రమణ చెప్పిన బాపు కథ!

‘కోతికొమ్మచ్చి’ నుంచి…
బాపుగురించి చెప్పాలంటే రమణ గురించి, రమణ గురించి చెప్పాలంటే బాపూ గురించి చెప్పక తప్పదు. వారి స్నేహబంధం అంత దృఢమైనది. ఇద్దరి జీవితాలూ గోదారి ఒడ్డునే మొదలైనా మద్రాసులో వారి బంధం గట్టిపడింది. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులూ, పస్తులతో పడుకున్న రోజులూ, మిత్రులతో సరదా సంభాషణలూ, మధ్య మధ్యలో కొంటె బొమ్మలూ, హిట్లు, ఫెయిల్యూర్లు… ఇలా ఒకటేమిటి వారి జీవితాలను తరచి చూస్తే ఎన్నో సంగతులు. తమ మధ్య చోటుచేసుకున్న ఎనె్నన్నో సంగతులనూ, అప్పటి సందర్భాలనూ రమణగారు తన ‘కోతి కొమ్మచ్చి’లో గుదిగుచ్చారు. ముఖ్యంగా తన ప్రియనేస్తం బాపు గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు… ముళ్ళపూడివారి మాటల్లోనే…
అల్లరి బాపు
1942లో మేము మెడ్రాసు పిఎస్ హైస్కూల్‌లో ఐదు, ఆరు క్లాసులు కలిసి చదువుకున్నాం. బాపు తండ్రి వేణుగోపాలరావుగారు నిజానికి కోపాలరావు. ఆయన మంచి చిత్రకారుడు. రంగుల బొమ్మలు వేసేవారు. చిన్నబాపు కూడా ఆయన పెన్సిల్, బ్రష్‌లు పట్టుకుని బొమ్మలు వేస్తుంటే చూసి కోప్పడేవారు. బాపుకు కూడా కోపం వచ్చి బొగ్గులతో నేలంతా బొమ్మలు వేసేవాడు. పెన్నుతో కోర్టు కాగితాలు – కాజులిస్టు పేపర్లమీద బొమ్మలు వేసేవాడు.‘బొమ్మలు కూడూ గుడ్డా ఇవ్వవురా. ముందు చదువుకుని పరీక్షలు పాసవు’ అని గోపాలరావుగారు కసురుకునేవారు.
తరగని ఆస్తులు
ఈ మధ్య ఒకసారి ఒక చుట్టాలాయన అడిగాడు – ఇన్ని బొమ్మలు వేశారు, ఇన్ని సినిమాలు తీశారు. మీ ఆస్తి ఏపాటిది? అని. బాపు తన ఆస్తి వివరాలు చెప్పాడు – మెహదీ హసన్ కచేరీలు 150 గంటలు, బడే గులామ్ అలీ 90 గంటలు, హిందీ సినిమాలు – గులాం హైదర్, నౌషాద్, మదన్ మోహన్‌ల నుండి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వరకు, అరవంలో మామ, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజాలు, తెలుగులో రాజేశ్వరరావు, లీలా, సుశీల, జానకి, జిక్కి, ఘంటశాల, మామ, రఫీ, లత, ఆశా, కిషోర్‌కుమార్ వగైరాలవి 200 గంటలున్నాయి. అన్నీ ఇండెక్స్ చేసి బైండ్ పుస్తకాల్లా ఉన్నాయి. ఇవికాక రవిశంకర్, హలీమ్ జఫర్‌ఖాన్, కరీమ్‌ఖాన్, బిస్మిల్లా, బీటిల్స్, లారీ అడ్లర్ (క్రోమోనికా), జెత్రోటుల్ గ్రూపు ఫ్లూటు, బితోవెన్, బాక్, వెర్దీ వైగరాలు క్లాసిక్ కచేరీలున్నాయి. ఇవికాక హిందూ శిల్పాల మీద పుస్తకాలు (బొమ్మల్లో తనకు మొదటి గురువులు శిల్పాలే అంటాడు బాపు), ఓల్డ్ మాస్టర్స్ ఆర్ట్ పుస్తకాలు, పంచ్‌వాల్యూములు, బిఎఫ్‌ఐ సినిమా గ్రంథాలు, సంగీత, సాహిత్య విమర్శనాగ్రంథాలు, రామాయణ, భాగవతాలు – మామూలుగా అయితే రెండుకోట్లు – విలువ తెలిసిన వారికైతే – అన్నట్టు – బి బి సి సౌండ్ ఎఫెక్ట్ ఎన్నికోట్లో తెలియదు’’ అంటూ ఆగి అడిగాను – ‘‘ఎందుకు ఈ ఆస్తి వివరాలు? పిల్లనిస్తారా?’’ అని. ‘‘ఇవ్వను’’ అన్నాడాయన ముక్తసరిగమలతో…
బాపు బుద్ధిమంతనం
సాక్షి సినిమాని మైసూరు వాళ్ళు కొన్నారు. కొనుగోలుదారుల్లో ఒకరైన భక్తవత్సలం సంతకం పెడుతుంటే అంతవరకూ తలవంచుకు కూర్చున్న బాపు ‘సార్! వన్ మినిట్!’ అన్నాడు.
‘మా పిక్చరు కొనేముందు ఒకసారి ఆలోచించండి’ అన్నాడు బాపు
భక్తాగారు సంతకం ఆపి ఆశ్చర్యంగా చూశారు.
‘ఈ పిక్చరు రాసింది రమణగారు. తీసింది నేను. ఆయన పని ఆయన బాగానే చేశారు. మీకు వార్నింగ్ ఇవ్వడం డైరెక్టరుగా నా కనీస ధర్మం. ఆపైన మీ ఇష్టం’ అన్నాడు బాపు.
మాకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. గుండె ఆగింది. చెమటలు పట్టాయి.
‘మిస్టర్ బాపూ! యూ మీన్’ అన్నారు భక్తా.
‘…ఐ మీన్ వాట్ ఐ సెడ్’ అంటూ బాపు గది నుంచి లేచి వెళ్ళిపోయాడు.
తలుపు తీస్తూ ఆగి ‘అయామ్ నాటె ఫూల్-బట్- చెప్పడం నా ధర్మం- తరువాత మీ ఇష్టం’ అని తలుపు లాగేశాడు.
నేను కంగారుపడి ఏదో చెప్పబోతుంటే- ‘రమణా! డోన్ట్ గెట్ పానికీ’ (ఖంగారు పడవద్దు) అని తలవంచుకుని చెక్కుమీద సంతకం పెట్టేశారు భక్తా.
మెహదీ హసన్‌కు వీరాభిమాని
ఉర్దూ తెలియనివాడు, తెలియనందువల్ల రాగభావాలను, లయను మాత్రమే ఆస్వాదించి ఆనందించేవాడు ఒక్కడున్నాడు – బాపు. అతనికి బడేగులామ్ అలి, మెహదీ హసన్ అంటే ప్రాణం. భాష తెలియదు. కేవలం సంగీతం విని వాళ్లను ఆరాధిస్తాడు. మెహదీ హసన్‌కి ఇది తెలిసి షాకైపోయాడు. వారేవా శభాష్ అన్నాడు. ఇంత పరిశుద్ధమైన, స్వచ్ఛమైన సంగీత శ్రోతకు ఏమి ఇవ్వగలను? అంటూ ఆలింగనం చేసుకున్నాడు. బాపు వేసి తెచ్చిన తన రేఖాచిత్రంపైన సంతోషంగా సంతకం చేశాడు. అప్పట్లో నిత్యాగ్నిహోత్ర వ్రత నిష్ఠుడైన బాపు ఆ సంతకాన్ని గ్రహించి తన సొంత పోర్ట్రయిట్‌లో పైప్‌లో పదిలపరిచి సత్కరించుకున్నాడు. ఆ పైప్‌లో సెగలేని పొగలా ఉన్నదే మెహదీ హసన్ సంతకం.
ఇడ్లీ కన్నా పచ్చడే బాగుంది!
ఓసారి చిన్న కథ రాసి ప్రభ ఆఫీసుకు వెళ్ళాను. ఎడిటర్ విశ్వంగారికి ఇచ్చి కూర్చున్నాను. ‘ఇక మీరు వెళ్లవచ్చు. బాగుంటే దినపత్రికలో ప్రకటన వస్తుంది’ అన్నారు విశ్వంగారు.
‘చిన్న కథేనండి… కొంచెం చదివి ఇప్పుడే చెప్పేస్తే…’ అన్నాను నేను.
ఆయన చురుక్కున చూశారు. చేతిలోని పుస్తకంలో దాచిన బాపు బొమ్మతీసి బల్లమీద పెట్టాను. ‘‘మా ఫ్రెండ్ బాపు – బొమ్మ కూడా వేశాడు. ఫ్రీ’’ అన్నాను.
‘‘అక్కర్లేదు, మాకు ఆర్టిస్టులున్నారు. బయటవాళ్లవి తీసుకోం’’ అంటూనే ఆయన బాపు వేసిన బొమ్మని ఓ క్షణం సేపు చూశారు. ఏమనుకున్నారో గానీ, పక్కనే ఉన్న నా కథను చూసి చదవసాగారు. రెండు నిమిషాల్లో కథ చదివేశారు. బాపు బొమ్మను మళ్లీ ఓసారి చూశారు. ‘‘ఇడ్లీకన్నా పచ్చడే బాగుంది’’ వేస్తాను లెండి’’ అన్నారు. ముప్పావలా పెట్టి ఫుల్‌మీల్స్ తిన్నంత బలం వచ్చేసింది. ఈ ఇడ్లీ కన్నా పచ్చడి బాగుండటం జోక్‌లా అనిపించినా – తర్వాత అది చిరసత్యమై, స్థిరసత్యమై నిలబడింది. తర్వాత నేను గోప్ఫ రైటర్నయిపోయి ఎన్ని గొప్ప కథలు రాసినా – బాపు గొప్పన్నర బొమ్మలు వేసేవాడు. అప్పుడు నేననుకునేవాడిని – ఇడ్లీ కన్నా పచ్చడే బాగుందని.
*
కొంటెబొమ్మల బాపు
సంజీవరెడ్డిగారి లా కాలేజీ లెక్చర్‌కి లా స్టూడెంటుగా చప్పట్లు కొట్టిన బాపూయే 1966లో ఆ చప్పట్లను మించిన చప్పుడుతో కార్టూన్ తప్పెట్లు వాయించాడు. ఆ ఏడాది బాపు, నేను జ్యోతి పత్రికకోసం బెజవాడ మకాంమార్చి అక్కడే ఉండేవాళ్లం. అప్పట్లో బాపు ఆంధ్ర దినపత్రికకు ‘మనవాళ్లు’ పేరుతో కార్టూన్లు వేస్తుండేవాడు. ఏలూరు రోడ్లో రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో కాలువ దగ్గర నాలుగు రోడ్ల కూడలి ఉండేది. ఆ జంక్షన్‌లోనే ఆంధ్రపత్రిక ఆఫీసు ఉండేది. దాని ఎదురుగా చౌరస్తాలో ఓ పెద్ద ఫౌంటైన్ మధ్యన సంజీవరెడ్డిగారి నిలువెత్తు శిలా విగ్రహం నిలిపారు ఆయన అభిమాని.
ఫౌంటైన్ జలాభిషేకం చేస్తుంటే అభిమానులు‘ గులాభి’షేకం చేసేవారు. బతికున్నవారికి శిలావిగ్రహం వేసి పూజించటం, వేసిన వారికి, వేయించుకున్న వారికి, ఊరికి కూడా శుభం కాదని చెప్పడానికి బాపు ఐదారు కార్టూన్లు వేశారు. ఆయనపై కోపమేమి లేదు. ఆయన మేలుకోరే వేశాడు. వాటిపై అలజడి రేగింది. అప్పట్లో కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రిగా ఉంటున్న రెడ్డిగారి మీద నిరసనగా అప్పటికే అశాంతి, అలజడి లేచాయి. కారణాల్లో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమం ఒకటి. వీరకాకాని – ఉక్కు కాకాని నినాదాలతో తీవ్రంగా విజృంభించిన ఆ గొడవలకి బాపు గారి కార్టూన్లు, ఈ శిలావిగ్రహం మంచి సమిధల్లా, కొరకంచుల్లా అందివచ్చాయి. శత్రుమూకలు విగ్రహానికి మోకులు పగ్గాలు విసిరి, మెడకు బిగించి గుంజి గుంజి లాగారు. విగ్రహాన్ని కూల్చివేశారు. ఆ మర్నాడు బాపు వేసిన కార్టూన్ ఇదే.

చెన్నై, ఆగస్టు 31: ప్రముఖ దర్శకుడు బాపు ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న బాపు ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రయివేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు బాపు సోదరుడు శంకర్ తెలిపారు. బాపు మృతిపట్ల ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. 80 ఏళ్ల బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. 1933 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన బాపు బాల్యం అంతా అక్కడే గడిచింది. తండ్రి వృత్తిరీత్యా మద్రాసు చేరుకున్న బాపు మద్రాసు యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. నల్లకోటు వేసుకుని లాయరు కావాల్సిన బాపు చిత్రలేఖనంపై ఆసక్తితో బొమ్మలు గీయడం వైపు మళ్లారు, ‘ఆంధ్రపత్రిక’లో కొంతకాలం కార్టూనిస్టుగా పనిచేసిన ఆయన అతి త్వరలోనే అందరి నోటిమాటగా మారారు. బాపు బొమ్మల్లో తెలుగుదనం ఉట్టిపడేది. తెలుగమ్మాయి అంటే బాపు బొమ్మలాగా ఉంటుందనేంతగా ఆయన గీసిన చిత్రాలు ఉండేవి. సినీ దర్శకుడిగానే కాకుండా కళాకారుడిగా, కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, డిజైనర్‌గానూ బాపు రాణించారు. తన చిరకాల మిత్రుడు ముళ్లపూడి వెంకటరమణతో కలిసి రూపొందించిన ‘బుడుగు’ పాత్ర తెలుగు నేల ఇంటింటి మాటగా నిలిచిపోయింది. ఆ పాత్ర ఆబాల గోపాలం హృదయాల్లో ఇప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఏడు దశాబ్దాల పాటు కొనసాగిన బాపు, ముళ్లపూడి అనుబంధం ఎన్నో అద్భుత పాత్రలకు ప్రాణం పోసింది. సంభాషణ రచయితగా ముళ్లపూడి, దర్శకుడిగా బాపు తెలుగు సినీరంగం ఉన్నంతకాలం గుర్తుంచుకునే ఎన్నో కళాఖండాలు అందించారు. ‘సాక్షి’ చిత్రంతో దర్శకుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన బాపు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. బంగారు పిచుక, బాలరాజు కథ, బుద్ధిమంతుడు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, మనవూరి పాండవులు, భక్త కన్నప్ప, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, సీతా కళ్యాణం, వంశవృక్షం చిత్రాలు ఆయన తీసిన కళాఖండాల్లో కొన్ని. శ్రీరామరాజ్యం ఆయన తీసిన చివరి చిత్రం. హిందీలో ఆయన హమ్‌పాంచ్, వో సాత్ దిన్, మొహబ్బత్, ప్యారీ బెహ్న చిత్రాలు తీశారు. బాపును ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం చిత్రాలు జాతీయ అవార్డులు అందుకోగా, ఐదుసార్లు నంది అవార్డులు ఆయన అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో, వెంకటేశ్వర, ఆంధ్ర యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. సినిమా రంగానికి చేసిన సేవలకుగాను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌తో పాటుగా ఎన్నో సంస్థలనుంచి పురస్కారాలు అందుకున్నారు. బాపు చేతిరాత ఒక ఫాంట్‌గా రూపు దిద్దుకోవడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.

