మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1 సి.ఎస్.ఆర్ చిలకల పూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలీడుకాని సి ఎస్ ఆర్ అంటే తెలియని వారు ఉండరు .ఆ ముక్కుమాట నక్కవినయపు చూపులు మాటలో మెత్తదనం మనసులో గుండెలు తీసే బంటుతనం ఆయనకు స్వతహాగా వంటపుట్టిన సొమ్ములు .11-7-1907 న గుంటూరు జిల్లా నరసరావు పేట లో జన్మించారు .ఎస్.ఎస్ ఎల్.సిపాసై కోఆపరేటివ్ శాఖలో శిక్షణ పొంది ఉద్యోగించారు .చిన్నప్పటి నుంచి వీధిభాగవతాలు ,నాటకాలు బాగా చూడటం తో ఉద్యోగానికి రిజైన్ చేసి ,17వఏట నాటకరంగం పై ‘’రాధా కృష్ణ ‘’నాటకం లో కృష్ణుడుగా కాలు మోపి ,నటనతో అలరించి ప్రేక్షకాభిమానం పొందారు .తర్వాత రామదాసుగా ‘’రామదాసు ‘’భవానీ శంకరుడుగా ‘’చింతామణి ‘’సారంగధరుడు గా ‘’సారంగధర ‘’శ్రీరాముడుగా ‘’పాదుక ‘’సత్యవంతుడుగా ‘’సతీ సావిత్రి ‘’విజయరామ రాజుగా ‘’బొబ్బిలి యుద్ధం ‘’,తుకారాం గా ‘’భక్త తుకారాం ‘’,పర దేశి గా ‘’పతిత పావన ‘’నాటకాలలో నటించి విశేషమైన హావ భావాలతో ,కొత్త వరవడులను సృష్టించి ,సామాన్యులనుంచీ ,మాన్యులదాకా,కళాభిజ్ఞుల మెప్పించి సెభాష్ అని పించుకొన్నారు .నటనతో నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు .తన గాత్ర మాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు .పాత్రలకు జీవం పోసిన నట శిల్పి ఆయన .అప్పటికే నాటక రంగం పై వీర విహారం చేస్తున్న స్థానం నరసింహారావు గారికి సమఉజ్జీ అని పించారు .అపూర్వ నటనా వైదుష్యం ఆయన ప్రత్యేకత .మాటలను అర్ధవంతంగా విరిచి పలికి ,అవసరమైనంత మెల్లగా స్పష్టంగా పలకడం కన్నులతో హావభావాలు కురిపించటం లో దిట్ట. తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి తనదైన బాణీ తో ,విలక్షణ నటనతోఒప్పించి మెప్పించారు .అన్ని అయన ప్రతిభకు గీటు రాళ్ళే. ఈస్ట్ ఇండియా కంపెని 1933లో నిర్మించిన రామదాసు సినిమాకు సియేస్ ఆర్ హీరో రామదాసు .1936లో ద్రౌపదీ వస్త్రాపహరణం లో శ్రీ కృష్ణుడుగా నటించి నటనా వైదుష్యాన్ని చాటారు .అయితే 1946లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన సారధీ వారి ‘’గృహప్రవేశం ‘’సాంఘిక చిత్రం ఆయన జీవితాన్ని గొప్పమలుపే తిప్పింది.కామెడీ విలనీ ని పండించారు ఆయన .’’మై డియర్ తులశమ్మక్కా’’అంటూ అక్కను బుట్టలో వేసుకొనే పాత్రలో ఆయన జీవించారు .సినీవిమర్శకుల పొగడ్తలను విపరీతంగా అందుకొన్నారు .ఆ డైలాగ్ ఆనాడు ఆంధ్ర దేశమంతా మారు మోగింది .’’జీవితం ‘’సినిమాలో ఆయన చెప్పిన ‘’ఆకాలం లో నేను కాలేజీలో చదివే రోజుల్లో ‘’డైలాగ్ కూడా అందరికి హాస్యపు తారకమంత్రమే అయి అందరి నోళ్ళల్లోనూ నాని౦ది. ఆయనకు ఫేం ,నేం రెండూ తెచ్చిన గోల్డెన్ డైలాగ్ లు అవి .జగదేక వీరుని కధ సినిమాలో రాజనాలను ‘’హే రాజన్ !అంటూ సంబోధించటం వారిద్దరి మధ్య పింగళి వండి వడ్డించిన హాస్యం ను వీరిద్దరూ పండించి మనకు మానసిక ఆనందాన్ని పంచిపెట్టారు .ఉత్కృష్టమైన హాస్యానికి అది ఒక మచ్చు తునకగా నిలిచింది .విజయావారి అప్పు చేసి చేసి పప్పుకూడు చిత్రంలో సియేస్ ఆర్ అప్పుకే ఒక కొత్త అర్ధాన్ని నిర్వచించారు .పెద్ద మొత్తాన్ని ఒకరి దగ్గరే అప్పు తీసుకోవాల్ట . వడ్డీ తీరుస్తూ అసలు అడగకుండా కాలక్షేపం చేయచ్చు నట .ఇందులో ప్రతి సన్నివేశం లో ఆయన నటన నభూతో గా ఉంటుంది .. ఆయన నటనకు శిఖరాయమానం మాయాబజార్ లో శకుని పాత్ర .’’ముక్కోపానికి ముఖ స్తుతి ఉండనే ఉంది ‘’అనే డైలాగ్ డేలివరిలో ఆయన నటన తారస్థాయి తాకుతుంది .కన్యా శుల్కం లో రామప్ప పంతులు ,ఇల్లరికం లో మేనేజర్ ,జయం మనదేశం లో మతి మరుపు రాజు ,కన్యాదానం లో పెళ్ళిళ్ళ పేరయ్య గా,చక్రపాణి లో పిసినారి తాతగా, పాతాళ భైరవిలో రాజుగా ,భక్త కుచేలలో ‘’కుచేలుడు’’గా ,గూడవల్లి రామబ్రహ్మంగారి మాయాలోకం లో నవభోజ రాజుగా ఆయన పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు .ఆయన విలనీలో హాస్యం పండించి కొత్తమార్గం చూపారు .పూర్వకాలం లో 1939లో తీసిన వెంకటేశ్వర మహాత్మ్యంలేక బాలాజీ లో ఆయన విష్ణుమూర్తి వేషం వేసి సొయగాలుఆరబొశారు.అందులో భ్రుగు మహర్షి పాత్రను మా పెద్దక్కయ్య మామగారు’’ పండిట్ రావు ‘’అనే శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ గారు పోషించారు .భ్రుగుమహర్షి పాదంలో ఆయన అహంకారానికి చిహ్నమైఉన్న కన్ను ను కృష్ణుడిన సీస్ ఆర్ చిదిమేసే ఫోటో మా అక్కయ్యా వాళ్ళ ఇంట్లో నేను చూశాను .నేను బెజవాడ ఎస్ ఆర్ ఆర్ సివి ఆర్ కాలేజీ లో 1956-58 లో ఇంటర్ చది వేటప్పుడు ఆయన విజయా టాకీస్ దగ్గర ఒక బడ్డీ కొట్టుదగ్గర సిగరెట్ తాగుతూ ఉండగా రెండు మూడు సార్లు చూసి ,పలకరించాను .చాలా మర్యాదగా మాట్లాడారు .తెల్లటి గ్లాస్గో పంచె విరిచికట్టి,తెల్లని లాల్చీ తో పంచె కొంగు ఒకటి లాల్చీ జేబులో ఉండేట్లు దోపి కనిపించారు .ఆయనతో మాట్లాడి నట్లు అందరికీ గొప్పగా చెప్పుకొనే వాడిని.దాదాపు 50 సినిమాలలో ఆయన నటించారు .ఆంగిక వాచక అభినయాలకు కొత్త అర్ధాలు చెప్పిన మహానటుడు ఆయన .రాముడుగా కృష్ణుడుగా ,శివుడుగా నటించి మెప్పించినమహానతుడు . ‘’శివ గంగ ‘’,అగ్నిమంత్రం ‘’,రిక్షావాలా ‘’ అనే మూడు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు సిఎస్ఆర్ .కానీ కారణా౦తరాలవలన అవి విడుదలభాగ్యానికి నోచుకోలేదు .నాటక ,సినిమా రంగం లో దాదాపు అయిదు దశాబ్దాలు నట జ్యోతి గా వెలిగిన ఆయన 8-10-1963న 56ఏళ్లకే మరణించటం దురదృష్టం . సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్-21-12-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.