బళ్ళారి రాఘవపై తూష్ణీ భావమా?! – పోతుల బాలకోటయ్య
‘వినాశకాలే విపరీత బుద్ధి’ అంటారు పెద్దలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దీ అలాంటి బుద్ధేనేమో… ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఒక్కో అడుగు అలాంటి బుద్ధితోనే వేస్తున్న దుస్థితి. రాష్ట్ర విభజన నేపథ్యంలో… పోలవరం ముంపు మండలాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్, ఉద్యోగుల విభజన, హైదరాబాద్ శాంతి భద్రతలు వంటి అంశాలపై వివాదాస్పద నిర్ణయాలతో పాటు ఆఖరికి సచివాలయంలో ఇనుప కంచె, ఏపీఎన్జీవోలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడం, కట్టడాల కూల్చివేత, రెండు ప్రధాన టీవీ చానళ్ళ ప్రసారాల నిలిపివేత ఈ కోవలోనివే.
ఇప్పుడు తాజాగా తెలుగు ప్రజలకు గర్వకారణమైన నాటక రంగ మహా నటుడు బళ్ళారి రాఘవ గారిపై కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, డైలాగులు కూడా అలాంటివే. మొత్తం నాటకరంగ కళాకారులను, కళాప్రియులను కించపర్చేవే. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మహా కవి దాశరధి జయంత్యుత్సవ కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ ట్యాంకు బండ్‌పై ఏర్పాటు చేసిన విగ్రహాల గురించి ప్రస్తావించారు. బళ్ళారి రాఘవ లాంటి పనికిమాలిన విగ్రహాలు అక్కడ పెట్టారని, ఆయన గురించి బడి పిల్లలకు కూడా తెలియదంటూ వ్యాఖ్యానించారు. ‘నేనేది మాట్లాడినా మీడియా వాళ్ళు వివాదాస్పదం చేస్తారని అంటూనే…. ఇది పనికిమాలిన పని కాదా?’ అంటూ మీడియా వాళ్ళనే ప్రశ్నించారు.
నిజానికి బళ్ళారి రాఘవ విగ్రహం హైదరాబాద్ ట్యాంకు బండ్‌పై 1985 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇన్నేళ్ళ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో… హైదరాబాద్ పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా చట్టరూపం దాల్చిన పరిస్థితులలో.. కేసీఆర్ బళ్ళారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? ప్రాంతాలకతీతంగా తెలుగు కళా వైభవానికి వన్నెలు దిద్దిన నటులను దూషిస్తే, తెలుగు వైభవానికి మంచి జరుగుతుందా?
బళ్ళారి రాఘవ గురించి ఇప్పటి బడి పిల్లలకు తెలియకపోవచ్చునేమో… కానీ, కేసీఆర్‌కు తెలియకపోవడం క్షమార్హం కాదు. 1880 ఆగస్టు 2న బళ్ళారిలోని తాడిపత్రిలో నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులు తొలి సంతానంగా రాఘవ పుట్టారు. బళ్ళారి మునిసిపల్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ చదివిన రాఘవ మద్రాసులో 1905లోనే న్యాయ శాస్త్ర పట్టా పొందారు. ఆయనకు మొదటి నుంచీ కళలంటే ఇష్టం. కథలంటే ఇష్టం. పాటలంటే ఇష్టం. ఈ ఇష్టంతోనే తెలుగు, కన్నడం, హిందీ, తమిళం భాషలతో పాటు ఆంగ్లంలోనూ ఆయన నాటకాలాడారు. దుర్యోధన, వృద్ధ రైతు, మంత్రి, గిరీశం వంటి చలన చిత్రాలలోనూ నటించారు. షేక్‌స్పియర్ నాటకంలో షైలాక్ పాత్ర పోషిస్తే, ఆ నాటకం చూసిన ప్రఖ్యాత ఇంగ్లీషు నాటక రచయిత బెర్నార్డ్ షా తెగ మెచ్చుకున్నాడట. రాఘవ ఇంగ్లండులో పుట్టినట్లయితే, షేక్‌స్పియర్ అంతటి ఖ్యాతి లభించేదని ప్రశంసించాడట. విశ్వకవి రవీంద్రుడు తన ‘పోస్టాఫీస్’ నాటకంలో రాఘవ నటనను చూసి ఉత్తమ శ్రేణికి చెందిన అఖిల భారత స్థాయి కళాకారునిగా కీర్తించాడట. బెంగళూరులో రాఘవ నాటక ప్రదర్శనను తిలకించేందుకు మహాత్మా గాంధీని ఆహ్వానిస్తే, పది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండలేనని చెప్పిన గాంధీ దాదాపు 80 నిమిషాలు దాటినా కన్నార్పకుండా రాఘవ నాటకాన్ని తిలకించాడంటారు. ఈ రోజుల్లోనే భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసినవాడు రాఘవుడు. స్ర్తీ పాత్రలను స్ర్తీలే ధరించాలని చెప్పి, విద్యాధికులైన స్ర్తీలను రంగ స్థలం ఎక్కించి వాస్తవికతకు అద్దం పట్టిన విప్లవ నటుడు ఆయన. జాతి ప్రగతికి, మూఢాచార నిర్మూలనకు నాటక రంగం అత్యంత ప్రధానమైన ప్రచార అస్త్రంగా నమ్మి, నాటకాల ద్వారా సామాజిక చైతన్యాలను వెలిగించిన జ్యోతి. అలాంటి మహా నటుడు మిగుల్చుకున్నది ఏదీ లేదు. మొత్తం జీవితాన్నే నాటక రంగానికి రంగరించి మరీ వినియోగించారు. వ్యక్తిగా ఆయన కుల మతాలకు వ్యతిరేకి. ‘ఆచారి’ని తన పేరు నుంచి తొలగించి, కేవలం బళ్ళారి రాఘవ తనను తాను సంస్కరించుకున్న ఘనుడు. ఒకానొక నాటకంలో తల్లి చనిపోయిన ఘట్టంలో సహజత్వం కోసం కడవల కొద్దీ నీళ్ళను తలపై కుమ్మరించుకొని, ఆ తరువాత జబ్బు చేసి మరణించాడు. బళ్ళారి ఘన చరిత్ర గురించి కేసీఆర్‌కు తెలియకపోవడం చిత్రం కాదేమో…
– పోతుల బాలకోటయ్య
సీనియర్ జర్నలిస్ట్

