నటి” మీనా ” ను రెహమాన్‌ కూడా పాడమన్నారట-

రెహమాన్‌ కూడా పాడమన్నారు

‘పూసింది పూసింది పున్నాగ..  పూసంత నవ్వింది నీలాగ..’ లాంటి  పాటలతో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మరిపించి, మురిపించిన మీనా చాలా కాలం తర్వాత ‘దృశ్యం’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకప్పుడు అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ సీతారామయ్యగారి మనవరాలు  నవ్యతో తన జ్ఞాపకాలను పంచుకుంది…

‘‘పెళ్లయ్యాక కొన్నాళ్లు గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాలు చేయమని నా వద్దకు బోలెడు స్ర్కిప్టులు వచ్చాయి. వైవిధ్యమున్న పాత్ర అయితేనే ఒప్పుకుంటాను అని చెప్పాను. అలాంటి సమయంలో ‘దృశ్యం’ ఆఫర్‌ వచ్చింది. కథ నచ్చింది. తెలుగులో నన్ను అందరు కుటుంబ కథా చిత్రాలతో బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాలో చక్కటి ఫ్యామిలీ కథ నడుస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ‘జ్యోతి’. అన్ని షేడ్స్‌ కలిగిన పాత్ర ఇది. స్ర్కిప్టు చెప్పినప్పుడు నాకదే నచ్చింది. ఇప్పుడు ‘దృశ్యం’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. తెలుగులో నాకు చిన్నప్పుడే హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్‌ సినిమాలోను బాలనటిగా చేశాను. అప్పట్లోనే సుమారు ముప్పై నుంచి నలభై చిత్రాల్లో చేశాననుకుంటా. ఏడో తరగతి పూర్తయ్యాక రాజేంద్రప్రసాద్‌గారి సరసన హీరోయిన్‌గా ఆఫర్‌ వచ్చింది. అలా తెలుగులో ‘నవయుగం’తో కథానాయికను అయ్యాను. అంత చిన్నవయసులో చేద్దామా వద్దా అని ఆలోచించాను. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా ‘సీతారామయ్యగారి మనవరాలు’లో అక్కినేని నాగేశ్వరరావుగారి మనవరాలిగా చేసే ఛాన్స్‌ రావడం కలిసొచ్చింది. అప్పుడు ‘వద్దండీ, స్టడీస్‌ డిస్ట్రబ్‌ అవుతుంది’ అని మా తల్లిదండ్రులు చెప్పారు. అయితే కథపరంగా నా పాత్రకు ఒక ప్రత్యేకత ఉందని చెబితే సరే అన్నారు. ఆ చిత్రం నాకొక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే!

 

పాడటం అదే ఆఖరు..
విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయికగానే నేను అందరికీ తెలుసు. కాని నేనొక మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసిన సంగతి చాలామందికి తెలియదు. నిజానికి నాకు మ్యూజిక్‌ గురించి పెద్దగా తెలియదు. ఇక పాడటం అంటే ఎంత కష్టమో ఊహించుకోండి. అదే మాటను భారతీరాజ గారి కొడుకు మనోజ్‌తో అన్నాను. ఎందుకంటే అతనే నన్ను తమిళ ఆల్బమ్‌ చేయమని అడిగాడు కాబట్టి. అప్పట్లో ఇంగ్లీష్‌ ఆల్బమ్స్‌ హవా నడుస్తుండేది. ‘మీరు పాడాలి’ అని అడిగేసరికి నాకు షాక్‌. ‘మీకు తమిళం వచ్చు. మంచి స్వరం ఉంది. అంతకంటే ఏం కావాలి?’’ అన్నాడతను. సరే, ఒకసారి ప్రయత్నించి చూద్దామని పాడాను. ఆ ఆల్బమ్‌లో ఎనిమిది పాటలు ఉన్నాయి. సంగీతాభిమానులను ఆకట్టుకుంది. ఆ ఆల్బమ్‌ను చూసి.. డి.ఇమామ్‌గారు ఒక చిత్రానికి పాడమంటే ఒక పాట పాడాను. అది చాలా క్యూట్‌ అండ్‌ బబ్లీ సాంగ్‌. సినిమాల్లో అదే నేను పాడిన తొలి, చివరి పాట. అంతకుముందు రెహమాన్‌గారు కూడా పాడమని అడిగితే – ‘‘అదేంటి? మీరు అంత పెద్ద పెద్ద మ్యూజిక్‌డైరెక్టర్లు, నన్ను పాడమంటారేంటి? నాకు ఏం తెలుసు?’’ అని సరదాగా చెప్పాను. నాతో పాడించాలన్నది వారి ముచ్చట. అంతే!

 

ఆ పాటకు ఏడ్చాను..
తమిళం, మళయాలం, తెలుగు, కన్నడలలోని పెద్ద పెద్ద స్టార్స్‌తో అంటే – రజనీకాంత్‌, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్ర నటులతో కలిసి చేసే అవకాశం నాకే వచ్చింది. అది నా అదృష్టం. ఇంతపెద్ద స్టార్‌లతో నటిస్తున్నప్పుడు నటనలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. నేను చిన్నప్పటి నుంచి బాలనటి కావడం వల్ల ఆ సమస్య రాలేదనుకుంటా! అయితే ‘ముఠామేస్ర్తీ’లో చిరంజీవిగారి పక్కన ఒక పాటకు స్టెప్పులు వేస్తున్నప్పుడు మాత్రం అబ్బో చాలా ఇబ్బందే పడ్డాను. ఆయనతో పోటీపడి డ్యాన్స్‌ చేయడమంటే మాటలు కాదు. నేను క్లాసికల్‌డ్యాన్స్‌ నేర్చుకున్నాను కాని బ్రేక్‌డ్యాన్సులు గట్రా తెలీవు. ఎప్పుడు టీవీల్లో కూడా చూడలేదు. అందులో ‘చికుచికుచాం చాం’ అనే పాటొకటి అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారప్పుడు. ఒకపక్కనేమో చిరంజీవి, మరోవైపు పాటకు డ్యాన్సులు కంపోజ్‌ చేసింది ప్రభుదేవా. అమ్మో!! వారిద్దరిదీ డెడ్‌లీ కాంబినేషనండీ (నవ్వుతూ). వాళ్లతో నేనెక్కడ పోటీపడేది? అదిరిపోయాను. ప్రాక్టీస్‌ చేస్తుంటే ఏడుపొచ్చేది. ‘భయపడకు. నేనున్నానుగా..’ అంటూ చిరంజీవిగారు నా కోసం రిహార్సల్స్‌ చేసి ప్రోత్సహించేవారు. ఎనిమిదిసార్లు వేయాల్సిన ఒకే రకమైన స్టెప్పుల్ని కంటిన్యూస్‌గా చేయడం నాకు చాతకాలేదు. నాలుగుసార్లు చెప్పున రెండు దఫాలుగా డ్యాన్స్‌ చేసేలా చేశారు. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాను. నేను ఆ పాటకు బాగా డ్యాన్స్‌ చేశాననిచెప్పి.. వారి ఇంటికి ఫోన్‌ చేసి.. వేడి వేడి దోశ, కర్రీ చెప్పించారు చిరంజీవిగారు.

 

రజనీ ఎక్కడున్నారో..
ఇలాంటి అనుభవాలు చెబుతున్నప్పుడు రాజమండ్రిలో రజనీకాంత్‌ గారు గుర్తుకొస్తారు. ఆయనతో నా మొదటి చిత్రం ‘యజమాని’. ఒకప్పుడు ఆయనతోనే బాలనటిగా చేసిన నేను.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుండటం కొంత చిత్రంగా అనిపించింది. రాజమండ్రిలో షూటింగ్‌ పూర్తి చేసుకుని మద్రాసు వెళ్లిపోతున్నాము అప్పుడు. ‘యజమాని’కి ముందే తెలుగులో ‘మనవరాలు’, ‘చంటి’, ‘అల్లరిఅల్లుడు’ వంటి మంచి చిత్రాలు చేయడంతో హీరోయిన్‌గా ఎంతో ఫాలోయింగ్‌ వచ్చింది. అది రజనీకాంత్‌కు తెలియదు. మేము మద్రాసుకు రైల్లో వెళ్లేందుకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాము. రజనీగారు ప్లాట్‌ఫాం మీదకు వెళ్లిపోయారు. నేను మాత్రం రైలు వచ్చాక వస్తానని చెప్పి కారులోనే కూర్చుండిపోయా. ‘లేదు మేడమ్‌ మాతోపాటు రండి.. రండి. ఫ్లాట్‌ఫాం మీద కూర్చుని మాట్లాడుకోవచ్చు’ అన్నారు యూనిట్‌ సభ్యులు. నేను అక్కడికి వెళితే ప్రయాణికులంతా నన్ను చుట్టుముట్టేస్తారని తెలుసు. వాళ్లకు తెలీదు. ఎంతచెప్పిన వినకపోతే కారు దిగి ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లిపోయాను. అప్పటికే అక్కడ రజనీకాంత్‌గారు కూర్చున్నారు. ఆయన్ను పట్టించుకోని ప్రయాణికులు నన్ను చూస్తూనే వరద వచ్చిపడ్డట్టు నన్ను ముంచెత్తేశారు. జనం దాడికి మా వాళ్లందరు చెల్లాచెదరయ్యారు. ఎవరు ఎక్కడున్నారో అర్థం కాలేదు. ఆ హడావిడిలో రజనీ ఏమైయ్యారో కూడా తెలీలేదు. ఇక నాకు ఊపిరాడక రైలు వస్తూనే కనిపించిన బోగీలోకి ఎక్కి.. ఊపిరి పీల్చుకున్నా. రైలు కదిలింది. అరగంటయ్యాక.. మరో స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత.. రజనీకాంత్‌గారు నేను కూర్చున్న పెట్టెలోకి వచ్చి.. ‘‘ఓ మీనా.. మై గాడ్‌.. ఏమిటీ క్రేజ్‌. నీకింత ఫాలోయింగ్‌ ఉందా. అద్భుతం!!’’ అన్నారు ఆయన ఆశ్చర్యంగా. నాకది అప్పట్లో పెద్ద కాంప్లిమెంట్‌. ఇంకోసారి ‘వీర’ అని ఆయనతోనే సినిమా చేస్తున్నాను. అది కూడా రాజమండ్రిలోనే షూటింగ్‌. అదే టైమ్‌లోనే రాజశేఖర్‌గారితో నేను చేసిన ‘అంగరక్షకుడు’ రిలీజ్‌ అయ్యింది. సినిమా చూడాలి చూడాలి అని తమిళ యూనిట్‌సభ్యులు అడిగితే.. టికెట్లు కొని బయలుదేరేందుకు సిద్ధమయ్యాను. రజనీగారిని పిలవాలా వద్దాని సంశయంతో పిలిచాను. వెంటనే ఆయన ‘నువ్వు వెళుతున్నావు కదా! అయితే నేనొస్తాను’ అని మాతోపాటు సినిమాకొచ్చారు. సినిమాచూసి హోటల్‌కు వచ్చే వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. నచ్చిందో లేదో నాకు చెప్పలేదు. హోటల్‌లో దిగుతూనే ‘గ్రేట్‌ జాబ్‌ మీనా. చాలా హెవీ క్యారెక్టర్‌. సులువుగా చేశావు’ అన్నారు. రాజమండ్రిలో రజనీతో కలిసి సినిమా చూడటం నిజంగా స్వీట్‌ మెమొరీ!

రియాల్టీ మరింత వినోదం
‘‘సీరియల్‌ కంటే రియాల్టీషోలు బోర్‌ కొట్టవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందులోను రకరకాల వ్యక్తులతో స్పాంటేనియస్‌గా మాట్లాడటం పెద్ద వినోదం. అయితే సహజంగా నేను మితస్వభావిని కావడంతో ‘నీకొంగు బంగారం కాను’ టీవీ షో చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. ‘‘మాట్లాడండి మాట్లాడండి..’’ అని షో నిర్వాహకులు అడిగేవారు. నాకైతే ఏం మాట్లాడాలో అర్ధమయ్యేది కాదు. ఆ తర్వాత అలవాటైపోయింది..’’

టీవీ అన్‌లిమిటెడ్‌
‘‘సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాతే టీవీరంగంలోకి వస్తారు అనే అభిప్రాయం ఉంది. నా విషయంలో అది సరైనది కాదు. నాకు డిమాండ్‌ ఉన్నప్పుడే కోరి టీవీరంగం వైపు వచ్చాను. నిజానికి సినిమాల్లో చేయలేని ఫెర్ఫార్మెన్స్‌ను టీవీ సీరియల్స్‌లో చేయవచ్చు. అన్ని రకాల షేడ్స్‌లో నటించే అవకాశం లభిస్తుంది అన్నది నా అభిప్రాయం. తొలిసారిగా ‘లక్ష్మీ’ అనే తమిళ సీరియల్‌ చేశాను. ఆతర్వాత అదే భాషలో రెండు చేశాను. తెలుగులో ‘అనుబంధాలు’ సీరియల్‌ కూడా పేరుతెచ్చింది’’

. నవ్య డెస్క్‌

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.