భాష్యకారుడు (సంపాదకీయం)
చేరా వెళ్లిపోయారు. భాషా శాసా్త్రనికి, సాహిత్య విమర్శకు ఎనలేని సేవ చేసి తెలుగు సమాజపు బౌద్ధికరంగంలో ముఖ్య పాత్ర నిర్వహించిన చేకూరి రామారావు నిరాడంబరమైన జీవితం గడిపి నిష్క్రమించారు. ఆయనతో పోలిస్తే అంగుష్ఠమాత్రులుగా ఉన్నవారు కూడా అందలాలు ఎక్కినా ఆయనను పదవులూ హోదాలూ పలకరించలేదు. ఆయనా అందుకు తాపత్రయపడలేదు. కేవలం అక్షరాలా అక్షరాల మనిషిగా జీవించారు. ఆధునికత, ప్రగతిశీలత, సంయమనం, అపారమైన పాండిత్యం, గాఢమైన కవిత్వ ప్రేమ- ఇన్ని లక్షణాలు ఒకచోట చేరితే చేరా. ఎనభై ఏళ్ల వయస్సులో చేరా మరణం కాలధర్మమే కావచ్చును కానీ, ఆయన అక్షరం ఇంకా సాహిత్య ప్రపంచపు జ్ఞాపకంలో తాజాగానే ఉన్నది. చేరా మరణవార్త అందుకే దిగ్ర్భాంతిని, తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తున్నది.
భాషా శాస్త్రం ఆయన అధికారిక అధ్యయన రంగం. సాహిత్యం ఆయన అభిరుచి రంగం. భాషాశాస్త్ర పరిశోధనలో కొత్త దారి తొక్కి, తెలుగు వాక్య నిర్మాణ రహస్యాలను ఆయన ఆవిష్కరించారు. అమెరికాలోని కోర్మెల్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పరిశోధన చేసిన రామారావు నోమ్ చామ్‌స్కీ సుప్రసిద్ధ ‘ట్రాన్స్‌ఫర్మేషనల్ గ్రామర్ సిద్ధాంత’ పరికరాలను తెలుగు వాక్యానికి అన్వయించి విశ్లేషించారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించిన ఆయన పుస్తకం ‘తెలుగువాక్యం’ తెలుగు వాక్యానికి నవీన వ్యాకరణం వంటిది. దురదృష్టవశాత్తూ, చేరా భాషాశాస్త్ర ఆవిష్కరణలను కానీ, భాషా సంబంధి రచనలను కానీ తెలుగు సమాజం ప్రయోజనవంతంగా వినియోగించు కోలేకపోయింది. ఒకరిద్దరు తప్ప, ఆ రంగంలో ఆయనతో సంభాషించిన వారు కానీ, ప్రధాన స్రవంతి చర్చలలోకి ఆ అంశాలను తీసుకువచ్చినవారు కానీ లేకపోయారు.
ఆధునిక తెలుగువాక్యాన్ని చేరా వ్యవహర్తల సంభాషణల నుంచి, ప్రసిద్ధ వచన రచనల నుంచి నమూనాలుగా తీసుకుని విశ్లేషణలు, వ్యాఖ్యలు చేశారు. రాసే తెలుగుకి, మాట్లాడే తెలుగుకి అంతరం ఉండి తీరుతుందని, రాసే భాష ప్రయోజనాలు భిన్నమయినవని, బౌద్ధిక వచనం సూటిగా అలంకార రహితంగా ఉండాలని ఆయన వాదించేవారు. నిర్విచక్షణగా ఆలంకారిక వచనం కానీ, కవిత్వ వచనం కానీ ఉపయోగించకూడదని చెప్పేవారు. చేరా వచనశైలి శాస్త్ర వచనానికి ఉదాహరణ ప్రాయంగా ఉండేది. వాక్యనిర్మాణానికి సంబంధించి తన శాసీ్త్రయ సూత్రాలనే చేరా వచన కవిత్వ విశ్లేషణకు కూడా వినియోగించుకున్నారు.
తెలుగు సాహిత్య ప్రపంచంతో నిత్యసంబంధంలో ఉన్నప్పటికీ, చేకూరి రామారావుకు విస్తృతమైన ప్రసిద్ధిని అందించింది ఆయన ‘చేరాతలు’ కాలమ్. అంతకు ముందే నగ్నముని ‘కొయ్యగుర్రం’ దీర్ఘకవితను ‘ఆధునిక మహాకావ్యం’ అని చేరా అభివర్ణించడంపై పెద్ద చర్చ జరిగింది. 1986 నుంచి 1994 దాకా ఎనిమిదేళ్ల పాటు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ఆయన నిర్వహించిన ‘చేరాతలు’ కాలమ్ నాటి సాహిత్యలోకంలో ఒక సంచలనం. ప్రధా నంగా సమకాలిక కవిత్వ విశ్లేషణగా సాగిన ఆ కాలమ్, కొత్తగా రాస్తున్న కవులకు ప్రోత్సాహ కరంగా ఉండేది. రూపరీత్యా కవిత్వ నిర్మాణ పద్ధతిని వ్యాఖ్యానిస్తూ చేరా రాసిన వ్యాసాలు, అప్పటికి తెలుగు సమాజానికి అలవాటైన వస్తు విమర్శకు పూర్తి భిన్నమైనది. చేరా ప్రగతిశీల అభిప్రాయాలు కలవారని, ప్రజావ్యతిరేక కావ్యవస్తువును సమ్మతించేవారు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కానీ, కవితా నిర్మాణం మీద కేంద్రీకరించిన తీరు ఆయనకు ‘రూపవాది’ అన్న విమర్శను తెచ్చిపెట్టింది. వస్తువుతో ఏకీభావం ఉన్నప్పుడు, విమర్శించ వలసింది రూపాన్నే కదా- అని ఆయన సమాధానం. రాజకీయంగా, సాహిత్యోద్యమాల పరంగా కీలకమయిన కాలంలో చేరాతలు, పదునైన వ్యక్తీకరణ, మునుపటి కంటె భిన్నమయిన కవితానిర్మాణం చేయగలిగిన కవి తరాన్ని, తరాల్ని ఆవిష్కరించడానికి దోహదం చేశాయి. కవిత్వం రాయడానికే కాదు, కవిత్వాన్ని ఆనందించడానికి కూడా కొంత శిక్షణ, సహాయమూ కావాలని చేరాతలు నిరూపించాయి. తొలి అడుగులు వేస్తున్న కవులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, వారి కవిత్వాన్ని అర్థం చేసుకోగలిగిన పాఠకులను కూడా అవి రూపొందించాయి.
చేరాతలు కాలమ్ చేరాకు ప్రఖ్యాతితో పాటు, అనేక సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. ఆయన కాలమ్‌లో కనిపించిన కవులకు సాహిత్యరంగంలో ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో, చేరా ఎంపికపై విమర్శలు వచ్చాయి. తన నిర్మాణ సూత్రాలను అన్వయించి వ్యాఖ్యానించడానికి అనువైన పాఠ్యాలు కావడం వల్లనేమో, చేరా సీ్త్రవాద కవిత్వానికి పెద్ద పీట వేశారు. వస్తువు మంచిచెడ్డల జోలికి పోకపోయినా, ఆయన చేసిన రూపవిమర్శ కూడా ఆ ధోరణి కవిత్వానికి ఆసరాగా నిలిచింది. విప్లవ, దళితవాద కవులను కూడా చేరా అప్పుడప్పుడు పరామర్శించారు. ఏ కోవలోకీ చేరకుండా ఉన్న కవులను కూడా ఆయన వారి వ్యక్తీకరణ బలాబలాల ప్రాతిపదికన తరచు కాలమ్‌లో పరామర్శించారు.
చేరా ఆసక్తులు ఆధునిక వచన కవిత్వానికి మాత్రమే పరిమితమైనవి కావు. చిన్ననాడు స్వయంగా కవి అయిన చేరా, కవిత్వం మీద గాఢమైన అభిమానంతో తన సర్వశక్తులను కవిత్వ విమర్శ మీద కేంద్రీకరించారు. భాషాశాస్త్రంతో పాటు, ఛందస్సు కూడా చేరాకు ఇష్టమ యిన రంగం. ముత్యాల సరం మీద, వచనపద్యం లక్షణాల మీద సుదీర్ఘమైన చర్చలు చేశా రు. పత్రికలకు పనికివచ్చే ‘ఇంగ్లీషు-తెలుగు పత్రికా పదకోశం’ కూడా ఆయన నిర్మించారు. నేటి సమాచార సాధనాల్లో ఉపయోగించే తెలుగుని ఆయన నిశితంగా పరిశీలించేవారు.
2003 దాకా పదహారు పుస్తకాలు (అధికం సాహిత్య విమర్శే) ప్రచురించిన చేరాను ఖమ్మం సాహితీమిత్రులు (సాహితీ స్రవంతి) 2004లో ఆయన 70వ జన్మదినం సందర్భంగా ఘనంగా సన్మానించారు. దీర్ఘకాలం తెలుగు భాషా సాహిత్య వేదికల మీద వెలిగిన చేరా, పదేళ్ల నుంచి తెరచాటుకు వెళ్లిపోయారు. అనారోగ్యం ఆవరించిన మాట నిజమే కానీ, ఆయన బహిరంగ జీవిత నిష్క్రమణకు అదొక్కటే కారణం కాదు. కవిత్వపు సరిహద్దులు విస్తరింపజేసినందుకు తన కృషి మీద ఆయన సంతృప్తిగానే ఉన్నారు. కానీ ‘చేరాతల’కు లభించిన కొన్ని ప్రతిస్పందనలపై ఆయన నొచ్చుకున్నారు. శేష జీవితానికి ఒక కొత్త ప్రయోజనాన్ని, కొత్త సంకల్పాన్ని చెప్పుకుని నిశ్శబ్దంలోకి జారిపోయారు. కవిత్వంతో తన రొమాన్స్ ముగిసిందని, అది దారితప్పిన ప్రయాణమని, భాషా వ్యాకరణాల అధ్యయనంలో పూర్తికాలం వెచ్చించాలనుకుంటున్నానని పదేళ్ల కిందట చేరా బహిరంగ ప్రకటనే చేశారు. ఆ కృషి ఎంత వరకు సాగిందో ఇంకా తెలియవలసి ఉన్నది.
మన చేరా మాస్టారు – ఓల్గా

తెలుగు రచయితలందరికీ చేరా గారితో తమవైన ప్రత్యేకమైన అనుభవాలు ఉండి ఉంటాయి. ఆయన నిత్య జీవితంలో స్నేహితులతో ఎంతో ప్రజాస్వామికంగా వ్యవహరించేవారు. అది ఇంకొకరికి సాధ్యం కాదు. అరుదైన వ్యక్తులు వెళ్ళిపోతుంటే జాతికి కలిగేలోటు తీర్చలేనిది.
గత శతాబ్ది చివరి రెండు దశాబ్దాలు (1980లు, 1990లు) సీ్త్రవాద సాహిత్య వికాస దశాబ్దాలు. ఆ వికాసంలో ప్రధాన పాత్ర చేకూరి రామారావు గారిది. సీ్త్రవాద కవిత్వాన్ని అర్థం చేసుకో నిరాకరిస్తున్న అనేక మంది కవుల, మేధావుల, విప్లవకారుల ఆలోచనలను సరియైున దారిలో పెట్టడానికి ఆయన విమర్శలు ఉపయోగపడ్డాయి. కవయిత్రుల కవిత్వం అచ్చవగానే ఆ తాజాదనాన్నీ, వస్తు శిల్పాల కొత్తదనాన్నీ ‘చేరాతలు’ రాసి సాహిత్య ప్రేమికులకు పంచిపెట్టే వారు. రామారావు గారి చేరాతల చేయూత లేకుంటే ఆ దశాబ్దాల నడక సీ్త్రవాదులకు మరింత కష్టమై ఉండేది. ఆ రోజుల్లో కవిత్వం కథలు రాయటం మొదలుపెట్టిన కవయిత్రులందరికీ ఆప్తమిత్రుడు చేరా.
ఔను, ఆయన చాలా గొప్ప భాషా శాస్త్రవేత్త. భాషా శాస్త్రంలో ఆయనతో దీటుగా శాస్త్ర చర్చలు చేయగలవాళ్లు అతి తక్కువ మంది. సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారు. విశ్వవిద్యాలయ ఆచార్యుడు అందంగా, హుందాగా, ఎదుటివారి గౌరవాన్ని కమాండ్ చేయగలిగిన వ్యక్తి. కానీ నిష్కల్మషమైన మనసుతో, మాటతో, చిరునవ్వుతో అందరినీ స్నేహితులుగా చేసుకునేవారు. ఒకటి రెండు కవితలు రాసిన వాళ్లు కూడా వచ్చి ఆయనతో సమానస్థాయిలో కూర్చుని మాట్లాడగలిగిన వాతావరణాన్ని ఆయన కల్పించారు. ఆయనతో స్నేహం అంటే పోసుకోలు కబుర్లు కాదు. లేనిపోని ప్రగల్భాలు కాదు. అసూయలూ, ఆడిపోసుకోవడాలూ కాదు. నేర్చుకోవటం. కవిత్వాన్ని ఎలా చదవాలో, ఎలా ఆనందించాలో, ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోవటం. తెలుగు వాక్యరీతుల సొగసుల్ని అర్థం చేసుకోవటం. తెలుగు వ్యాకరణమంటే భయం పోగొట్టుకోవటం. తెలుగు ఛందోరీతుల మీద మమకారం పెంచుకోవటం. ముత్యాల సరాన్ని ముద్దాడేటంతగా ప్రేమించటం. ఇవన్నీ నేను ఎంతో కొంత చేరా గారితో స్నేహంలో నేర్చుకోగలిగాను. నాలాగే ఎంతో మంది నేర్చుకుని ఉంటారు. అధ్యాపకుడిగా ఆయన బోధన నేను వినలేదు. కానీ ఒక సాహితీ మిత్రునిగా ఆయన నాకు ఎంతో బోధించారు. అలాగే సీ్త్రవాదం గురించి ఓపికగా ఎంతో విన్నారు. నేనిచ్చిన పుస్తకాలు చదివారు. దాదాపు నలభై సంవత్సరాల కాలంలో ఆయన మీద గౌరవం పెరుగుతూ వచ్చింది. చేరా గారితో స్నేహం చెయ్యటమంటే ఆయన కుటుంబంలో ఆప్తులుగా మారిపోవటమే. రంగనాయకి గారు, అమ్మాయి సంధ్య కూడా మమ్మల్ని ఎంతో స్నేహంగా చూసేవారు. ఆయన మనవడు హేమంత్ కూడా మాకు దగ్గరయ్యాడు.
వ్యక్తిగతంగా ఆయన నాకు చేసిన మేలు మర్చిపోలేనిది. నాకేదో అపకారం జరుగుతుందని ఒకరోజు సాయంత్రం యూనివర్సిటీ నుంచి జూబ్లీహిల్స్‌కు బస్సులో వచ్చి నాకు జాగ్రత్తలు చెప్పి, అసలు పరీక్షా సమయంలో పక్కనే పెద్ద అండగా ఉండి నాకు ధైర్యాన్నిచ్చారు. నాకూ, కుటుంబరావుకూ మర్చి పోలేని మహోపకారం ఆయాచితంగా చేశారు. ఆ తరువాత దాని గురించి ప్రస్తావనే లేదు. నేనింత సహాయం చేశాను అని పదే పదే గుర్తుచేసే చిన్న మనసు కాదాయనది. నిజంగా 1980వ దశకం చివరి సంవత్సరాలలో నాకు గొప్ప వ్యక్తుల, మేధావుల స్నేహం లభించింది. నేను ‘ఈనాడు’ ఆఫీసులో పనిచేస్తుండేదాన్ని. పక్కనే ఉన్న ఒక భవనంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు పనిచేసింది. అక్కడికి చేరా వచ్చేవారు. కేతు విశ్వనాథరెడ్డి గారు, చలసాని ప్రసాదరావు గారు, శివలింగప్రసాద్ గారు, నేనూ, కుటుంబరావు తరచూ అక్కడ కలిసేవాళ్ళం. అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు సిలబస్ గురించి చర్చలు నడిచేవి. సాహిత్య, సామాజిక, రాజకీయ విషయాల గురించిన చర్చలు జరిగేవి. రామారావు గారు రాసిన పాఠాలు నిజంగా మార్గదర్శకాలు. సావిత్రి గారి కవితను ఆయన వివరించి విశ్లేషించిన తీరు ఎంతో ఆధునిక మైనది. మాట్లాడటంలో, వివరించటంలో, స్నేహం చెయ్యటంలో, ఒక సంప్రదాయ ధోరణిని ఒదిలించుకోటానికి, కొత్త భావాలనూ, రీతులను అర్థం చేసుకోటానికీ రామారావు గారు కనిపించకుండా నాపై వేసిన ప్రభావం ఎంతో మాటల్లో చెప్పలేను.
1983లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కోసం ఎగ్నెస్ స్మెడ్లీ కథలను ‘సామాన్యుల సాహసం’ పేరుతో అనువదించాను. అను వాదంలో అది నా తొలిప్రయత్నం. సంపాదకుడుగా చేరా ఉన్నారు. కథలు పంపిస్తే తప్పులుంటే ఆయన వ్యాఖ్యలు రాసి, సవరించి తిరిగి పంపించవచ్చు. కానీ ఆయన ఒక రాత్రంతా నిద్ర లేకుండా నేనా కథలు చదువుతుంటే విని వెంట వెంటనే స్పందించారు. నేను, గీత, కె.లలిత, కుటుంబరావు ఆ రోజు లలితా వాళ్ళింట్లో గడిపిన రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేను. రామారావు గారు ఇచ్చిన కొన్ని సలహాలు నాకు ఇవాళ్టి వరకూ ఎన్ని అనువాదాలో చేయగల శక్తినిచ్చాయి. సాహిత్యం, రాజకీయాలు, సాంఘిక శాస్త్ర విషయాలు- ఎంత క్లిష్టమైన వస్తువునైనా తేలికగా అనువాదం చేయగలుగుతున్నాను.
2002లో మా ఇద్దరికీ మహాభారతంలో విరాటపర్వం చదవాలనే కోరిక కలిగింది. కలిసి చదివితే ఇంకా ఎక్కువగా ఆస్వాదించవచ్చు ఆనందించవచ్చు అనుకున్నాం. రెండు నెలల పాటు రోజూ ఉదయం తొమ్మిది గంటలకు చేరా గారింటికి వెళ్ళేదాన్ని. ఆయన, హేమంత్ స్కూలుకి వెళ్ళాక తన పనులు ముగించుకుని ఉండేవారు. రెండు గంటల పాటు తిక్కన గారి కవిత్వపు రీతులలో, లోతులలో మునిగితేలేవాళ్ళం. తిక్కన వాడిన భాష గురించి ఎన్ని విశేషాలు చెప్పేవారో. నేను గమనించి చెప్పిన కవితా విశేషాలనూ ఆయన ఆనందించి నన్ను మెచ్చుకునేవారు. వేగుంట మోహన ప్రసాద్ గారి కవితలను అర్థం చేసుకోవటం నేర్పింది కూడా మాస్టారే. తెలుగు రచయితలందరికీ చేరా గారితో తమవైన ప్రత్యేకమైన అనుభవాలు ఉండి ఉంటాయి. ఆయన నిత్య జీవితంలో స్నేహితులతో ఎంతో ప్రజాస్వామికంగా వ్యవహరించేవారు. అది ఇంకొకరికి సాధ్యం కాదు. అరుదైన వ్యక్తులు వెళ్ళిపోతుంటే జాతికి కలిగేలోటు తీర్చలేనిది.
రెండు మూడు సంవత్సరాలుగా చేరాగారు మరింత పరధ్యానంగా, డిటాచ్‌డ్‌గా కనిపిస్తూ వచ్చారు. ఐతే ఆయన సాహిత్య ప్రపంచంతో తన సంబంధాన్ని మాత్రం ఒదులుకోలేదు. ప్రతి రోజూ నగరంలో జరిగే సభలకు హాజరయ్యేవారు. అందరినీ చూసేవారు. సభలో కాసేపు కూచుని వెళ్లిపోయేవారు. వేదిక మీద కూర్చుని విలువైన మాటలు మాట్లాడాల్సిన వ్యక్తి సభలో ఎక్కడో ఓ చోట నిశ్శబ్దంగా కూర్చుని వెళ్తున్నారే అని బాధ కలిగేది. కానీ ఆయన ఈ ప్రపంచంలో ఒక డిటాచ్‌మెంట్‌ని అభ్యాసం చేసి తను వెళ్ళిపోయే మార్గాన్ని సుగమం చేసుకున్నట్లున్నారు. ధ్యానంలో అనాయాసంగా ఈ ప్రపంచాన్ని దాటి అవతలి గట్టుకు చేరుకోగలగటం ఆయన జీవిత గమనం లాగానే గౌరవంగా హుందాగా జరిగిందనిపిస్తుంది.
– ఓల్గా

