బడే గులాంఅలీఖాన్ చివరి మజిలీ

రచన: ఆర్వీ రామారావుహైదరాబాద్ అంటే ఇప్పుడు చాలా మందికి స్థిరాస్తి వ్యాపారానికి అనువైన చోటు అని మాత్రమే అర్థం అవుతుంది. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ఎవరిది అన్న చర్చ తీవ్రంగా మాత్రమే కాదు జుగుప్సాకరంగా కూడా సాగింది. మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం కనక మాకూ దాని మీద హక్కు ఉందని వాదించిన చరిత్ర జ్ఞాన హీనులకు కొదవే లేకుండా పోయింది. వారి దృష్టిలో హైదరాబాద్ అభివృద్ధి అంటే స్థలాల, ఇళ్ల వ్యాపారం, ఆ వ్యాపారంలో వారి దురాశకు తగ్గట్టుగా స్థలాల ధరలు పెరగడమే. ఇదంతా భౌతిక సంస్కృతిలో మాత్రమే భాగం అని వారికి తట్టదు. సంస్కృతి కేవలం ఆస్తుల రూపంలో ఉండదని వాళ్లకు చెవికెక్కదుగాక ఎక్కదు. సంస్కృతికి రెండో పార్శ్వం ఒకటి ఉంటుందనీ దాన్ని బౌద్ధిక సంస్కృతి అంటారని తెలియదు గాక తెలియదు. హైదరాబాద్ భౌతిక సంస్కృతికి ఎంత ప్రతీతో బౌద్ధిక సంస్కృతికి అంతకన్నా ఎక్కువ ప్రఖ్యాతి చెందింది. దేశానికి రెండో రాజధాని కావడానికి సకల అర్హతలూ హైదరాబాద్‌కు ఉన్నాయని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాట సంస్కృతిని కాసుల్లో కొలిచే వారికి ఎలా గుర్తుంటుంది?ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ప్రభావం దక్షిణ భారతదేశంలో అంతగా లేకపోయినా హైదరాబాద్‌లో ఆ పోరాట రణన్నినాదాలు తుర్రెబాజ్ ఖాన్ రూపంలో ప్రతిధ్వనించాయని స్థిరాస్తి వృద్ధే అభివృద్ధి అనుకునే వారికి ఎలా అర్థం అవుతుంది? కోఠీలో ఉన్న ఉస్మానియా విశ్వ విద్యాలయ మహిళా కళాశాల గోడ వార తుర్రెబాజ్ ఖాన్ రోడ్ అనే ఒక “నామ ఫలకం” ఉండేది. రోడ్డు విస్తరణలో భాగంగా ఉమెన్స్ కళాశాల కుంచించుకు పోయిన తర్వాత ఆ నామఫలకం నిశానీ కూడా లేకుండా పోయింది. ఇప్పటికీ అది లేకపోలేదు, ఉంది. కాని ఏదో రహస్యాన్ని దాస్తున్నట్టు కోఠీ చౌరస్తాలో ఆర్టీసీ బస్ టర్మినల్ కు ఆనుకుని ఉన్న మూడు సింహాల స్థూపాన్ని కాపాడడం కోసం నిర్మించిన కంచె లోపల దాక్కుని తుర్రెబాజ్ ఖాన్ రోడ్ అని పరిశోధకులకు మాత్రమే కనిపించేట్టుగా ఉంది. ఇలాంటి నామఫలకాలు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి. కాని ఆ వీధులను ఆ పేరుతో ఎవరూ పిలవరు. పండిత్ మోతీరాం మార్గ్, బడే గులాంఅలీఖాన్ మార్గ్ లాంటివి అలా అనామకంగా మిగిలిపోయిన నామ ఫలకాలే. ఇంతకీ పండిత్ మోతీరాం, బడే గులాం అలీ ఖాన్ హైదరాబాదీలు కారు. కాని హైదరాబాద్ సంస్కృతిలో వారి కీర్తి ప్రతిష్టలూ భాగమే. దాయరా మీర్ మోమీన్బడే గులాంఅలీ ఖాన్(ఏప్రిల్ 1902 – 25 ఏప్రిల్ 1968) ప్రసిద్ధ పాకిస్తానీ గాయకుడు. భారత-పాకిస్తాన్ దేశాల సరిహద్దులను నిర్ణయించడానికి రాడ్‌క్లిఫ్ అవిభక్త భారత్ చిత్రపటంపై గీసిన గీత భారత్-పాకిస్తాన్ అని రెండు దేశాలను సృష్టించగలిగింది కాని రెండు దేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను విడదీయలేక పోయింది. సంస్కృతి బీటలు వారేట్టు చేయడం రాడ్‌క్లిఫ్ ఎర్రపెన్సిల్‌కు సాధ్యమే కాలేదు. బడే గులాంఅలీ ఖాన్‌కు హైదరాబద్‌తో విడదీయరాని సంబంధమే ఉంది. ఆయన పటియాలా ఘరానాకు చెందిన హిందుస్తానీ గాయకుడు. బ్రిటిష్‌వారి ఏలుబడిలోని పంజాబ్‌లోని కసూర్‌లో బడే గులాంఅలీ ఖాన్ జన్మించారు. దేశ విభజన పుణ్యమా అని కసూర్ పాకిస్తాన్‌లో భాగమై పోయింది. దేశ విభజన కారణంగా ఖాన్ పాకిస్తానీ అయిపోయాడు. కాని ఆయన ఏనాడూ దేశ విభజనను అంగీకరించలేదు. “దేశంలో ప్రతి ఇంట్లోనూ ఒకరికి హిందుస్తానీ సంగీతం నేర్పితే దేశ విభజన అయ్యేదే కాదు” అని ఖండితంగా చెప్పే వారు. ఖాన్ ఎక్కువ కాలం పాకిస్తాన్‌లో నివసించ లేదు. శాశ్వతంగా భారత్‌లో ఉండి పోవాలని నిర్ణయించుకుని భారత్ వచ్చేశారు. అప్పటి బొంబాయి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ సహకారంతో ఆయన భారత పౌరసత్వం కూడా సంపాదించారు. బొంబాయిలోని మలబార్ హిల్‌లో ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో ఖాన్ ఉండే వారు. అయితే ఆయన లాహోర్, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్‌లో కూడా నివసించారు. బడే గులాంఅలీ ఖాన్ తండ్రి అలీ బక్ష్ ఖాన్ ప్రసిద్ధ గాయకుడు. ఏడేళ్ల వయసులోనే బడే గులాం అలీ ఖాన్ తన పినతండ్రి కాలే ఖాన్ దగ్గర సారంగి, పాటలు పాడడం నేర్చుకున్నారు. 21 ఏళ్ల వయసులో బెనారస్ వెళ్లి హీరాబాయి గాత్రానికి సారంగీ సహకారం అందించేవారు. ఖాన్ చాలా వరకు మహిళల గాత్రానికి సారంగీ సహకారం అందించినా ఆ తర్వాత తన పిన తండ్రి పాడిన గీతాలను గానం చేసే వారు. ఉస్తాద్ అఖ్తర్ హుసేన్ ఖాన్, ఉస్తాద్ ఆషిక్అలీ ఖాన్ శిష్యరికం కూడా చేసిన తర్వాత కలకత్తాలో సొంతంగా మొదటి సంగీత కచేరీ చేసిన బడే గులాంఖాన్ కీర్తి ప్రతిష్ఠలు పెరిగిపోయాయి. శాస్త్రీయ సంగీతంలో సుదీర్ఘ ఆలాపనలే అందం అని ఖాన్ అంగీకరించేవారు. కానీ దీర్ఘ ఆలాపనలను ఆస్వాదించే ఓపిక శ్రోతలకు ఉండడం లేదు కనక వారి అభిరుచి మేరకు ఆలాపాన్ని తగ్గించానని ఖాన్ చెప్పేవారు. గాయకుడిగా ఎంత ప్రసిద్ధుడైనా ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. బలవంతం మీద నౌషాద్ సంగీత దర్శకత్వంలో 1960లో మొగల్-ఎ-ఆజం సినిమాలో రెండు పాటలు పాడారు. అప్పట్లో లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వారు ఒక్కో పాట పాడడానికి రూ. 500 పారితోషికం తీసుకుంటుండగా బడే గులాం అలీ ఖాన్ మాత్రం ఒక్కో పాటకు రూ. 25,000 పారితోషికం అడిగారు. 1962లో ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మభూషణ్ ప్రదానం చేశారు. ఖాన్ భార్య అల్లా జివాయ్ 1932లోనే మరణించడంతో ఆయన సంతానం లేని విధవరాలు అల్లారఖీని పెళ్లాడారు. సబ్రంగ్ అనే కలం పేరుతో బడే గులాం అలీ ఖాన్ అనేక గీతాలను కూర్చారు. చివరి రోజుల్లో ఖాన్ కు పక్షవాతం సోకింది. అయినా కొడుకు మునవ్వర్అలీ ఖాన్ సహాయంతో సంగీత కచేరీలు చేస్తూనే వచ్చారు. బషీర్ బాగ్ పాలెస్‌లో 1968లో ఆయన మరణించారు. ఖాన్ శిష్యుడు మల్తీ గిలాని ఇప్పటికీ బడే గులాంఅలీ ఖాన్ స్మారక సంగీత కచేరీలు నిర్వహిస్తూనే ఉంటారు. బడే గులాం అలీ ఖాన్ సమాధి పాత బస్తీలోనీ హరీబౌలీలోని దాయరా మీర్ మోమీన్‌లో ఉంది. ఆ వాస్తవం ఇప్పటికీ అనేక మంది సంగీత ప్రియులకు కూడా తాజా వార్తే. మరి స్థిరాస్తే అభివృద్ధి అనుకునే వారికి హైదరాబాద్ బౌద్ధిక సంస్కృతి తలకెక్కక పోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది.
9676282858

