కర్మయోగి కొడాలి – కొడాలి వేంకటాచలం
కొడాలి ఆంజనేయులు గారు 1897లో కృష్ణాజిల్లా దివి తాలూకాలోని కొడాలి గ్రామంలో జన్మించారు. బందరు హిందూ హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకటశాసు్త్రలు గారి దగ్గర విశ్వనాథ సత్యనారాయణ గారితో కలసి చదువుకున్నారు. తరువాత వీరిద్దరూ ‘సత్యాంజనేయ కవులు’ పేరుతో జంట కవులుగా కొంతకాలం కవిత్వం చెప్పారు. తరువాత ఆంజనేయులు స్వాతంత్య్ర సమరంలోకి దూకగా, విశ్వనాథవారు సాహిత్యరంగంలో నిలదొక్కుకున్నారు. అనంతర కాలంలో విశ్వనాథవారు తన ‘రామాయణ కల్పవృక్షం’ అవతారికలో కొడాలి వారిని గుర్తుచేసుకుంటూ ‘అతడె తోడు కల్గినను అచ్చముగ కలకండ అచ్చులుం పోతలు పోసియుండెదము పోతనగారి విధాన’ అని కూడా ఉద్ఘాటించారు. అంతేకాదు, తన ‘వేయిపడగలు’లో కొడాలివారిని రాఘవరావు అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేయించారు కూడా. పీకలదాకా స్వాతంత్య్ర సంగ్రామంలో కూరుకుపోయిన ఆంజనేయులు గారు అడపాదడపా రాసిన ఖండకావ్యాల్లో జాతీయోద్యమ సువాసనలు గుబాళించేవి. 1922-25 మధ్యకాలంలో గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేసినందువల్ల ఆంజనేయులు గారు ‘సాహితి’ సంపాదకులుగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యంలో పెద్ద సంచలనం సృష్టించిన చలం కథలను తొలిసారిగా ప్రచురించిన సాహసం, ఘనత కొడాలి వారికే దక్కుతాయి. సాహితిలోనే కాక భారతి, శారద, సఖి, జ్వాల, ప్రతిభ, వీణ, కృష్ణా పత్రికలకు కూడా ఆయన కవితలు రాశారు. అనేక సంకలనాల్లో ఆయన కవితలు స్థానం సంపాదించుకున్నాయి. న్యూయార్క్‌లో ప్రచురితమైన ‘ఇండియా లవ్స్ పోయెమ్స్’లో కాళిదాసు, భర్తృహరి, క్షేత్రయ్య, అల్లసాని పెద్దన వంటి మహాకవుల కవితలతో పాటు ఆంజనేయులుగారి ఖండకావ్యం ‘పెళ్ళి కూతురు’ కూడా ‘టు ది బ్రైడ్’ పేరుతో ప్రచురితమైంది. 27 సంవత్సరాల పాటు స్వాతంత్య్రసమరంలో కష్టాలు భరిస్తూ, ఏడేళ్ళపాటు సి క్లాసు జైలు శిక్షను అనుభవించినా, స్వాతంత్ర్యానంతరం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఆంజనేయులుగారు జీవితాంతం ఆశాజీవే. ఏ పనిచేసినా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన కర్మయోగి ఆయన
– కొడాలి వేంకటాచలం
(ఆంజనేయులుగారి జన్మస్థలం కొడాలిలో నేడు ఆయన విగ్రహావిష్కరణ)

