చరిత్రను చిత్రిక పట్టిన గడియారం – సంగిశెట్టి శ్రీనివాస్‌

చరిత్రను చిత్రిక పట్టిన గడియారం – సంగిశెట్టి శ్రీనివాస్‌

Published at: 28-07-2014 07:24 AM

తెలంగాణ పునర్వికాసోద్యమానికి ఊపిరులూది, చైతన్యాన్ని ప్రోది చేసిన పండిత పరిశోధకుడు, సంపాదకుడు, గతానికి-వర్తమానానికి వారధి గడియారం రామకృష్ణ శర్మ. హైదరాబాద్‌ రాష్ట్రంలో తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసి ‘సుజాత’ పత్రిక సంపాదకులుగా, శాసనాల పరిష్కర్తగా, సంస్కర్తగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, సారస్వత పరిషత్తు నిర్వాహకుడిగా, సభలు, సమావేశాల, నిర్వాహకుడిగా, రేడియో ప్రయోక్తగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా తెలుగు జాతికి ముఖ్యంగా తెలంగాణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. కాలగర్భంలో కలసిపోయిన చరిత్ర ను రికార్డు చేసే విధంగా కొమర్రాజు లక్ష్మణరావు స్ఫూర్తి, ప్రోత్సాహంతో ‘తెలంగాణ శాసనాలు’ మొదట 1935లో ‘లక్ష్మణరాయ పరిశోధక మండలి’ పక్షాన ఆదిరాజు వీరభద్రరావు ప్రచురించారు. దూపాటి వెంకటరమణాచార్యులు, ఆదిరాజు వీరభద్రరావు పరంపరను కొనసాగిస్తూ అనంతర కాలంలో ‘తెలంగాణ శాసనాలు’ రెండో భాగాన్ని గడియారం రామకృష్ణ శర్మ సంపాదకత్వంలో ప్రచురించారు.

‘‘..83 శాసనములకు పండిత గడియారం రామకృష్ణశర్మగారు నకళ్ళు వ్రాసి యున్నారు. శ్రీ రామకృష్ణ శర్మ గారి చరిత్రాభిమానమును, చారిత్రక కోవిదత్వమును, ఉత్సాహశీలమును, రచనా నైపుణ్యమును ఈ గ్రంథము వేయినోళ్ళ జాటు చున్నది. శ్రీ రామకృష్ణ శర్మగారు ఈ గ్రంథ సంపాదకీయ భారము వహించి మమ్ముల కృతకృత్యుల జేసియున్నారు. సంస్కృతాంధ్ర కర్ణాటకాంగ్లేయ భాషలయందు పండితులును, విశేషించి శాసనములను వ్యాఖ్యాన సహితంగా ఇంగ్లీషునందును, తెలుగునందును ప్రకటించి, చరిత్ర పరిశోధన పండిత ప్రకాండుల మెప్పును గడిచినవారు శ్రీ రామకృష్ణ శర్మగారు’ అని ఆయన ప్రతిభను పరిశోధక మండలి గౌరవ కార్యదర్శి ఆదిరాజు వీరభద్రరావు తమ ‘పీఠిక’లో పేర్కొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఆలంపూరు శిల్ప సంపద గురించి 1946లోనే పుస్తకాన్ని వెలువరించడమే గాకుండా, శిథిలావస్థలో ఉన ్న వాటిని, ముంపుకు గురైన గుడులను యథావిధిగా ఒడ్డుకు తరలించడంలో ఈయన కీలక భూమిక పోషించారు. కేవ లం శాసనాలే గాకుండా తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. మిత్రులు, ఆప్తులు సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో 1950లో ‘సుజాత’ సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు. ఇందులో ఆది రాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణరావు, సామల సదాశివ (కథలు), మల్లంపల్లి సోమశేఖర శర్మ, తదితర పండితుల రచనలతో పాటుగా, యువ కవులు, కథకులకు ఇది వేదికగా ఉండింది. దాశరథి ‘నా తెలం గాణ కోటి రతనాల వీణ’ కవిత మొదటిసారిగా ఈ పత్రికలోనే ప్రచురితమైంది.

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో ప్రత్యేకంగా స్మరించుకోవాల్సిన సంచిక ‘సుజాత’ తెలంగాణ సంచిక ఇందులో తెలంగాణకు సంబంధించిన చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, పత్రికా రంగాలపై ఆయా విషయాల్లో ప్రసిద్ధులైన వ్యక్తులచే విలువైన వ్యాసాలు రాయించి వెలువరించారు. ఈ సంచికను పునర్ముద్రించినట్లయితే తెలంగాణ వైభవము, ప్రతిభ అందరికీ తెలిసి వస్తుంది. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి 1953లో ఆలంపురంలో ‘ఆంఽధ్రసారస్వత సభలు’ నిర్వహించారు. ఈ సభల్లో శ్రీ శ్రీ మొదలు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వరకు తెలుగునాట పేరున్న సాహితీవేత్తలందరూ పాల్గొన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైలుని నడిపించారంటే ఆ సభలు ఎంత ఘనంగా నిర్వహించారో తెలుసుకోవచ్చు. ఈ సభల్లో సురవరం ప్రతాపరెడ్డికి జరిగిన అన్యాయం చర్చనీయాంశమైంది. రాజకీయ రంగంలో ఆయనకు అన్యాయం జరిగినా సాహిత్య రంగంలో ఈ సభ నిర్వహణ ఆ ప్రాంతానికి చెందిన సురవరంపై గౌరవాన్ని పెంపొందించింది. ఈ సమావేశాల్లో చేసిన చర్చలు తర్వాతి కాలంలో కేంద్రం ఏర్పాటు చేసిన ‘సాహిత్య అకాడెమీ ఆవార్డు’ ప్రతాపరెడ్డికి దక్కేలా చేశాయి. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ఈ పురస్కారం లభించింది. ఈ సభల్లోనే కాళోజీ ‘నాగొడవ’ మొదటిసారిగా ఆవిష్కృతమైంది.

మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసింది కూడా గడియారమే. ఆలంపూరు తాలూకాలోని చెన్నిపాడు గ్రంథాలయం, ఉండవెల్లిలోని శ్రీ సరస్వతీ విలాస పుస్తక భాండాగారాలను రూపుదిద్దింది ఈయనే. తనకు అత్యంత సన్నిహితుడైన సురవరం ప్రతాపరెడ్డికి దక్కినట్లుగానే రామకృష్ణశర్మ స్వీయ చరిత్ర ‘శతపత్రం’కు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కింది. ఈ పుస్తకం అలనాటి తెలంగాణకు దర్పణం. స్వీయ చరిత్రతో పాటుగా దశరూపసారం, భారత దేశ చరిత్రం, ఆలంపుర క్షేత్ర చరిత్ర, ఆలంపురం శిథిలములు, తెలుగుసిరి, బీచుపల్లి క్షేత్ర మహత్యం, ఉమామహేశ్వర చరిత్రం, భారతీయ వాస్తు విద్య తదితర గ్రంథాలు ఆయ న కలం నుంచి వెలువడ్డాయి.  1919లో అనంతపురం జిల్లా కదిరిలో జన్మించిన శర్మగారు చిన్నప్పుడే ఆలంపూరులో స్థిరపడ్డారు. తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి, సంస్కృతికి చిరస్మరణీయమైన సేవలందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భంగా ఆయన చేసిన కృషిని ప్రభుత్వం కొనసాగించాలి. అదే ఆయనకు సరైన నివాళి.
(గడియారం రామకృష్ణ శర్మగారు గతించి ఎనిమిదేళ్ళు)
– సంగిశెట్టి శ్రీనివాస్‌

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.