పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్
ఫాతిమా రిఫాత్ ఈజిప్ట్ లోని సంచలన రచయిత్రి .అలీఫా రిఫాత్ అనే మారుపెరుతోనే రచనలు చేసింది .గ్రామీణ ప్రాంతాలలో సెక్స్ లో స్త్రీల డైనమిజాన్ని ,బాంధవ్యాలను కోల్పోవటాన్ని రచనల్లో ప్రతిఫలింప జేసింది .మతం లో ఇవి తీవ్ర ధోరణులే అయినా ఆమె కు మతం పట్ల పూర్తీ విశ్వాసమే ఉంది .ఆమె రాసిన కధలలో పితృస్వామ్య వ్యవస్థలో మగ వాళ్ళ బాధ్యతా రాహిత్యాన్ని ,మతం పట్ల వారి నిబద్ధత లేని జీవిత విధాలను ,స్త్రీల యెడల చూపే అలసత్వాన్ని ఎత్తి చూపింది .తనకుటుంబ సభ్యుఅల నుండి ఇబ్బందులు రాకుండా ఉండటానికే మారు పేరుతో రాసింది .
ఫాతిమా అబ్దుల్లా రిఫాత్ 1930 జూన్ అయిదున ఈజిప్ట్ లోని కైరో లో జన్మించింది .తండ్రి ఆర్కిటెక్ట్ .తల్లి గృహిణి .మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వారుగా ఆమె కుటుంబీకులు గొప్పలు చెప్పుకొనే వారు .గ్రామీణ ప్రాంతం లో బాల్యం గడవటం వలన ఆమె కధలన్నిటికీ అదే నేపధ్యం అయింది .తోమ్మిదవ ఏటనే కవిత్వం రాసింది .అందులో గ్రామీణ స్త్రీల నిస్పృహను తెలియ జేసింది .ఇది చదివిన కుటంబం లోని వారందరూ ఆమెకు శిక్ష విధించారు .మిశ్రాల్ జదీడా ప్రైమరీ స్కూల్ లో చదివి ,కల్చరల్ సెంటర్ ఫర్ వుమెన్ లో ఇంటర్ చదివింది .కైరో లోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ లో 1946నుండి మూడేళ్ళు ఇంగ్లీష్ భాష అభ్యసించింది .ఫైన్ ఆర్ట్స్ కాలేజిలో చేరి చదువుదామని అనుకొంటే తండ్రి బలవంతాన పెండ్లికి ఒప్పించిఆమె కజిన్ అయిన పోలీస్ ఆఫీసర్ కిచ్చి పెళ్లి చేశాడు .
ఈజిప్ట్ సంస్కృతిలో మగవాళ్ళే రచయితలూ గా ఉండాలి అనే సంప్రదాయం ఉంది .ఆమె భర్త భార్యను మారు పేరుతోకధలు ,కవితలు రాయటానికి ఒప్పుకొని ప్రోత్సహించాడు కూడా .1955-60కాలం లో ఆమె రాసిన వన్నీ ప్రచురితమయ్యాయి .తర్వాత భర్త పెట్టిన తీవ్ర ఒత్తిడి తో రాయటం ఆపేసింది .14 ఏళ్ళు ఏదీ రాయకుండానే ఉండిపోయింది ఈ కాలం లో సాహిత్యం ఖగోళం ,చరిత్రలను అధ్యయనం చేసింది .తన సమాజం లో జరుగుతున్న అన్యాయాలకు మౌన ప్రేక్షకురాలిగా ఉండిపోవటం ఆమెకు అసాధ్యం గా ఉంది .1973లో ఆమెకు తీవ్రమైన జబ్బు చేసింది .భర్త మనసు మార్చుకొని మళ్ళీ రాయమని ప్రోత్సహించాడు .ఆ ప్రోద్బలం తో ఉత్సాహం గా కధలు నవలలు రాసి ప్రచురించింది .ఫాతిమా రాసిన ‘’మై వరల్డ్ ఆఫ్ అన్ నోన్ ‘’కద విశేషం గా ప్రాచుర్యం పొందింది .1979లో భర్త మరణించాడు .భర్త కు తరచూ జరిగే బదిలీలలో గ్రామ జీవితాన్నే హాయిగా అనుభవిస్తూ ,అతని మరణం తర్వాతకూడా ఈజిప్ట్ లోనే ఉండిపోయింది .
1981లో మక్కా కు హాజీ పవిత్ర యాత్ర చేసింది .ఇంగ్లాండ్ టర్కీ జర్మని మొరాకో , ఆస్ట్రియా మొదలైన వాటిని తిరిగి చూసింది .ఫెడరేషన్ ఆఫ్ ఈజిప్షియన్ రైటర్స్ ,షార్ట్ స్టోరి క్లబ్ ,దార్ –అల్ –ఉదాబా మొదలైన సాహితీ సంస్థలలో జీవిత కాలం అంతా సభ్యురాలుగా ఉంది .1984లో ఇంగ్లాండ్ లో జరిగిన మొదటి ‘’అంతర్జాతీయ మహిళా పుస్తక మహోత్సవం ‘’కు వెళ్ళింది ..అక్కడ ఈజిప్ట్ లోని మహిళా హక్కుల గురించి ,అక్కడ ఉన్న బహు భార్యాత్వం గురించి గంభీరం గా ప్రసంగించింది .1984లో ఫాతిమా ‘’ఎక్సేలేన్సి అవార్డ్ ‘’ను మోడరన్ లిటరేచర్ అసెంబ్లీ ‘’నుండి పొందింది .అరవై అయిదేళ్ళ వయసులో ఫాతిమా రిఫాత్ 1996 జనవరిలో మరణించింది .ఆమెకు ముగ్గురు మగ పిల్లలు .వివిధ భాషల్లో ఆమె రచనలు వందకు పైగా అనువాదాలైనాయి .
ఫాతిమా రాసిన వన్నీ అరెబిక్ భాషలోనే రాసింది .మొదట్లో శృంగారం రంగరించే ఎక్కువ గా రాసింది .జేనీస్ జాన్ డేవిస్ అనే అనువాదకుడి తో పరిచయం అయిన తర్వాత అతని సలహా తో సాంఘిక సమస్యలపై,మరింత సరళం గా వాడుక భాషలో రాయటం మొదలెట్టింది .ఆమె నవలలు ,కధలు ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, జెర్మని ,స్వీడిష్ భాషల్లోకి తర్జుమా అయ్యాయి .ఇంగ్లీష్ లోకి అనువదింప బడిన ఆమె చిన్న కధలు మహా గొప్పగా ప్రచారమై మంచి పేరును గుర్తింపును తెచ్చి పెట్టాయి .ఈజిప్ట్ లోని మిగతా స్త్రీ వాద రచయిత్రులకు భిన్నం గా ఫాతిమా మాతా చారం పాటించే స్త్రీల గురించే ఎక్కువగా రాసింది .తన జీవిత చరిత్రలో తండ్రి తనను ప్రేమగా చూడ లేదని అందుకే సాహసం తో కొత్త మార్గాన్ని పట్టాల్సి వచ్చిందని చెప్పింది .తండ్రులు కూతుళ్ళ యెడల ప్రవర్తించే హింసా విధానం పై రాయాల్సి వచ్చింది అన్నది .మగాళ్ళకు కావాల్సింది జల్సాయే నని గుర్తించానని అందుకే తన రచనల్లో ఆడవారిపై మగవారు ప్రేమ చూపించాలనే సందేశం ఉంటుందని చెప్పింది .భార్యా భర్తలు పవిత్ర భావన తోనే శృంగార కార్యం జరుపుకోవాలని కోరింది .అప్పుడే భగవంతునిపై విశ్వాసం పెరుగుతుందని చెప్పింది .
ఈజిప్ట్ లోని పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలను భవిస్తున్న ఒంటరితనాన్ని ఆవ హేళలను,బాధలను కధల్లో చిత్రించింది .ఈ కధల్లో సెక్స్ ,చావు ,పెళ్లి మాస్టర్బెషన్ ,జననేంద్రియ వర్ణన ,ప్రేమ ,పెళ్ళికాని యువతుల్లో గర్భధారణ,,వితంతు వ్యధ మొదలైన తార్కిక సమస్యల ను వివరించింది .ఆమె కాలం లో వీటిని గురించి మాట్లాడమే నేరం. బరి తెగించి ఆడది ప్రవర్తిస్తే సమాజం పతన మవుతుందని భావన ఉండేవి .స్త్రీల సెక్స్ కోరికలను అణచి వేయటాన్ని ఆమె వ్యతిరేకించింది .కాని తాను మాత్రం చక్కని కుటుంబ వ్యవస్థలో సనాతన మత విశ్వాస జీవితమే ఆదర్శం గా గడిపింది .కురాన్ పితృస్వామ్యాన్ని ప్రబోదించినా మతానికి వ్యతిరేకం గా ‘’మ్రుగాడు ‘’సంచరించటం ఆమె హర్షించలేదు .మతాన్ని అడ్డం పెట్టుకొని ఆడదాని బతుకు బుగ్గి చేయరాదని నిష్కర్ష గా చెప్పింది .ఇన్ని చెప్పినా ఆమె కధల్లో వివాహాతేర సంబంధాలు మచ్చుకైనా కని పించవు .నీతి నిజాయితీ భార్యా భర్తలిద్దరికీ ఉండాలనే బోధించింది .’’డిస్టంట్ వ్యూ ఆఫ్ ఏ మినరెట్ ‘’ ‘’బాహియ్యా అనే ఆమె కదలు జగత్ ప్రసిద్దాలైనాయి . మొత్తం మీద ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతీ లో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి ,ఎలుగెత్తి చాటి ,సరిదిద్దుకోమని ముందుకు వచ్చి ధైర్యం గా చెప్పి ,రాసిన అలీఫా రిఫాత్ అభి నందనీయురాలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-14-ఉయ్యూరు

