మనకు తెలియని మహాత్ముని కబుర్లు -1
హిందీ భాషోద్యమాన్ని 40 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించిన వారు శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు .ఆయన ‘’నే నెరిగిన గాంధీ ‘’అనే పుస్తకం రాసి గాంధీజీతో తన అనుభవాలు తెలియజేశారు .అందులో గాంధీ మరణ వార్త గురించి ఆయన ఏమి రాశారో తెలుసుకొందాం .
‘’గుంటూరు జిల్లా ఉన్నవా అనే కుగ్రామం లో ఉన్న మాకు 30వ తేదీ రాత్రికే గాంధీజీ మృత్యు వార్త తెలిసింది .ఆ రోజు నేను పడిన ఆవేదన నాకే ఆశ్చర్యమేసింది .మాతల్లి మరణి౦చి నప్పటి కన్నా ఎక్కువగా దుఖించాను .అంత దుఖపడటం అవసరమా అని పించింది .మస్తిష్కం ఉచితానుచితాలను పట్టించుకోదు.దుఖం కొంతతగ్గాక అందుకు కారణం వెతుక్కొని కొంతతృప్తి చెందాను .గాంధీ మాట విని పాథశాల స్వస్తి చెప్పి ,30ఏళ్ళుఉడతా భక్తిగా దేశ హితైక కార్యక్రమాలలో మునిగి తేలాను .ప్రతినిమిషం ఆయనతో పెనవేసుకుపోయాయి మా లాంటి వారి జీవితాలు .అలా౦టిమాకు ఈ గ్రంధి తెగేసరికి విసిరి ఒడ్డుమీద పడేసినట్లయింది .తీరని వేదన, వ్యధ పడక తప్పదు.
1934లో గాంధీతో ప్రత్యక్ష పరిచయభాగ్యం హరిజనోద్ధరణ సందర్భంగా ,అంతకు ముందు 1916లో దక్షిణ భారత హిందీ ప్రచారసభ రజతోత్సవం నాడు మహాత్ముని ఆంద్ర దేశానికి తోడ్కొని వచ్చే మహా అదృష్టం నాకు దక్కింది .నా జన్మ చరితార్ధమైంది ..1934 గాంధీ ని ఆహ్వానింఛి తీసుకురావటానికి ఆంధ్రరాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యదర్శి శ్రీ మాగంటి అంకినీడు గారు పంపగా ,నేను డోర్నకల్లు స్టేషన్ కు వెళ్లి ,గాంధీజీ పరివారంతో బెజవాడకు వచ్చాను .ఆరోజుల్లో గాంధీజీకి మీరాబెన్ సుశ్రూష చేసేవారు .
తెల్లారుతోంది గాంధీ ఇంకా ఏదో రాసుకొంటూనే ఉన్నారు .ఆయన నెత్తిమీదున్న నాలుగు వెంట్రుకలు పిల్ల తెమ్మేరలకు నృత్యం చేస్తున్నాయి .ఆ దృశ్యం చూడగానే బసవరాజు అప్పారావు గారి గేయం ‘’నాలుగు పరకల పిలక .నాట్యమాడే పిలక –నాలుగూ వేదాల నాణ్యమెరిగిన పిలక –కొల్లాయిగట్టితేనేమి మా గాంధి కోమటైపుట్టితేనేమి ?”’అనే గేయం పాడి ,మీరాబెన్ కు వినిపించి హిందీలో అర్ధం చెప్పాను .ఆమె ఎంతో సంతోషించింది .ఆంధ్రకవి కల్పనా శక్తికి అబ్బురపడి శ్లాఘించింది .అప్పుడు గాంధీజీ బస బందరులో జాతీయ కళాశాలలో ఏర్పాటు చేయబడింది .అప్పుడు నేను ఆకళాశాలలో హిందీఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను .మూడు రోజులు గాంధీ ఇక్కడే ఉన్నారు .కార్యక్రమం బాగా ప్రశాంతంగా జరిగింది .విశాలంగా ఉన్న కాలేజి ఆవరణలోకి గాడిదలను రాకుండా చేయలేకపోయాం .ఒక రోజుఒక గాడిద గట్టిగాఓ౦డ్ర పెడుతోంది .గాంధీ విని ‘’అచ్చా అచ్చా సురీలాహై ‘’అంటే శ్రావ్యంగా ఉంది అన్నారునవ్వుతూ .నేను వెంటనే అందుకొని ‘’గాంధీజీ !గాడిద తత్వ విచారణ చేస్తోంది ‘’ఖుదాహై ‘’?అంటే దేవుడున్నాడు’’అని .కానీ ఎందుకో సందేహ౦ కలిగి ‘’హైకి నహీ హైకి ,నహీ ‘’ఉన్నాడా ,లేడా,ఉన్నాడా లేడాఅని వితర్కిన్చుకొని చివరాఖరికి ‘’హై హై హై’’ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని నిర్ణయానికి వచ్చింది అంటూ ఇంచుమించు అదేస్వరంతో నే చెప్పాను ఆయన సంతోషం తో పకపకా నవ్వారు .ఆయన అంతరం ఏమిటి /నా అంతరం ఏమిటి ?ఈ ఛలోక్తి విసిరేసాహాసం నాకు ఎలా వచ్చింది .నాకే ఆశ్చర్యమేసింది నిజానికి బాపూజీకి సామాన్యుల యెడ వాత్సల్యం ,సహజ వినోదప్రయత్నమే నన్నీ సాహసానికి ప్రోత్సహించింది .
రేపు గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-22-ఉయ్యూరు