
దాశరథి మహాకవి, ఆయన చేసిన సాహిత్య సృష్టి అనితర సాధ్యం. అంగారాన్నీ, శృంగారాన్ని రంగరించినవాడు. తెలంగాణను సాహిత్యంలో ప్రవేశపెట్టిన తొలి యోధుడు దాశరథి.కాలానికి కరుణ లేదు. కాలం కర్కశం అయింది. కాలం మా అన్నయ్య దాశరథిని 1987 కార్తీక పౌర్ణమి నాడు కబళించింది. తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మా అన్నయ్య పర్వదినాన పరమ పదించారు. ఆ రోజు వ్యాస పూర్ణిమ. గురునానక్ జన్మదినం. దివాజుద్దీహుం షరీఫ్. నిండు పున్నమి నాడు పోయాడు. మమ్ములను కారు చీకట్లలో ముంచి పోయాడు. కాలాన్ని మించిన వేగం కనిపించదు. అప్పుడే రెండేళ్ళు గతించాయి.
దాశరథి మహాకవి, బహు భాషావేత్త, పండితుడు, అచంచల దేశభక్తుడు, మహావక్త, మంచి మిత్రుడు, మనసున్నవాడు, అన్నింటీనీ మించి గొప్ప మానవతామూర్తి, దాశరథిని గురించి కానీ, వారి రచనలను గురించి కానీ తెలియని వారు అరుదు. అతడు సాహిత్యంలో చేసిన కృషి అలాంటిది. అతడు చేసిన సాహిత్య సృష్టి అనితర సాధ్యం. అంగారాన్నీ, శృంగారాన్ని రంగరించినవాడు. తెలంగాణను సాహిత్యంలో ప్రవేశపెట్టిన తొలి యోధుడు దాశరథి. దాశరథి జీవితంలో దాపరికాలు లేవు. అతని జీవితం తెరచిన పుస్తకం. అన్నదమ్ములంగా మాది సుమారు అరవై యేళ్ల అనుబంధం. మాకు అరమరికలు లేవు. అన్యోన్యంగా జీవించాం. ఆ ముచ్చట్లు ఎంత చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా తరగవు. కొన్ని పాత విషయాలు కొత్తగా ప్రస్తావిస్తాను.
మా పూర్వులది భద్రాచలం. రామానుజుని అంతరంగ శిష్యుల్లో దాశరథి ఒకరు. మాది వారి వంశం అంటారు. మా పితామహులు లక్ష్మణాచార్యులవారు విద్వాంసులు, వైద్యులు. వారికి భద్రాచలంలో ఇల్లూ, వైద్యం, ఆలయంలో ఉద్యోగం, కూనపరాజు పర్వలో భూములూ ఉండేవి. వారికి సంతానం కలగడం, పోవడం జరుగుతుండేది. మా నాయన పుట్టగానే వారిని తీసుకొని మా నాయనమ్మ బుచ్చమ్మగారు వాళ్ల చిన్న గూడూరులోని తమ్ముని ఇంటి కి చేరుకుంది. మా తాతగారు భద్రాచలంలో అన్నీ వదులుకొని చిన్న గూడూరు చేరారు. ఆస్తిపాస్తులు ఆర్జించారు. మా నాయన గారి చదువుకోసం మద్రాసు చేరి, వైద్యం చేసి మద్రాసు యూనివర్సిటీ విద్వాన్ చేయించి మద్రాసులో వైద్యం వదులుకొని మళ్లీ చినగూడూరు చేరారు. మా తండ్రిగారు వెంకటాచార్యుల వారు సంస్కృత ద్రావిడాల్లో ఉద్దండ పండితులు. వారు తమిళం నుంచి అనేక ప్రబంధాలను తెనిగించారు. మా మాతామహులు భట్టర్ దేశికులకు సంస్కృతాంధ్రాల్లో మంచి ప్రవేశం ఉండేది.
మా అన్నయ్య కృష్ణమాచార్యులు 1925లో చినగూడూరులో జన్మించారు. వారి విద్యాభ్యాసాన్ని గురించి చాలా తర్జనభర్జనలు జరిగాయి. మా తాతలిద్దరు మ్లేచ్ఛ విద్య అంటే ఉర్దూ చదువు పనికిరాదన్నారు. మా నాయన వారితో ఏకీభవించలేదు. కాలాన్ని అనుసరించాలన్నారు.
నిజాం నవాబు ఒక పద్ధతి ప్రకారం తెలుగు భాషను, సంస్కృతిని ధ్వంసం చేస్తున్న కాలం అది. ఉర్దూ బోధన భాష రాజకీయ భాష అయింది. తెలుగు చెప్పే వీధి బడులు నడిపించడానికి కూడా సర్కార్ అనుమతి అవసరం చేశారు. తెలుగు మాట్లాడాలన్నా, రాయాలన్నా, తెలుగుదనం కనబరచాలన్నా బుగులుపడుతున్న రోజులవి.
చినగూడూరు పేరుకు చిన్నది. ఊరు పెద్దదే. ఆ రోజుల్లో మదర్సా, పోలీసు నాకా, టప్పాకానా ఉండేవి. మా నాయన పట్టుదలతో అన్నయ్యను మదర్సాలో చేర్చారు. ఉగ్గంపల్లి పటేల్ ఇస్మాయిల్ ఇంట్లో చ దువు చెప్పేవాడు. మా నాయన సంస్కృతం కూడా ప్రారంభించారు. ఆ ఊళ్లో ఉన్న తహతాన్యాలో నాలుగో తరగతి పూర్తి అయింది. అన్నయ్య చదువు కొనసాగించడానికి మా నాయన ఖమ్మం మారారు. అన ్నయ్య ఫౌఖాన్యా అంటే హైస్కూల్లో చేరారు.
మా అన్నయ్యకు తొలి నుంచీ తెలుగు ఆరాటం మెండు. ఇంటి పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం. మా నాయన సంస్కృతం, ద్రావిడం తప్ప మిగతావి భాషలే కావనే వాడు. తెలుగు ఒక భాష కాదని వారి అభిమతం. అందుకే ఇంటి దగ్గరే అన్నయ్యకు ద్రావిడ, సంస్కృతాలు బోధించారు. అన్నయ్య 15 ఏండ్ల ప్రాయంలోనే తిరుప్పావై కాలక్షేపం సాయించారు.
ఇంటి స్థితి ఇది. స్కూల్లో సాంతం ఉర్దూ. అంటే ఉర్దూ మీడియం తెలుగు చదవదలచివారికి మూడు నుంచి ఏడవ తరగతి దాకా బోధించారు. ఆ తర్వాత తెలుగు ఆప్షనల్ విషయం. ఎనిమిదో తరగతి తెలుగు ఆప్షనల్ క్లాసులో మా అన్నయ్య ఒక్కడే ఉండినట్లు గుర్తు. తెలుగు చదవడానికి జంకేవారు.
ఇంత వ్యతిరేకత ఉన్నా అన్నయ్య తెలుగు తృష్ణ తగ్గలేదు. మా అమ్మకు తెలుగులో మంచి విద్వత్తు ఉండేది. చాటుగా అమ్మ దగ్గరే అన్నయ్య అప్పకవీయం, కావ్యాలూ చదివాడు.
అన్నయ్య తెలుగు ఆర్తికి ఖమ్మం వాతావరణం ఎంతగానో ఉపకరిచింది. విజ్ఞాన నికేతనం, విద్యార్థి సంఘం గ్రంథాలయాలు దాశరథికి ఎంతో తోడ్పడ్డాయి. దాశరథి పుట్టుకతో కవి. అతడు చాలా చిన్నతనం నుంచే పెద్దలు మెచ్చే కవితలు చెప్పేవాడు.
కారణాంతరాల వల్ల మేము గార్ల జాగీరుకు మారాల్సి వచ్చింది. దాశరథి కవి కావడానికి ఖమ్మం వాతావరణం తోడ్పడ్డట్టే, అతనిలో విప్లవ జ్వాలను రగిల్చింది గార్ల జాగీరులోని కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రమహాసభ పోరాటాలు! దాశరథి అనేక పోరాటాలు నిర్వహించారు. అడవుల్లో తిరిగారు. కోయలతో పాటు ఉన్నారు. జబ్బులు తెచ్చుకున్నారు. అవి చివరిదాకా వారిని వదల్లేదు.
దాశరథి సభల్లో అగ్గి కురిపించాడు. కవితలు చదివి నిప్పులు ఉముసేవాడు. ఆనాటి నిజాం రాజ్యంలో ఉండి నవాబులను ‘ముసలి నక్క జన్మ జన్మాల బూజు’ అనడానికి సాహసం కావాలి. ఒక సభలో కవితలు చదివిన సందర్భంలో పోలీసులు పట్టుకున్నారు. అయితే, చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు.
దాశరథి తరువాత కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయాడు.
దాశరథిలో సంప్రదాయ సిద్ధం అయిన పాండిత్యం ఉంది. మార్స్కిస్టు అవగాహన ఉంది. అందుకే ప్రపంచంలో ఏ మూల అన్యాయం జరిగినా తిమిరంతో సమరం సాగిస్తాడు. దాశరథి కాయాన్ని కాలం కబళించింది. కానీ ‘నాస్తి తేషాం యశఃకాలే జరామరణజం భయం’.
– దాశరథి రంగాచార్య
(1989 నవంబర్ 6న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమయిన వ్యాసం దాశరథి కృష్ణమాచార్య
జయంతి సందర్భంగా పునర్ముద్రణ)

