స్మృతిపథంలో బసవపున్నయ్య

పార్టీ కార్యకర్తల్లో పిడివాదం పెగరకుండా కృషిచేసిన అరుదైన కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్య. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాలలో ఆయనది ప్రధాన పాత్ర. బసవపున్నయ్య సంస్కారం ఉన్నతమైనది.
ఇది సీపీఎం ప్రముఖ సిద్ధాంతకర్త కీ.శే. మాకినేని బసవపున్నయ్య (యం.బి.) శతజయంతి సంవత్సరం. పుచ్చలపల్లి సుందరయ్య గారు తన ఆత్మకథలో ‘కొత్తగా సీపీఎం ఉమ్మడి సీపీఐ నుంచి విడివడి ప్రత్యేక పార్టీగా ఏర్పడినప్పుడు యం.బి.ని పార్టీ ప్రథమ జాతీయ కార్యదర్శిగా మహాసభ ఎన్నుకుంటుందని నేను భావించాను. సీపీఐలో అంతర్గత పోరాటంలోనూ, సీపీఎంకు ప్రత్యేక పార్టీగా సైద్ధాంతిక అస్తిత్వాన్ని ఇవ్వడంలోనూ ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే కొత్త పార్టీకి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలున్న నాయకుడు కావాలని నన్ను ఎన్నుకున్నారు’ అని రాశారు. అంటే యం.బి.కి సీపీఎంలో ఉన్న ప్రాధాన్యం అర్థం అవుతుంది. అంతేకాదు, యం.బి. కూడా తనతో పాటు, పార్టీ కేంద్రంలో ఉండి పార్టీకి సైద్ధాంతికంగా, నిర్మాణరీత్యా సహకరిస్తేనే తాను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి అంగీకరిస్తానని స్పష్టం చేశానని కూడా సుందరయ్య చెప్పారు.
యం.బి.ది పార్టీ వాద ప్రతివాదాల్లో ఒక విలక్షణమైన, ఆకర్షణీయమైన శైలి! సీపీఎం ఏర్పడిన కొత్తలో పత్రికల వాళ్లు ఆయనను ‘సీపీఐ కమ్యూనిస్టు పార్టీ కాదా?’ అని అడిగితే ఆయన వెంటనే ‘వాళ్లు కమ్యూనిస్టులయితే మరి నేనెవర్ని?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పుడు అన్ని కమ్యూనిస్టు పార్టీలు మిగిలిన కమ్యూనిస్టు పార్టీలను వాటి వాటి పేర్లతోనే పిలుస్తున్నారనుకోండి! 1980-81లో అనుకుంటా సూర్యాపేటలో ఒక ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ ‘నా బట్ట తలపై వెంట్రుకలైనా దట్టంగా రావచ్చు గానీ, ఇందిరాగాంధీ గెలవడం కల్ల!’ అని యం.బి. అన్నారు. సీపీఎం అభిమానులు బ్రహ్మాండంగా చప్పట్లు చరిచారు. తీరా ఆ ఎన్నికలలో ఇందిరా గాంధీ ఘనవిజయం సాధించారు. ఆ తదుపరి ఒకసారి యం.బి. కలిసినప్పుడు ‘అదేంటండీ, అంత ఘంటాపథంగా ఇందిరాగాంధీ ఓడిపోతుందని అన్నారు…?’ అని అడిగాను. ‘భలేవాడివయ్యా నా సైన్యాన్ని ఎన్నికల యుద్ధంలోకి దింపుతున్నాను. ఆ సందర్భంలో నాకు ఇందిరాగాంధీ గెలుపు ఖాయమనిపించినా, ‘ఇందిరా గాంధీ గెలుస్తుంది – మనం ఓడిపోతామని’ చెబితే – మనవాళ్లు ఇక గోడలమీద రాతలు కూడా మొదలెట్టరు’ అని అన్నారు (అప్పుడు ప్రధాన ప్రచారం గోడలపై రాతలే – ఫ్లెక్సీలు రాలేదు).
యం.బి.కి చిన్నతనం నుంచి హేతువాద దృక్పథం ఉండేది. వాళ్ల ఊళ్లో రచ్చబండ వద్ద ‘పోతరాజు’ (గ్రామ దేవత – ఒక కర్ర ముక్క పాతిపెట్టి పుసుపు కుంకుమ పూసి)కు, కొలుపులు, జాతర్లు జరిగేవట. పోతరాజు మహిమల కథలు! ఒకరోజు ఒక కుక్క ఆ పోతరాజుపై కాలుపైకెత్తి మూత్రం పోయడం యం.బి. చూశారట! అంతలావు పోతరాజు ఆ మాత్రం కుక్కనే ఏం చేయలేకపోయాడని ఈయన తనకాలితో పోతరాజును తన్నాడట! ఇది ఆయన బంధువులెవరో చూసి ‘వేలెడంత కూడా లేవు ఎంత పొగర్రా నీకు, ఉండు ఇంట్లో చెప్తానని’ కేక వేశాడట! అందుకు ఇంట్లోంచి పారిపోతే, తెనాలిలో వారి ఊరు వాళ్లెవరో గుర్తించి, వాళ్ల ఊరు తీసుకెళ్లారట! కందాళం హనుమంతరావు గారని అప్పుడు కొల్లూరులో ఒక హెడ్ మాస్టర్ బాగా మంచి పేరున్న ఆయన. తన స్కూల్లో యస్.యస్.యల్.సి. విద్యార్థులకు ఫైనల్ పరీక్ష ముందు పరీక్ష పెట్టి, కొంతమందిని పరీక్షలో నెగ్గలేరని డిటెయిన్ చేశారట! ఆ డిటెన్‌షన్ విధానానికి వ్యతిరేకంగా యం.బి. నాయకత్వాన విద్యార్థులు సమ్మె చేశారట! అప్పుడు యం.బి. రాయించిన నినాదం ఏమంటే ‘ఎట్లాగూ కృతార్థులయ్యే విద్యార్థులను పాస్ చేయించడంలో కందాళం వారి గొప్ప ఏముంది – అలా చదువులో వెనుకబడిన విద్యార్థులను పాస్ అయ్యేలా చేయిస్తేనే గదా ఆయన ప్రతిష్ఠ!’ అని. అది చదివి హెడ్ మాస్టర్ తన స్కూలు విద్యార్థుల ముందు ఆ నినాదాన్ని మెచ్చుకున్నారట. అప్పుడు మా నాన్నగారు కొల్లూరు హైస్కూలు విద్యార్థి.
గోర్బచేవ్ సోవియట్ యూనియన్‌లో తొలిసారి గ్లాస్‌నాస్త్ (బహిరంగంగా వాస్తవ పరిస్థితిని వెలిబుచ్చడం) ప్రవేశపెట్టాడంటారు. కానీ యం.బి. దాన్ని, అంతకుముందే అవలంబించేవారు. ఢిల్లీలో కేంద్ర రాజకీయ పాఠశాల జరిగింది. మన రాష్ట్రం నుంచి కొరటాల సత్యనారాయణ, వి.యన్. రెడ్డి, టి.వి.ఆర్. చంద్ర, నేను అక్కడికి విద్యార్థులుగా వెళ్లాం. యం.బి. ‘1951 ఎత్తుగడల పంథా’ గూర్చి పాఠం చెప్పారు. అయిపోయిన తర్వాత మేము ముగ్గురమూ (కొరటాల రాలేదు) యం.బి.ని విడిగా కలిసి మా సందేహం అడిగాం. ‘మన భారత విప్లవ పంథా రష్యా మార్గమా, చైనా మార్గమా అన్న చర్చ…’ అని నేను ప్రశ్న పూర్తి చేయకుండానే ‘అసలు మీకు ఒక విషయం చెప్పాలి! క్లాసులో సీరియస్‌గా పాఠం చెప్తే ఆ విషయం చెప్పలేదు కదా!’ మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దిగబడ్డాం! ఇప్పుడు మీరు మా గురించి, మార్క్సిజంలో నిష్ణాతులం అనుకున్నట్లే మేమప్పుడు పార్టీ కేంద్రం బొంబాయిలో ఉన్న డాంగే, రణదివే, అజయ్‌ఘోష్‌ల గురించి వాళ్లకు మార్క్సిజం వేళ్ల కొసలపైన ఉంటుందనీ, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలరని అనుకునేవాళ్లం. ఇక్కడ మాకు ఆ సాయుధ పోరాటం సందర్భంగా ఏదైనా సమస్య వస్తే బొంబాయిలో వాళ్లకి ఆ సమస్య గురించి రాసి వారిని పరిష్కారం చూపమని అడిగేవాళ్లం. వారు పరిష్కారం రాసి పంపేవారు. ఆ పరిష్కారం మాకు అతికేది కాదు. అదే విషయం ‘కామ్రేడ్స్ మీ పరిష్కారం ఇక్కడ మాకు అన్వయం కావడం లేదు’ అని మళ్లీ వారికి పంపేవాళ్లం. వాళ్లు దానికి ‘ఎందుకు కుదరదు కామ్రేడ్స్ – అని లెనిన్ ఇలాంటి సందర్భంలో అంటూ ఒక రెండు పేజీల లెనిన్ కొటేషన్ జోడించి సమాధానం ఇచ్చేవారు. వీళ్లతో అయితే మేం చర్చించగలం గానీ, లెనిన్‌తో చర్చించ గల స్థాయి మాకు లేదు కదా! అందుకని మావో కొటేషన్ ఏదన్నా మాకు అనుకూలంగా వున్నది వెలికితీసి ఒక మూడు పేజీల కొటేషన్‌తో వారికి మళ్లీ రాసేవారం. ఇలా వారిది రష్యా మార్గం అయింది, మాది చైనా మార్గం అయింది. నిజానికి వారికి రష్యా మార్గమూ, మాకు చైనా మార్గమూ క్షుణ్ణంగా తెలిసింది కాదు’ అని చెప్పారు. అయినా నేను పట్టువదలని విక్రమార్కుని మాదిరి ‘ఇంతకీ మీరు ఏం చెప్పాలని’… ‘అని ప్రశ్న వేయకముందే’ సరే! క్లాసులో నా పాఠమే కాదు ఇప్పటి నా వివరణ సారాంశం కూడా మీకు అర్థం కాలేదన్న మాట అని ఆయన నవ్వారు. అప్పుడు గానీ మాకు తట్టలేదు. మేమూ పకపకా నవ్వాము.
ఇంకోసారి విడిగా మాట్లాడేటప్పుడు- ‘అదిగో, ఆ మావోగారి కాళ్లు, గడ్డమో పట్టుకుని ఇక్కడకు తీసుకువచ్చి ‘మంగళాపురం’ (చండ్ర రాజేశ్వరరావు గారి ఊరు)లో రహస్యంగా వుంచి, ఇక్కడ విప్లవం తీసుకురమ్మని ప్రాధేయపడదాం! ఆయన వల్ల అవుతుందేమో చూద్దాం – అయినా మన దేశం – మన భౌతిక పరిస్థితి – మన ప్రజల చైతన్యం – ఇవి ప్రధానం గానీ, ఏ నాయకుడినో కాపీ కొడితే కుదురుతుందా?’ అని అన్నారు. ‘ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో, మా చైనా చూడండి, అక్కడ తిండిలేని వాడు లేడు, బట్టలేని వాడు లేడు, ఇల్లు లేనివాడు లేడు, నిరుద్యోగి ఉండడు – అంటూ చేతులు బారజాపుతూ ఉపన్యసిస్తాను.’ అది సరేసారు, ‘మన చైనాలో అధ్యక్షుడు లీ షాల్ చీని 10 సంవత్సరాలు జైల్లో పెట్టి సరిగ్గా తిండి కూడా పెట్టకుండా చంపారట కదా అని ఎవరన్నా లేచి అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అయితే అలా అడగరు ఎవ్వరు – అసలు నాయకులకు ఎదురు ప్రశ్న వేస్తే ఊరుకుంటామా – మన వాలెంటీరే కర్ర చూపించి కూర్చోపెడతాడు’ అని ఇంత బాహాటంగానూ అనేవారు. మావో ప్రసిద్ధ రచన ‘ఆన్ కాంట్రడిక్షన్స్’ (వైరుధ్యాలపై) విమర్శిస్తూ ఆ మావో, మిత్ర వైరుధ్యం అంటారేమిటి? వైవిధ్యం కాదు. వైరుధ్యంలో మళ్లీ మిత్రత్వం ఏమిటి? మైసూరు పాకు తింటూ పచ్చి మిరపకాయ నంజుకున్నట్లు అని అనడమే గాక, దానిపై ఒక విమర్శనాత్మక పుస్తకమే రాశారు. ఓంకార్‌ను సీపీఎం పార్టీ నుంచి రాష్ట్ర కార్యవర్గం తొలగించింది. ఆ తర్వాత యం.బి. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికొచ్చారు. ఆయన ఓం కార్ బహిష్కరణ విషయంలో రాష్ట్ర కమిటీలో ‘బహిష్కరించడమేనా మరో మార్గం లేదా? ఒక్క ఓంకార్ తిరిగి పార్టీకి లభించాలంటే ఎంత కష్టం! ఓంకార్ మీ దృష్టిలో తప్పుచేసి ఉండొచ్చు. కానీ ఓంకార్ తప్పులేనా చేసింది. సాయుధపోరాటంలో ఆ తర్వాత వరంగల్ జిల్లా పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర ఏమిటి? ఆయనపై చర్య తీసుకునే ముందు ఓంకార్‌తో ఒకసారి నేను మాట్లాడే అవకాశం కల్పించి ఉండవలసింది. ఇక మీ ఏకగ్రీవ నిర్ణయానికి ఇప్పుడు చేసేదేముంది?’ అని తన అసంతృప్తిని వినిపించారు.
ఇలా చాలామంది కంటే పార్టీలో ఓపెన్ మైండ్‌తో ఉండడమే గాక, కొంత వరకూ పార్టీ కార్యకర్తలలో గుడ్డివిశ్వాసం, పిడివాదం పెరగకుండా కృషి చేయాలని భావించే అరుదైన నేతలలో ఆయన ఒకరు. భగవతీ చరణ్ వర్మ రాసిన ‘చిత్రలేఖ’ నవల నాకు నచ్చింది. ఆయనకు ఇచ్చి మీరు చదవండి అని అడిగాను. ఆయన చదివి ‘బాగుంది దీనిపై మన ప్రజాశక్తిలో సమీక్ష చేయమన్నారు.’ ‘ఎందుకులెండి విఠల్ గారికి ఇప్పుడు ఈ వేశ్యల, రాజుల, రంగప్పల నవల ఎందుకు నచ్చిందో అని మన కార్యకర్తలు విస్మయపడతారు’ అన్నాను. ‘సరేనయ్యా వాళ్లు ఏది కావాలంటే అది ఇవ్వడమేనా మన పత్రిక చెయ్యాల్సింది. వాళ్లను అట్లా అయినా ఆలోచింపనియ్యి’ అని ప్రోత్సహించారు. ఇలా ఎంతని చెప్పగలం? ఏది ఏమైనా మనదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలలో సిద్ధాంత వేత్తలలో ఆయనది ప్రధాన పాత్ర. ఆయనదొక విలక్షణమైన శైలి! తాను సీపీఎంలో నిర్వహించిన అంతర్గత పోరాటం సందర్భంగా యం.బి. తనతో కలిసి రాలేదన్న అసంతృప్తి సుందరయ్యకు ఉండేది. ఆయన తన రాజీనామా లేఖలో కూడా ఆ విషయం ప్రస్తావించారు. జలంధర్ మహాసభలో యం.బి., ఇ.యం.యస్.లు కేంద్రకమిటీ తరపున తయారుచేసిన డాక్యుమెంట్‌కు సుందరయ్య గారు ప్రత్యామ్నాయ డాక్యుమెంటు పెట్టారు. యం.బి., సుందరయ్యగారి ప్రత్యామ్నాయ డాక్యుమెంటును తీవ్రంగా విమర్శించారు. కానీ సుందరయ్య మరణానంతరం ఆయన సంతాప సభలో మాట్లాడుతూ ‘ప్రపంచ వ్యాప్తంగా నాకు తెలిసిన ఐదుగురు మార్క్సిస్టు అగ్ర నేతల్లో సుందరయ్య ఒకరు’ అని ఎంతగానో ప్రసంశించారు. ఆయన సంస్కారం ఉన్నతమైనది.
– డా. ఎ.పి. విఠల్

