వాల్మీకం లో వర్షర్తు శరదృతు వర్ణన

వాల్మీకం లో  వర్షర్తు శరదృతు వర్ణన

రామ లక్ష్మణులు కిష్కింద దగ్గర ప్రస్రవణ పర్వతం పై ఉన్నప్పుడే వర్షరుతువు శరదృతువు వచ్చి వెళ్ళిపోయాయి.మహర్షి వాల్మీకి  ఆ రెండిటిని అద్భుథ కవితా శైలిలో వర్ణించాడు .ఆ వైభోగాన్ని దర్శిద్దాం .

వర్షర్తు వర్ణనం

కిష్కింధలో సుగ్రీవుడు అంగదుడు పట్టాభి షేక ఆనందం లో హర్షాన్ని అనుభవిస్తున్నారు .ఇక్కడ ప్రస్రవణ పర్వతం మీద రామ సోదరులిద్దరు వర్షాకాలపు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు .శరత్ కాలం ఎప్పుడు వచ్చి సీతాన్వేషణ మొదలౌతుందా అని ఎదురు చూస్తూ చింతా క్రాంతు లైనారు.సింహాలు పులులూ , కొండా, కోనా .చెట్లూ చేమ ,పూలు పండ్లు చూడటానికి మనోహరం గా ఉన్నా ,మనస్సు దేనిమీదో ఉండటం వలన సోదరుల మనస్సును రంజింప లేక పోతున్నాయి .పర్వత శిఖరం ఎక్కి ప్రకృతి పులకిన్తను చూడాలనుకొను  చూశారు మనోహరం గా ఉంది అసలే ప్రకృతి ప్రేమికులు వారి మనసులు పులకింతలై పరవశించిపోయారు .

పర్వత శిలలు అనేక వన్నె చిన్నెలతో భాసిస్తున్నాయి .అందులో అనేక ధాతువులున్నాయి .చాలా రకాల పూలు ,జలజల పారే సెల ఏళ్ళు ,సరోవరాలు నాలుగు దిక్కులా కని పిస్తున్నాయి  .ఈశాన్యానికి దిగువ ,నైరుతికి ఎగువన గా ఉన్నందున రామ లక్ష్మణులుండే గుహ వాస యోగ్యం గా ఉంది .ఒక వైపు మేఘ మాలగా ,మరో వైపు కైలాస శిఖరం లాగా కానీ పించే పర్వత శిఖరం రక రకాల వృక్ష సంతతి తో పట్టు చీరకట్టి ,బంగారు ఆభరణాలతో అలంకరించుకొన్న  అంగన లా ఉంది .ఎటు చూసినా పక్షుల కలకలారావాలు ,హంస సారసల మంద గమనం ,పుష్ప హాసం ,నిర్మల నదీ జలం చందన చెట్ల నుండి వచ్చే సుగంధం ,మనోహరం గా ఉన్నాయి .దగ్గరలోనే ఉన్న కిష్కింద నుండి నృత్య గీత సంరంభం విని పిస్తూనే ఉంది .అక్కడ సుగ్రీవుడు చాలాకాలం తర్వాత స్త్రీ సాంగత్య భోగాలనుభవిస్తుంటే ఇక్కడ రాము డు సీతా వియోగం తో విచారిస్తూంటాడు .రామానుజుడు అన్నకు ధైర్యం చెప్పుతున్నాడు .సకల లోకాలను జయించే కోదండ పాణికి రావణుడు ఒక లెక్క కాదని ధైర్యం చెప్పాడు .శరత్తు రాగానే విజయయాత్ర చేసి రావణ సంహారం చేద్దామంటాడు .

సోదరుల ఆవేదనకు ఉపశమనం గా చల్లని వాతా వరణం సహకరిస్తోంది .కొండల్లాంటి మేఘాలు ఆకాశమంతా నిండి చల్లని గాలితో బాటు రసధారలతో భూదేవి దాహాన్ని తీరుస్తున్నాయి .నవమాసాలు సూర్య కిరణాలతో పీల్చుకొన్న జలం తో గర్భ ధారణ చేసిన ఆకాశం శ్రావణ మాసం రాగానే కమ్మని రాసానయాన్ని కంటోంది .రంగు రంగుల మేఘాలు చూడ ముచ్చటగా ఉన్నాయి .ఎండకు ఎండి ఒత్తుగా కురిసిన వానకు నిట్టూర్పు విడిచే భూమ తల్లి లాగా సీతా మాత కూడా దిగులుతో నిశ్వ సిస్తూ ఉంటుందని రామయ్య భావించాడు . కాదంబినీ కడుపు లో నుంచి వెలువడే కమ్మ తెమ్మేరాలను రెండు చేతులతో తాగేయాలని పిస్తోంది .శత్రు సంహారం జరిగి నిర్భయం గా నిబ్బరం గా పట్టాభి షేకం చేసుకొంటున్న సుగ్రీవుడి లాగా పర్వత రాజం అప్పుడప్పుడు కురిసే వర్ష దారాలతో అభిషేకం చేసుకొంటోంది .మేఘాలను జింక చర్మం లా ధరించి జలదారాలను జందెం లా వేసుకొని గుహ లో నుంచి వెలువడే గాలిని వేద నాదం చేసుకొని గిరి కుమారులు వేదాధ్యయనం చేస్తున్నట్లుంది .కొరడా దెబ్బల లాంటి మెరుపు తీగల తాకిడికి తాళ లేక ఆకాశం  అక్రంది స్తూంది  . మేఘాలను తప్పించు కొని పోవాలని తల్లడిల్లే తటిల్లతలను చూస్తె రావణుడి ఒడిలో గిల గిల కొట్టు కున్న సీత రాముడి ఊహా  ప్రపంచం లో  ఒక్క సారి మెరుస్తుంది .దిక్కులను, కాలాలను మరిపింప జేసే ముసురు ప్రేయసీ ప్రియులకు ఆహ్లాదం గా ఉంది .వర్షం వస్తుందనే హర్షాతి రేకం తో కొండలు పుష్పించాయి .ధూళి అణగి పోయింది .గాలి చల్ల బడి పోయింది .వేసవి వైషమ్యం ఉప శమించింది .రాజులు విజయ యాత్రలు ఆపేసి విశ్రమించారు .హంసలు మానస సరోవరాలను చేరుకొన్నాయి .చక్ర వాకాలు అన్యోన్యం గా మెలగుతున్నాయి.దారులన్నీ ఏకమైనాయి .ఒక చోట వెలుతురు ఇంకో చోటా చీకటి ఉండటం వల్లఆకాశం వెలుగు నీడలతో రమణీయం గా ఉంది .సెలయేళ్ళు అతి వేగం గా ప్రవహిస్తున్నాయి .తుమ్మెదలు నేరేడు పండ్ల రుచి మరిగి ఆప్యాయం గా ఆరగిస్తూ ఉన్నాయి .పండిన మామిడి పళ్ళు రాలి కిందపడ్డాయి .పచ్చిక బయళ్ళు నెమళ్ళతో నిండి పోయాయి .మేఘాలు వర్ష దారాల తో నిర్విరామం గా నడవ లేక కొండ మీద విశ్రాంతి తీసుకొంటూ వెడుతున్నాయి ఇంద్ర గోపపు పురుగులతోబయళ్ళు పట్టు చీరల్లా కని  పిస్తున్నాయి .కేశవ స్వామి నెమ్మదిగా నిద్ర పట్టిస్తుంటే నదులు సముద్రం లో కలిసి పోతున్నాయి .బలాక పక్షులు మేఘాల దగ్గరకు చేర్తున్నాయి .కాంతలు కౌగిట్లో నలిగి పోతుంటారు .నదులు ప్రవహిస్తూంటే మేఘాలు వర్షిస్తున్నాయి .ఏనుగు ఘీన్కారాలతో అడవులు మార్మ్రోగి పోతున్నాయి .అరణ్యాలు రమ్యం గా భాసిస్తున్నాయి .విరహ వేదన చెందే వారు ప్రియులను స్మరించుకొంటూ దిగులు పడుతూ ఉంటారు .నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి .ఏనుగులు జల పాతాలాల ధ్వనికి ఉలిక్కి పడి వెనక్కి చూస్తూ నృత్యం చేస్తున్నాయి .తుమ్మెదలు పై నుంచి పడే వాన జల్లుకు చిరాకు పడుతూ ,పూదేనే తాగుతూ తాగుతూ ఆగిపోతాయి .మేఘ గర్జన విన్న మత్తేభాలు తమ తో పోటీకి మరో మత్తేభం గర్జిస్తోంది అని   భ్రమ పడుతున్నాయి .సృష్టిలోని సకల ప్రాణులు సుఖాన్ని అనుభ విస్తూ హాయిగా వర్షాకాలం గడుపుతున్నాయి సీత జాడ తెలియక రామ లక్ష్మణులు మాత్రం బాధ పడుతున్నారు .

శరదృతు  వర్ణనం

వర్షాకాలం పోయి’’  శారదరాత్రు లుజ్వల లసత్తర తారకహార పంక్తులన్ ‘’అని ఎర్రన గారు వర్ణించినట్లు శారదరాత్రులు వెలిగి పోతున్నాయి .ఆకాశం నిర్మలం గా కనిపిస్తోంది సుగ్రీవుడికిచ్చిన గడువు దాటి పోయింది .అన్వేషణ ప్రారంభం కాలేదని పించింది రాముడికి .తన ఆర్తిని తమ్ముడికి రాముడు చెప్పుకొంటాడు .అన్నకు ధైర్యం చెప్పి ,ఆత్మా సంయమనం తో యోగ సమాధి సాధించి దుఖాన్ని జయించమని రామానుజుడు అన్నకు చెప్పాడు .రావణుడు సీతను స్వాధీనం చేసుకోవటం అగ్నిని కౌగిలించుకోవటమే నన్నాడు .శర న్మేఘ సందర్శనం చేయాలని అన్న దమ్ములిద్దరూ ఉవ్విళ్ళూరుతుంటారు .వెన్నెల రాత్రుల వైభవాన్ని దర్శించి పులకించి పోతారు .చక్రవాకాలు హంసలు తుమ్మెదలు మదపు టేనుగులు వృషభ రాజులు ప్రకృతి లావణ్యాన్ని చూసి పరవశించి పోతూంటాయి .ఏనుగులు ప్రణయ లీలలోసర్వం మరచి క్రీడిస్తు రమణీయ వనాంతరాలలో విహరిస్తున్నాయి .హంసలు హర్షాతి రేకం లో జలక్రీడలు చేస్తూ పులకిస్తున్నాయి .నెమళ్లు కొంగలతో పోటీ పడి ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి .ఇప్పటిదాకా పుట్టల్లో దాక్కున్న పాములు శరత్తు రాగానే బయటికి వస్తున్నాయి .సంధ్యా దేవి కూడా అనురాగం అతిశయించి చంద్రుని కిరణ  స్పర్శకు పులకరించి తారకలాంటి కళ్ళను తెరచి తనంతట తానే అంబరాన్ని వదిలి వెడుతోంది .తెల్లని వెన్నెల చీర కట్ట్టుకున్న రజనీ కుమారి సౌకుమార్యం ,సౌందర్యం ఎంత చెప్పినా చాలదు .

వెన్నెల రాత్రిలో గగన వీధి లో కలిసి పోయిన జాబిల్లి లాగా నీటి మడుగులో కలువల మధ్య హంస హాయిగా నిద్ర పోతోంది .తెల్ల వారు జామున పల్లెల్లో విని పించే రధి మంధన ఘోష ,ఆబోతు ఆనంద నినాదాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి .తుమ్మెదలు కమ్మ తెమ్మరెల వెంట జంటలు జంటలుగా తిరుగుతూ ,మధ్య మధ్య మకరందాన్ని ఆస్వాదిస్తూ తుంటరి చేష్టలు చేస్తున్నాయి .చేపలకు నడుము కట్టు గా ఉన్న నదీ సుందరులు ప్రణయ క్రీడలతో అలసి పోయి మందం గా ముందుకు కదిలి వేడుతున్నాయి  .ఎక్కడ చూసినా పైరు పంటలు కంటికి ఇంపుగా మనసుకు ఆహ్లాదం చేస్తున్నాయి .వసుమతిని రసప్లావితం చేసిన వారి దారలు అంటే మేఘాలు వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతున్నాయి .వాన నీరు తగ్గి పోతుంటే నదీ తీరం లో నెమ్మదిగా భూమి కని  పిస్తోంది .మొదటి సమాగమం సమయం లో తొడల మీద పట్టుకొని సిగ్గును నటించే సౌభాగ్య వతుల్లా నదీ ప్రవాహం ప్రసన్నం గా కని  పిస్తోంది . వర్షాలు తగ్గ గానే రాజులు శత్రువులపై దాడికి సిద్ధమౌతున్నారు .కాని సుగ్రీవుడు కాంతా సక్తం లో మునిగి తమను పట్టించుకోవటం లేదని రాముడు భావించి సుగ్రీవుడి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని బాధ పడుతాడు .వానర రాజుకు బుద్ధి చెప్పి రమ్మని తమ్ముడు లక్ష్మణుడిని కిష్కింధకు పంపిస్తాడు .

వాల్మీకి మహర్షి చేసిన ఈ రెండు ఋతువుల వర్ణనలు కాళిదాసుకు ,ఆ తర్వాత నన్నయ ,తిక్కన ఎర్రనలకూ ఆదర్శమైంది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.