భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండేల్
Posted on 01/07/2014 by గబ్బిట దుర్గాప్రసాద్
(విహంగ కు ప్రత్యేకం )
భారత నాట్య శిరోమణి ,సాంఘిక సేవా దీక్షితురాలు ,జంతు ప్రేమి ,థియాసఫిస్ట్ శ్రీమతి రుక్మిణీ దేవి అరండేల్ ఆదర్శ మహిళా మాణిక్యాన్ని గురించి తెలుసుకుందాం .1904 ఫిబ్రవరి 29న తమిళ నాడు లోని మదురై లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించింది .తండ్రి నీల కంఠ శాస్త్రి ఇంజినీర్ .తల్లి శేషమ్మ కు సంగీతం ఇష్టం .తండ్రికి తరచూ ఉద్యోగ బదిలీలు ఉండేవి.ఆనిబి సెంట్ మద్రాస్ లోని అడయార్ లో నిర్వహిస్తున్న థియోసాఫికల్ సొసైటీ తో తండ్రికి పరిచయమై ,తండ్రితో పాటు వెళ్ళిన రుక్మిణికి ఆ సంస్థ తోను నాట్యం సంగీతం ,భారతీయ సంస్కృతులపై మంచి అవగాహన కలిగింది .ఆ సంస్థ నిర్వాహకు రాలైన అనిబిసెంట్ అనుచరుడు జార్జి అరండేల్ ను చూసింది . ఆయన అప్పుడు వారణాసి లోని సెంట్రల్ హిందూ కాలేజి ప్రిన్సిపాల్.ఆయనపై ప్రేమాభిమానాలేర్పడి అందరికి ఆశ్చర్యం కలిగిస్తూ అరండేల్ ను మతాంతర వివాహమాడి సంచలనం సృష్టించింది రుక్మిణీ దేవి .
భర్త అరండేల్ తో కలిసి ప్రపంచ పర్యటన చేస్తూ ఎందరో థియసాఫిస్ట్ లను జేమ్స్ కజిన్స్ అనే కవిని ,మేరియా మాంటిసోరి అనే విద్యా వేత్తనూ కలుసు కొన్నది.కొద్దికాలం లోనే అఖిల భారత యువ ధియాసఫిస్ట్ సమాఖ్య కు అధ్యక్షురాలై తర్వాత ‘’ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ యంగ్ ధియాసఫిస్ట్స్ ‘’.గౌరవ స్థానాన్ని అందుకొన్నది .అనుకోకుండా బాంబే లో రష్యా బాలే నాట్య కళా కారిణి ‘’అన్నా ప్రావ్లోవా ‘’కార్య క్రమాన్ని అరండేల్ దంపతులు చూశారు .ప్రావ్లోవా తో పరిచయం రుక్మిణి కి నాట్యం పై అభి రుచి కల్గి, , ఆమెతో నౌక లో ఆస్ట్రేలియా వెళ్లి నాట్యం అభ్యసించి ఆమె బృందం లో ప్రదర్శనలిస్తూ ‘’సోలో ‘’లలో విశేష ప్రతిభ కన పరిచింది .అన్నా ప్రావ్లోవా ప్రోద్బలం తో రుక్మిణి కి భారతీయ నాట్యం పై విపరీతమైన అభిమానం కలిగి జీవితాంతం ఆ కళకే అంకితమైంది .
1933లో మద్రాస్ మ్యూజిక్ అకాడమి వార్షికోత్సవం రుక్మిణీ దేవి జీవితాన్ని మలుపు తిప్పింది .ఆ రోజు ‘’సాదిర్’’‘’అనే నాట్యాన్ని చూసి ,మైలాపూర్ గౌరీ అమ్మాళ్ దగ్గర ,ఈ కృష్ణయ్యర్ పర్య వేక్షణలో అభ్యసించి చివరగా ‘’పండనల్లార్ మీనాక్షి సుందరం పిళ్లే ‘’వద్ద మెళకువలు నేర్చింది .రుక్మిణీ మొదటి ప్రదర్శనను 1935లో థియాసాఫికల్ సొసైటీ డైమండ్ జూబిలీ ‘’ఉత్సవాలలో చేసి అరంగేట్రం చేసి అందరి ప్రశంసలు పొందింది .1936జనవరి లో భర్తతో కలిసి సంగీత , నృట్యాభి వృద్ధికోసం ‘’కళా క్షేత్ర ‘’సంస్థను స్థాపించి భారతీయ సాంప్రదాయ ‘’గురు కుల ‘’విధానం లో నేర్పటం ప్రారంభించింది . ఈసంస్థను వంద ఎకరాల సువిశాల ప్రాంగణం లో ’తిరువన్మియూర్ ‘’ లో అన్ని వసతులతో ఏర్పాటు చేశారు దంపతులు .కళాక్షేత్ర లో విద్య నభ్యసించి ప్రసిద్ధులైన నాట్య కోవిదులలో శ్రీమతి యామిని కృష్ణ మూర్తి సంయుక్తా పాణిగ్రాహి కమలాదేవి చటోపాధ్యాయ ,లీలా సామ్సన్ ,రాదా బర్నర్ ,అంజలి మెహర్ ,శారదా హాఫ్మన్ ,తో బాటు శ్రీ సి వి చంద్ర శేఖర్ లు ఉన్నారు .
‘’సాదిర్ ‘’నుంచే భారత నాట్యం ఆవిర్భవించింది .భరతనాట్యం పేరు రావటానికి ముఖ్య కారకులు కృష్ణయ్యర్ ,రుక్మిణీ దేవి .పండనల్లార్ శైలి లో ఉన్న విధానం లో ఎన్నో గణనీయ మైన మార్పులు తెచ్చి ఆధునిక భారత నాట్యాన్ని అభి వృద్ధి చేసి ప్రపంచ ప్రసిద్ధి చేసిన ఘనత వీరిద్దరికే దక్కింది .ఒకప్పటి ‘’దేవ దాసీ’’నృత్య సంప్రదాయం ఇప్పుడీ భరతనాట్య సంప్రదాయం గా రూపు దాల్చింది . ఆలయ శిల్పాలను అధ్యయనం చేసి ఆహార్యం ,తగిన వస్త్రాలు వయోలిన్ లాంటి వాద్య సహకారం ,లైటింగ్ ,ఆభరణాలు మొదలైన హంగులన్నీ ఏర్పాటు చేసి మహోన్నత వైభవాన్ని సంతరించింది .ఎందరో సంగీత, నృత్య గురువులను ఆహ్వానించి మెలకువలను నేర్పించింది .విషయం లో కొత్తదనాన్ని ప్రవేశ పెట్టి రామాయణ గీత గోవిందం లను వినూత్న విధానాలలో జనరంజకం గా అభినయించే పద్ధతులను ప్రవేశ పెట్టి కళ ను జన సామాన్యం దగ్గరకు తీసుకు వెళ్ళింది . రామాయణం లోని ముఖ్య ఘట్టాలైన సీతా స్వయం వరం ,రామ వనవాసం పాదుకా పట్టాభిషేకం శబరీ మోక్షం లను ,కాళిదాస మహా కవి రచించిన కుమార సంభవ కావ్యం లో ముఖ్య విషయాలను జయదేవుని గీత గోవిందాన్ని ,ఉషా పరిణయం లను రుక్మిణీ దేవి అసమాన ప్రతిభ తో భారత నాట్యాన్నిఅభినయింప జేసి ప్రేక్షకుల అభినందనలనందుకోన్నది. నిత్య ప్రయోగ శీలిగా ఉండేది .
భారత నాట్య శిక్షణ ఇస్తూనే విద్యా భి వృద్ధికి రుక్మిణి దంపతులు అవిరళ సేవ లందించారు .భారత దేశం లోనే మొట్ట మొదట గా ‘ మాంటిస్సోరి ‘’ విద్యా విధానాన్ని కళా క్షేత్ర ఆవరణలో ప్రవేశ పెట్టారు .’’బీసెంట్ థియాసాఫికల్ హై స్కూల్ లో 1939లో తరగతులు ప్రారంభించ టానికి మరియా మాంటిస్సొరి ని డాక్టర్ అరండేల్ ఆహ్వానించాడు .తరువాత ‘’బీసెంట్ అరండేల్ సీనియర్ సెకండరి స్కూల్ ‘’ ,’’కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ‘’,మరియా మాంటిస్సొరి స్కూల్ ఫర్ చిల్ద్రెన్ ,క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ సెంటర్ ,యు .వి స్వామినాధయ్యర్ లైబ్రరి ,మొదలైన సంస్థలను కళాక్షేత్ర ఆవరణలోనే నెలకొల్పి విద్యాభి వృద్ధికి ఏంతో తోడ్పడ్డారు .1952 ,56లో రాజ్య సభ సభ్యురాలై సమర్ధ వంతం గా దేశ సేవ చేసింది .
రాజ్య సభ సభ్యురాలిగా అనేక సంస్థలతో సంబంధం కలిగి ఉంది .మాన వ సేవాకార్యక్రమాల నెన్నిటినో చే బట్టింది .రాజ్య సభ సభ్యురాలుగా జంతు హింస ను నిషేధిస్తూ ప్రభుత్వం 1960 లో తెచ్చిన ‘’ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ ‘’ను కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి తీసుకు రావటం లో రుక్మిణీ అరండేల్ కృషి ప్రశంసనీయం .ప్రభుత్వం 1962లో’’యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ‘’ను ఏర్పాటు చేసి రుక్మిణీ దేవిని దానికి చైర్మన్ ను చేసి గౌరవించింది .ఆ పదవిలో జీవితాంతం పని చేసి జంతు సంక్షేమానికి ఎనలేని సేవలందించింది . తాను శాకా హారిగానే ఉంటూ శాకా హార వ్యాప్తికి చాలా కృషి చేసింది .1955నుండి 31సంవత్సరాలు అంటే జీవితాంతం ‘’ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ ‘’కు ఉపాధ్యక్షురాలుగా పని చేసింది .
రుక్మిణీ దేవి సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన ఆ నాటి జనతా పార్టి ప్రధానమంత్రి ,గాంధేయ వాది శ్రీ మొరార్జీ దేశాయ్ ఆమెను ‘’రాష్ట్ర పతి ‘’పదవి కి అభ్యర్ధిగా ప్రకటిస్తామని కోరితే మర్యాదగా తిరస్కరించిన సంస్కారి రుక్మిణీ అరండేల్ .82ఏళ్ళు నిండు జీవితాన్ని గడిపి భారత నాట్యానికి, విద్యాభి వృద్ధికి జంతు సంక్షేమానికి సేవలు అందించిన రుక్మిణీ దేవి 1986 ఫిబ్రవరి 24న మరణించింది .
భారతీయ చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని 1987లో కళాక్షేత్రం లో ‘’కలం కారి కేంద్రం ‘’ను ప్రారంభించారు .దీని ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1994లో ‘’జాతీయ ప్రాముఖ్య సంస్థ ‘’గా ప్రకటించింది . రుక్మిణీ దేవి అరండేల్ శత జయంతిని 29-2-2004న కళాక్షేత్రం లోను ప్రపంచం లో వివిధ ప్రాంతాలలోను సభలూ సమావేశాలు సెమినార్లు నిర్వహించి ఘనమైన నివాళి అర్పించారు .ప్రపంచ వ్యాప్తం గా యువత పాల్గొని పాటలు నృత్యాలు, పద్య పఠనం లతో మారు మోగించారు .ఆ రోజే న్యుధిల్లీ లో లలితా కళా ఆడిటోరియం లో రుక్మిణీ దేవి ఫోటో ప్రదర్శన నిర్వహించారు . ఆ నాడే డాక్టర్ సునీల్ కొఠారి రచించిన రుక్మిణీ దేవి జీవిత చరిత్ర ,ఫోటో లతో ఉన్న పుస్తకాన్ని మాజీ రాష్ట్ర పతి వెంకట్రామన్ ముందు మాట రాయగా ,భారత రాష్ట్ర పతి ఏ.పి జే .అబ్దుల్ కలాం ఆవిష్కరించారు .
రుక్మిణీ దేవి నృత్య విద్యా, సాంఘిక సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956’’పద్మ భూషణ్ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .విశ్వ భారతి ‘’దేశికోత్తమ ‘’అవార్డును ప్రదానం చేసింది .సంగీత నాటక ఎకాడేమి ,పురస్కారాన్ని, ఫెలోషిప్ ను అంద జేసింది .భారత జంతు సంక్షేమ సంస్థ ‘’ప్రాణి మిత్ర ‘’ను ,లండన్ లోని ‘’రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ ‘’సంస్థ ‘’క్వీన్ విక్టోరియా సిల్వర్ మెడల్ ‘’,నుఇచ్చాయి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘’కాళిదాస సమ్మాన్ ‘’పురస్కారం అందించి సత్కరించింది .అమెరికాలోని వేన్ విశ్వ విద్యాలయం గౌరవ డాక్ట రేట్ ను ,లాస్ ఏంజిల్స్ కౌంటి అండ్ సిటి వారు ‘’స్క్రోల్ ఆఫ్ ఆనర్ ‘’అందజేసి గౌరవించారు .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

