అదృష్టంకొద్దీ ఇప్పుడు విశ్రాంతి దొరికింది – మణిశర్మ

‘‘సంగీత దర్శకుడిగా నా జర్నీ సో ఫార్ సో గుడ్. మా నాన్నగారు మ్యూజిక్ నేర్చుకోకపోతే నాకు సంగీతంతో పరిచయం ఏర్పడేది కాదేమో. నాన్నగారికి మ్యూజిక్ వచ్చి… పరిశ్రమకు రాకపోయినా నేను పరిశ్రమకు వచ్చేవాడిని కాదేమో. ఏ సభల్లోనో వాయించుకుంటూ ఉండేవాడినేమో. ఏదేమైనా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే నాకు ఆసక్తి ఉండేది కానీ, మ్యూజిక్ డైరక్టర్‌ని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ఆటోమేటిగ్గా జరిగాయి. అంతేగానీ నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. ఇప్పటికీ నాకంటూ ప్రత్యేకంగా గోల్ ఏదీ లేదు’’ అంటున్నారు మణిశర్మ. సంగీత దర్శకుడిగా ఆయన ఎన్ని హృదయాలను ఏలారో అందరికీ తెలిసిందే. శుక్రవారం పుట్టిన రోజు చేసుకుంటున్న మణిశర్మతో ‘చిత్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ సరిగమలు మీకోసం..
ప్ర: ఒక వైపు పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలూ చేశారు. ఎలా బ్యాలన్స్ చేసుకోగలిగారు. ఆ రహస్యం మాతో పంచుకుంటారా?
మామూలుగా నాలో ఏదో భయం ఉండేది. అందుకే ఓ యాటిట్యూడ్ అలవాటైంది. అది మా ఇళయరాజాగారిని ఫాలో అవడం. ఆయన కూడా అంతే. ఒక వైపు పెద్ద సినిమాలు చేసేవారు. మరో వైపు కామెడీ సినిమాలు చేసేవారు. గోపీచంద్ ‘యజ్ఞం’ సినిమాకు నేనే సంగీతం చేశాను. నా కెరీర్ మొత్తం మీద అంత తక్కువ ఎమౌంట్‌ని నేనెప్పుడూ తీసుకోలేదు. చిరంజీవిగారు, మహేష్‌బాబు సినిమాలకు సంగీతం చేసినప్పుడే ఈ సినిమా కూడా చేశాను. ఎందుకు చేశానంటే కారణాలున్నాయి.. కొంతమంది దర్శకులుగానీ, నిర్మాతలు గానీ తొలిసారి సినిమాలు చేసేటప్పుడు ‘అన్నగారూ… మీరు చేయాలి. మీరు చేస్తే నాకు లైఫ్ వస్తుంది’ అని అనేవారు. వెంటనే చేసేవాడిని. అప్పుడు వారు చాలా ఆనందించేవారు. వాళ్ల సంతోషంలో నేను ఆనందాన్నివెతుక్కునేవాడిని. ఎందుకంటే… ఎంత సంపాదించి ఏం లాభం? ఎంత తింటాం? డబ్బు అనేది ఆల్వేస్ హ్యాపీనెస్ కాదు. బతకడానికి కావాలనుకోండి. కానీ మా లాంటి మ్యుజిషియన్స్‌కి, సెన్సిటివ్ మ్యుజిషియన్స్‌కి అదే ఆనందం. డైరక్టర్ వచ్చి సన్నివేశాలు చెప్పగానే హార్మోనియం ముందు కూర్చుని బాణీలు కడతాను.
ప్ర: ఇప్పటికీ హార్మోనియం ముందు కూర్చుంటారా..
అవునండీ. అందుకే నా పాటల్లో ఇప్పటికీ మెలోడీ ఉంటుంది.
ప్ర: మీ పేరు చూసి సీడీలు కొనేవారు కోకొల్లలు కదండీ..
అది హార్డ్ ఎర్న్‌డ్ నేమ్. హార్డ్ ఎర్న్‌న్డ్ మనీ అంటారు కదా. అలా ఇది నేమ్. ఈ రోజున కూడా చాలా మంది నన్ను కలిసి ‘ఎందుకు సార్ వరుసగా చేయడం లేదు’ అని అడుగుతుంటారు. ‘ఊరికేలేవయ్యా. వాళ్లకి నా సంగీతం నుంచి రిలీఫ్ కావాల్సి వచ్చింది. 15 ఏళ్లు దాదాపుగా అన్ని సినిమాలు నేనే చేశాను కదా. కొత్త టాలెంట్ వస్తున్నారు. దేవి అయితేనేం, తమన్ అయితేనేం, హారిస్, జోష్వా శ్రీధర్… ఇలా అందరూ మన దగ్గర పనిచేసిన వారే వస్తున్నారు’ అని అంటున్నా.
ప్ర: మీ అబ్బాయి సాగర్ మహతి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు కదా?
అవునండీ. గోపీచంద్ సినిమాకు సంగీతం చేస్తున్నాడు. వెస్ట్రన్, క్లాసికల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓ ఐదేళ్లు కీబోర్డు ప్లేయర్‌గా చేశాడు. నా దగ్గర కూడా నేర్చుకున్నాడు.
ప్ర: మిమ్మల్ని సలహాలూ, సూచనలు అడుగుతుంటాడా?
లేదండీ. నేను ఇళయరాజాగారి దగ్గర, ఎమ్మెస్ విశ్వనాథన్ గారి దగ్గర, కీరవాణిగారి దగ్గర (నా ఫస్ట్ సినిమా నుంచి 100 సినిమాల దాకా చేశా), విద్యాసాగర్ దగ్గర, అలాగే రాజ్-కోటిగారి దగ్గర కీబోర్డు ప్లే చేశాను. 15ఏళ్ల పాటు వాళ్లతో మెలిగిన నేను అవేమీ నా సంగీతంలో కనిపించకుండా ఉండాలని 6 నెలలు కీబోర్డు వాయించడం మానేశాను. నాకు కొంత ప్రాబ్లెమ్ వచ్చినా నేను ఎక్కడికీ వెళ్లకుండా నా రోల్ నేను చేంజ్ చేసుకున్నా. శాటిస్‌ఫాక్షన్ ఉండాలంటే ఆ మాత్రం శాక్రిఫైజ్ చేయాల్సిందే. ‘చూడాలని ఉంది’ ఆడియో ఈ రోజు వేసుకున్నా ఫ్రెష్‌గా ఉంటుంది. ‘తీసెయ్‌రా ఆ పాట’ అనేటట్టు ఉండదు. చిరు, పవన్, మహేష్.. కాంబినేషన్లతో నేను చేసిన పాటలన్నీ ప్రజాదరణ పొందినవే. శివరాత్రి వస్తే ఇప్పటికీ ‘భం భం భోలే..’, ‘సదా శివ సన్యాసి’ వంటి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా నెల్లూరు నుంచి ఒకాయన ఫోన్ చేసి ‘నాయనా.. నేను డిస్టర్బ్‌డ్‌గా ఉన్నప్పుడు ‘నమ్మిన నా మది మంత్రాలయమే’ అనే పాట వింటాను. నా కళ్లమ్మట నీళ్లు వస్తాయి’ అని చెప్పాడు. ఇలాంటివి వింటున్నప్పుడు నాకు చాలా ఆత్మ సంతృప్తి కలుగుతుంది.
ప్ర: అంత ఆత్మ సంతృప్తిని అనుభవించిన మీరు కావాలనే సినిమాలు తగ్గించుకున్నారా?
అదృష్టవశాత్తూ తగ్గాయండీ. 15 ఏళ్లు కీబోర్డు ప్లేయర్‌గా రాత్రింబవళ్లు పనిచేశా. ఆ తర్వాత 15 ఏళ్లు మ్యూజిక్ డైరక్టర్‌గా చేశా. ఇప్పుడు కూసింత సమయం దొరికింది. అయామ్ ఎంజాయింగ్ మై లైఫ్. నాకు లైఫంతా నాలుగు గోడల మఽధ్యే గడిచిపోయింది. ఇప్పుడే అయామ్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు హీరోలు డ్యాన్సింగ్ చేసే పాటలు చేయాలని లేదు. అవి కూడా ఒకప్పుడు చేశాను. కానీ ఆ టైమ్ అయిపోయింది. అందుకే నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా పేరు నిలబెట్టే పాటలు చేయాలనుకొంటున్నాను. ఇప్పుడు నేను పెద్దగా సినిమాలు చేయకపోయినా నేను మిస్ అయ్యేంతగా ఏమీ ఉండటం లేదు.
ప్ర: మిక్సింగ్‌లో కింగ్ మీరే అనే పేరుంది. అందుకు స్పెషల్‌గా ఏమైనా చేసేవారా?
నా పాటలో ముందు మాట వినిపించాలి. వేటూరిగారు, శాసి్త్రగారు వంటి లిరిసిస్ట్‌లు మనదగ్గర ఉన్నప్పుడు, వాళ్లిచ్చే సాహిత్యం వినిపించకుండా పీకనొక్కేస్తే ఇంక భాష ఏం నిలుస్తుంది? అందుకే మొదటి నుంచీ నేను ఆ విషయంలో నిక్కచ్చిగా ఉన్నాను.‘రామ్మా చిలకమ్మ’ అయినా ఇంకోటయినా పాటలో పదాలు వినిపించాల్సిందే. పాట వింటూ ఆ పదాలను పేపరుపై ఎవరైనా రాయగలగాలి అనుకునేవాడిని.
ప్ర: నాలుగ్గోడల మధ్య జీవితాన్ని గడిపిన మీరు ఎలా అప్‌డేట్ అయ్యేవారు?
ఇంటికి వెళ్లినప్పటి నుంచీ మ్యూజిక్ రన్ అవుతూనే ఉండేది. వరల్డ్‌లో ఏ యే మ్యూజిక్‌లున్నాయి.. జాజ్, వెస్టర్న్.. వాటిలో కొత్తగా ఏం వచ్చాయి. వాటిని కొనడం, వినడం.. స్నానం చేసినా, నిద్రపోయినా… 24 గంటలు సంగీతం రన్ అవుతూనే ఉండేది. దీనివల్ల ప్రాబ్లమ్ అయింది. ఓ రోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ శబ్దంలో ఆ శబ్దం వినిపించలేదు. అప్పటినుంచి రాత్రుళ్లు వినడం మానేశా.
ప్ర: అప్పట్లో ఇంటర్నెట్ ఇంతగా అందుబాటులో ఉండేది కాదుగా. మరి వరల్డ్ మ్యూజిక్‌ని మీరెలా సంపాదించేవారు?
నేను ప్రతి ఏడాది విదేశాల్లో మ్యూజిక్ టూర్‌లకు వెళ్లేవాడిని. అప్పుడు క్యాసెట్లు, సీడీలను సేకరించేవాడిని. నా స్నేహితులు పంపేవారు. బాలుగారు వెళ్లినప్పుడు తెచ్చేవారు. సౌండ్‌కి ఆల్వేస్ టచ్‌లో ఉండేవాడిని. సౌండ్‌ని ఆరాధించేవాడిని. పాటల్లో ఏం చెప్పినా పద్ధతిలో చెప్పాలని ప్రయత్నించేవాడిని.
ప్ర: మీరు పరిశ్రమకి వచ్చిన కొత్తలో పాటలకు ఇంత ప్రాచుర్యం ఉండేదా?
ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. యూట్యూబ్, రేడియోలు, ఇంటర్నెట్‌లు.. ప్రాచుర్యం ఎక్కువగా ఉంది. ఈ ఎక్స్‌పోజర్ మంచిదే. సంగీతం బావుంటే ఎంత త్వరగా శ్రోతలకు చేరువవుతుందో, బాగా లేకుంటే అంతే త్వరగా స్టేల్ అయిపోతుంది.
ప్ర: ఇప్పుడు సీడీలు కొనేవాళ్లే లేరు. మొత్తం డిజిటలైజేషన్ అవుతోంది. దాని గురించి మీరేమంటారు?
ఇందాక చెప్పినట్టు డిజిటల్ ఎక్స్‌పోజర్ ద్వారా ఆడియోకు కాస్త మార్కెట్ వస్తోంది. రెహమాన్, హారిస్ లాంటి వారు చాలా ప్లానింగ్‌గా ఉంటున్నారు. ఎక్కడా మోసపోవట్లేదు. తాము చేసిన సంగీతాన్ని చాలా బాగా సంరక్షించుకుంటున్నారు. కానీ నేను ఆ రకంగా ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు అవన్నీ చేసిపెట్టేవారు కూడా లేరు. ‘మీకున్నన్ని హిట్లు నాకు ఉంటే అవి ప్లే అయితే వచ్చే డబ్బులతో జల్సాగా ఉండేవాడిని. పనే చేసేవాడిని కాదు సార్’ అని హారిస్ జైరాజ్ ఎన్నోసార్లు నాతో అంటుంటాడు. డిజిటల్ విధానంలో పాటలు ప్లే అయిన ప్రతిసారీ మీటర్ తిరుగుతూనే ఉంటుంది. సృజనకారులకు డబ్బులు వస్తూనే ఉన్నాయి.
ప్ర: రీరికార్డింగ్‌లో మీరు దిట్ట అనే పేరుంది..
నేను మా గురువుగారిని ఎక్కువగా అనుసరిస్తుంటాను. పాటలకన్నా రీరికార్డింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేది. టీవీల్లో వచ్చే ఆర్.ఆర్.ను రికార్డ్ చేసేవాడిని. అలాగే రికార్డింగ్ రూముల్లోనూ రికార్డ్ చేసుకునేవాడిని. ఏదైనా దర్శకుడు చెప్పే సన్నివేశాన్ని ఆకళింపు చేసుకోవడం వల్లనే మంచి సంగీతం వీలవుతుంది.
ప్ర: సినిమాలు తీయాలనే ఆలోచన ఎంత వరకు వచ్చింది?
సినిమాలు తీసి బాగుపడ్డవాడు ఎవడూ లేడని తెలిసి కూడా నేను ఆ తప్పు చేశాను. చాలా నష్టం అనుభవిస్తున్నాను. ‘ముంబై 125 కి.మీ’ త్రీడీ హారర్ సినిమా హిందీలో నిర్మించాను. చేతులు కాలాయి. పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు.
ప్ర: లైవ్ రికార్డింగ్‌లు తగ్గిపోతున్న తరుణంలో వాద్యకారుల పరిస్థితి?
ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడిపోతున్నారు. ఇళయరాజాగారు ఇప్పటిదాకా ఒక్క రికార్డింగ్ కూడా లైవ్ ఆర్కెసా్ట్ర లేకుండా చేయలేదంటే నమ్మండి. నేను కూడా నా వంతుగా చాలా కృషి చేస్తున్నాను.
ప్ర: మ్యూజిక్ స్కూల్ ప్రారంభించే ఆలోచనలున్నాయా?
చేద్దామనే ఓ ప్లేస్ తీసుకున్నా. చెన్నైలోని ఈసీఆర్‌లో. స్కూలు, బోర్డింగ్ వసతులు కల్పిస్తూ స్కూలును ఏర్పాటు చేద్దామనుకున్నా. మునులు తపస్సు చేస్తే అడ్డంకులు సృష్టించే రాక్షసులు ఎప్పుడూ ఉంటారని మనం చదివాం. నేను ఈసీఆర్‌లో తీసుకున్న స్థలం విషయంలోనూ అదే జరిగింది. డాక్యుమెంట్‌లో నాకు అమ్మిన వారు చిన్న తప్పు చేశారు. అది తెలుసుకుని ఒక వ్యక్తి నాపై కేసు పెట్టాడు. ఇప్పుడు ఆ కేసు సివిల్ కోర్టులో ఉంది. నేను 2002లో స్థలం కొంటే 2010లో అతను మీద పడ్డాడు.
ప్ర: అదెలా సాధ్యం?
మా నాన్నగారు వేదం నేర్చుకున్నారు. మ్యూజిక్ ఫ్యామిలీలో పుట్టాను. నేను మోసం ఎందుకు చేస్తాను? నాకు రికార్డింగ్ రూమ్, ఎయిర్‌పోర్టు తప్ప ఇంకేమీ తెలియదు. నేను ఎంతో పోగొట్టుకున్నాను గానీ, ఇతరులది తీసుకోవడం ఎప్పుడూ లేదు. మణిశర్మ ల్యాండ్ గొడవ అని వార్తలను రాసేవారు కనీసం నా అభిప్రాయం తీసుకోవాలి కదా. నేను ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర ల్యాండ్ కూడా తీసుకోలేదు. మా రికార్డింగ్ థియేటర్‌ను కూడా వడ్డీకి డబ్బులు తెచ్చుకుని నేనే కట్టుకున్నాను. ఏ ప్రభుత్వం నాకు సెంటు భూమిని ఇవ్వలేదు.

