బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం
ఎనభై ఏళ్ళ బాల బాపు శతమానం భవతి
మూడేళ్ళ కితం వెంకట రమణ వెళ్ళిపోతే వెక్కి వెక్కి ఏడ్చాం .ఇవాలా బాపు అదేదారి చూసుకొంటే గుండె చేరువై దుఖిం చాం .రమణ తో తెలుగు మార్కు వ్యంగ్యం మృగ్యం యితే బాపుతో తెలుగు చిత్ర వెలుగు అదృశ్యమైంది .వీరిద్దరు కలిసి లేక పోవటం తో వాళ్ళ మాటల్లోనే ‘’తెలుగు వాడి ఆస్తి ,ప్రకాస్తి’’ కోల్పోయాం .స్నేహానికిచ్చిన చిరస్థాయి ని కోల్పోయాం .రమణ మరణ బాధతో సగం ,భార్య మృతి తో సగం కుంగిపోయిన ఆ బడుగు బుడుగు ఇక ఈ లోకం లో తనకేం పని ఎటో వెళ్ళిపోయాడు ఇద్దర్నీ వెతుక్కుంటూ .పైలోకం లో హాయిగా కల్సుకోవాలని ఆశిద్దాం .
బద్ధకం గా బాసిం పట్లేసుకు స్థితి శక్తిలో కూర్చున్న తెలుగు అక్షరాల బద్ధకం వదిలించి నిటారుగా వంకరగా చేష్టలతో ,నిలబడేట్లు చేసి ,గతి శక్తి శక్తి నిచ్చి తెలుగు అక్షరాల పవర్ ఏమిటో రుజూ చేశాడు .బాపు ఫాంట్ కు పాంటు ,షర్టూ తొడిగి చైతన్యం తెచ్చాడు . ఇప్పుడు బాపు వెళ్ళిపోతే ,అవి ఏడవ్వా మరి ?అదే ‘’అక్షర విలాపం ‘’అయింది .బాపు గీసిన కన్నె, ‘’బామ్మ ‘’అయి ఏ వయసు వారికైనా ముచ్చటై ,మనోహరమై ,మధుర మంజుల హృదయ నాదమై నర్తించింది ,ఇప్పుడా బామ్మ విలపించదా కన్నీరు మున్నీరుగా . ఆ చెలువం ,సొగసు ,చిలిపితనం బావురు మంటున్నాయికడా తమ సృష్టికర్త తమల్ని వీడి వెళి పొతే .
ఆంధ్రుల రవి వర్మ గా ,దామెర్ల రామారావు గా సజీవ పౌరాణిక పాత్రల చిత్రాలతో తమకు ప్రాణ ప్రతిష్ట చేసిన బ్రహ్మ బాపు తమల్ని వదిలి మరల రాని లోకాలకు తరలి పొతే ఆ పాత్రలు కార్చే కన్నీటికి అంతూ దరీ ఉందా?’’ఇది బాపు స్ట్రోక్ ‘’అని గర్వం గా చెప్పుకొని తామూ ఆస్థాయి సాధిద్దామని ప్రయత్నించి విఫలురైన వందలాది చిత్రకారుల గుండెల్లో గూడుకట్టుకొన్న ‘’తమ చిత్ర దేవుడి’’ని మరిచి ఉండగలరా వీరంతా ?
చిత్రసీమలో అనుభవం లేకుండానే ‘’ కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలనే’’ చాలెంజీ తో ప్రవేశించి తన దర్శకత్వ ప్రతిభకు ‘’సాక్షి ‘’గా తీసి ‘’అబ్బోలు అమ్మోలు ‘’అందుకొన్న ఆ ‘’సత్తి బాబు ‘’ ,’’బతకరా బతకరా నూరేళ్ళు నిండుగా‘’అని పదే పదే పాడినా పట్టనట్లు దూరమైతే ఆ యూనిట్ నిస్చేస్టమై నీరుకారిపోదా?
సభల్లో ,సమావేశాలలో బాకాలు కాకాలు పట్టే జనాలకు దూరం గా మనో వల్మీకం లోనే రామాయణ భాగవతాలను దర్శించి ,గీసింది ప్రతిదీ చిత్రమే విచిత్రమే చిత్రాతి చిత్రమే అనిపించిన చేతికి వ్రేళ్ళకూ సహకరించిన ‘’కుంచే విలాపం ‘’ ఆ పెన్ను శోకం ఆర్చేదేవరూ తీర్చేదెవరు ?వుడ్ హౌస్ ను ఆపోసన పట్టి ఆ ఫుడ్ ను తెలుగు వారికి విందుభోజనం గా అందించిన ఆ సరస చిత్ర సల్లాపుని మర్చి పోయి తెలుగు హాస్యం తట్టుకోగలదా ?
ఆర్టిస్ట్ మోహన్ అన్నట్లు అపరూప చిత్ర శిల్ప కళా సాంప్రదాయాన్ని ,మన రేఖా చిత్ర పరంపరను అందించిన స్రష్ట ను తలచుకొని ఆ సాంప్రదాయం ,చిత్రరేఖామాలికలు చేసే మౌన రోదనానికి అడ్డు పడగలిగే వాడేవరు ?ఎన్ని కావ్యాలకు ,కధలకు నవలకు ముఖ చిత్రాలు గీశాడో లెక్క చెప్పగలమా? ‘’గంగావతరణ ‘’కావ్యానికి గీసిన ముఖ చిత్రం ఆయన అలౌకిక దృష్టికి ప్రతక్ష నిదర్శనం .జనార్దనాస్టకానికి జగన్మోహననం గా వేసిన ముఖ చిత్రం ఎన్నికాలాలు గడిచినా మరుగున పడుతుందా ?గాలిబ్ ను తెలుగు నేలపై నిల బెట్టిన ఘనత ఆయనదేగా .పర్షియన్ చిత్రాల వరవడిని అందులో దర్శింఛి పరవశిం చమా ? .ఏ దేశ చిత్రమైనా ఆ దేశ సంప్రదాయాన్ని క్షుణ్ణంగా ఆకళింపుప చేసుకొని పరిపూర్ణం గా చిత్రించిన బాపు శేముషికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ? బాపు వేసిన ‘’డబల్ స్ప్రెడ్ ఇలస్త్రేషన్లు ‘’మనకొక కుదుపు నిచ్చి ఏంతో ఎత్తున నిలబెట్టాయి .మన పాఠకులకు ‘’కొత్త రుచిని ‘’ అందించింది మాత్రం బాపు యే.ఇపుడు ఇదంతా శూన్యమేగా ?పూరించే చిత్రనాదుడేవ్వడు’?అని ఆవేదన చెందటం లేదా?
హాపీ పిక్నిక్ గా అందాల రాముడిని చూపించినా ,’’బుడ్డి’’ మంతుడిలో బుద్ధి మంతుడిని చూపినా ,తెలుగింట్లో అచ్చం ముత్యాల ముగ్గు వేసినా ,,పెళ్ళాన్ని’’ మిస్టర్’’, ను చేసినా ,పెళ్లి పుస్తకాన్ని ‘’చిత్రించి నా,గోరంత దీపానికి కొండంత వేలుగునిచ్చినా ,రామాయణం తీసినా భాగవత కధలు చెప్పినా బాపు మార్కు ముద్ర ఉంటుంది .మనసుకు హత్తుకుంటుంది .గుండెను కదిలించి కళ్ళను చెమరరింప చేస్తుంది .అన్నిటిలో అంతర్వాహినిగా ,ఆయనకు పారాయణం అయిన రామాయణం ఉండటం ఆశ్చర్యం కాదు ,ఆనందంమే . దానిని మించి కద లేదనేది ఆయన నిశ్చయ మైన అభిప్రాయం .ఏది చెప్పినా దాని చుట్టూనే నే తిరగటం ఆయనకిష్టం ,అభిమానం ,ఆదర్శం .అంతటి తపస్సు చేసిన చిత్ర శిల్పి బాపు .మరివన్నీ మాగతేమిటి అని బావురు మనవా?.’’కొంటె బొమ్మలతో ‘’కితకితలు పెట్టించాడు .వ్యంగ్యాన్ని ,రంగరించి తీయని మెత్తని గాయాలు చేశాడు .బాపు బొమ్మకు ‘’షేక్స్ పియర్ ‘’అయినా నవ్వి తీరాల్సిందే .నవ్వక పొతే వాడొక వేస్ట్ అనాల్సొస్తుంది .
‘’కుసింత కలా పోసిన ‘’సేసిన రావు గోపాలరావు కాంట్రాక్టర్ అవతారం లో నటనా విశ్వ రూపాన్ని చూపించి ,బక్కపలచాటి శోభన్ ను శ్రీరామునిగా శోభాయమానం గా తీర్చి దిద్ది ,సంగీతను ‘’ముగ్గు ‘’లో ముత్యం లా కూర్చోబెట్టి జయప్రదను సీత గా ‘’సీతా కళ్యాణం ‘’లో నయన మనోహరం గా చూపించి ,గంగావతరణాన్ని ‘’దృశ్య ప్రబంధం ‘’గా చూపి ,నూతన్ ప్రసాద్ తో ‘’కొత్తా దేవుడి ‘’అవతారానెత్తించి ,వాణిశ్రీకి మేకప్ శూన్య వేషం తో కొండంత వెలుగు నిచ్చి ‘’ రాజేంద్రుడికి ‘’నటకిరీటి’’రావటానికి సానబెట్టి , కళాకారుల్లో ఉన్న సమర్ధత ,సామర్ధ్యం నటనా ప్రతిభను వెలికి తీసి వారికొక అస్తిత్వాన్నిచ్చిన వాడు బాపు .ఈ పాత్రలన్నీ తమ సంగతేమిటి అని విచార వదనం తో విలపిస్తున్నాయి .
బాపు దృశ్యం కనుల పండువు గా ఉంటుంది .తెలుగింటి లోగిలి లా ఉంటుంది .ముత్యాల ముగ్గులా ఉంటుంది .అచ్చ తెనుగు తీపిదనం లా ఉంటుంది .కళ్ళు సంతృప్తి తో ,మనసు ఆనందం తో ,హృదయం పరవశం తో నిండిపోతుంది .అదే బాపు ప్రత్యేకత .
చిన్నపిల్లల పుస్తకాలను కళాత్మకం గా ,ఆకర్షణీయం గా తీర్చి దిద్దిన ఘనత బాపు –రమణ ల జంట దే . ఆ పుస్తకాలను పట్టించుకోక పోవటం తో అవి గోడౌన్ లో గోడు గోడున ఏడుస్తున్నాయి .ఇందర్ని ఏడిపించి బాపు హాయిగా నవ్వు కుంటూ పైలోకాలకు చేరిపోయాడు .
బాపు ఒక చెరగని సంతకం .ఒక లిపి మాంత్రికుడు .స్నేహం లోని తీపిదనాన్నిఅరవై ఏళ్ళకు పైగా రమణ తో అనుభవించి లోకానికి ఆ మాధుర్యాన్ని, ఆదర్శాన్ని అందించిన వాడు .చివరికి పద్మ శ్రీ పొందినా ఆయన ప్రతిభకు అది నామ మాత్రం .తెలుగు వాడు ఛాతీ విరిచి గర్వం గా చెప్పుకోదగ్గ పేరు బాపు ది.తెలుగు సంస్కృతికి ఆనవాలు . తాను క్షరమైనా తెలుగు అక్షరాలకు శాశ్వతత్వం కల్పించి చిరంజీవి అయ్యాడు బాపు . భారత దేశానికి’’ ఆ బాపు ‘’,ఆంధ్ర దేశానికి ‘’ఈ బాపు ‘’ చిరస్మరణీయులు ,మార్గ దర్శులు ,మహితాత్ములు .ఇలాంటి ‘’బాపు లు’’ ఇక జన్మించరు
.ముళ్ళపూడి , బాపు దర్శనం ముళ్ళపూడి విశేషాలు ముళ్ళపూడి , బాపు దర్శనం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-14-ఉయ్యూరు


