ పక్షు డితడు పండితరక్షు/’’ పద్యాన్ని అనుకరిస్తూ.. శివుణ్ని, ఎద్దును పోలుస్తూ ‘‘ఆతడంబకు మగం డితడమ్మకు మగండు/ నెలమి నాతనికన్న నితడు ఘనుడు/ అతను శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు/ నెలమి నాతనికన్న నితడు ఘనుడు/…’’ అనే పద్యాన్ని వికటకవి చెప్పాడంటారు
శ్రీశ్రీ ‘నవ కవిత’ను ‘సరదా పాట’గా మార్చి, ‘‘మాగాయీ కంది పచ్చడీ/ ఆవకాయి పెసరప్పడమూ/ తెగిపోయిన పాత చెప్పులూ/ పిచ్చాడి ప్రలాపం, కోపం/ వైజాగులో కారాకిళ్లీ/ సామానోయ్ సరదాపాటకు/ తుప్పట్టిన మోటర్ చక్రం/ తగ్గించిన చిమ్నీ దీపం/ మహవూరిన రంపప్పొట్టూ/ పంగల్చీలిన ట్రాం పట్టా/ విసిరేసిన విస్తరి మెతుకులు/ అచ్చమ్మ హోటల్లో చేపలు/ సామానోయ్ సరదాపాటకు/ నడి నిశిలో తీతువు కూతా/ పడిపోయిన బెబ్బులి వేటా/ కర్రెక్కిన నల్లినెత్తురూ/ జుర్రేసిన ఉల్లికారమూ/ చించేసిన కాలెండర్ షీట్… సరదాపాటకు’’ అంటూ మూల రచన ముక్కుపిండేశారు శాస్త్రి. అలాగే, ‘అద్వైతం’ గీతానికి ‘విశిష్టాద్వైతం’ పేరుతో ఆనందం అంబరమైతే/ అనురాగం బంభరమైతే/ అనురాగం రెక్కలు చూస్తాం/ ఆనందం ముక్కలు చేస్తాం….’’ అంటూ వర్గ ఘర్షణను చిత్రించారు. ‘‘నేను సైతం కిళ్లీకొట్లో/ పాతబాకీ లెగరగొట్టాను/ నేను సైతం జనాభాలో/ సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను; ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడీలెన్నో; ప్రపంచమొక సర్కస్ డేరా/ కవిత్వమొక వర్కర్ బూరా’’ లాంటివి శ్రీశ్రీ కవితాపాదాలకు జరుక్ శాస్త్రి పేరడీ పంక్తులు ‘చోటా హజ్రీ నమస్తుభ్యం/ వరదే కామరూపిణి/ కాఫీ పానం కరిష్యామి/ సిద్ధిర్భవతు మే సదా..’’ లాంటివి ఆయన హాస్య ప్రియత్వానికి మచ్చుతునకలు. ‘
ఏ రోడ్డు చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వకారణం?/ రహదారి చరిత్ర సమస్తం/ ధూళి ధూసరి పరిన్యస్తం!/ రహదారి చరిత్ర సమస్తం/ యాతాయాత జనసంయుక్తం/ రహదారి చరిత్ర సమస్తం/ పథిక వాహన ప్రయాణసిక్తం/ భూంకారగర్జిత దిగ్భాగం/ చక్రాంగజ్వలిత సమస్తాంగం/ రహదారి చరిత్ర సమస్తం/ పైజమ్మాలను పాడుచేయడం-అని శ్రీశ్రీ కవిత్వానికి దేవీ ప్రసాద్ పేరడీ . ‘తొక్కిన కదలని సైకిలు/ పక్కింటి మిటారిపైన పగటి భ్రమయున్/ యెక్కకె పారెడి గుఱ్ఱము/ గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ’’ అంటూ నవ్వులవాన కురిపించారు.
‘‘ఏ ల్యాబ్ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వకారణం/ శాస్త్రజ్ఞుల చరిత్ర సమస్తం/ పరదూషణ పరాయణత్వం…./ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో/ విద్యార్థుల జీవనమెట్టిది/ ప్రొఫెసరచ్చేసిన పేపర్ కాదోయ్/ దాన్ని వ్రాసిన విద్యార్థెవడు?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కవన శర్మ. ‘‘దినపత్రిక దిక్కుల వ్రాతలు/ దీవించే సంపాదక నేతలు/ అర్థానికి అకాడమీ దాతలు/ పలు భాషల ప్రచురణ కర్తలు/ కౌగిలి కోరే కృతిభర్తలు/ కృత్రిమ సంఘం, కుంటి నడకలు/ కావాలోయ్ నవీన కవులకు…’’ అంటూ ఆధునిక కవులను ఏకేశారు కాట్రగడ్డ. కవి, సినీ నటుడు తనికెళ్ల భరణి అయితే ‘‘స్కాచ్ విస్కీ, స్పెన్సర్ సోడా/ స్టేటెక్స్ ప్రెస్, గ్యాసు లైటరూ/ తెల్లగ్లాసూ, చల్లని ఐసూ/ మటన్ చిప్స్, బాయిల్డెగ్సూ/ కావాలోయ్ నవకవనానికి…’’ అన్నారు. శ్రీశ్రీ ‘జయభేరి’ గేయానికి ‘గుండుభేరి’ పేరడీ సృష్టించారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. ‘‘నేను సైతం/ తెల్లజుట్టుకు/ నల్లరంగును కొనుక్కొచ్చాను/ నేను సైతం/ నల్ల రంగును/ తెల్లజుట్టుకి రాసి దువ్వాను/ యింత చేసీ/ యింత క్రితమే/ తిరుపతయ్యకు జుట్టునిచ్చాను’’ అంటూ వాపోయారాయన. కృష్ణశాస్త్రి కవిత ‘‘సౌరభములేల చిమ్ము బుష్పవ్రజంబు?’’కు ‘సందియం’ పేరుతో ‘‘జఠర రసమేల స్రవియించు జఠర గ్రంథి?/ అడవిలో యేల నివసించు నడవి పంది?/ ఏల పిచ్చికుక్క కరచు? కాకేల యరుచు/..’’ అనే పేరడీ రాశారు జొన్నవిత్తుల. ఆత్రేయ పాట ‘‘కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్ల’’ పాటకి.. ‘‘పరిగెత్తుకొచ్చిందీ పిచ్చికుక్కా/ అది కరిచిందీ కచ్చగా కాలిపిక్కా’’ అంటూ అందరినీ నవ్వించారు. ఇంకా ఆరుద్ర, మాగంటి వంశీమోహన్, జాగర్లపూడి సత్యనారాయణ, వివి సుబ్బారావు తదితరులెందరో శ్రీశ్రీ కైతలకు పేరడీలు కట్టారు.
పేరడీలతో కవులను అల్లల్లాడించిన జరుక్ శాస్త్రి మీద 19 పద్యాలతో ‘రుక్కుటేశ్వర శతకం’ తెచ్చారు శ్రీశ్రీ, ఆరుద్ర. ‘‘రుక్కునకు, ఆగ్రహముగల/ ముక్కునకు, విచిత్ర భావముఖురిత వాణీ/ భాక్కునకున్, తెగవాగెడి/ డొక్కునకున్ సాటిలేని డుబడుక్కునకున్…’’ అంటూ శాస్త్రిని ఆటపట్టించారు. ఇందులోని పద్యాలు ‘జరూ!’తో అంతమవుతాయి. శ్రీశ్రీ విడిగా ‘సిరిసిరి మువ్వ’ శతకాన్ని రచించారు. ‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే సుమతీ శతక పద్యానికి పేరడీగా ఇందులో ‘‘ఎప్పుడు పడితే అప్పుడు/ కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్/ చొప్పడిన యూరనుండుము/ చొప్పడకున్నట్టి యూర చొరకుము మువ్వా’’ అంటూ కాఫీ దాతలను కీర్తించారు.
సినారె శైలిలో ఓ ప్రేమలేఖ రాశారు శ్రీరమణ. ‘‘మధుర రసైక ధారావాహినీ:/ నమస్తే: నమస్తే: ప్రియసఖి/ నేనే. నేనే నారాయణ రెడ్డిని/ కవిని. రవిని- నిను కోరే ప్రియుణ్ని/ నీ చూపులు వలపు సేతువులు/ నీ రూపులు రామప్ప శిల్పాలు…’’
ఇప్పటిదాకా మనం చెప్పుకొన్నది అంతా’’శబ్దాశ్రయ హాస్యం ‘’.
ఇక భావాశ్రయ హాస్యానికి తెరతీద్దాం .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-21-ఉయ్యూరు

