తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’

చారిత్రక కల్పనా నవల ‘బోయకొట్టములు పండెండ్రు’లో రచయిత కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె చూపించిన శిల్పవిన్యాసం అమోఘం. ముఖ్యంగా ఆధునిక యూరోపియన్ చారిత్రక నవలా శిల్పాన్ని యథాతథంగా తీసుకోలేదు. దానికి అచ్చతెలుగు జానపద కథన శైలిని జోడించి ఒక కొత్త వొరవడిని సృష్టించారు.
పండరంగని అద్దంకి శాసనానికి తొలి మధ్యయుగ ఆంధ్ర చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది చరిత్ర నిర్మాణానికీ, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక నిర్మాణానికీ, భాషా పరిణామానికీ అన్నింటికీ ముఖ్యమైనదే. క్రీ.శ. 624 నాటి తొలి మధ్యయుగ ఆంధ్ర చరిత్రలోని రాజకీయ కల్లోలం ఒక సామ్రాజ్య ఆవిర్భావానికి దోహదం చేసింది. ఈ చారిత్రక యుగానికి సంబంధించిన ప్రజా జీవనం ఏంటి? ఈ చరిత్రను నడిపించిన శక్తులేవి? అనేవి నిజానికి ఇప్పటికీ సాధికారిక సమాధానం లేని ప్రశ్నలు.
ఆంధ్ర దేశంలో షోడశ మహా సామ్రాజ్యాలలోని అస్సక గణం శాతవాహన సామ్రాజ్యంగా విస్తరించడం భారత చరిత్రలో ముఖ్య ఘట్టం. అటు తరువాత విష్ణుకుండినులు.. రాష్ట్రకూటులు పరిపాలన సాగించినా రెండో పులకేశి వేంగిని జయించి కుబ్జ విష్టువర్థనుణ్ణి పాలకుడుగా నియమించడం తెలుగు చరిత్రలో అత్యంత కీలకమైన మలుపుని తీసుకొచ్చింది. మధ్యయుగాల యుద్ధకాంక్షలు- సాంస్కృతిక విస్తరణలూ- వీరుల క్రూరత్వాలు మొదలైనవన్నీ మొదలై పతాక స్థాయికి చేరుకున్న కాలం ఇది. దక్షిణా పథ రాజ్యాల మధ్య ఘోరయుద్ధాలతో పాటు వైవాహిక సంబంధాలు ఏర్పడి చిన్న చిన్న రాజ్యాలు బలమైన రెండు సామ్రాజ్యాలుగా ఆవిర్భవించవలసిన కాలం ఇది.
భారత ఉపఖండంగా వందలాది జాతులు- వలసలతో నిరంతరం సంఘర్షించుకున్న ఈ ఉపఖండం ఒక దేశంగా ఏర్పడటానికి దోహదం చేసిన ముఖ్యమైన చోదక శక్తులు వ్యవసాయం -సంస్కృతి అని చెప్పాలి. చారిత్రక యుగంలో వర్ధిల్లిన సార్ధవాహులు -బౌద్ధం- జైనం ఒక తాత్విక సామాజిక విప్లవానికి నాంది పలికాయి. అప్పుడప్పుడే ఏర్పడుతున్న లేత రాజ్యం ముందు రెండు మార్గాలు పరుచుకున్నాయి.
ఒకటి వ్యవసాయం -గ్రామం పునాదిగా వర్ణ కుల వ్యవస్థ సామాజిక రూపంగా ఉండి బ్రాహ్మణుల మంత్రాంగం క్షత్రియుల నాయకత్వంలోని వైదిక వర్ణ వ్యవస్థ.
రెండోది వ్యవసాయం -వర్తకం -పట్టణాలు పునాదిగా వర్ణకుల వ్యవస్థ లేని సమాజంగా ఉండి బ్రాహ్మణ మంత్రాంగానికి చోటులేని క్షత్రియ నాయకత్వంలోని గణతంత్ర వ్యవస్థ.
ఈ రెండు మార్గాలలో రాజ్యం ఏ మార్గం ఎంచుకోవాలి అనేదాన్ని వైదిక ఆర్థిక వ్యవస్థ నిర్దేశించింది.
వ్యవసాయం-గ్రామం-చేతివృత్తులు -బ్రాహ్మణులు -అవైదిక అగ్రకులాలు -సత్శూద్రులు- దేవాలయం ఉండే స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ ఇది. ఈ వైదిక ఆర్థిక వ్యవస్థ ఏర్పడటం అంత సునాయాసంగా జరిగింది కాదు. లేదా అహింసాయుతంగా ఏర్పడిందీ కాదు. బ్రాహ్మణులు- క్షత్రియులు- వైశ్యులు ఒక వర్గంగా శూద్రులు -ఆదివాసులు మరో వర్గంగా జరిగిన వర్గపోరాటం ఫలితంగా ఏర్పడిన వ్యవస్థ ఇది. హింస -వర్ణసాంకర్యం -కులం -వైదిక సంస్కృతి సాధనాలుగా దేశమంతా వైదిక ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది.
భారత చరిత్రలో మనకి ఈ ఘర్షణకి సంబంధించిన చారిత్రక ఆధారాలు అతి తక్కువగా కనిపిస్తాయి. వందలాది సంవత్సరాలు స్థిరంగా ఉండిపోయిన ఈ ఆర్థిక వ్యవస్థ పాత ఘర్షణల తాలూకూ ఆనవాళ్లని దరిదాపుగా చెరిపివేసింది.
కాబట్టి ఈ ఘర్షణ చరిత్రని పునర్నిర్మించుకోవడానికి ఆధునిక కాలంలో జీవించి ఉన్న గత చరిత్రని విశ్లేషించుకుంటూ భౌతిక ఆధారాల చుట్టూ కల్పనని జోడించుకుంటూ పోవాలి. ఇది చరిత్ర అధ్యయనానికీ కళా సౌందర్యానికీ దోహదం చేసే అద్భుత కళా రూపం అవుతుంది. అటువంటి అద్భుత కళారూపం కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళే రాసిన ‘బోయకొట్టములు పండ్రెండు’ నవల.
తెలుగులో చరిత్రని ఆధారం చేసుకొని అల్లిన చరిత్ర కాల్పనిక నవలల సంఖ్య కొద్దిపాటివే. పురాణవైర గ్రంథమాల చారిత్రక నవలల కోవలోనివి కాదు. బాపిరాజు -గోనగన్నారెడ్డి, అడివి శాంతిశ్రీ, నోరి నరసింహశాసి్త్ర -వాఘిరా, తెన్నేటి సూరి -చంఘీజ్ ఖాన్, అల్లం రాజయ్య, సాహుల -కొమురం భీం లాంటి నవలలు చారిత్రక కాల్పనిక నవలలు. ఈ కోవలోని నవల ‘బోయకొట్టములు పండ్రెండు’.
పండరంగని శాసనంలోని ఈ మాటను తీసుకొని ఇప్పటి దాకా ఉన్న చరిత్రని అధ్యయనం చేసి రాసిన ఒక జాతి వీర గాథ ఇది. ఆ జాతి బోయ.
బహుశా నల్లమల అటవీ ప్రాంతంలో నివసించిన గిరిజన జాతి బోయలు. ఒక్క ఆంధ్ర ప్రాంతాన్నే తీసుకున్నా అటవీ ప్రాంతంలోని జాతుల సంఖ్య తక్కువ కాదు. దండకారణ్యంలో గోండులు కోయలు గుత్తికోయలు సవరలు జాతాబులు చెంచులు ఇంకా ఎన్నో జాతుల ప్రజలు ఉన్నారు. వేలాది సంవత్సరాల క్రితం ఇప్పటికన్నా ఎన్నో రెట్ల వైశాల్యంలో ఉండిన అటవీ ప్రాంతాలలో చరిత్రకెక్కని ఎన్నో రకాల ప్రజలు నివసించి ఉండొచ్చని ఊహించవచ్చు.
భారత ఉపఖండంలో రాజ్యం అనేది ఏర్పడిన తరువాత మొదటి నుండీ దానికున్న కర్తవ్యం ఈ వేరు వేరు జాతుల ప్రజల్ని ఒక రాజ్యపు పాలితులుగా మార్చడం. అందుకోసం వైదిక సమాజ చట్రంలోకి ఈ జనాన్ని చేర్చుకోవడం. ఈ పరిణామం అంతా మనం చరిత్రలో చూడొచ్చు. వందల తరాలు గడిచాక ఈ జాతుల ఆనవాళ్ళు ఎక్కడా లేకుండా అవన్నీ వివిధ అవైదిక కులాలుగా వైదిక సమాజ చట్రంలోకి చేరిపోయాయి.
కానైతే బౌద్ధం, జైనం లాంటి తాత్విక చింతనలు మనకి చేసిన మహోపకారం ఆయా జాతుల అమ్మదేవతల పూజల్ని కొనసాగనివ్వడం. బౌద్ధ శ్రమణకులు ఆనాటి ప్రజల అనూచాన పూజాదికాలలో కల్పించుకోకుండా అష్టాంగ మార్గాన్ని ప్రబోధించారు. ఫలితంగా బ్రాహ్మణ్యం ఈ జాతుల ప్రజల్ని వాళ్ళ వాళ్ళ అమ్మ దేవతలు వాళ్ల జాతి పురాణ గాథలతో సహా చేర్చుకోవల్సి వచ్చింది. అంతేకాక అమ్మదేవతలనీ, పురాణ గాథల్నీ ఆమోదించాల్సి వచ్చింది.
ఈ గాథలు, ఈ పండుగలు ఈ ఆచార వ్యవహారాలే ఇవాళ మనం గతాన్ని గురించి ఊహించడానికి ఉన్న ఆధారాలు. వీటికి ఉన్న భౌతిక యదార్థత ఎంత తక్కువైనా అది ఈవేల్టికీ మన జీవితంలో కొనసాగుతున్నది. మన చారిత్రక జీవనంలోని ఈ సంక్లిష్టతలోంచి ఒక సాంఘిక జీవనాన్నీ పరిణామాన్నీ చిత్రించిన బోయకొట్టములు పండ్రెండు అచ్చంగా తెలుగు ప్రజల వీరగాథ.
పల్లవులకీ వేంగి చాళుక్యులకీ మధ్య జరిగిన యుద్ధాలలో త్రిపురాంతకం ప్రాంతంలోని బోయలు నలిగిపోయి తమ జీవనం కోసం అణ్డెక్కి ప్రాంతానికి బయలుదేరడంతో ఈ నవల ప్రారంభమవుతుంది. మొదటి బోయ వీరు వీరనబోయడు అతని భార్య మంగసాని పల్లవుల ప్రాపకాన్ని సంపాదించి అణ్డెక్కి ప్రాంతంలో స్థిరపడతారు. క్రమంలో ఇవి పన్నెండు బోయకొట్టాలుగా విస్తరిల్లుతాయి.
పల్లవులతోనూ చాళుక్యులతోనూ కలవకుండా తమ మానాన తాము జీవిద్దామని బోయ నాయకులు భావించినా అది సాధ్యపడదు. ఇటు పల్లవ రాజో అటు చాళుక్య రాజో ఎవరో ఒకరివైపు ఉండాల్సిన స్థితి బోయలది.
పల్లవులైనా చాళుక్యులైనా వాళ్ళు విస్తరింప చేయదల్చుకున్న వ్యవస్థ మాత్రం ఒకటే. రాజ్యం కోసం విస్తరణ కోసం యుద్ధాలు చేసుకున్నా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం వీరి ధ్యేయం.
పల్లవ రాజప్రతినిధి జయవర్మ మొదటి వీరనబోయనితో కట్టెపు దుర్గాన్ని నిర్మించమనీ, వీరన బోయన వంశం వారు మొత్తం బోయ కొట్టాలకు పాలకులుగా ఉండాలనీ, పన్నులు వసూలు చేయాలనీ, జనం అంతా యుద్ధ విద్యలలో ఆరి తేరి ఉండాలనీ ఆజ్ఞాపిస్తాడు.
బోయ కొట్టాల మీదికి వచ్చిన చాళుక్య జయసింహ వల్లభుడు పల్లవుల అనుమతులనీ ఆమోదిస్తూనే వాటితో పాటు బౌద్ధానికి వ్యతిరేకంగా బ్రాహ్మణుల్ని గ్రామంలో ఉంచుకోవాలనీ శివాలయాలు కట్టుకోవాలనీ పూజలు చేయాలనీ ఆజ్ఞాపిస్తాడు. అంతటితో ఆగకుండా రెండవ వీరన బోయణ్ని శిక్షణ కోసమని తనతో తీసుకుపోతాడు.
తమని పోలిన ఒక వైదిక రాజరిక వ్యవస్థని బోయల్లో నెలకొల్పి ఆ వ్యవస్థని తమ సామంత రాజ్యంగా చేసుకోవాలనే యోచన ఇరువేపులా కనిపిస్తుంది. కానీ బోయలు ఈ వైదిక రాజరిక వ్యవస్థలో చేరకుండా తాము తాముగా ఉండిపోవాలని ప్రయత్నిస్తారు. ఈ రెంటి మధ్య ఏ విధమైన ఘర్షణ -శాంతి జరిగాయనేదే ఈ నవల.
ఒకటవ వీరన బోయడు- మంగసాని, రెండవ వీరనబోయడు- జయశ్రీ, సంపంగి, కసవనబోయడు- పృధ్వీవ్యాఘ్రరాజు, నన్ని బోయడు- పొన్ని బోయడు, పొన్ని బోయడు- వకుళ, గుణగ విజయాదిత్యుడు- పండరంగడు.. ఈ ప్రధాన పాత్రల చుట్టూ జరిగిన ఘట్టాలు తొలి మధ్యయుగ చరిత్రని మన ముందు ఉంచుతాయి.
పృధ్వీవ్యాఘ్రరాజు బలవంతంగా వైదిక రాజరికాన్ని బోయలలో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తాడు. బోయ కొట్టాలుగా ఉన్న సమాజాన్ని ఒక రాజరిక వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నమే ఫలించి ఉంటే చరిత్రలో చాళుక్యులకి ఒక బలమైన సామంత రాజ్యం ఉండేది. లేదా బోయలే బలపడి తెలుగు నాట ఒక కొత్త రాజవంశంగా తలెత్తేది.
తలెత్తలేదు. పృధ్వీవ్యాఘ్రరాజు కాలానికి నిరంతర యుద్ధాలనించి బయటపడి తీరికగా ఉన్న పల్లవులు బోయకొట్టాల మీద తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించుకున్నారు. పల్లవ ఉదయచంద్రుడు కసవనబోయని మనుమడు వీరభద్ర బోయణ్ణి నాయకుడిగా చేశాడు. వీరభద్ర బోయడు పసి వయస్సులోనే హత్యకు గురౌతాడు. తరువాత నన్ని బోయడు పొన్ని బోయడు అనేవారు బోయకొట్టాలకు నాయకులౌతారు.
ఇక్కడి వరకూ వేంగి చాళుక్యులతో మైత్రినీ బంధాన్నీ పెంచుకున్న బోయ కొట్టాలు ఇప్పుడు పల్లవులతో మైత్రినీ, బంధాన్నీ పెంచుకుంటారు. బోయ ప్రతినిధిగా నన్ని బోయడు- నాగరికతను నేర్చి వైదిక రాచరిక మర్యాదల్ని వంట పట్టించుకున్న పొన్ని బోయడు ఇద్దరూ కలిసి బోయకొట్టాలను బలపరుచుకున్నారు. పొన్ని బోయడు వకుళను వివాహమాడడం ద్వారా పల్లవుల బంధుత్వాన్ని ఏర్పరుచుకున్నాడు.
బహుశా బోయ కొట్టాల వంటి ఒక పరిపాలనా విభాగం ఇక రాజ్యంగా రూపాంతరం చెందాల్సి ఉంది. అప్పటికే గ్రామం ఏర్పడిపోయింది. బ్రాహ్మణులు, వివిధ కులాల చేతివృత్తుల వారు వ్యవసాయం అన్నీ బోయ కొట్టాలలో స్థిరపడ్డాయి. వైదిక గ్రామం ఏర్పడి ఉంది. కాబట్టి అన్ని రకాలుగా వైదిక బోయ రాజ్యం ఏర్పడడానికి నేపథ్యం ఏర్పడింది.
కానీ చరిత్ర ఇంకోలా సాగింది. 108 యుద్ధాలతో విసిగి వేసారిన చాళుక్యరాజు మరణం తరువాత గుణగ విజయాదిత్యుడు అధికారంలోనికి వచ్చాడు. ఇతడికి స్పష్టమైన లక్ష్యం ఉంది. అందుకు తోడు వీరుడూ అతి క్రూరుడూ అయిన పండరంగని సేనాధిపత్యం ఉంది.
చారిత్రక కల్పనా నవలలో రచయిత చూపించిన శిల్పవిన్యాసం అమోఘం. ముఖ్యంగా ఆధునిక యూరోపియన్ చారిత్రక నవలా శిల్పాన్ని యథాతథంగా తీసుకోలేదు. దానికి అచ్చతెలుగు జానపద కథన శైలిని జోడించి ఒక కొత్త వొరవడిని సృష్టించారు. చాలా ముఖ్యంగా చారిత్రక నవలలో కల్పన అనేది చాలా క్లిష్టమైన అంశం. చారిత్రక సంఘటనల వాస్తవికత మీద కొన్ని చారిత్రక పాత్రల్ని ఆధారంగా తీసుకొని కల్పిత పాత్రల్ని సృష్టించి రాయడం రచయిత సామర్థ్యానికి పరీక్ష. మనకి చాలా చారిత్రక నవలల్లో చరిత్రని కల్పన అధిగమిస్తూ ఉంటుంది.
చరిత్ర గమనంలోని భౌతిక వాస్తవికతని ఏ మాత్రం విస్మరించకుండా ఏ మాత్రం అధిగమించకుండా వాస్తవికతని ప్రస్ఫుటీకరించే కల్పనని జోడించడం ఈ నవలకి అద్భుతమైన శైలిని ఇచ్చింది. ఒక్కొక్క తరంలోని -ఒక్కొక్క కాలంలోని సంఘటనల మధ్య ఉత్థాన పతనాల గతితార్కికతనీ, వాటి వెనుక ఉండే చారిత్రక చోదక శక్తుల్నీ కళాత్మకంగా చిత్రించారు.
మొట్ట మొదట నవల పేరే మన్ని కట్టిపడేస్తుంది. తెలుగు భాషా చర్చ నవలలో సందర్భాఆనికి తగినట్లుగా ప్రవేశిస్తుంది. జానపద పాటలు వాటి శైలీ సంస్కృత సంధుల్ని సమాసాలనీ తెలుగులోకి ప్రవేశపెట్టడానికి కృషినీ దానికి వ్యతిరేకతనీ కూడా చిత్రిస్తుంది ఈ నవల.
నిజంగానే చరిత్రలో చాలా సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు. రాజ్యం- మానవుల చైతన్య శీల కార్యాచరణనించి జరుగుతాయి. రాజ్యం అండదండలతోనే వైదిక ఆర్థిక వ్యవస్థ విస్తరించింది. దీనికి సముద్రగుప్తుడి నించి అన్ని రాజ్యాలు దోహదం చేస్తాయి. సాంస్కృతిక రంగంలో ఇది సహజ పరిణామం అనిపించవచ్చు గానీ ఇది బలప్రయోగంతో విస్తరించినదే. అలాగే భాష- తెలుగు భాష, కవిత్వం, ఛందస్సు, ఇవన్నీ సాహిత్యేతర రాజరిక అవసరాల కోసం సృష్టించినవి. అన్నంత మాత్రాన అందులో మనం వ్యతిరేకంగా తీసుకోవల్సింది ఏమీ లేదు.
మరో ముఖ్యమైన అంశం బౌద్ధం. ఈ నవలా చారిత్రక కాలానికి బౌద్ధ విస్తరణ భీతి వైదిక రాచరికాన్ని వెన్నాడుతూనే ఉంది. అందుకే బౌద్ధం విస్తరించకుండా- ముఖ్యంగా పాలితులలో, అంతకన్నా ముఖ్యంగా బోయల వంటి జాతులలో విస్తరించకుండా రాజ్యం ఎన్నో పటిష్ఠమైన ఏర్పాట్లు చేసుకుంది. దీని చివరి ఫలితం నన్నయ మహా భారత అనువాదం.
తెలుగు భాషలో వచ్చిన చారిత్రక కల్పన నవలల్లో ఇది ప్రజల చారిత్రక వీరగాథని చిత్రించిన అద్భుత నవల.

