లాభం

లాభం

మా చిన్నప్పుడు ఉయ్యూరులో ఊరవెంకయ్య గారి పచారీ సామాను దుకాణం గొల్లవీధిలో మా ఇంటికి దగ్గరగా ఉండేది .వెంకయ్యగారబ్బాయిలు వెంకటేశ్వర్లు సుబ్బారావు ,తాతయ్య సోదరులు షాపు మెయింటైన్ చేసేవారు .అందులో పెద్దాయన రాజకీయం ,వెంకటేశ్వర సినిమాహాలు నిర్మాణం ఇతరవ్యాపాలతో బిజీబిజీ .రెండవ ఆయన సుబ్బారావు కొలతలు తూనికలు  బిల్లులు అతి జాగ్రత్తగా చూసేవాడు .చివరివాడుతాతయ్య రేట్లు  వేసేవాడు  .ఎక్కువమంది ఇక్కడే కొనేవారు .వీరితర్వాత చెప్పుకోగలిగిన షాపులు బూరగడ్డ బసవయ్య గారిది ,వెంట్రప్రగడ సూరయ్య గారిది .వీరందరికంటే ఎక్కువ వ్యాపారం చేసేవారు ఒకాయన’’ భోగేంద్రుడు ‘’ఉండేవాడు .ఈయనదగ్గర నంబర్ వన్ సరుకు దొరికేది .పెద్దవ్యాపారం .చుట్టుప్రక్కల ఊర్లనుంచి ఆడవాళ్ళు విపరీతంగా సరుకు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు .తర్వాత ఏమైందో తెలీదుకానీ దివాలాతీసి బికారిఅయి మనోవ్యాధితో చనిపోయాడు .నాహైస్కూల్ క్లాస్ మేట్ సత్తార్ బేగ్ తండ్రికి సెంటర్లో ఒక దుకాణం ఉండేది .మరో ముస్లిం ఆయనకు ఒక దుకాణం,పిండిమిల్లు  ఉండేవి .తర్వాత కొల్లిపర సుబ్బారావు షాపు ఏకాంబరేశ్వర టాకీస్  దగ్గర ఉండేది .వాం వాటర్ తయారుచేసే కంతేటి వారి కొట్టు పెద్దవంతెన దగ్గర ఉండేది .

  ఊర వెంకయ్య గారికొట్టు మాకు  ఆనవాయితీ .మానాన్న గారి కాలం లో సరుకుల లిస్టు నేనే రాసే వాడిని .తమాషాగా దానిలో మొదట్లో శ్రీరామ రాసి తర్వాత బెల్లం ,జిగురు, తర్వాత చింతపండు ‘’వగైరా రాసేవాడిని .మా ఇంట్లో అందరూ నవ్వేవాళ్ళు .దాన్నితీసుకొని మా నాన్నగారితో కొట్లో సరుకులు కట్టించి డబ్బిచ్చికాని పద్దుపెట్టి కాని తెచ్చేవాళ్ళం. జీతాలురాగానే ఇచ్చేవాళ్ళం డబ్బు .కనుక మాకు ఈకొట్టు అతి చనువు. అందులో పాపారావు ,నా౦చారయ్య అనే గుమాస్తాలు ఉండేవారు .బహునమ్మకస్తులు .ఉలవలు ధాన్యం,ఉప్పు  వగైరాలను మరకం(నాలుగు సేర్లపాత్ర ) తో  లేక అడ్డ(రెండున్నర సేర్లపాత్ర ) సేరుపాత్రతో సుబ్బారావు కొలిచేవాడు .చాలాస్పీడ్ గా కొలిచేవాడు .అంతవేగంగా కొలిచేవాడిని నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు .ఆయన కొలత మొదట్లో ‘’లాభం ‘’అని మొదలుపెట్టి రెండు ,ఆరెండు, మూడు ,ఆమూడు నాలుగు అంటూకొలిచేవాడు .’’ఒకటి ‘’అనే మాట వచ్చేది కాదు దాని బదులే’’ లాభం ‘’అనేవాడు ఎందుకో నాకు తెలేలిసేదికాదు. నోరు వెళ్ళబెట్టి గుడ్లు అప్పగించి ఆశ్చర్యంగా చూడటమే మాపని .

 ఇవాల్టితో పూర్తయిన శ్రీ కొల్లిపర పాండురంగారావుగారు రాసిన శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం ‘ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు ఈ’’లాభం’’ కథతెలిసింది .శ్రీ వాసవి కన్యకాదేవి అగ్ని ప్రవేశ సమయం లో 102 గోత్రాల వైశ్య దంపతులు  ఆమెతో పాటు అగ్ని ప్రవేశం చేయటానికి సిద్ధపడ్డారు .ధర్మపురానికి చెందిన ‘’లాభశ్రేష్టి ‘’అందరికంటే తనకే ముందుగా కంకణ ధారణ చేసి అగ్నిప్రవేశానికి అనుమతినిమ్మని అమ్మవారిని ప్రార్ధించాడు .వాసవి మాత అతని త్యాగానికి కరగిపోయి తొమ్మిదిపోగులతోకూడిన దారం ,ఆరు తమలపాకులతోకలసిన తాంబూలం ఆయువ లాభ శ్రేష్టికి ఇచ్చి ఆశీర్వదించి వైశ్య ప్రముఖులతో ‘’పూజ్యులైన గురుబాల వృద్ధులారా !ఈ యువకుడు తన వంశానికి ఒక్కడే .సమస్త వైశ్యకులధర్మ రక్షణకై ప్రాణాలు అర్పించటానికి సిద్ధం గా ఉన్నాడు .సంతానం లేని ఇతడికి ఉత్తమగతులు కలుగుగాక .ఇకముందు గణన, కొలగారం అంటే కొలపాత్రలతో కొలిచేటప్పుడు ,దానం మొదలైన అన్ని శుభకార్యాలను ఆచరించే సమయం లో వైశ్యులు అందరూ ఈ త్యాగ శీలుడైన యువకుడు ఈ ‘’లాభ శ్రేష్టి’’  పేరును ముందుగా స్మరించి ,వాళ్ళు పొందే పుణ్యఫలం  లో కొంచెం ఇతడికి చెందేట్లు కొలతలు ,దానాదులు చేయాలి .’’అని చెప్పింది ఆమె తండ్రి కుసుమ శ్రేష్టి ‘’కన్యకాదేవి చెప్పిన దానిప్రకారం ఆర్యవైశ్యులు చేసే దానం విక్రయం ,గణనం మొదలైన పనులలో మొట్ట మొదటగా ‘’లాభం’’అని చెప్పి తమ తొలి కర్మల పుణ్యఫలాన్ని ఈ లాభ శ్రేష్టి కి  సమర్పిద్దాం.ఇది నాఆజ్ఞ.’’అన్నాడు అందరూ అత్యుత్సాహంతో  చప్పట్లు మారుమోగేట్లు కొట్టి అంగీకారం తెలియజేశారు .ఇదీ ‘’లాభం ‘’కథ.

మరో విషయం –వైశ్యుల ప్రధాన వృత్తులలో ‘’గోదానం ‘’ఒకటి .’’గోమఠాలు’’ నెలకొల్పి గోపోషణ చేస్తూ ఉండే వీరిని ‘’గోమఠులు ‘’అనేవారు .వారినే కాలక్రమం లో పేరుమార్చి  ’’ కోమట్లు’’ అంటున్నాం .గోమఠులు ‘’కోమటులు’’ అయ్యారన్నమాట .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-26-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.