అనుక్షణ శ్రీప్రియం కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం
అమ్మమ్మా ఎన్నేళ్ళ యింది ఒక మంచి సినిమాచూసి? పెద్ద హీరో తో కార్లు లేపకుండా గన్నులు పేల్చకుండా ,భీభత్సం సృస్టించకుండా తీసికూడా .నిన్న మధ్యాహ్నం రెండు గంటలాటకు ,మూడో వారం నడుస్తుండగా మా ముసలావిడా నేను మామనవరాలు రమ్య ఉయ్యూరుల్ దీపక్ మహల్ లో’’దృశ్యం ‘’ సినిమా చూశాం .చూసిన తర్వాత ఏర్పడిన అభిప్రాయమే పై మాటలు .పైత్య ప్రకోపం లేని పరుచూరు బ్రదర్స్ హుందా అయిన స్క్రీన్ ప్లె రాయటం ,సంభాషణలను ప్రతి సందర్భం లోను అత్యంత అర్ధ వంతం గా ఉండటం ,శ్రీ ప్రియ ప్రతి దృశ్యం లోను తన పరిణతిని చూపటం ,వెంకటేష్ ఫామిలీ సినిమాలలో ఈ మధ్య నటిస్తూ ,ఆ అనుభవాన్ని రంగరించి ఇందులో నటించటం ,మీనా జుట్టు విరబోసుకున్నా సరైన అర్ధాంగిగా ఉండటం, పిల్లలిద్దరూ పరిధిలో పక్వనటన ప్రదర్శించటం ,ఫామిలీ సెంటి మెంట్ లో డిటెక్టివ్ కధను అతి నాగరకం గాచొప్పించి ,మానవత్వ విలువల నేపధ్యం గా ,యజమానికి కుటుంబ బాధ్యతా ,పోషణా ,రక్షణా పరమావధిగా ఉండాలని అనుక్షణం గుర్తు చేస్తూ శ్రీప్రియ దర్శకత్వం అందరిని ఆకర్షించింది .సస్పెన్స్ అంతర్వాహినిగా సాగింది .ఒక్క వీరభద్రం అనే పోలీస్ తప్ప అందరూ మంచి మనుషులుగానే ఉన్నారు అతను చూసిన దృశ్యాన్ని వెంకటేష్ అతి రహస్యం గా ,పకడ్బందీగా పోలీస్ స్టేషన్ పునాదుల్లోనే సమాధి చేసి ,అందరిని రాంగ్ ట్రాక్ లో బలే నాక్ గా నడిపించాడు .బ్రాహ్మడు మేక దొంగలు కధలో దొంగలందరూఆవుదూడను మేక అని చెప్పటం వెర్రి బాపడు ఇంతమంది చెప్పింది నిజమే కదా అని నమ్మి మోసపోయి ఆవు పెయ్యను వాళ్ళ పాల పడేసి ఇంటికి చేరటం కద గురటు కొచ్చింది నాకు .వెంకటేష్ తనకు పరిచయం ఉన్న వారందరి హృదయాల్లో ఒకే డేటు లను దృశ్యమానం గా ముద్రించి అదే పలికించి ,పోలీసుల చేత నిజాన్ని కనుక్కోనీకుండా చేస్తాడు .వీరభద్ర పాత్ర దారి బాగా చేశాడు కన్నులతోను ముఖ భంగిమలతోను క్రూరత్వాన్ని భేషుగా చూపించాడు
నదియా పోలీస్ ఐ జి.గా ,దుస్టూడైన ఒక కొడుక్కి తల్లిగా ,’’హర్ మాస్టర్స్ వాయిస్’’ పాత్రలో నిమిత్తమాత్రుడైన సీనియర్ నటుడు నరేష్ ఆమె భర్తగా నటించారు .కొడుకు మిస్సింగ్ కోసం నదియా చేసిన అన్ని ప్రయత్నాలు వ్యర్ధమే అవుతాయి . అందరిది ఒకే మాట .దాన్ని చేదించే ప్రయత్నాలన్నీ విఫలం .దీని వెనక ఏదో రహస్యం ఉందని ఆమె భావన .తనకొడుకు గురించి చెడు కూడా తెలుసు కొన్నది .అయినా థర్డ్ డిగ్రీ ప్రదర్శింప జేసింది స్వయం గా దగ్గరుండి అదీ రాంబాబు అనే వెంకటేష్ అంటే అయిస్టూడూ లంచగొండి అయిన వీరభద్రం తో .చూడలేక బాధ పడతాడు నరేష్ .ఆపే ప్రయత్నం చేయమని ఇజి భార్య కు చెప్పి ఆపే యిస్తాడు .పెద్దపరుచూరి కూడా పోలీస్ హెడ్ గా రాంబాబు విషయం లో సాఫ్ట్ కార్నర్ లో ఉంటాడు. భాద్రాన్ని ‘’జర బద్రం కొడుకో ‘’అని హెచ్చరిస్తూంటాడు .సినిమా అందరితోను పాత్రోచితం గా నటింప జేయించింది శ్రీప్రియ .చంద్ర బోసు పాటలు రాశాడు కాని మ్యూజిక్ హోరులో మాటలే తెలియలేదు .
’’వెనక స్థల సంగీతం ‘’అదే నండి బాగ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కలిసొచ్చింది .అసలు సినిమా చూస్తున్నాము అనే భావన రాదు .మన ఇంట్లో జరిగే సంఘటనకు మనం దృశ్య రూపం లో చూస్తున్నామని పించింది .అది చాలు శ్రీప్రియ దర్శ కత్వ ప్రతిభకు .ఈ సినిమా అందరికి పాఠాలు నేర్పింది .వ్యవస్థలో ఉన్న లోపాలు యువత వెర్రి వేషాలేస్తే వచ్చే ప్రమాదం ,ఆడపిల్ల తనకు జరిగే అపాయాన్ని తలిదండ్రులకు చెప్పక పొతే కలిగే ఫలితం చెప్పి ఎలా కాపాడుకోవాలో తెలియ జెప్పింది .మరో ఆడపిల్ల జోలికి పోకుండా బుద్ధి చెప్పిన ఆ కుటుంబం అత్యంత గుంభన గా కలిసి కట్టుగా ఒత్తిళ్లకు ,రాంగ్ ట్రాక్ లకు లొంగకుండా రహస్యాన్ని కాపాడుకోన్నది .నిజం చెప్పించే ప్రయత్నం లో విఫలమైన ఐ.జి నదియా రాజీనామా చేసి భర్తతో విదేశాలకు వెళ్ళా బోతూ వెంకటేష్ ను ,తమకొడుకు ను గారాబం తో పెంచి ,పట్టించుకోకుండా ,అడిగిన వన్నీ అమర్చి అజమాయిషీ లేకుండా తప్పుచేశామని ఇప్పటికైనా నిజం చెప్పమని ఏడుస్తూ నరేష్ ప్రార్ధిస్తాడు .అప్పుడు వాళ్ళు మనసు విప్పి మాట్లాడారుకనుక ఉన్న విషయమంతా వివరించి చెప్పాడు .తనది చిన్న కుటుంబం అని ,తనకు తన కుటుంబమే ప్రపంచమని ,వారిలో ఏ ఒక్కరికి అపకారం జరిగినా తట్టుకోలేమని ,అందుకే అందరం కలిసి కట్టుగా ప్రవర్తిం చామని నిజం చెప్పాడు .అంతకు ముందు మీనా భర్త ను పోలీసులు ఇంత క్రూరం గా ప్రవర్తించిన తర్వాతనైనా నిజం చెబుదామని అన్నది .అప్పుడు వెంకీ ‘’మన పిళ్ళ వాడి చేతిలో పరాభవం పొందితే ,వారెవరైనా వచ్చి ఓదారుస్తారా ,మన నష్టాన్ని పూడుస్తారా ?నాకు తెలిసిందాన్ని బట్టి ణా కుటుంబాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేశాను సాక్షాధారాలు ఎవరికీ దొరకవు .నామీద నమ్మకం ఉంచుకోండి మనం అంతా ఒక్కటే’’ .అని చెప్పాడు .చివరికి ఐజి దంపతులు బయట పడ్డప్పుడే అసలు విషయం చెప్పి ఊరడించాడు. వాళ్ళు చూడటానికి శవం కూడా దొరకకుండా కొత్త గా కట్టే పోలీస్ స్టేషన్ పునాదుల్లో దాన్ని వేసి పూడ్చేశాడు .అదే క్లైమాక్స్ సీన్ .మీనా అడిగితె అప్పుడు బయటికి చెప్పాడు .ఒకటి రెండు సందేహాలు వస్తాయి .కాని మనల్ని ఆ జోలికి పోకుండానే కద లాకేళ్లి పోతుంది .ఎక్కడా ఎరువు తెచ్చుకొన్నట్లు లేదు .అతి లేదు .పరుచూరు మార్కు భారీ డైలాగులు లేక పోవటం అన్నిటి కంటే మరీ ప్లస్ పాయింట్ .సభ్యతకు ,సంస్కారానికి మచ్చు తునకగా నిలిచే సినిమా ఇది .రామానాయుడు సంస్థ సురేష్ బానర్ పై నిర్మించి గర్వం గా చెప్పుకో దగ్గ సినిమా .తెలుగు ప్రేక్షకులకు గొప్ప రిలీఫ్ ఇచ్చిన చిత్ర దృశ్యం .అందరూ అభినంద నీయులే .
హడావిడి ,ఆర్భాటం లేకుండా సైలెంట్ గా ఒక చల్లని నదీ ప్రవాహం లా సినిమా సాగిపోతుంది .చిన్నపిల్లలు చూడటానికి కొద్ది ఇబ్బంది పడతారేమోకాని ,మీనా వెంకీ ల సరస సల్లాపాలు మురిపాలు క్లాస్ గా రిచ్ గా ఉన్నాయి వెకిలి తనం ,జిడ్డు హాస్యం లేకుండా మైంటైన్ చేసిన శ్రీప్రియ అభినదనీయు రాలు. అందుకే సినిమా శ్రీప్రియం ,అనుక్షణ కావ్య దృశ్యం ,వెంకటేషీయం అన్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- 29-7-14-ఉయ్యూరు

