
అదొక సరస్వతీనిలయం. నిజాం రాజుల మీద, ఆంగ్లేయుల మీద పోరాడేందుకు యువతను సన్నద్ధం చేయాలన్న ఉన్నత ఆశయంతో ఊపిరిపోసుకున్న ట్రస్ట్ ‘గురుకుల్’. ఎంతోమంది దాతల ఔన్నత్యంతో బన్సీలాల్‌వ్యాస్ ఆ ట్రస్టును విద్యాలయంగా నెలకొల్పారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన వారసులు అష్టకష్టాలతో బతుకుతున్నారు. వారి కుటుంబీకులలో ఒకరైన స్నిగ్ధావ్యాస్.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ఉన్న గురుకుల్‌లో కేవలం అయిదువేల జీతంతో పనిచేస్తున్నారిప్పుడు. వేలకోట్ల రూపాయల విలువ చేసే ట్రస్ట్ భూములు అన్యాక్రాంతమైపోవడం, కొన్నింటిని గత ప్రభుత్వాలు అమ్ముకోవడం.. వీటన్నిటిమీద ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టడంతో.. మరోసారి ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్నిగ్దావ్యాస్ మాట్లాడారు..
పూర్వం మాది కోల్‌కతా. నాన్న పేరు హరిప్రసాద్ పండిట్. నేను అక్కడే పుట్టి పెరిగాను. మా అన్నయ్య బట్టలషాపు నడిపేందుకు హైదరాబాదుకు వలస వచ్చాడు. అప్పట్లో మాదేమీ ఉన్నోళ్ల కుటుంబం కాదు. ఉన్నంత వరకు బాగానే ఉండేవాళ్లం. మా అన్నయ్య హైదరాబాదులో ఉన్నందున నేను కూడా ఇక్కడికే రావాల్సి వచ్చింది. మేము బ్రాహ్మణులం. సంప్రదాయ పద్ధతులను పాటించేవాళ్లం. అలాంటి గౌరవ కుటుంబీకులకే నన్నిచ్చి పెళ్లిచేయాలని మా కుటుంబీకులు భావించేవారు. చుట్టాల ద్వారా సంబంధం వెతుకుతున్నప్పుడు బన్సీలాల్ కుటుంబం గురించి తెలిసింది. బన్సీలాల్, జానకీదేవిలకు ఒక కొడుకు, మరో కూతురు. కొడుకైన దేవేంద్రనాథ్‌కు ఇద్దరు కొడుకులు సురేంద్రనాథ్, రవీంధ్రనాథ్. వాళ్లలో రెండో అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్లి అయ్యాక వాళ్ల ఇంటికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం గొప్పతనం గురించి తెలిసింది. దేశానికి ఎంతో సేవ చేయాలన్న ఉత్తమ ఆశయంతో బన్సీలాల్ అప్పట్లో గురుకుల్ నెలకొల్పారు. అందుకు స్పందించిన కొందరు దాతలు భూముల్ని దానం చేశారు. నాకు తెలిసినంత వరకు మా పెద్దలు చెప్పిన సమాచారం మేరకు – నిజాం రాజులు, ఆంగ్లేయుల మీద పోరాడేందుకు యువతను సన్నద్ధం చేయడం గురుకుల్ లక్ష్యమట. అప్పట్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, ప్రాణత్యాగాలకు సైతం వెనకాడకుండా.. బన్సీలాల్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. చదువుతోపాటు వ్యక్తిత్వ నిర్మాణంలోను గురుకుల్ కృషి ఆదర్శనీయం.
జీతాలకే దిక్కులేదు..
గురుకుల్ ట్రస్టు కింద ఎన్ని వందల ఎకరాల భూమి ఉందో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఘట్‌కేసర్‌లో ఉన్న గురుకుల్‌ట్రస్ట్‌ను మాత్రం ఆర్థికసంక్షోభాలతోనే నడుపుతున్నాము. నా భర్త కొన్ని ఇబ్బందుల వల్ల చనిపోయాడు. నేనిప్పుడు ఒక్కదాన్నే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలేతై వాళ్లకు పెళ్లిళ్లు చేశాను. ఒకరు మద్రాసులో మరొకరు రాజస్థాన్‌లో ఉంటున్నారిప్పుడు. అందమైన భవనాలు నిత్యయఙ్ఞంతో ప్రత్యేక హాస్టల్ వసతి గల ఈ విద్యాలయాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదొక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం లాభం! మా పరిస్థితి మారలేదు. వందల ఎకరాల ఆస్తులను గురుకుల్ అభివృద్ది కోసమే కేటాయించాలన్నది నా అభిప్రాయం. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులున్నప్పటికీ మాతృసంస్థ అయిన గురుకుల్‌కు పైసా చెల్లించడం లేదు. జిల్లాలోనే ఏకైక ఎయిడెడ్ కళాశాలగా ఉన్న గురుకుల్ కళాశాలలో పోస్టులను భర్తీ చేయలేదు. ట్రస్టులో మా మామగారి తల్లి జానకీదేవి, బి.కిషన్‌లాల్‌లు సభ్యులుగా ఉండేవారు. అప్పుడు గురుకుల్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. ఆ తర్వాత ఎండోమెంటు పరిధిలోకి వెళ్లింది. అప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మాలాంటి వాళ్లం ఏమీ చేయలేక బాధపడుతూ కూర్చున్నాం.
గురుకుల్ అభివృద్ధిని ఎండోమెంట్ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గురుకుల్‌ను ట్రస్టులోనే కొనసాగించాలి. సంస్థకు వేల కోట్ల ఆస్తులున్నప్పటికీ చాక్‌పీసుల కోసం, కనీస అవసరాల కోసం దాతలను అభ్యర్ధించాల్సి వస్తోంది. గురుకుల్‌లో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వమే విద్యను అందించే ఏర్పాట్లు చేస్తే మంచిది. ఇక్కడ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తే ఇటు హైదరాబాద్‌కు దగ్గర్లోని ఘట్‌కేసర్, కీసర, బీబీనగర్, ఉప్పల్ మండలాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాకు వేతనాల వరకు అయితే – గత ఆరేళ్ల నుంచి మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ ట్రస్టు ద్వారా అందుతున్నాయి..” అని ముగించారు స్నిగ్ధావ్యాస్.

