చారిత్రక శిథిలాల నుంచి నలంద మళ్ళీ ఊపిరిపోసుకుంది. గతించిపోయిన ఓ జ్ఞాపకం ఎనిమిది వందల సంవత్సరాల తరువాత చిగురులు తొడిగింది. ఈ మహోన్నత జ్ఞాన కేంద్రం మళ్ళీ ప్రభవించినా తగిన ప్రాచుర్యం దక్కకపోవడం విచిత్రం. అబ్దుల్ కలామ్ ఆలోచన, అమర్త్యసేన్ ఆశయం ఎనిమిదేళ్ళ తరువాత ఆచరణ రూపం దాల్చినందుకు సంతోషించాలి. బీహార్‌లోని రాజ్‌గిరిలో శిథిల నలంద విశ్వవిద్యాలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రాంగణం రూపుదిద్దుకొనే వరకూ ఒక తాత్కాలిక కేంద్రంలో సోమవారం నుంచి బోధనలు మొదలయ్యాయి.
దాస్యశృంఖలాలు తెంచుకున్న తరువాత ఏ దేశమైనా తన చారిత్రక మూలాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. విధ్వంసమైన తన చరిత్రను తిరగరాసుకుని, విజ్ఞాన, సాంస్కృతిక చిహ్నాలకు ప్రాణప్రతిష్ట చేయడానికి నడుంబిగిస్తుంది. అస్తిత్వ పునరుద్ధరణకు సంకల్పిస్తుంది. సమున్నతమైన వారసత్వాన్నీ, ఔన్నత్యాన్నీ చాటిచెప్పడం కోసం తాపత్రయపడుతుంది. బౌద్ధయుగంలో తక్షశిల, నలందాలు విశ్వమానవులకు విజ్ఞానాన్ని పంచిన మేథోకేంద్రాలు. విదేశీయుల దాడులతో తక్షశిలకు ప్రమాదం ఏర్పడుతున్న దశలో గుప్తుల రాజధాని పాటలీపుత్రానికి చేరువగా నలంద అవతరించింది. పదికిలోమీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉన్న సువిశాల ప్రాంగణంలో, విశాలమైన బోధనా ప్రాంగణాలతో, పదివేలమంది విద్యార్థుల నివాసానికి సరిపడా సౌకర్యాలతో ఈ విశ్వవిద్యాలయం ఉండేదంటారు. శిథిలరూపంలో ఉన్నప్పటికీ నాటి వైభవానికి ఆనవాళ్ళు ఇప్పటికీ అక్కడ మిగిలేవున్నాయి. ప్రధానంగా బౌద్ధ ధార్మిక విజ్ఞాన అధ్యయన కేంద్రంగా పనిచేస్తూ, చిత్రకళ, వైద్యం, జ్యోతిషం, గణితం, వాస్తు, భౌతిక, దర్శనశాస్త్రాల్లో కూడా బోధన అందించేది. ధనుర్విద్యా కేంద్రమూ, అస్త్రశస్త్ర ప్రయోగశాలలూ అనుబంధంగా ఉండేవంటారు. ఏడవ శతాబ్దానికి చెందిన చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ ఈ విశ్వవిద్యాలయంలోనే అభ్యసించిన తొలితరం విద్యార్థి. బోధకుడు కూడా. అనంతర కాలంలో బౌద్ధం క్షీణించడమూ, భారత చక్రవర్తుల నుంచి ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంతో ఈ విశ్వవిద్యాలయం ప్రాభవం తగ్గిపోవడం మొదలైంది. విదేశీయుల దండయాత్రల్లో భాగంగా, 1193లో కుతుబుద్దీన్ ఐబక్ సైన్యాధ్యక్షుడైన మహ్మద్‌బిన్ బక్తియార్ ఖిల్జీ దానిని ధ్వంసం చేసి తగులబెట్టాడు. ఇంగ్లండ్‌లో ఆక్స్‌ఫర్డ్, ఇటలీలో బలోగ్నా (బలోనీ) విశ్వవిద్యాలయాలు మొగ్గ తొడుగుతున్న కాలంలో నలంద కథ ముగిసింది.
తక్షశిల మనదేశంలో లేకపోయినా నలందను పునరుద్ధరించవచ్చునన్న ఆలోచన మన పాలకులకు రాకపోవడం విచిత్రం. 2006లో అబ్దుల్ కలామ్ బీహార్ అసెంబ్లీ సంయుక్త సమావేశంలో చేసిన ప్రస్తావనతో నలంద పునరుత్థాన ప్రస్థానం మొదలైంది. బీహార్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తక్షణం ఆమోదించి 455 ఎకరాలు కేటాయించింది. కేంద్రప్రభుత్వం రెండున్నరవేల కోట్లు ఖర్చుచేస్తోంది. నిర్మాణం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమై, 2020 నాటికి పూర్తవుతుంది. పదివేలమంది విద్యార్థులు, పదిహేను వందల మంది ఉపాధ్యాయులతో ఒక వెలుగు వెలిగిందని చెబుతున్న అప్పటి నలందా, ఇప్పుడు తెలుగు విద్యార్థిని కందుల జ్యోతిర్మయి సహా 15 మంది విద్యార్థులు, 11 మంది ఉపాధ్యాయులతో తన మలి ప్రస్థానాన్ని మందగమనంతో ప్రారంభించింది. పరిశోధనల లక్ష్యంతో ఏర్పాటవుతున్న ఈ విశ్వవిద్యాలయంలో సంఖ్య కంటే సామర్థ్యానికే ప్రాధాన్యం కనుక నలభై దేశాల నుంచి వచ్చిన వెయ్యి దరఖాస్తులను వడకట్టినట్టు చెబుతున్నారు. ఇవే ప్రమాణాలు విద్యార్థుల ఎంపికలోనూ, ఇంకా ముఖ్యంగా ఉపాధ్యాయుల ఎంపికలోనూ కొనసాగించవలసిందే. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయం విదేశాంగశాఖ పరిధిలో ఉంది కనుక విదేశీ విరాళాలకు చాలా అవకాశం ఉంది. జపాన్, సింగపూర్, చైనా, కొరియా, ఆసే్ట్రలియా ఇత్యాది దేశాలు కూడా ఈ విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. గత ఏడాది మన్మోహన్ సింగ్ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఏడుదేశాలతో ఒప్పందం చేసుకున్నారు కూడా. అయితే, ఇప్పుడు చేరిన విద్యార్థుల్లో వాటిలో చాలా దేశాల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం విచిత్రం. నెలాఖరున అధికారికంగా ఆరంభమైన తరువాత గ్లోబల్ స్థాయి విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలి.
నలంద కేవలం మరొక విశ్వవిద్యాలయంలాగా మిగిలిపోకూడదు. గత కాలపు వైభవాన్ని సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో ప్రాచుర్యం పొందాలంటే అలనాటి విలువలూ, రాబోయే కాలం నాటి ఆధునికతా మేళవించుకోవాలి. ఇప్పటి విశ్వవిద్యాలయాల్లో లోపించిన క్రమశిక్షణ, పరిశోధనల్లో జరుగుతున్న మేథోచౌర్యం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదు. అలనాటి నలంద గురించి హ్యుయాన్‌త్సాంగ్ చెప్పినట్టు అత్యున్నత క్రమశిక్షణ, అద్భుతమైన అంకితభావం విలువలుగా ఆచరించాలి. ఎనిమిదివందల ఏళ్ళనాటి నలందా రూపాన్ని యధాతథంగా అనుకరించడంతో సరిపోదు. వనరుల వినియోగం విషయంలో ప్రకృతితో మనిషి ఉన్న అనుబంధాన్ని అది నేర్పిన విధంగా ఇప్పుడు కూడా నేర్పాలి. మనిషి మనీషిగా ఎదగడానికి మార్గం సుగమం చేయాలి.
జపాన్ లో” నేతాజీ ”సహచరుడైన 99 ఏళ్ళ ”సయికిరో మిసిమి ”తో ప్రధాని మోడీ సమావేశం
![]() |
| టోక్యో, సెప్టెంబర్ 3 : మోదీ తమ జపాన్ పర్యటనలో ఈ పెద్దాయనతో నాలుగు మాటలు ఆప్యాయంగా మాట్లాడారు. కుశల ప్రశ్నలు వేశారు. 99 ఏళ్ల వయసులో ఈ పెద్దాయన ఓపిక చేసుకుని మోదీ ప్రసంగం వినడానికి విచ్చేశారు. పెద్దాయనను ఒక నెలరోజుల పాటు ఇంటర్వ్యూ చేసి మంచి జీవిత కథను తయారు చేయాలని నరేంద్ర మోదీ తమ వెంట వచ్చిన టి.వి. సిబ్బందిని ఆదేశించారు. ఈ పెద్దాయన పేరు సయికిరో మిసుమి. ఇంతకీ ఈయన ఎవరంటారా? భారత జాతి రత్నం నేతాజీ సుభాస్ చంద్రబోస్‌తో అడుగులో అడుగు వేసి ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మహా మనిషి! |


