బ్రాహ్మణాల కధా కమామీషు -16
ఉప బ్రాహ్మణాలు -2
తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనే ముఖ్య సాధనం అని అందులో మూడు రకాలున్నాయని చెప్పుకొన్నాం .ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకొందాం .
క్రుచ్చ్రం
మూడు రోజులు పగటి పూట మాత్రమె సాత్వికాహారం తింటూ ,తరువాత మూడు రోజులు రాత్రిమాత్రమే భోజనం చేస్తూ ,మరో మూడు రోజులు ప్రయత్నం చేయకుండా దొరికిందే తింటూ ,చివరి మూడు రోజులు పూర్తిగా ఉపవాసం చేయాలి .ఇలా పన్నెండు రోజులు దీక్షగా చేస్తూ , వెంటనే ఫలితం రావాలంటే పగలంతా నిల్చునే ఉండాలి .రాత్రిళ్ళు కూర్చునే ఉండాలి .సత్యం మాత్రమే మాట్లాడాలి .చెడు సాంగత్యం పనికి రాదు .’’రౌరవం ‘’,’’యౌదాజయం ‘’అనే సామలను గానం చేస్తూ ఉండాలి .చివరికి దేవతా తర్పణం మొదలైనవి చేసి ,దేవతలకు నైవేద్యం పెట్టి తినాలి .ఈ పన్నెండు రోజుల తపస్సును ‘’క్రుచ్చ్రం ‘’అంటారు .
అతి క్రుచ్చ్రం
పైన చెప్పిన నియమాలన్నిటిని పాటిస్తూ ,కుడి చేతిలో పట్టినంత అన్నాన్ని మాత్రమె రోజుకు ఒక సారి తినాలి .అదే అతి క్రుచ్చ్రం .
క్రుచ్చ్రాతి క్రుచ్చ్రం
ఈ రెంటికి మించిన ఘోర తపస్సు .పన్నెండు రోజులూ నీటిలోనే ఉండాలి .మిగిలిన నియమాలన్నీ పై మాదిరే .ఈ మూడు తపస్సులు చేస్తే పాపాలు నశిస్తాయి
ప్రాయశ్చిత్తాలు
.శాస్త్రం చెప్పినట్లు చేయక పోవటం ,నిషేధించిన పనులు చేయటం ,సమాజానికి హాని కలిగేవి చేయటం పాపాలు అని పించుకొంటాయి .పాపాలకు చేసే ప్రతీకారమే ప్రాయశ్చిత్తం .అనేక రకాల పాపాలకు వాటికి తగిన ప్రాయశ్చిత్త విధులున్నాయి .ఉదాహరణకు –అశ్లీలం లేక బూతు మాట్లాడితే ‘’దదిక్రా వ్ణో అకార్షం ‘’మొదలైన సామలను గానం చేయాలి .ఎవరినైనా దూషిస్తే ప్రాయశ్చిత్తం గా ‘’ఇదం విశ్నుర్వి చక్రమే ‘’సామను చదవాలి .తలిదండ్రులను గురువును దూషించిన పాపం పోవటానికి ‘’తమాహం సోమ రారణ ‘’సామ చదవాలి .ఇలా ఎన్నో ఉన్నాయి .
కామ్య కర్మలు
ఆయుర్దాయం పెరగటానికి ‘’తు చే తునాయ ‘’మొదలైన సామలతో తెల్ల ఆవాలను మంత్రించి ప్రతి రోజూ తినాలి. చిన్న చిన్న రోగాలకు ‘’శం నొ దేవీ రభీస్టయే ‘’సామతో నేతిని మంత్రించి రోజూ శరీరానికి రాసుకోవాలి .సర్ప భయం లేకుండా చేసుకోవటానికి శంఖ పుష్పి ,సర్ప గంధ లను నూరి గుళిక చేసి దగ్గరుంచుకొని ‘’చర్శానీ ద్రుతం ‘’ సామ తో మూడు సార్లు అగ్నిలో హోమం చేయాలి .అప్పుడు ఆ గుళికను మెడలో కట్టుకోవాలి. విషం తిన్నా హాని చేయకుండా ఉండటానికి ‘’త్వమిమీ ఓషధీ ‘’సామను రోజూ గానం చేయాలి .ముసలితనం మృత్యువు రాకుండా దుంపలు పండ్లూ తింటూ ,జింక తోలు ధరించి మౌనం గా నెల రోజులు అడవిలో ఉండి పుష్య పూర్ణిమ నాడు ‘’ఉద్వయంత మసస్పరి ‘’అనే సామ తో సూర్యుడిని పూజించాలి .ఇలా నాలుగేళ్ళు చేస్తే జరా మ్రుత్యువులు దూరం .
దేవతాధ్యయన బ్రాహ్మణం
అగ్ని ,ఇంద్రుడు ,ప్రజాపతి ,సోముడు ,వరుణుడు ,త్వష్ట ,అంగిరసుడు ,పూషా ,సరస్వతి ,ఇంద్రాగ్నులు కలిసి పది మంది సామ గానానికి అది దేవతలు .కాలేయం రౌరవం మహోత్సవం మొదలైన సామలకు దేవత అగ్ని .వామ దేవ్యం ,సామకు ప్రజాపతి దేవత .ఔశన కావం అనే సామకు సోముడు దేవత .యజ్న యజ్నీయం కు వరుణుడు,వార వంతీయం ,ఆభీవర్తనం సామలకు త్వస్ట దేవతలు .స్వ్హ ప్రుస్టా అనే సామకు అంగిరసుడు ,కౌశీతం ,దైవోదానం మొదలైన వాటికి పూషా దేవతలు .కొన్నిటికి సరస్వతి మరికొన్నిటికి ఇంద్రాగ్నులు దేవతలు .మిగిలిన సామలన్నిటికీ ఇంద్రుడే దేవత .వసువులు ,రుద్రులు ,ఆదిత్యులు విశ్వే దేవులు అనే నలుగురు సామ దేవతలు .ఇంద్రాగ్ని ప్రజాపతులు దేవతలు ఇంకా కుదిస్తే ‘’బ్రహ్మ ‘’ఒక్కడే సామ లన్నిటికీ దేవత
రుక్కు ను తల్లి అని ,గానాన్ని తండ్రి అని ,స్వరాన్ని ప్రజాపతి అంటారు .గాయత్రి అన్నా సావిత్రి అన్నా ఒక్కటే .
సంహితో పనిషత్ బ్రాహ్మణం
సామ గాన రహస్యాలను తెలియ జెప్పేది ఈ బ్రాహ్మణం .అధ్యయనం గురు శిష్య సంబంధం ,ధర్మ శాస్త్ర విషయాలు చెప్ప బడ్డాయి .మందరం మాధ్యమం తార అనే స్థాయీ భేదాన్ని బట్టి గానం మూడు రకాలు .వీటికి దేవ సంహిత ,అసుర సంహిత ,రుషి సంహిత మొదలైన సాంకేతిక పదాలనుప యోగించారు .ఆయా గాన ఫలితాలూ చెప్ప బడ్డాయి .గానం చేసేటప్పుడు మూల మంత్రాలలో వచ్చే మార్పులను అంటే ఉన్న అక్షరాలూ జారిపోవటం కొత్తవి చేరటం ‘’హో ,హోఇ.,తాఇ’’మొదలైన విచిత్ర ధ్వనులు ,ద్రుతం విలంబితం మొదలైన వృత్తులు ,స్వర ప్రస్తార విషయాలు ఉన్నాయి. గాన ప్రభావం వలన మూల సాహిత్యం లో కలిగే అనేక మార్పులను సామ వేదమే నాంది పలికింది
స్వాధ్యయనం ఏరోజు మాన రాదనీ సామ జపం వలన యజ్న యాగాలు చేసిన ఫలితం వస్తుందని ప్రోత్సహించింది .
వంశ బ్రాహ్మణం
సామగాన ఋషుల పరంపర ఇందులో ఉంది .’’బ్రహ్మకు ,ఆచార్యులకు ఋషులకు సకల దేవతలకు నమస్కారం ‘’అనే మాటతో ఇది ప్రారంభ మౌతుంది .మిత్ర వర్చాసుడు ,బ్రహ్మ వృద్ధి ,గిరి శర్మ ,నిగడుడు ,త్రాతుడు ,రుద్ర భూతి మొదలైన అరవై మంది సామ గురువుల గురించి వారి గోత్రాల గురించి పేర్కొన బడింది .అందరికీ మొదటి గురువు ‘’బ్రహ్మ ‘’మాత్రమె అన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-14-ఉయ్యూరు

