రావణుడు కొట్టిన శక్తి బాణం దెబ్బలకు లక్ష్మణుడు మూర్చపోతే ,రావణుడు చేతులతో లేపే ప్రయత్నం చేశాడా ?

రావణుడు కొట్టిన శక్తి బాణం దెబ్బలకు లక్ష్మణుడు మూర్చపోతే ,రావణుడు చేతులతో లేపే ప్రయత్నం చేశాడా ?

అవునంది వాల్మీకి రామాయణం .యుద్ధకాండ 59వ సర్గ లో రావణుడుతీవ్రబాణాలతో  తో లక్ష్మణుడిని కొట్టాడు .  రగిలిన కోపం తో రామానుజుడు రాక్షసరాజుధనుస్సునువిరిచేసి  మూడుబాణాలతో తీవ్రంగా నొప్పించగా రావణుడు దిగ్భ్రమ చెంది చలించిపోయాడు .అప్పుడు అతడి శరీరం కొవ్వుతో పూయబడి రక్తం తో  తడిసింది .కోపం పట్టలేక ఇక లక్ష్మనుడిని కట్టడి చేయటానికి బ్రహ్మ ప్రసాదించిన శక్తి ని చేతిలో ధరించి వదిలాడు. అది పొగకక్కుతూ నిప్పులకోలిమిలామండుతూ వానరులకు భయం కలిగిస్తూ రామానుజుడి మీదకు వచ్చింది . దాన్ని సుమిత్రా తనయుడు తీవ్ర అస్త్రాలతో హోమం చేసిన అగ్నిలా ఉన్న బాణాలతో కొట్టాడు .అయినా ఆశక్తి విశాలమైన లక్ష్మణస్వామి వక్షస్తలాన్ని తీవ్రంగా కొట్టింది .నేలపై ఒరిగిపోయాడు రామానుజుడు లక్ష్మణుడు .

  నేలపై పడి వ్యాకులంగా ఉన్న లక్ష్మణుడిని  రావణాసురుడు తనభుజబలం తో పట్టుకొన్నాడు .’’హిమవాన్ మందరో మేరు స్త్రైలోక్యం నా సహామరైః-శక్యం భుజాభ్యాముద్ధర్తు౦ నశక్యో భరతానుజః ‘’. హిమవత్పర్వతం ,మందరపర్వత౦  మేరుపర్వతం,దేవతలతో సహా మూడులోకాలనూ రావణుడు భుజాలతో ఎత్తవచ్చునేమో కానీ ,లక్ష్మణ స్వామిని మాత్రం ఎత్తలేకపోయాడు దశగ్రీవుడు .

  బ్రహ్మయిచ్చిన శక్తి చేత వక్షస్థలం పై కొట్ట బడినా ,తాను  ఊహించటానికి కూడా శక్యం కాని ‘’విష్ణుభాగం ‘’  అనే విషయాన్ని స్మరించటం చేత అపాయం లేనివాడయ్యాడట రామానుజుడు .’’శక్త్యా బ్రహ్మాతుసౌమిత్రి స్తాడితో పిస్తనాంతరే-విష్ణోర మీమా౦స్యభాగ మాత్మానం ప్రత్యనుస్మరత్ ‘’.

  తన ప్రయత్నం మానని రాక్షసరాజు రాక్షస సంహారకుడైన లక్ష్మణుడిని బాహువులతో గట్టిగా పట్టుకొని కదల్చటానికి విశ్వ ప్రయత్నం చేసినా చాతకాలేదట –‘’తతో దానవ దర్పఘ్న౦ సౌమిత్రిం దేవ కంటకః-త౦పీడయిత్వా బాహుభ్యాం నప్రభుర్ల౦ఘనే భవేత్ ‘’

 అప్పుడు హనుమాన్ రంగప్రవేశం చేసి రావణుడిమీదకు దూకి కోపం తో వజ్రం వంటి పిడికిలితో రావణ వక్షస్థలం పై మోదాడు .దెబ్బకు దెబ్బ తీశాడు .ఆదెబ్బకు అబ్బా అంటూ చలించిపోయి లంక రాజు నేలపై మోకాళ్లమీద పడిపోయాడు –‘’తతః కృద్దో వాయుసుతో రావణం సమభిద్రవత్ – అజఘానోరసి క్రుద్దో వజ్రకల్పెన ముష్టినా ‘’

ఈ దెబ్బకు రావణుడు ముఖం కళ్ళు చెవులనుంచి విపరీతం గా రక్తం స్రవించి రధం మధ్యలో కూర్చుండిపోయాడు .’’అస్యైశ్చనెత్రైః,శ్రవణైఃపపాత రుధిరం బహు -విషూర్ణ మానో నిశ్చేష్టో రథో పస్థ ఉపావిశత్ ‘’

 ఇంత అద్భుతమైన సీన్ ను మన హరికధకులుకాని ,పౌరాణికులు కానీ ,రామాయణ విశ్లేషకులు కానీ  ఎందుకు గుర్తి౦చలేదో ఆశ్చర్యమేస్తుంది .ఎవరికంటా పడలేదా ?నేను ఎక్కడా ఈ దృశ్య వర్ణన విన్నట్లు, చదివినట్లు గుర్తులేదు .మహర్షి వాల్మీకి వందనాలతో –

ఆధారం –ఆచార్య పుల్లెల రామ చంద్రుడుగారి బాలానందిని వ్యాఖ్య .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-26-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.