శ్రమ నీ ఆయుధమైతే విజయం బానిస అవుతుందన్న నానుడికి నల్లగొండ చేనేత కార్మికుడు శ్రీనాథ్ నిలువెత్తు నిదర్శనం. చేనేత రంగంలో కూడు దొరకక ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నా, ఉపాధి కరువై, కనీస కూలీ గిట్టుబాటు కాని గడ్డు పరిస్థితులు ఉన్నా ఈయన వెనుకంజ వేయలేదు. డిగ్రీ చదువుకున్నా కులవృత్తిపై అచంచల విశ్వాసంతో ముందుకు కదిలి ఆ రంగంలో తనదైన ముద్ర వేశాడు. విశ్వ వేదికలపై తన కళా నైపుణ్యాన్ని చాటి అనేక బహుమతులు గెలుచుకుని రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కుటుంబాలకు భరోసా కల్పించాడు. ఆయన సాధించిన విశేషాల సహాహార మే ఈ కథనం.
ప్రకృతి రంగులతో ఓ అందమైన పట్టుచీరను తయారుచేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకుని తన నైపుణ్యాన్ని చాటాడు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఇడెం శ్రీనాధ్. ఈయనది నిరుపేద చేనేత కుటుంబం. తన తాత తండ్రుల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. శ్రీనాధ్ తల్లిదండ్రులు ఇడెం బిక్షపతి, సత్తమ్మలు సైతం చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగించారు. రఆ కాలంలో తాను ఒకవైపు చదువుకుంటునే తీరిక సమయంలో తమ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ చేనేత పనిని అలవరచుకున్నారు. డిగ్రీ వరకు చదివిన ఆయన చేనేత వృత్తినే ఉపాధిగా మలచుకున్నారు.
కెనడా హస్తకళల ఫౌండేషన్ సహకారంతో…….
2006లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ శ్రీనాధ్ జీవితాన్ని మార్చింది. అక్కడ కెనడా దేశానికి చెందిన హస్థ కళల ఫౌండేషన్ వారితో శ్రీనాధ్‌కు పరిచయం ఏర్పడింది. ప్రకృతి రంగులతో డబుల్ ఇక్కత్ పద్దతిలో రూపొందించిన వసా్త్రలను చూసి ఫౌండేషన్ ప్రతినిధులు అబ్బురపడ్డారు. కెనడాలో నిర్వహించే చేనేత వసా్త్రల పోటీకి ఆయనను ఆహ్వానించారు. ప్రకృతి రంగులతో నాలుగు నెలల పాటు శ్రమించి 9రకాల పూల డిజైన్‌లతో మొత్తం 854 పూల డిజైన్‌లు 33మెట్లతో ఓ అద్బుతమైన పట్టుచీరను రూపొందించి దాన్ని కెనడాలో జరిగిన పోటీకి పంపించాడు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది హస్తకళాకారులు పాల్గొన్న పోటీలో శ్రీనాధ్ రూపొందించిన డబుల్ ఇక్కత్ వస్త్రం ప్రధమ స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఇక్కడ జరిగిన జాతీయ హస్థకళల పోటీకి సైతం పాల్గొన్నాడు. అక్కడ కూడా విజయం వరించింది. శ్రీనాధ్ రూపొందించిన వస్త్రం 2011 జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. జులై 1న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి చేతుల మీదుగా శ్రీనాధ్ జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నాడు. పురస్కారంతోపాటు లక్ష రూపాయల నగదు బహుమతిని పొందాడు. మారుమూల కుగ్రామంలో ఓ చేనేతకార్మికుడు రూపొందించిన వసా్త్రనికి జాతీయ స్థాయి పురస్కారం రావడం పట్ల గ్రామప్రజలు, చేనేత కార్మికులు శ్రీనాధ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ప్రభుత్వ పథకాలు నేరుగా కార్మికులకే అందాలి
– ఇడెం శ్రీనాధ్
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పూర్తిస్థాయిలో కార్మికులకు అందడం లేదు. చేనేత రంగంలో ప్రతిభ ఉన్న కళాకారులను ప్రభుత్వం మరింత ప్రొత్సహించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు సైతం నూతన డిజైన్‌లను రూపొందిస్తే చేనేత వసా్త్రలకు మరింత ఆధరణ పెరుగుతుంది. కార్మికులు రూపొందించిన వసా్త్రలకు ప్రభుత్వ సైతం మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఎగ్జిబిషన్‌లు నిర్వహించి గ్రామీణ స్థాయి కళాకారులకు మరింత ప్రొత్సాహం అందించాలి.
– మధుసూదన్, నల్లగొండ

