బుద్ధి గడ్డి తిని ‘’ఇద్దరమ్మాయిలతో ‘’వెళ్ళా .
నిన్న సాయంత్రం మా అమెరికా మనవడు అంటే మా అమ్మాయి విజ్జి పెద్ద కొడుకు శ్రీకేత్ ‘’తాతగారూ సినిమాకు తెసుకెళ్ళరా’’?అని గోముగా అడిగాడు .’’నేను ఎందుకురా రమణ మామయ్యా తీసుకు వెళ్తాడులే ‘’అన్నాను .ఎవరో ‘’దీపక్ హాల్ లో ‘’గుండె జారి గల్లంతు అయింది ‘’ఆడుతున్నట్లు చెప్పినట్లు జ్ఞాపకం అది చూడాలని నాకు ఉబలాటం .అదే అనుకోని మళ్ళీ శ్రీకేత్ తో ‘’మనిద్దరం వెళ్దాం లేరా ‘’అన్నాను .ఇద్దరం బయల్దేరి సాయంత్రం ఎడుగటల ఆటకు వెళ్లాం .తీరా టికెట్లు తీస్తే అక్కడ ఆడేది ‘’ఇద్దరమ్మాయిలతో ‘’అని తెలిసి కన్గుతిన్నాను .’ఏరా ఈసినిమాకు వెళ్దామా ?’’అని అడిగాను. వాడు ‘’ఈ సినిమాకే నేను వస్తానంది ‘’అన్నాడు .’’మోసం గురో ‘’అనుకోని బాల్కనీలో కూర్చున్నాం ఇద్దరికీ అరవై రూపాయలిచ్చి ..సీట్లు జారి పోతున్నాయి .నడుం నిలవటం లేదు .సరే వాడు ఎంజాయ్ చేస్తాడు కదా అనుకోని అల్లు అర్జున్ తో ‘’వరుడు ‘’సినిమా షూటింగ్ లో రామోజీ ఫిలిం స్టూడియో లో పరిచయం ఉందికదా అని కొంత రాజీ పది చతికిల పడ్డాను కుర్చీలో .
సినిమా ప్రారంభమైంది .ఏమి తీస్తున్నాడో ఎందుకు యాక్ట్ చేస్తున్నారో ఏమీ అర్ధం కావటం లేదు .పూర్వం దాసరి నారాయణ రావు అయిదారు సినిమాలు అద్భుతం గా తీసి ,ఆ తర్వాతా పైత్యం ప్రకోపించి ఇష్టం వచ్చినట్లు తీసిపారేసి జనం మీదికి సినిమాలను వదిలిన సంగతి గుర్తుకొచ్చింది మేమందరం ఆయన సినిమాలను ‘’దాసరి పైత్యం ‘’అనుకొనే వాళ్ళం ఆయన సినిమా చూడాలంటే భయం వేసేది చాలా సినిమాలు చూడలేదు కూడా .
ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే అదే సీను జ్ఞాపకం వచ్చింది .పూరీ జగన్నాద్ దమ్మున్న దర్శకుడే .’’పోకిరి‘’లో విశ్వరూపం చూపించాడు .’’ఇడియట్ ‘’ను కొత్తతరహలో నడిపించాడు ఆ తర్వాతా కొన్ని బానే చేశాడు .ఇప్పుడు ఈ సినిమాలో దాసరి గారి పైత్యం పూరీ కి కూడా కమ్మినట్లని పించింది .కధను ‘’పూరీ పిండి ‘’నలిపి నట్లు నలిపేశాడు .పాపం రావు గోపాల రావు కొడుకు ‘’జులాయి ‘’లో వేసిన పోర్శనే.అల్లు దీ అదే బాణీ .దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్–డ్రమ్ములు విరగ్గొట్టి గిటార్ తీగెలు తెంపి ,భూకంపం సృష్టించి నట్లు గా ఉంది విన సొంపైన బాణీయే లేదు. అతనికీ దాసరి గారి పైత్యం ప్రకోపించినట్లని పించింది .హీరోయిన్లు ఎందుకోస్తారో ఎందుకు పోతారో తెలీదు .వాళ్ళ భాష వాళ్ళకే అర్ధం కాదు .ముదురు డైలాగులు .ప్రేమకంటే కామ ప్రేలాపనే ఎక్కువ .’’ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను‘’అన్న చందమైంది నా పని .
దీనికి తోడు మరో పైత్య ప్రకోపం’’ బ్రహ్మి ది వయోలినిస్ట్ ‘’.ఆపాటలేమితో ఆ రాగాలేమిటోఎవరినో ఉద్దెశిన్చిఆ సంగీత ప్రకంపనలేమిటో జుట్టు పీక్కోనేట్లుంది .సంగీతానికి విదేశాలలో జరిగిన అవహళనే అది .క్షమించరానిది.ఇద్దరు హీరోయిన్లు .మధ్యలో డైరీ రీడింగు .ఆ డేయిరీ ని రెండో అమ్మాయిని ట్రాప్ చేయటానికే నని చివరికి అల్లు చెబుతాడు .మొదటావిడ రివెంజి చేస్తుంది .రెండో ఆవిడా సహకరిస్తుంది .
పాపం విలన్లు ఏమి చెయ్యాలో తెలీక అర గంట కోసారి ఒక డాబా మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా గుండ్రం గా నిలబడి మాట్లాడుకొంటారు .అల్లు అయినకాడికి ఏ ఆయుధమూలేకుండా కొన్ని సార్లు సాయుదుడై మిగిలిన సార్లు విచక్షణా రహితం గా చంపేస్తూ ఉంటాడు .పోలీసు ఆఫీసర్లు చేతులు ముడుచుకొని చోద్యం చూస్తూంటారు .ఇలా కధ నలిగి నలిగి, చినిగి చినిగి, పిసకబడి పిసకబడి, మర్దనా అయి పోయి’’,మర్దరూ’’అయిపోయి మనకు చెవుడు కళ్ళ నెప్పి తెప్పించే సినిమా ఇది .పూరీ ‘’పూర్ పెర్ఫామేన్సు ’ ‘కు నిలువెత్తు అద్దంఈ సినిమా .ఒక సారి తాపీగా కూర్చుని పూరీ తన ప్రతిభను సమీక్షిన్చుకోవాల్సిన సమయం వచ్చింది .అడ్డ దిడ్డం గా సినిమాలు తీసి ఎవరో హీరో కోసం బలి కాకూడదు తాను .మంచి కద లేకున్నా పర్లేదు పిక్చరైజేషన్ తో ఆకట్టుకొన్నాడు ఇప్పటిదాకా .ఈ సినిమాలో అన్నీ తీసికట్టే .దాసరి లాగా మారి పోవద్దని పూరీ ని ,అతని ప్రతిభను కోరుతున్నాను ఆరోగ్యవంత మైన సినిమాలు తీసి జనం కు సినిమా మీద నమ్మకం కలిగించలేక పోతే సినిమాలు తీయటం మానేయటం చాలా మంచిది పూరీ లో గొప్ప రచయిత ఉన్నాడు . ఆ రచయిత ను వెలుగు లోకి తెస్తే మళ్ళీ సాహిత్యానికి ఎంతో మేలు చేసి నట్లవుతుంది .
నిజం గా చెప్పాలి అంటే చెవులు రెండూ మూసుకొని సినిమా చూశాను ఆ రణగొణ ధ్వని భరించలేక. అది మ్యూజిక్ అనుకొంటే తెలుగువాళ్ళ దురదృష్టం. దేవిశ్రీ తన ప్రతిభతో దేదీప్యమానం గా ఇప్పటిదాకా వెలిగాడు .అది దీంతో మసక బారిపోయింది .కర్ణ కఠోరం అని పించింది .’’సారీ పూరీ అండ్ దేవీ’’ .
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -6-6-13-ఉయ్యూరు
