సరిగ్గా వంద సంవత్సరాల కిందట ఇదే రోజున మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇంతటి మహాయుద్ధం, ఇంతటి విధ్వంసం మునుపటి చరిత్రలో లేవు. తెలుగు కవిత్వంలో నిక్షిప్తమైన ఆ యుద్ధ ప్రకంపనలు ఈ రెండు ఖండికలు!
దించు లంగరు
దించు లంగరు దీర్ఘయుద్ధం
ధర్మపక్షము ముల్లు చూపెను
నరుల పీనుగు పెంట పోకల
నాటి వెలయును శాంతి వృక్షము.
పాత సంధులు పాతిపెట్టుము
యుద్ధముల కవి ఉనికి పట్టులు
లోక మంతయు ఏకమై
యుద్ధమునె మారణము చేయును.
వచ్చెనిది బంగారు కాలము
వాంఛ లెల్లను తీరు సుజనుల
కాంగిలేయుల ధర్మ రాజ్యము
జ్ఞానమును స్వాతంత్య్రమిచ్చుచు
సంతతము వర్థిల్లు గావుత!
– గురజాడ అప్పారావు
(‘కృష్ణాపత్రిక’ 1915 అక్టోబరు 30)
మానవులందఱు మహిచరు లగుటన్- మహినే యుద్ధ మొనర్తురు గా!
ఈ నవాహవంబున నన జలచరు-లింక వియచ్చరులై రహహా!
పూనికి నందందే పోరుం బొరిఁ-బొనరింతురు వేఁగులు, తీఁగెల్
గానఁబడమి నవి వేఁ గాకస మిటఁ-గాంచ మహాయుద్ధ మిదె కదా!
జయాపజయములు దైవికములె యైు-సమకొనుఁదుద, నిప్పటి యూహల్
ప్రయోజనము లేనివి యనుచుం జె-ప్పనౌ; నైన, నే నుడివెద సం
దియ మేటికిఁ? గైజరున కందఱుం-దెలియఁగ శత్రులు, మిత్రులుగా
నయమున న్జార్జిచక్రవర్తికి-న్జయము సిద్ధమని యననగుఁ గా!
సాయపడిరి యాస్ర్టియావారి కని-జర్మను; లింగ్లిషువా రన్నన్
దోయము వా రగు ప్రాన్సువారికిని-దుర్బలులగు బెల్జియనులకున్;
న్యాయం బీయది యగుట నందఱు స-హాయులైరి ఈ పక్షమునన్;
శ్రేయం బిదె కద దైవము దోడగు-సిదము జయ మాంగ్లేయుల కౌ
హైందవు లాంగ్లేయులతోఁ గూడి మ-హాహవముం జేయుటఁ జూడన్
బొందగుఁ గృష్ణార్జునులు గూడుకొని-పోరికిఁ దొడఁగినయ ట్లహహా!
సందేహంబుం గలదే జయ మిట-సమకొనుటకు, ధర్మం బెందుం
బొందపడు నొ యందే మేల్గెలు పగుఁ; బోలుం గద శాంతియె మేలై
అప్రార్థితు లయ్యును సమయజ్ఞత-నాంగిలేయులకు సహాయులునై
దీప్రప్రవిదారణముఁ జలుపుటం-దెలిసి వారలు కృతజ్ఞతతో
క్షిప్రముగ నె తమతో సమానులుగఁ-జింతిం చి సమస్వాతంత్య్రం
బే ప్రసిద్ధముగ నొసఁగవలయుటన్-హిత మిది హైందవులకు నెందున్
తన దొరునిది బలతారతమ్యమును-దలఁపక, వృషభము వ్యాఘ్రముతో
ననిసే సి వినాశముఁగాంచె; నటులె-యక్కట! యేనుఁ గహా!
ఘనమగు భల్లూకంబు న్మార్కెనె, కనునె గెలుపు? గడు గాసిపడున్,
గనుఁగొన నఖిల మృగంబుల సింహము-ఖ్యాతిగ గెల్చి జయముఁగాంచున్
ఫ్రెంచివార లింగ్లీషువారలును-బ్రేముడిఁ గూడుటఁ జూడఁగ
త్ర్పాంచిత చందన కర్పూరంబులు-వలనొప్పఁగ బొందినయట్లౌ
గాంచన్ జర్మను లాస్ర్టియనులు వే-డ్కం గూడుట రసమును బులుసున్
మించి కలసినట్లగపడు నెవరికి;-మేలగు రష్యావారె ధ్రువుల్
సర్వ విధంబుల స్వతంత్రశక్తిని- జనుట బ్రిటిషు ప్రభుతయె సూర్యుం;
డుర్విఁ బ్రజాప్రభుతచేతఁ జంద్రుని-యోజం దోఁచును ప్రాన్సు; మహా
గర్వంబునఁ గ్రౌర్యంబున జర్మను-ఖ్యాతిగ నంగారకుఁ డన నౌ;
గుర్వాభము రుష్యా సామ్రాజ్యము;-గొఱలు సర్వియా బుధుభంగిన్
ఆలమునకు మూలంబగు నాస్ర్టియ-యౌ శని; జర్మను పక్షమునం
దాలోచింపక చేరెఁగాన శు-క్రాచార్యుండగుఁ దుర్కీ; వే
యేలా? యాంగ్లేయ ప్రభుత్వ మను-నిద్ధ బలుండు జనార్దనుఁడే
కేల దర్భ గొనె; జపాను రాహువు;- కేతువు బెల్జియ మనఁగ జనున్
నెపోలియనువలెఁ బ్రపంచ జయమున-నెగడఁ గడఁగన ట్లెగ్గె యగున్;
విపులబలు లయిన యాంగిలేయులే-ఫ్రెంచివారితోఁ గలసిరి స
త్కృపాంతరంగులు గావున, వారలు- గేరక చేరినఁగడు లగ్గౌ
నిపుడు విపులకున్ హిత మిది; కైజరె- యెనవయవలె నశోకుని కాంతిన్.
భూమిఁ గంసునికి గెలుపబ్బెనె శ్రీ- పురుషోత్తముని కె గొల్పొదవెన్;
భీమశక్తి శల్యునికిన్ జయమయ్యెనె- భీమాగ్రజుండు యుధిష్ఠిరుఁడే
శ్రీమంతుఁడు విజయము హరికృపఁ గనెఁ;- జెందునె కైజరు గర్వితుఁ డా
స్వామి హరికృపన్? ధర్మిష్ఠుండగు- జార్జి చక్రవర్తి విజయుఁడౌ
ఆయనయ సంపన్నుండు న్నీతి-న్యాయ ధర్మ పరిపాలకుఁడు న్
దయావీరుఁ డాయోధనవీరుఁడు-తంత్రావాప విశారదుఁడు న్
గ్రియా ప్రధానుఁడు కైజరు లోఁగొని- కీర్తనీయ శాంతిం జేఁతన్
జయార్జునుం డఁట జయముం బ్రాఁతియె- జార్జి చక్రవర్తి విజయుఁడౌ.
శ్రీ మహామహోపాధ్యాయ నామ బిరుద- రత్న కొక్కొండ వేంకటరత్నశర్మ సముదితం బినరత్నావళ మిది భీమ-భండననివారకము శాంతిభద్రదంబు.
సమర శాంతిరస్తు. సర్వేజనాః సుఖినో భవంతు.
మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నశర్మగారు
(‘ఆంధ్రపత్రిక’ 1915 రాక్షస సంవత్సరాది సంచికనుండి)
