అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -4(చివరి భాగం )

Inline image 1  Inline image 2

సాల్వ రాయలు ఒక రోజు వెంకటేశ్వర స్వామిపై శృంగార కీర్తన చెప్పమని కోరాడు .మళ్ళీ పాత  శృంగార  వాసన గుబాళించి ‘’ఏమొకో !చిగురు టధరమున –యెడ నేడ కస్తూరి నిండెను ‘’అని లంకించుకొని ‘’ఉడుగని వేడుకతో బ్రియుదోట్టిన నఖ శశి రేఖలు –వెడలగా వేసవి కాలపు వెన్నెల కాదుకదా –‘’అని విజ్రుమ్భించి చెప్పాడు నాదనామక్రియ రాగం లో .రాయలు సంతోషపడి అన్నమయ్య వ్యక్తిత్వాన్ని మరచిపోయి తనపై అలాంటి పదాన్నే చెప్పమన్నాడు .చెప్పనన్నాడు .బ్రతిమిలాడటం పోయి బెదిరింపు లోకి దిగినా అయ్య ఏమీ చలించలేదు .అధికార మదం ఒళ్ళంతా నిండి పూర్వం తనను రాజువుకమ్మని దీవించిన గురువునే సంకెళ్ళ తో బంధించి చెరసాలలో పెట్టాడు .రాజు కండకావరాన్ని పోగొట్టేది ఒక్క శ్రీని వాసుడే అని నమ్మి ఆయనపై ముఖారి లో ‘’ఆకలి వేళల ,నలపైన వేళల –తేకువ హరినామ మే దిక్కుమరి లేదు  ,-కొరమాలి యున్న వేళ ,కులము చెడిన వేళ-జెరవడియోరులచే జిక్కిన వేళ-నోరపైన హరినామ మొక్కటే గతి గాక – సంకెల బెట్టిన వేళ,చంప బనిచిన వేళ-అంకిలిగా నప్పుల వారాగిన వేళ-వేంకటేశు నామమే విడిపించ గతి గాక –మంకు బుద్ధి బొదలిన మరి లేదు తెరగు ‘’అని ఆర్తిగా వేడుకొన్నాడు .రాయలకు భయం వేసింది .అంతటి మహానుభావుడు శపిస్తే తన జీవితం వ్యర్ధం .సాధించింది నిష్ప్రయోజనమ అనుకోని ఇక ఆయన జోలికి వెళ్ళలేదు

ఈ ఉదంతం తర్వాత  తాళ్ళాపాకకో తిరుపతికో చేరి ఉంటాడు .మళ్ళీ సాల్వుని తో ఎప్పుడూ సంబంధం పెట్టుకొన్నట్లు లేదంటారు పుట్టపర్తి వారు .తనకున్న భగవద్ భక్తీ ప్రదర్శితం అవుతోంది అవసరమైన చోట్ల. కాని భగవంతుని దర్శనమే కావటం లేదని దిగులేక్కువైంది అన్నమయ్య లో .శ్రీనివాసుడు ఆయనతో దోబూచు లాడుతున్నాడు .కొందరు సాహితీకారులు అన్నమయ్య జాతీయాలను ‘’దొబ్బేసి ‘’తమవిగా చేసుకొని ఠీవి వెలిగిస్తున్నారు .పదాలకు నకళ్లు రాసుకొని సొమ్ములు చేసుకొంటున్నారు .ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా బయట పడి ఆయన చెవులకు చేరుతున్నాయి .అప్పుడు తన మనోభావాలను ‘’రామ క్రియ ‘’లో ఇలా తెలియ జేసుకొన్నాడు .’’వెర్రు లారా!మీరు వేరుక కలిగి తేను –అర్రు వంచి తడుకల ల్లంగ రాదా!ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము కాదు –కుడిచి వేసిన పుల్లె కుడువ గా రాదు –బడి నొకరు చెప్పిన ప్రతి చెప్ప బోతేను –అదరు శ్రీహరికిది అరుహము కాదు’’అని అంటూ ‘’చిబికి వేసిన గింజ చేత బట్టగ నేల-కబుక కెంగిలి బూరె గడు గంగ మరినేల?-మించు చద్ది కూటి మీద నుమిసినట్లు –మంచిదోకటి చెప్పి మరి చెప్పనేరక –పుచ్చి నట్టి పండు బూజు లోననె యుండు –బచ్చెన కవితలు బ్రాతిగావెందు-‘’అని చివరికి ‘’ఎన్నగ శ్రీ వేంకటేశు తాళ్ళపాక –అన్నమాచార్యులు అఖిల దిక్కులు మెచ్చ –ఉన్నతితో బాడిరాక డేవ్వ డాను –సన్న నోరాసు నట సమ్మతా హరికి?అని ఏకి పారేసి శ్రీహరినే నమ్మాడు .

కీర్తి,కనకాలు వర్షిస్తూనే ఉన్నాయి .పదకవితా పితామహుడని పించుకొన్నాడు ఆ తర్వాత ‘’సంకీర్తనా చార్యుడు’’అని పేరొందాడు .ఇక ఇక్కడి నుండి అన్నమయ్య సాధన ప్రారంభం అయింది అన్నారు సరస్వతీ పుత్రులు నారాయణా చార్యుల వారు .ఇప్పటిదాకా సంసారం ‘’అమృతపు నడబావి ‘’అని పించింది .ఇప్పుడు లోవేలుగు క్రమం గా ఆక్రమిస్తుండగా  సంసారం ‘’జలధి లోపలి ఈత ,జము నోటిలో బతుకు ,చమురు తీసిన దివ్వె ,సమయించె పెను దెవులు ,సమరాన ఉనికి ,సంగటి కట్టిన త్రాడు ,చంద్రుని జీవనం ,చలువ లోపలి వెండి ,జలపూత బంగారు ‘’అని పించి రోత పుడుతోంది .ఇప్పటివరకు స్త్రీ లను చూసిన చూపు ‘’అంగనల ముఖామ్బుజాలు  అంగడికి ఎత్తిన దివ్వెలు  ,కుచయుగాలు ముందటి పసిడి కుండలు ,ఇతవులైన మోపులు ఎంగిలి చేసిన తేనెలు ,యెడ నేడ కూటాలు ‘’అనిపించాయి .

అప్పుడెప్పుడో కలో కనపడ్డ స్వామి సాక్షత్కారించటం లేదేమి ?అని వితర్కిన్చుకొన్నాడు .తన తప్పే కాని స్వామి తప్పు లేదని తెలుసుకొన్నాడు .’’యెంత మాత్రమున ఎవ్వరు తలచిన అతడు అంతమాత్రమే .ఘన బుద్ధులకు ఘనుడు .అల్ప బుద్ధులకు అల్పుడు .నీటికొలది తామర .’’అనుకొంటూ వదలకుండా స్వామి వెంట బడ్డాడు .అన్నమయ్యకు తెలిసో తెలియకో కొన్ని మహాత్యాలు జరిగాయి .తమ బాధలు ఈయనే తీరుస్తాడని భక్త బృందాలు తయారయ్యాయి .తాను భగవత్ సాక్షాత్కారానికి పరి తపిస్తుంటే మళ్ళీ ఈ గుది బండలేమిటి ?అని బాధ పడ్డాడు .స్వామిపై విరహం తో వేగిపోతున్నాడు .’’మగడువిదిచినా మామ విడువ నట్లు ,నగినా ,మనసు రాసినా లోకులు మానరు .తగిలేరు పోగిలేరు ,దైన్యమే చూపేరు ,మొగమటలనేరు .దేవుడు ఇచ్చనా పూజారి వరం ఇవ్వనట్లు ,ఈ బుడి బుడి సంగాతాలతో నేను ఎన్నాళ్ళు పోగాలాలి “”/అని వేడుకొన్నాడు వెంకటేశ్వరుడిని .బతుకు అనిత్యం అని తెలిసినా బ్రతుకు పై పేరాశ ఉందని ప్రాణం అంటే తీపి చావు అంటే వెరపు అజ్ఞానికి జ్ఞానం ఎలా కలుగుతుంది .సిగ్గు లేకుండా వేడుకొంటున్నాను నీచేతి లోని వాడిని .నువ్వే విచారించికాపాడాలి ‘’అని పరిపరి విధాల ఆవేదన చెందుతున్నాడు .

సంసారమే మనసైన తనకు’’ జియ్యా’’ ఏ దిక్కు అన్నాడు .పుడమిలో బతుకులు పున్నమి అమావాసలు .అని బావురుమని పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు .కాని జాలాది కవి అన్నట్లు  శ్రీనివాసుని హృదయపు’’ పొంత ‘’మాత్రం నిండటం లేదు .తేనే లోపలి ఈగలా బతుకుతున్నానన్నాడు .గజ రాజు బతుకు అయి కడలేని మనసైందిట .నడివీధిలో జంతువులా ఉన్నాడట .గడకు కట్టిన పాత గుడ్డలా మనసు అని  పిస్తోంది .ఒక్క చోట నిలవటం సాధ్యం కావటం లేదు ఆవేదన పెరిగి ఆసులో గొట్టం లాగా తాళ్ళ పాక  తిరుమలకు తిరుగుతూనే ఉన్నాడు .ఇప్పుడు స్వామి మునుపటిలాగా కనపడటం లేదు అన్నమాచార్యులకు . .నైవేద్యాలు అలంకారాలు అసలు దృష్టిలోకి రావటం లేదు .శ్రీహరి పాద తీర్ధం కొత్తగా కనిపిస్తోంది ,అనిపిస్తోంది .అది ‘’మోహ పాశాలు కోసి మోక్షం ఇచ్చే మందుగా ‘’అని పించింది .కడు చల్లనైన మందు అయింది .గురుతైన రోగాలను కుదిర్చే మందుగా ఉంది .దురితాలు బాపే దొడ్డ మందు . బ్రహ్మాదులు సేవించే మందనిపించింది  ఆయనకిప్పుడు .నరకాన్ని పోగొట్టే నమ్మక మైన మందు అయింది స్వామి తీర్ధం.ఇప్పుడు అదీ పరిణతి ఆయన సాధించింది .అంటే అన్నమయ్య ప్రస్తానం లో మరో సోపానం ఎక్కాడన్నమాట .

శ్రీరాగం లో ‘’నిత్యాత్ముడై యుండి నిత్యమై వెలుగొందు –సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు –ప్రత్యక్షమై యుండి ,బ్రహ్మమై యుండు ‘’అని స్వామి అసలు రహస్యం అర్ధం చేసుకొన్నాడు .’’ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత-డేమూర్తి నిజ మోక్ష మియ్య జాలెడు నాత-డే మూర్తి లోకైక హితుడూ –ఏ మూర్తి నిజ మూర్తి  నే మూర్తి యును గాడు ,-ఏ మూర్తి త్రై మూర్తు లేకమై యాత-డేమూర్తి సర్వాత్ముడైన మూర్తి –ఆ మూర్తి తిరు వెంకటాద్రి విభుడు ‘’అని స్వామి సర్వాన్తర్యాన్ని ,త్రిమూర్తి స్వరూపాన్ని మనసులో దర్శించాడు .’’ఏ వేల్పు పాదయుగ మిలయు నాకాశంబు –ఏ వేల్పు పదమీ శాన్తంబనంతంబు –ఏ వేల్పు నిశ్వాస మీ మహా మారుతం-బె వేల్పు నిజ దాసు లీ పుణ్యులూ –ఏ వేల్పు సర్వేషు డేవేల్పు పరమేశు –డేవేల్పు భువనైక హిత మనో భావకుడు –ఏ వేల్పు కడుసూక్ష్మమే వేల్పు కడు ఘనము-ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడూ ‘’అని అలౌకిక ప్పారవశ్యం తో వొడలు తెలియక పాడాడు .దీనినే భక్త రామదాసు సినిమాలో శ్రీరాముడిపై  పేరడీ చేయించి   తండ్రీ కొడుకులు నాగేశ్వరరావు  నాగార్జున కబీరు రామదాసుల చేత సంగీత కర్త కీరవాణి రచయిత బారవి అన్నగారు  వేదవ్యాస తో రాయించి  ఉన్నికృష్ణన్ ?(హరిహరన్? )చేత  గుక్క తిప్పుకోకుండా పాడించి హిట్ చేశాడు .

మళ్ళీ తాళ్ళపాకలో కాపురం ఉన్నాడు .ఉన్నాడుకాని మనసులో దిగులే .’’నాకెట్లు కైవశం అవుతావు కోనేటి రాయా !నిన్నెట్లా మెప్పించాలి ?నాకోరిక యెట్లా తీరుస్తావు?’’అని మనసులో నివేదిన్చుకొంటూ నే ఉన్నాడు .గుండె దిటవు చేసుకొంటున్నాడు మళ్ళీ దైన్యం ..ఇవన్నీ భక్తుల జీవిత ప్రస్తానం లో సోపానాలే .ఒక్కో మెట్టు ఎక్కుతూ పోవాల్సిందే అదే బాధ అన్నమయ్యా పడుతున్నాడు .ఆగలేక ,ఓపలేక నిందలు మోపాడు నల్లనయ్య మీద ‘’వెన్నలు దొంగిలించావు .తల్లి బిడ్డల్ని వావి వరసా లేకుండా చేసుకొన్నావు .పెద్ద చేపవై చిన్న చేపల్ని నవిలి మింగావు .నీబామ్మర్దిని రధానికి కట్టించావు .సురభామినులతో సరససల్లాపాలాడావు . .బోయే దాని ఎంగిలి కుడిచావు .బలిని పాతాళానికి తోక్కేశావు  శ్రీసతి పాదాలను నీ మెడలో అంట గట్టుకోన్నావు ‘’అని చేరిగిపారేశాడు ,అక్కసంతా వెల్ల బెట్టుకొన్నాడు పాపం .

ఇప్పుడాయన తెలివి తేటల్ని దూషిస్తున్నాడు ‘’ఓరోరి వేంకటేశా!నా లాగా వెర్రి వెంగళప్పవు .నిన్ను కాదన్న వాళ్ళనీ మోస్తూనే ఉన్నావు .’’నార సేరు ‘’అని పొరపాటున అన్నా అది నీ పేరే భక్తుడు తలచాడని సంబరపడే వెర్రి బాగుల వాడివి .నీ సేవకులకే నువ్వు దాస్యం చేశావు .కుచేలుని అటుకులనే మెచ్చిన నీ రసహీనతకు నవ్వొస్తోంది ‘’అని దేప్పాడు .ఇదో మెట్టు .ఈ సీను అవగానే ‘’నేను ఒక్కడినీ లేక పొతే నీ కృపకు పాత్రత ఏముందయ్యా !నేను కీర్తిస్తేనే నీకు కీర్తి వచ్చిందయ్యా ‘’అని సవాలు చేశాడు .అహం తగ్గింది.చేసిన పాపాలు చెబితే పోతాయి అన్న సామెత ప్రకారం చెప్పి లెంప లేసుకొన్నాడు ‘’నా పాపాలకు నరకాలు చాలవు .నేనేత్తిన జన్మలను రాయటానికి వనం లో తాటాకులు చాలవు .నా ఆచారపు ఎంగిలి ని నదులేవీ పావనం చేయలేవు .స్వామీ !నేను నీ సూత్రపు ప్రతిమను మాత్రమె .నా గుణాలను ఎంచకు .నీ గుణాలకు తగ్గట్లు ప్రవర్తించు .కామాదుల కారడవిలో చిక్కి జ్ఞాన మార్గం తప్పాను ‘’అని తహతహ లాడాడు అన్నమయ్య .

నరజన్మ  ను  అసహ్యిం చుకోన్నాడు .స్వామి దయ లేకుండా ఎవరూ దరి చేరలేరు .తానూ ఆయన్ను కనుగొన లేదని కినుక ఎందుకు అన్నాడు .’’అసలు మాటకు వస్తే ఎవరు నిన్ను నిజం గా కనుక్కున్నారయ్యా !జటాయువుకు మోక్షమిచ్చావు .రాతికి ప్రాణమిచ్చావు .నిన్ను వాళ్ళు నమ్మారా?నువ్వు నరుడివి అని గేలిచేశారు మారుతికి బ్రహ్మ పదవి ఇచ్చావు .రాక్షస సంహారం చేశావు .కాని నిన్ను రాజు అన్నారు అది రాజ విధి అన్నారు .దశరధ తనయుడేకదా అన్నారు .ధర్మరాజే నిన్ను ‘’మరది ‘’అని చనువుగా మాట్లాడాడు .లోకం లో నిన్ను అర్ధం చేసుకొన్నది ఎవరయ్యా !బాణాసురుని చంపితే నువ్వుదేవుడు అని నమ్మను కూడా నమ్మ లేదు .నరకుని చంపి పదారు వేల మందిని పెళ్లాడితే ఎవరికీ పట్టనే లేదు .విశ్వ రూపం చూపించి అందరి కనుల మాయ తొలగించినా , ద్రౌపదిని కాపాడినా ,బ్రహ్మ చేత మొక్కిన్చుకొన్నా నిన్ను దేవుడని నమ్మనే లేదు లోకులు పలుగాకులు .’’అని లోక రీతిని బయట పెట్టాడు ‘          భౌతిక పరిధులు క్రమంగా విస్తరిస్తున్నాయి . సంకుచితం దూరమైపోతోంది .విశాల భావన వెలుగై తోస్తోంది .పరమేశ్వరత్వం విశ్వవ్యాప్తం అన్న ఎరుక కలిగింది ‘’యెలమి హరిదాసు లే జాతి యైన నేమి ?తలమేల ?కులమేల?తపమే కారణము ..గుల్లలో ముత్యం పుడుతుంది .మహాను భావులు ఎక్కడ పుట్టినా ఒకటే .చిడిపి రాళ్ళలో వజ్రాలు పుడతాయి. ఈగల వలన తేనే వస్తుందికదా .బురదలోని తామరకు సుగంధం లేదా? పనికి రాణని జంతువుకు పరిమళ భరిత జవ్వాది పుట్టటం లేదా ?కీటకం నోటిలోంచి పట్టు దారం రావటం లేదా?కనుక వేంకటేశుని కొలిచే దాసులు ఎందులో పుట్టినా గణన కేక్కుతారు అని నిశ్చయం గా చెప్పాడు .పరిపక్వతకు చేరువౌతున్నాడు అన్నమయ్య .

భగవత్ అపచారం భాగవతుల యెడ అపచారం లేకుండా  దురహంకారం  లేకుండా ,సుఖ దుఖాలకు లోనుకాకుండా ,అజ్ఞానుల తో కలవ కుండా ,పరిశుద్ధ మనస్సుతో ఉండేదే పరమ వైష్ణవం అని తెలిపాడు .ప్రపత్తి కలగాటమే పరమ వైష్ణవం  అని చెప్పాడు .’’పరమ వైష్ణవాచార సంపత్తియే సంధ్యా వందనం .అనుకోని ఇంకోమేట్టేక్కి కర్మ మార్గానికి దూరమైనాడు అన్నమయ్య .తనకు ఏ రకమైన శక్తీ లేదని దేవుడికి విన్న విన్చుకొన్నాడు .శక్తి ఉంటె స్వామి సరసనే  ఉండే వాడిని కదా అనుకొన్నాడు .కర్మం ధర్మం దేవుడు కల్పించినవే. ఆయన ఎలా కావాలనుకొంటే అలా అవుతుంది అని నిశ్చయించుకొన్నాడు .’’నా అజ్ఞానం సహజాతమే కదా .నేను జ్ఞానిని అయితేనే నువ్వు రక్షిస్తావా?’’అని సవాలు విసిరాడు .’’నా మనసు నీ అధీనం .నేను ఆడే మాటలు నీవే .ఈ తనువూ నువ్వు పుట్టించినదే .నీ ఆజ్ఞతో దీన్ని మోస్తున్నా ను బతుకు ఈడుస్తున్నాను .నేను నీవు చేసిన మానిసినే .వెలి నీవే  ,లో నీవే వేడుకలన్నీ నీవే ‘’అని అద్వైత భావన మనసంతా వ్యాపించి జీవిత ప్రస్తానం లో శిఖరానికి చేరుకొన్నాడు .

‘’హరి దలచు పంచ మహా పాతకుడైనా  బ్రాహ్మణోత్తముడే .అన్నాడు ‘’శరణు అంటున్నా . .నీ నామం భవ హరం .’’అని హాయిగా భారం అంతా శ్రీనివాసుడిపై బెట్టి నిశ్చింతగా కూర్చున్నాడు అన్నమయ్య .భాగవతులకు పరవశమే ఆభరణం .’’మహా వేదో నామమయ మైన జీవితం గడిపినవాడు సర్వోత్తమమైన ముక్తిని పొందాడు .’’అసాధారణ భావన ,స్వతంత్ర మధుర ధారా ,విషయ వైవిధ్యం అన్నమయ్య కవితలో ప్రధాన గుణాలు ‘’అని మాన్యులు శ్రీ రాళ్ళ పల్లి  అనంత  కృష్ణ శర్మ గారు అంటారు .పుట్టపర్తి వారు ‘’తెలుగు పదాలను జోడించటం లో తిక్కనకు కుడి చేయ్యి అన్నమయ్య  .భావ విశ్రుం ఖలతలో తిక్కన అన్నమయ్యకు సరి కానే కాడు.భాష మైనం లాగా వంగిపోతుంది .ఒక్కొక్క భావం ఒక్కొక నందన వనం .అన్నమయ్యలో కవిత్వాన్ని వెతకటం అంటే స్సముద్రానికి ఏతం వేయటమే .అది  సర్వాం గీణమైన చక్కర బొమ్మ .పదాలు  అర్ధ భావ గంభీర సంగీతమయం .త్యాగరాజు లాగా నాద ప్రదానమైనవికావు .అన్నమయ్య ప్రయోగించిన జాతీయాలు నానుడులు అనేక ప్రబంధాలకు జీవనౌషదాలు .అన్నమయ్య గాంధర్వ లోకం నుంచి అవతరించి  పదనామ సంకీర్తనలతో ముక్తి పొందిన ధన్యుడు ‘’అన్నారు

ముందే చెప్పినట్లు ఈ వ్యాస పరంపరకు ఆధారం పుట్ట పర్తి వారి ‘’త్రిపుటి’’అని మరో సారి మనవి చేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-14-ఉయ్యూరు

.

 

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.