అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -1

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -1

సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారు ‘’త్రిపుటి  ‘’’లో ’పదకవితా పితామహుడు అన్నమయ్య ‘’అన్న వ్యాసం రాశారు .ఇవాళ పుట్టపర్తి వారిజయంతి సందర్భం గా ఆవ్యాసం లోని ముఖ్య విషయాలను ‘’అన్నమయ్య ప్రస్థాన సోపానాలు ‘’గా అందజేస్తున్నాను .

తెలుగు దేశం లో జైనుల తో చంపూ కావ్య రచన ఆరంభమైంది .వీరశైవం రాజస  భక్తీ  మార్గం .వీరి వచన సాహిత్యం కన్నడ సాహిత్యానికి ఒక వెలలేని తొడుగు .బసవేశ్వరుడోక మహా జ్వాల .పాల్కురికి సోమనాధుడు కన్నడ ద్విపదను తెలుగులో ప్రవేశ పెట్టాడు .ద్వైతమతం లో శ్రీ పాద రాయలు ప్రసిద్ధుడు .వీర శైవం నుండి జనాలను మరల్చటానికి ‘’దాసర కూటాలు ‘’ఏర్పరచాడు .ప్రజల భాషలో సాత్వికతకు స్థానం కల్పించాడు .సాల్వ నరసింహ రాయల బ్రహ్మ హత్యా దోషాన్ని రాయలు పోగొట్టి శిష్యుణ్ణి చేసుకొన్నాడు .రాజాదరణ ద్వైతానికి లభించింది.కూటాలు బాగా గ్రామాల్లో నాటుకు పోయాయి .వీరితర్వాత వ్యాసరాయలు ,పురందర దాసుల కాలం లో బాగా అభివృద్ధి చెందాయి .పురందరుల పద వాజ్మయాన్ని వ్యాసరాయలు ‘’ఉపనిషత్తులు ‘’అని గౌరవించాడు .తన దేవతార్చనలో పురందర పదాలనూ చేర్చాడు .తన విద్యా గురువైన శ్రీ పాద రాయల వలెనె పద రచనలు రాయటం ప్రారంభించాడు .ఇప్పటి నుండే ద్వైతులు  పద రచన రాయటం ప్రారంభమైంది .కనక దాసు, వాది రాజు,విజయ రాయలు ,జగన్నాద రాయలు  మొదలైన  వారు పద కర్తలుగా ప్రసిద్ధంయ్యారు .మంత్రాలయ రాఘ వెంద్ర స్వామికూడా ఉడిపి శ్రీ కృష్ణుని పై ‘’ఒకే ఒక్క పదం ‘’పాడారని పుట్టపర్తి వారు తెలియ జేశారు .

పురందరుని కాలానికి పద సాహిత్యం బాగా అల్లుకు పోయింది .కనకదాసు మహా గంభీరుడు,సాహసి. పురందరునిలో లాలిత్యమేక్కువ .కాని పండితులు ఆక్షేపించి దాసర కూటాలకు ‘’మడి తక్కువ ‘’అన్నారు వాళ్ళేమీ పట్టించుకోలేదు .అన్నమయ్యకు శ్రీపాద రాయల పదాలే ఉత్సాహాన్నికల్పించాయి .తనూరి చెన్న కేశవ స్వామిపై పదాలు పాడి ,జనం మెచ్చగా క్రమం గా’’ పదకవితా పితామహుడు ‘’అని పించుకొన్నాడు. అందుకే ‘’ఆడిన మాటలెల్ల అమృత కావ్యముగా ,పాడిన పాటేల్ల పరామ గానము ‘’అయిందని అన్నమయ్య చెప్పుకొన్నది యదార్ధమే అయింది .అన్నమయ్య పోగేసిన సామగ్రి అంతాఒక కావ్యానికి సరిపడా ఉంది .కాని కావ్యకర్త కాకుండా పద కర్త అయ్యాడు .’’ఆ తప్పతడుగే మన భాగ్యం ‘’అయింది అన్నారు ఆచార్యుల వారు .లేక పొతే ఒక నాచన సోమనాధుడు అయ్యి ఉండేవాడు అంటారు .సోమనకున్న బిరుదులైన  ‘’సాహిత్య రస పోషణుడు ‘’,సంవిధాన సంభూషణుడు ‘’,సకల భాషా చక్ర వర్తి ‘’ అన్నమయ్యాకూ సరిపోతాయి.ఇందులో ఏ అనుమానమూ లేదుఅని సరస్వతీ పుత్రుల మనోగతం . .

 

అన్నమయ్య తల్లి అక్కమాంబ తో దేవుడు  ‘’మాడుపూరి మాధవ స్వామి ‘’మాట్లాడేవాడట .అదీ ఆమె భక్తీ .సంతానం కోసం ‘’తిరు వేమ్గాముడైయ్యా ‘’కు సేవ చేసింది .కలలో స్వామి సాక్షాత్కరించి ‘’బిరుదు గజ్జియల కటారం ‘’ఇచ్చాడు .అందుకే అన్నమయ్య ‘’నందక అంశం ‘’లో పుట్టాడు అని అంటారు .అన్నమయ్య తాతకు ‘’చింతలమ్మ ‘’దేవత .ఆయనకొక సారి కనిపించి ‘’మూడవ తరమ్మునను –వదలని కీర్తి మీ వంశంబు నందు –పరమ భాగవతుండు ,ప్రభవించు శౌరి –వరమున జగదేక వల్లభుం డతడు’’అని చెప్పింది ఆ వర ఫలమే అన్నమయ్య.ఇంతకు  ముందు వారి వంశం లో ఎవరికీ ఈ పేరు లేదు ఈయన తోటే ప్రారంభమైంది . అది సార్ధకమైంది .అన్నమయ్య మనవడు ‘’సకల వేదాంత –జాత చోదితాంబై ,జలజోదరునకు –నామమై ,విన పరిణామమై మున్ను –హేమామ్బరుండానతిచ్చిన యట్టి –అన్నమయాహ్వాయంబు ‘’అని చెప్పినా విష్ణువుకు అన్నమయ్య అనే పేరు ఎందుకు వచ్చిందో సందేహం మాత్రం తీరదు .చిన్నప్పుడే తలిదండ్రులు ‘’అన్నమాచార్య ‘’అని ముద్దాడారట .

అన్నమయ్య మొదటి కీర్తన ఏదో ఆయనకోడుక్కు కూడా తెలిసినట్లు లేదు .అలాగే చివరికీర్తన ఏదో మనకీ తెలీదు .సరే అన్నమ బాలుడు దిన దిన ప్రవర్ధమానుడవుతున్నాడు .ఒక రోజు స్వామి ‘’పంచాస్త్ర కోటి స్వరూపుడు ,రవళిమ్చు పసిడి మువ్వల యందెలు ,పైడి వలువలు మొదలైన వస్త్ర ఆభరణ విశేషాలతో దివ్య తేజో రాశిగా దర్శన మిచ్చాడు .’’నాకై పదరచన ము అల్లుము ‘’అని ఆదేశించి అదృశ్యమైనాడు .సందేహాలన్నీ తీరాయని ,బ్రహ్మానందం పొందానని ,సంకీర్తన లతో దేవుని కోరిక తీరుస్తానని పదం చెప్పాడు .ఆయన ఊరు తాళ్ళ పాక .పల్లెటూరే .వ్యవసాయమే ముఖ్య వ్రుత్తి .అందరూ  కష్టపడితేనే కాని కుటంబం లోని వారందరికీ నాలుగు వేళ్ళూ లోపలి పోవు .పశువులకు మేత కోసి తీసుకు రావటం అన్నమయ్య పని . కొడవలి తీసుకొని అడవికి వెళ్ళాడు .ఉత్సాహం గా గడ్డి కోస్తున్నాడు .ఏమరుపాటు తో కొడవలి చేతికి తగిలి రక్తం కారింది . .ఏదో అశాంతి మనసులో జొరబడింది  ఆ భావాలనే పదం గా రాశాడు .

‘’అయ్యో !పోయెం గాలము –ముయ్యంచు మనసున నే మోహమతి నైతి –చుట్టంబులా తనకు సుతులు కాంతలు చెలులు –వట్టి యాసల బెట్టు వారే కాని ‘’అని పించింది .చివరికి తప్పు తెలిసి ‘’అంతరాత్ముండువెంకటాద్రీశు  గొలువ కిటు ల –అశాం కూటముల అలజడికి లోనైతి ‘’అని మధన పడ్డాడు .అప్పుడే  వెంకటాద్రి ఉత్సవాలు జరుగుతుంటే వాళ్ళ వెంట పడి వెళ్ళాడు .దూరం గానే ‘’తిరు వెంగడము ‘’కనిపించింది ‘.అది ‘’పది వేల శేషుల పడగల మయం –అఖిలోన్నతం  ,బ్రహ్మాదులకు అపురూపమైన హరివాసం.అఖిలానికి నిత్య నివాసం గా ,బ్రహ్మానంద రూపం గా ‘’ కన్పించింది .’’అది మూల నున్న దనం గా భాసించింది .ఆ కొండ వేదాలే శిలలుగా మారిన కొండ .పుణ్య రాశులే ఏరులైనాయి .బ్రహ్మాది లోకాల కొనల కొండ .సర్వ దేవతలు అక్కడ మృగ జాతిగా ఉన్నారు .జల నిధులే నిట్ట చరులు .తపసులే తరువులు .పొడుగ్గా ఉన్న కొండ పూర్వపు అంజనాద్రి .మరి అలాంటి చోట కొండపై శ్రీదేవుడు ఎందుకు కొలువై ఉండడు ?నడిచి నడిచి అలసిపోయాడు .ఒక చెట్టుకింద నిద్రపోయాడు .నిద్రలో అలమేలు మంగ చెప్పులతో కొండ యెక్క రాదనీ మందలించి స్వామి వారి ‘’లడ్డు ప్రసాదం ‘’తినిపించి సేద తీర్చింది .మెలకువ వచ్చి అమ్మపై ‘’శతకం’’ చెప్పాడు .ప్రతిపద్యం చివరా ‘’వెంకటేశ్వరా ‘’అనే మకుటాన్ని వాడాడు .మకుటమే స్వామిది. లోపలి పద్యమంతా అమ్మవారిపైనే .అప్పటికి అన్నమయ్య పదారేళ్ళ పడుచు వాడు ‘’.తోటి యాత్రికులతో కొండ ఎక్కాడు .కన్నుల పండువుగా తెప్పల కోనేరు కనిపించింది .

Inline image 1  Inline image 2 Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.