కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం )

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం )

తెలుగు కవులలో అవకాశం పొందిన ఆలిండియా రేడియో మాజీ స్టేషన్ డైరెక్టర్ డా.ఆర్ .అనంత పద్మనాభ రావు ‘’బీడు వారిన నేల’’కవిత .బీడు వారిన గుండెతో రైతు రోదిస్తున్నాడని ,యాత్రలన్నీ మానవ మనో మాలిన్యక్షాళన మానస సరోవరాలు కావాలని ,మానవ మస్తిష్కం లో ఆలోచనా శిఖరాలు చిగురించాలని ,కేదార్ దారుణానికి మానవ తప్పిదమే కారణమని ‘’నింగీ నేలా నీరు పదిలంగా వాడుకొందాం –నింగి కెగసే ఆలోచనలతో సమైక్యతా గీతం పాడుకొందాం ‘’అని భావ గర్భితమైన ,తమ అనుభవ పూర్వకమైన సందేశం ఇచ్చారు .’’దాగిన అంతరాన్ని’’ బోడో భాషా కవి శ్రీ శరత్ చంద్ర బోరో కవితను శ్రీ సుధామ కవితానువాదం చేశారు .హృదంత రాళం చేదించుకు  చిమ్ముకు రానిఅసలు దుఖిన్చేందుకు కాని కన్నీళ్లు నిజమైనవి కావని ,మలినపు మరక అంటిన నవ్వు హాయిగా నవ్వినా నవ్వు కాదని ,సృష్టికే మూలాధారం లేని ప్రణయం ,నిర్మితి లేని ప్రేమ అస్తిత్వానికి అనర్హమని ,తిరిగి పొందాలనుకుని ఇచ్చే దానం ,ప్రశంసలకోసమమే ఇచ్చే కానుక ఉదారతకు నిదర్శనం కాదు అని మనసులో దాగిన ఆంతర్యాన్ని ఆవిష్కరించాడు కవి .గర్భస్థ శిశువు ఆవేదనను తల్లికి చెప్పుకునే  ‘’ఏ పేరూ లేకుండా ‘’ కవితను కన్నడం లో డా.జయశ్రీ సి.కంబర్ చెప్పిన దానికి డా కే బి లక్ష్మి తెనుగు అనువాదం చేశారు .’’ప్రేమరహిత ,నిరభిమాన భావనలు నన్ను గట్టిగా తడుతున్నట్లని పిస్తోందని ,తల్లి గొంతుకను,తీపి రాగాలను  తానూ అనుకరించగలనని ,కాని తానూ చీకట్లో జారిపోతున్నానని తన ఆశలు అడుగంటి పోయాయని ,తెగిన గాలి పటం లా చిద్రమై పోతున్నానని తీవ్ర ఆవేదన చెందుతుంది .చివరికి ‘’ఏ పేరూ లేకుండా నిస్సహాయం గా స్రవిస్తున్నాను –ప్రవహిస్తున్నాను –వేగం గా ఎర్రగా ‘’అని ఆడపిల్లని కన కుండా గర్భ చ్చేదం చేసుకున్నప్పుడు కడుపులోని శిశువు చెందే ఆవేదనే ఇది .

‘’ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బావి అడుగున అంధకారం లో నీళ్ళున్నాయి –నీళ్ళలో అందకారముంది –పదిలం ప్రియ తమా పదిలం –నీ మది అంచున లోతైన బావి ఒకటి ప్రవహిస్తోంది ‘’అనే హెచ్చరికతో ‘’అగాధాల బావి ‘’ని డా నాళేశ్వరం శంకరం ,కొంకణి భాషలో రాసిన శ్రీ పరేష్  నరేంద్ర కామత్ కవితను అనువదించారు .శ్రీ ఉదయ నారాయణ సింగ్ మైధిలి భాషలో తన ఊరిని ,అక్కడి జీవన పరిస్తితిని ,పరిసరాల్ని మట్టి వాసన తో  అక్షర బద్ధం చేస్తే డా .అనుమాండ్ల భూమయ్య ‘’ఎన్నాళ్ళ కేన్నాళ్ళకు ‘’అని తెలుగు చేశారు .’’నేను ముళ్ళ దారిలో నడవక తప్పదు –యదార్ధమనే అగ్ని ని పట్టుకొని తరువాతి తరానికి అంద జెయ్యాలని ఆరాట పడ్డారు’’యదార్ధ వాదం ‘’లో  ప్రో.వసంత అబాజీ దహకే మరాఠీ లో .తెలుగు చేశారు శ్రీ నగ్న ముని .

రాక్ష ప్రవ్రుత్తి భూమి మీద రాజ్యం చేస్తోందని నిర్జన ప్రదేశాలను సైతం కబళించేస్తోందని ,హింసాత్మక మానవ మనస్తత్వాన్ని , స్వార్ధాన్ని  సంపూర్ణం గా సాధించాలనే ఉబలాటం పెరిగిందాని ,ఇవన్నీ గమనిస్తున్న నక్షత్రాన్ని ‘’ఎవరి తోనూ ఏమీ చెప్పకు నక్షత్రమా ‘’అంటూ ప్రాధేయపడ్డారు నేపాలీ భాషలో శ్రీ భూపేంద్ర అధికారి .’ డా .టి గౌరీశంకర్ తెలుగులో చెప్పారు ..’’తన దేహం కాగితం గా మారిందని ,దానిపై తన  అస్తిత్వకావ్యాన్ని రాయమని ,కాగితాన్ని తేలిగ్గా తీసుకో వద్దని అనేక ప్రక్రియల్లో అది తయారైందని ,కావ్యమంటే సారం లేని శబ్ద విహారం కాదని ,కవిత్వమంటే ప్రేమ ఉద్వేగ హస్తం తో లలాటాన్ని స్పృశిస్తే సృష్టి సమస్తం ప్రేమ సంభరితం అవుతుందని ,అది హృదయం మీద రెపరెప లాడే మమతల మనోజ్ఞ పతాకం అని ,రక్త జ్వలిత సంగీతమే కవిత్వమని అది రక్తదానం చేసేవారినీ స్వీకరించే వారినీ నిత్య నూతనం గా పరవశింప జేస్తుందని నిర్వచించారు పంజాబీలో శ్రీ స్వరణ్ జీత్ సవి –తెలుగులో  వెలుగులు తెచ్చారు డా .యెన్ .గోపి .

‘’ ప్రశ్న కోసం అన్వేషిస్తూ ‘’-సింధీలో డా. విమ్మి సదరంగ్గణి వెతుకుతుంటే తెలుగులో డా. కొలక లూరి ఇనాక్ ‘’ అ అమ్మాయొకనైట్ క్వీన్ ,పగలు మౌనం రాత్రి గాఢ చంచలం అవుతుందని ,ఆమె  తన అగ్నిలో దహించుకు పోయే సూర్యుడని ఆమె ఒక స్వప్నం –దుప్పటికప్పుకుని నిద్ర పోయినట్లు నటిస్తుందని ,ఆమె ఒక కాగితప్పడవ అనాలోచనం గా ఎవరి చేతిలోకో ప్రవ హించి పోతుందని ,అ అమ్మాయి ఏడాదికో పక్షం మాత్రమె పుష్పించి మిగిలిన కాలమంతా మోడై మిగిలే ‘’బ్రయడల్ క్రీపర్ ‘’అని ,ఆమె ప్రశ్న కోసం అన్వేషించే జవాబు ‘’అని కమ్మని తెలుగులో నర్మ గర్భం గా పలికారు .దేశ రక్షణ చేసే జవాన్ ను కీర్తిస్తూ సందాలీ భాషలో ‘’కుమారి దమయంతి మేశ్రా’’గానం చేస్తే తెలుగులో డా .అమ్మంగి వేణుగోపాల్ ‘’జై జవాన్ ‘’అంటూ అతని నిండు యవ్వనం దేశానికీ ప్రజలకు అంకితమని ,అతని సుఖ దుఖాలు మాత్రం భూస్తాపితమని ,అతని మహా ప్రస్థానాన్ని దశ దిశలా ప్రతిధ్వనిస్తూ తుపాకులు పేలి గౌరవ వందనాన్ని సమర్పిస్తాయని అమర జవాన్ జ్యోతి దేదీప్యమానం గా ప్రజ్వరిల్లుతూ మహా వెలుగై యావత్ జాతిని ఆవహిస్తుందని ,జవాన్ అసమాన త్యాగం హ్రుదయాలనుండి చెదరిపోదని నివాళులర్పించారు .సరైన సమయం లో సరైన కవితను రాసి జాతిని రక్షించే జవాన్ కు జై కొట్టటం ఏంతో  శ్లాఘనీయం .,సందర్భ శుద్ధి ఉన్న కవిత .హాట్స్ ఆఫ్

కవిత్వం లో కని  పించకుండా పోయిన మాటకోసం తమిళ కవి శ్రీ ఈరోడ్ తమిళన్ బన్ వెతుకుతూ వజ్రాపు తునకను ,ఇంద్ర ధనుస్సు ముక్కను,పువ్వును అందమైన అమ్మాయిని పెడితే కవిత్వపాదాలు హర్షించక చిట పటమన్నాయ్ .కాని తన పసికందు తిరిగోచ్చినప్పుడు కనిపించకుండా పోయిన మాట వాడి చిట్టి కళ్ళల్లో జిగేల్ మంది ‘’అని తెనిగించారు డా .వనమాలీ .చిన్నపిల్లల అవసరం మాలిమి లో ఆనందం  సంతృప్తి వెల్లి  విరుస్తుందని తెలియ జెప్పిన కవిత ‘’ఆ మాట ‘’.

‘’కవిత నీకు రసగంగ –వాళ్లకు సట్టాబజార్ జీన్స్ –వాళ్లకు కెరీర్ జోన్ –నల్ల డబ్బు ఆసాముల తెల్ల దనం –కాని నాకు ఇంటి నుంచి బజారుదాకా ఒక సామూహిక ఉద్యమం ‘’అని హిందీ లో అన్న శ్రీ విష్ణు శర్మ కవితను శ్రీ నిఖిలేశ్వర్ తెలుగులో ‘’నా కోసం కవిత ‘’గా పల్ల  వింప జేశారు .వీరుకాక మిగిలిన కవులూ తమ భాషల్లో కవిత్వం చెప్పారు ,వాటికి మన వాళ్ళు తెనుగు చేశారు .కాని గుర్తుంచుకో దగ్గ కవిత్వం లేదని పించింది .సరుకుల చిట్టా గా కొందరు రాస్తే ,తికమకల అడ్డా గా  కొందరి కవిత లుండటం జాతీయ కవి సమ్మేళనానికి శోభ స్కరం  కాదని పించింది .ఇంత  ఖర్చుతో ,రంగ రంగ వైభవం గా నిర్వహించిన సమ్మేళనం లో పదికాలాల పాటు నిలువ ఉండే కవిత లేక పోవటం బాధాకరమే .మననం చేసుకొనేలైన్లు ,ఆలోచింప జేసే వాక్యాలు ,మనసులోపలికి చొచ్చుకు పోయే భావాలు ,గుండె తడిని తట్టే కవితలు ,కళ్ళు చెమర్చే పదాలు లేక పోవటం ఈ హంగామా లో వెలితిగా ఉందని చెప్పక తప్పదు .

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పుస్తకం లో ఒకే ఒక్క  తప్పు మాత్రం దొర్లింది.అది కవర్ పేజీ దాటిన తర్వాత వచ్చిన టైటిల్ పేజీ లో కవి సమ్మేళనం జరిగిన తేదీ 2014ఫిబ్రవరి 9 అని పొరబాటున పడింది .మిగతా అన్ని చోట్ల జనవరి 9 అని సరిగ్గానే అచ్చు అయింది .ప్రమాదో ధీమతా మపి .

ఇంత గొప్ప కార్యక్రమాన్ని హైదరా బాద్ లో నిర్వహించి, తెలుగు కవితలను పుస్తక రూపం లోమొదటి సారిగా  ముద్రించి అందరికి ‘’అమూల్యం ‘’గా అంద జేసి, భాగ్య నగరాన్ని కవితా సౌభాగ్య నగర్ గా ఆరోజును తీర్చి దిద్దిన ఆత్మీయులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారిని మరొక్క సారి అభినందిస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-14 –ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.