
![]() |
‘ఆంధ్రజ్యోతి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షికలో గతంలో బాపు వివరించిన బాల్యపు ముచ్చట్లు ఆయన మాటల్లోనే… (ఆంధ్రజ్యోతి, చెన్నై) మా ఊరు కంతేరు. నాన్న వేణుగోపాలరావు. అమ్మ సూర్యకాంతమ్మ. ఆమె నిడమోలు వారి ఆడపడుచు. సత్తిరాజు వారి కోడలు. నేను నరసాపురంలో నిడమోలు వారి ఇంట్లో పుట్టాను-ట. నేను పుట్టక మునుపే మా నాన్న గారు మద్రాసులో లాయర్ ప్రాక్టీసు పెట్టారుట. మైలాపూర్‌లోని అప్పరసామికోవెల వీధిలోని నెంబర్ 101 మా ఇల్లు. ఈ ఇల్లు నరసాపురం కంతేరు ఏలూరు కుటుంబాలకు రాజధానిలా వుండేది. చదువులూ పెద్ద చదువులూ ఉద్యోగాలూ పెళ్లి సమ్మంధాలూ కొత్త కాపురాలు తిరుపతి యాత్రలు, ఊటీ విహారాలు మెడ్రాస్ వైద్యాలూ – ఇలా ఎవరికే పని వచ్చినా – మా నాన్న సలహాలూ అమ్మగారి సేవలూ! అయిదురు పిల్లలూ ఏడుగురు అత్తగార్లూ వాళ్ల చుట్టాలూ కాకుండా కోర్టు పనుల మీద పల్లెటూళ్ళ నుంచి వచ్చే క్లయింట్లు మా ఇంటి వరండాలోనే బస! ఆ రోజుల్లో మెడ్రాసు తెలుగు లాయర్లందరికీ ఇదో ఆచారం. ఈ పల్లెటూరు అమాయకులు కోర్టులో కేసు గెలిస్తే మరి కనిపించేవారు కాదు. ఓడితే రైలు చార్జీలు అడిగి తీసుకుపోయేవారు. మా నాన్నగారు ఇచ్చేవారు. వాళ్లందరికీ మా అమ్మ కాఫీలూ, భోజనాలు చేసి పెట్టేది. తెల్లారగానే కాఫీలు- సద్దన్నాలు – స్కూలు వంటలు- కోర్టువంటలు అత్తగార్లకి ఇష్టవంటలు, సాయంత్రం చేగోడీ వంటి చిరుతిళ్లూ – తిరుపతి భక్తులకు పులిహోర పొట్లాలూ – విలాస యాత్రికులకు చచ్చిన కాలేజి (మ్యూజియం), బతికిన కాలేజీ (జూ), మూర్ మార్కెట్, లైట్ హవుసు, బీచి, సెకండ్ షో చూసి వచ్చిన వాళ్లకి లేటువంటలూ – ఇలా అన్నిటికీ ఒక అమ్మ – రెండు కుంపట్లూనూ – అన్నాలకి పెద్దది, కాఫీ, టీ కూరా చారులకు చిన్న కుంపటీనూ. ఈ సత్తిరాజుగారి సత్రంలో మా అమ్మకి పైన చెప్పిన సేవలు కాకుండా ప్రత్యేక బోనస్ రెండో కొడుకు బాపూ, వాడి అల్లరీనుట. (జాతియోద్యమం రోజులు కదా – అందుకని అటు మహాత్ముడి పేరూ – ఇటు మాతా మహుడి పేరు కలిసొచ్చేలా నన్ను బాపూ అని పిలిచేవారు). మా అన్నయ్యా తమ్ముడూ సాధువులు. మా అక్కయ్య సరే ఆడపిల్ల. మా చిన్న తమ్ముడు పసి బిడ్డ. అంచేత అల్లరీ, రౌడీ తనం నా బాధ్యతలైపోయాయి. మేడ వరండా కిటికీలోంచి వంగి కిందికి చూస్తూ ‘అమ్మ బెల్లమ్ముక్క ఇవ్వకపోతే దూకుతా’ అని అరిచేవాడినట. ఆ భయంతో మా అమ్మ కిటికీకి నిలువెత్తు కటకటాలు పెట్టించింది. నాకు కోపం వచ్చినపుడు ఆ కటకటాలకే కొట్టుకుని గోల చేస్తూంటే కిందికి తెచ్చి ఓ స్తంభానికి తాడుతో కట్టేసేది మా అమ్మ. ‘నల్ల కిష్టుడుతో రోలుకేసి కట్టు’ అనేది బామ్మ. తాడు తెగేదాకా లాగి బోర్లపడేవాణ్ణిట. వంటింట్లో బొగ్గులతో నేలంతా బొమ్మలు వేసేవాణ్ణిట. ఓ సారి మా నాన్నగారు బొమ్మలు చూసి ‘వెధవా – ఏమిటీ పిచ్చి గీతలు’ అని కోప్పడ్డారు. నేను చెరిపేయ బోతే – ‘సర్లే వుణ్ణీ వుణ్ణీ – మసి చూసుకో’ అన్నారు. రోజూ ఆయన వచ్చే ముందు ఆఫీసు కుర్చీలో కూర్చొని కేసు పేపర్ల చివర నేను బొమ్మలనుకునే గీతలు గీసేవాడిని. అవన్నీ దాచి, వచ్చే స్నేహితులకూ, పాపం క్లయింట్లకి కూడా ‘మా వాడు గీసిన బొమ్మలు’ అంటూ చూపించేవారు. రాత్రి పూట బిర్జిమీద రైలు, నాన్న కాల్చే చుట్టాను గీసే వాణ్ణి. వేసవి సెలవులొచ్చాయీ అంటే మమ్మల్ని కంతేరు తీసుకెళ్లేవారు నాన్న. పొలాల్లోకి తీసుకెళ్లీ, గడ్డి మేటల దగ్గర కూర్చుని – మా చేత తెలుగు పద్యాలూ భారతమూ కథలూ చదివించేవారు పెదనానగారబ్బాయి హనుమంతరావు. అదో గ్రేట్ ఎక్స్‌పీరియన్సు. వీధిలో ఏదో పని మీద వెడుతూ రాజేశ్వరరావు పాట వింటే చాలు – పరుగుపరుగున ఇంటికి వచ్చి రేడియో ఆన్ చేసేవాడిని. ఆ రోజుల్లో వాల్వ్ రేడియోలు కదా – ఈనాటి ట్రాన్సిస్టర్లలా కాకుండా వేడెక్కి సౌండ్ వచ్చేసరికి నిమిషం పట్టేది. ఈలోగా పాట అయిపోయేది. నేను ఏడ్చినంత పనయ్యేది. ‘అంత ఇష్టముంటే అతన్నోమారు కౌగిలించుకోరా’ అనే వారు మా నాన్న. రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావుగారు అప్పుడు పిల్లల కోసం ‘బాల’ పత్రిక పెట్టేరు. నా మొదటి బొమ్మ అందులోనే అచ్చయిందీ. రేడియో అన్నయ్యా రేడియో అక్కయ్యా పిల్లలతో ఒక సంఘము స్టార్ట్ చేశారు – దాని పేరు ‘బాలానంద’. సంఘంలోని పిల్లలందరినీ వారు వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్లి రేడియోలో నాటకాలు వేయించీ, పాటలు పాడించేవారు. హిగ్గిన్ బాదమ్స్ బుక్‌షాపుకు తీసుకెళ్లీ ‘మీ కావలసినవి కొనుక్కోండీ’ అనేవారు రాఘవరావుగారు – మేము కొన్న పుస్తకాలకూ పెన్సిళ్లకూ పేనాలకూ బ్రష్షులకూ బిల్లు కట్టేవారు. ఆయన మా మీద చూపించిన అభిమానం మరిచిపోలేనిది. అన్నట్టు నేను రేడియోలో వత్ ఆర్గన్ వాయించేవాణ్ణి. ఆ రోజుల్లో మెడ్రాసులో తెలుగువాళ్లకి సపరేటు స్కూలుండేది కాదుట. అందుకనీ నాన్నా ఇంకొంతమంది తెలుగు లాయర్లూ కలిసీ మా ఇంట్లోనే స్కూల్ స్టార్ట్‌చేశారు. తర్వాత ఈ స్కూల్‌ను తీసుకొని పెద్దది చేశారు – కెఎన్ కేసరిగారు. పిఎస్ స్కూల్లో చదువుతూండగా మా రవణ పరిచయం అయ్యేడు. తర్వాత మేము ఫ్రెండ్సుమి అయ్యాము. రవణా నేనూ ఇంకొంతమంది ఫ్రెండ్సూ కలిసి ‘ఉదయభాను’ అనే రాత పత్రిక స్టార్ట్‌చేశాము. రవణ పుస్తకమంతా రాస్తే – వాటిని స్టెన్సిలు మీద రాసి బొమ్మలు వేసేవాడిని. నేనూ రవణా సినిమాలు తెగ జూసేవాళ్లం. రెండు గంటల ముందు వెళ్లీ క్యూలో నుంచునీ – నాలుగణాల మూడు కాణులు పెట్టి టికెట్ కొనీ – సినిమా చూసేవాళ్లం. అలా చాలా ఇంగ్లీషు సినిమాలు చూసీ మాట్లాడుకునేవాళ్లం – తెలుగు, హిందీ సినిమాలలోని నాటకీయత గురించీ – మిగతా వాళ్లూ మాలాగే చేయొచ్చు కదానీ. సాయంత్రం ఫ్రెండ్సుతోపాటు శాంతోం బీచికి వెళ్లేవాళ్లం. అక్కడ కూడా పుస్తకం తీసుకెళ్లి బొమ్మలు గీసేవాడిని. ఇంటర్ చదవగానే ఓసారి, బీకాం పూర్తి చేయగానే మరోసారి బొంబాయి జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరతానని నాన్నగారిని అడిగాను. ఆయనంటే నాకు చచ్చేంత భయం – ఏదైనా అడగాలంటే ఆఫీసు రూంలో ఆయన కూర్చొన్న కుర్చీ వెనకాల గుమ్మానికి అర్థగంట సైలెంటుగా వేళ్లాడుతూ నించుంటే – అలికిడి పసిగట్టి ‘ఏమిటీ’ అని ఆయనంటే అప్పుడు బ్లర్ట్ అయ్యేవాడిని. కాని ఆయనెప్పుడూ ప్రేమతో మాట్లాడేవారు. ఆయన పాపం – ‘బొమ్మలు కూడూ గుడ్డా పెట్టవురా. ఈ చిత్రకళని నమ్ముకునే కంటే కమర్షియల్ టాక్స్ స్పెషలైజ్ చెయ్యి. అయినా కాస్త టైమియ్యి – ఈ లోగా అడ్మిషన్స్‌కి టైమయిపోతుంది కాబట్టి లా కాలేజీలో చేరిపో’ అన్నారు. మొదటి ఏడాది పూర్తి కాక ముందే ఆయన పోయారు. ఆయన మీదుండే గౌరవం కొద్దీ లా పూర్తి చేసి అడ్వకేటుగా ఎన్‌రోల్ అయ్యా. కొద్దిరోజులకు నల్లకోటు విప్పేసీ – ఫ్రీలాన్స్ ఆర్టిస్టు వృత్తి మొదలెట్టాను. లా కాలేజీలో చదువుతుండగా రవణ కథకు నాబొమ్మ వేసి ఆంధ్రపత్రికకు పంపేవాళ్లం. లజ్ కార్నర్‌కెళ్లీ ఆంధ్రపత్రికను తీసుకు చూసేవాళ్లం – నా బొమ్మా అతని కథా వచ్చిందేమోననీ… ఒక సారి చూసేసరికి నాబొమ్మ సెంటర్ స్ర్పెడ్‌లో వుంది. అంతే చెప్పలేని సంతోషం. ఆ రోజుల్లో ఆర్టిస్టులకి ప్రచురణ కర్తలిచ్చే సంభావన తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ‘బాల’ పత్రికలో బొమ్మలేసేటప్పుడు నెలకు వచ్చే అయిదు రూపాయలూ – ఆ మేనేజరు అరగంట నించోబెట్టి రేపు రమ్మనేవాడు. అలా వారం తిప్పి అప్పుడు విసిరేసేవాడు. 1955 – 60 ప్రాంతంలో ఆర్టూర్ ఈసెన్ బర్గ్ అనే ఆయన ఫోర్డ్ ఫౌండేషన్ ప్రతినిధిగా మెడ్రాసులో వుండేవారు. నేనన్నా, నా బొమ్మలన్నా వాత్సల్యం, ప్రేమా చూపించేవారు. ప్రతి వానికీ నా కారు చూపించి (సెకండ్ హ్యాండుది) ‘మా బాపూ బొమ్మలేసి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్నాడు తెలుసా’ అని గర్వంగా – మా నాయనమ్మగారు చెప్పినట్లు చెప్పేవారు. ఈసెన్ బర్గ్‌గారు ఫౌండేషన్ తరుపున దక్షిణ భారత భాషా బుక్‌ట్రస్టును ఏర్పాటు చేసి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో – అందరికీ అందుబాటులో వుండేలా పుస్తకాలను ప్రచురించేవారు. ఓ మారు ఉత్పల వారి పద్యాలకి నా బొమ్మలున్న పుస్తకానికి అవార్డు వస్తే గర్వంగా వెళ్లి చెప్పా. ఆయన ‘‘నేను అవార్డు కమిటీలో వున్నానోయ్. మిగతా కమిటీ సభ్యులు చూడకుండా అడుగు నుంచి పైకి తీసిపెట్టేవాడిని – నీ పుస్తకాన్ని’’ అని అన్నారు. రాత్రి వంట్ రోడ్డులో వున్న జింఖానా క్లబ్బుకి కార్లో తీసికెళ్లమనేవారు. నేను అసలే దూకుడు. అందులో – తిరిగి వచ్చేటప్పుడు పది దాటి రోడ్లు ఖాళీగా వుండేవేమో స్పీడు తొక్కేవాణ్ణి. ఆయన కామ్‌గా ‘‘యు ఆర్ ఫ్లయింగ్ టూ లో బాపూ’’ అనేవారు. బుచ్చినాన్న నాకు తెలుగు సాహిత్యం పరిచయం చేస్తే, శివరాజు సుబ్బలక్ష్మి పిన్ని ఆంగ్ల సాహిత్యం (పి.జి వుడ్ హౌస్ రచనలు) పరిచయం చేశారు. పిన్నిగారి దయచేత నేనిప్పటికీ వుడ్‌హౌస్ రచనలతో కాలక్షేపం చేస్తుంటా. ప్రయాణంలోనూ తీరిక వేళలోనూ నాకు నేస్తాలు – వుడ్‌హౌస్ పుస్తకాలే. నేను గర్వంగా చెప్పుకునే బంధువులు మరొకరు – మా అమ్మ తమ్ముడు (మావయ్య) నిడమోలు జగన్నాథ్‌గారు, వారి శ్రీమతి కళ్యాణ సుందరీ జగన్నాథ్. జగన్నాథ్ మావయ్య ఆ రోజుల్లోనే కులాంతర వివాహం చేసుకుని పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన తను నమ్ముకున్న దానిముందు ఎవ్వరికీ – దేనికీ తలొంచే వారు కాదు. కార్టూన్లంటే నాకు పిచ్చ. నిరంతర సాధన ద్వారానే నిత్యనూతనమైన కార్టూన్లని సష్టించొచ్చని నేను నమ్ముతాను. ఆయా సందర్భాలలో ఇతరులు గీసిన కార్టూన్లు కూడా కొత్త ఆలోచనలకు రూపం పోస్తాయి. భారతీయ శిల్పకళ నన్ను బాగా ఇన్‌స్పయిర్ చేసింది. నటరాజు శిల్పం ‘గ్రేటెస్ట్ పీస్ ఆఫ్ ఆర్ట్’ అని నా ఉద్దేశము. దివ్యత్వం ఉట్టిపడే నటరాజు బొమ్మను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. కొందరు చెప్పలేనంత ప్రేమతో – ‘‘నువ్వే కనుక ఏ బెంగాల్‌లోనో, అమెరికాలోనో పుట్టివుంటే’’ అంటూ విచారించేవారు. కానీ తెలుగుదేశంలో పుట్టడమే నా అదృష్టం. నేను డావిన్సీ మైకేల్ ఏంజిలో దగ్గర నుంచీ నేటి నందలాల్ బోస్, పిలకావారు, వైకుంఠం గారి కళాఖండాలు చూశాను. ఆనాటి ఆర్తర్ రాకాం దగ్గర నుంచి నేటి ఆర్‌కె లక్క్షణ్, వాసు, గోపులు గారి బొమ్మలు చూశాను. అందువల్ల నా చోటూ, ప్లేసూ నాకు తెలుసు. బుడుగు అన్నట్లు నా అంతటి వాడు నేనే! ఓ రోజు నాన్నగారి ఆఫీసు రూంలో గోడకి తగిలించిన కోటులో చిల్లర దొరికితే కొట్టేద్దామని చెయ్యి పెట్టా. సరిగ్గా అప్పుడే ఆయన రూంలోకి వచ్చారు. గుండె ఆగిపోయి.. ‘కోటు కింద పడితేనూ తీసి మేక్కు తగిలిస్తున్నా’ అని నసిగాను. ‘‘ జేబులో చెయ్యిపెడుతూ కోటు కింద పడిందంటావేమిరా’’ అన్నారంతే. ఇంకేం చెయ్యలే. చావగొట్టినా అంత బాధా, సిగ్గు వేసేది కాదు. |
|


