బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం )
గోపధ బ్రాహ్మణం -2
గోపధం లో కొన్ని పదాల వివరణ అత్యద్భుతం గా ఉంటుంది ఆ వైభవాన్ని తెలుసుకొందాం .
1-స్వేదం –సు వేదమే స్వేదం అని అర్ధం చెప్పింది .అంటీ బాగా వేదం చదవటం .వేదం గట్టిగా చదివి కంఠస్తం కావాలంటే చమట పట్టేట్లు చదవాలి .కా బట్టే ఈ సువేద పదం స్వేదం గా మారిందని వివరణ ఇచ్చారు ఇందులో .
2-రధం –రస అనే శబ్దం నుంచి వచ్చింది .రస పూర్ణం అంటే ఆనంద పూర్ణం గా ఉండటం .దీని వల్ల రధం అనే సంజ్ఞ రూపొందింది .
3-దీక్షిత –ధీక్షిత పదం నుండి ఇది వచ్చింది .శ్రేష్టమైన బుద్ధిని పొందేవాడు ధీక్షితుడు .అదే దీక్షిత గా మారింది.అందుచేత అతడు పెద్దలచే నమస్కరింప దగిన వాడు అవుతాడు .
4-మఖ –అంటే యజ్ఞం .ఖ అంటే చిద్రాలు దోషాలు .మ అంటే పోగొట్టేది .దోషాలు లేనిదిగా చేసేది .మఖ అంటే యజ్ఞం .దోషాలు లేనిదిగా యజ్ఞం ఉండాలి ..అంటే యజ్న కర్మ లో ఏ విధమైన పోరబాట్లు, దోషాలు ఉండరాదని తెలుస్తోంది .
5-సామ –సా అంటే లక్ష్మి అమ అంటే జ్ఞానం .లక్ష్మీ సంబంధమైన జ్ఞానం అని సామ కు అర్ధం .
6-కుంతాపసూక్తం – కు అంటే చెడు తాప అంటే తపింప జేయటం .చెడును నశింప చేసే సూక్తమే కుంతాప సూక్తం .అధర్వ వేదం లో దీనికి ప్రసిద్ధి ఎక్కువ .
కొన్ని సుభాషితాలు
1-దేవతలు పరోక్ష ప్రియులు ,ప్రత్యక్ష ద్వేషులు .ఈశ్వరుని అచింత్య శక్తిని వర్ణించే సందర్భం లో నిది .ఈశ్వరుడు పరోక్షం గా ఉన్నా ఇష్టుడు .ఈ భౌతిక జగత్తు ప్రత్యక్షం గా ఉన్నా ద్వేషింప దగినది .ఇది అశాశ్వతం .
2-యజ్ఞాలలో ఋత్విక్కులు అసమర్ధులు గా ,బ్రహ్మ చర్య దీక్ష లేని వారుగా ,రాగ ద్వేషాలున్న వారు గా ఉంటె ఆ యజ్ఞం నాశనమవుతుంది .సదాచారమే యజ్న ఋత్విక్కులకు ముఖ్యం .
3-మట్టి బెడ్డలు కుండలో వేస్తె అవి శౌచ కర్మకు ,దాన్యోత్పత్తికి పనికి రావు .ఉపయోగపడే వాటిని తగని స్థానం లో ఉంచరాదు అని అర్ధం .
4-యాజకుడు తేజస్వి ,సత్య వాది,వ్రత నిస్టూడు గా ఉండాలి .అతడు మంచి వాడు కాక పోతే పచ్చికుండలో నీళ్ళు పోసినప్పుడు విచ్చి నీరు కారిపోయినట్లు యజమాని ప్రయోజాన్ని నాశనం చేస్తాయి .
5-తలిదండ్రులు చిన్న తనం లో కుమారుడిని పోషిస్తే ,వాడు పెద్ద వాడై వారిని పోషించాలి .ఇది తెలిస్తేనే నిజమైన యజ్ఞం .తలిదండ్రుల సేవే నిజమైన శ్రాద్ధం ,తర్పణం కూడా .బతికి ఉండగా పట్టించుకోకుండా చని పోయిన తర్వాత శ్రాద్దాలు చేసినా అది నిష్ప్రయోజనం .
6-జరిగి పోయిన కాలం పరిమితం .రాబోయే కాలం అపరిమితం. గతం లో చెడు చేసినంత మాత్రాన కుంగి పోనవసరం లేదు .భవిష్యత్తు తరువాత వచ్చేదికనుక మంచి చేసి ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చు .నిరాశ చెందక్కర లేదు .
ఇప్పుడొక్క సారి ఈ బ్రాహ్మణం లో చెప్ప బడిన విషయాలను పునరాలోకిద్దాం . పూర్వ బ్రాహ్మణం లో సృష్టి విధానం ఓం మహాత్మ్యాన్ని వివరించారు .సృష్టి అంతా ఓం నుండే ఏర్పడింది .ఓం బ్రహ్మ ,విష్ణు, రుద్రాత్మకం .దీన్ని వెయ్యి సార్లు జపిస్తే కోరికలన్నీ సిద్ధిస్తాయి .గాయత్రీ మంత్రోపాసన చేస్తే సంతతి కూడా బలం గా ఉంటుంది. శిష్యుడు గురు శుశ్రూష చేసి పంచాగ్నులను వశం చేసుకోవాలి .గృహిణి అతడికి భిక్ష పెట్టాలి .భిక్ష పెట్టక పోతే పుణ్యాలన్నీ నశిస్తాయి .మాంస భక్షణ నిషిద్ధం .విపాట్ నది ఒడ్డున వసిస్టా శ్రమం ఉన్నది
ఉత్తర బ్రాహ్మణం లో దర్శ పూర్నమాసం నుండి చిన్న యాగాలు ,పెద్ద యాగాల వివరణ ఉంది .ఖగోళ ,జ్యోతిష సంబంధ విషయాలు చెప్ప బడ్డాయి .చిత్త మొదలైన నక్షత్రాలు పౌర్ణమి రోజు చంద్రునితో కలిసే చైత్రం మొదలైన నెలలు ఏర్పడుతాయని చెప్పారు. ఫాల్గుణ పూర్ణమి నుండి సంవత్సరం మొదలైంది అని పేర్కొన బడింది .భూమి గోళాకారామని ,సూర్యుడు ఎప్పుడూ చాటు కాడని వివరించింది .తిరుగుతూ ఉండే భూమి అంచున సూర్య కాంతి పడుతుందని తెలిపారు .
బ్రాహ్మణాల కధా కమా మీషు సర్వం సంపూర్ణం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-14-ఉయ్యూరు
