బాపు -సి.పిఐ కి బాకీ ఉన్నారు అన్న నారాయణ -మరియు బాపుపై కవితలు

బాపులేని సాంస్కృతిక-కళా రంగాలు చిన్నబోయాయి. నెమలి నాట్యంలా చేతి కుంచె నాట్యం ఆడుతుందా? జానపద, పౌరాణికం మొదలు వాలు జడల అట్రాక్షన్‌ వరకు తనదైన శైలిని రూపొందించుకున్న స్వయం శిల్పి బాపు. నేను చూసిన బాపు గారి చివరి సినిమా ‘శ్రీ రామరాజ్యం’. నయనతారను సీతగా రూపొందించిన విధానమెంతో అద్భుతం. నేనంతగా తన్మయత్వం చెందానంటే ఒక పంక్షన్‌లో సినీ నటులు బాలకృష్ణ కనిపించి, పలకరించారు. అనుకోకుండానే ‘శ్రీ రామరాజ్యం సినిమా చూశానన్నా’. ‘ఎలా ఉంది’? అని బాలకృష్ణ నన్నడిగారు. అసంకల్ప ప్రతీకార చర్యగా ‘సీత’ బాగా చేసిందన్నాను. వెంటనే నా పక్కనున్న ప్రముఖులు ‘కొంతన్నా లౌక్యం ఉండాలయ్యా’ అలాగ ‘కుండ బద్దలు కొడితే ఎలా’? అని మందలించారు.
చండ్ర రాజేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర తయారు చేయించాం. ఆ ప్రతిని బాపు గారికి పంపించాం. ముఖ చిత్రంతో పాటు లోపలి పేజీల్లో కూడా బొమ్మలు వేయమని కోరాను. రెండు నెలలు పడుతుందని చెప్పారు. తీరా వారి సన్నిహితుల ద్వారా మాకు తెలిసింది, ఇక బాపు గారి కుంచె ఆడే పరిస్థితి లేదన్నారు. ఇక చేసేది లేక స్థానికంగానే ఉమాశంకర్‌ ద్వారా ముఖచిత్రం గీయించుకుని గ్రంథం అచ్చు వేయించుకున్నాం. అయినా బాపు గారి హస్తం చండ్ర రాజేశ్వరరావు గారి గ్రంథంపై పడి ఉంటే సమాజం ఎంత సంతోషించి ఉండేదో. అయితే బాపు గారి బాకీ అలాగే చరిత్రలో నిలబడిపోతుంది. వారి కళామతల్లి సేవ అనిర్వచనీయమైనది. వారికివే నా జోహార్లు.
– డాక్టర్‌ కె. నారాయణ
            మా బాపూ వెళ్లి పోయావా !
ప్రపంచం యావత్తూ నిబిడాశ్చర్యంతో స్తంభించింది…
మాయమ్మ చచ్చిపోతే ఏడుపు రాలేదే
మా నాన్న చనిపోతే గుండె బరువెక్కింది
కానీ.. బాపు పోయారంటే
ఏడుపు ఆపుకోలేక పోయా
రామాయణాన్ని ఎవరైనా తీయగలరు..
కానీ బాపు తీస్తేనే అది సంపూర్ణ రామాయణం!
ముత్యాలముగ్గు, పెళ్ళి పుస్తకాలను
ఎవరు తీయగలరు..
మిస్టర్‌ పెళ్లాంతో గోరంత దీపాన్ని
ఎవరు వెలిగించగలరు…
ఇద్దరూ ప్రాణస్నేహితులంటారే
ఎంత నిర్దయగా
మిమ్మల్నీ మమ్మల్నీ వొదిలి పోయేరు రమణ
అంతకు మించి నిర్దయగా
రమణ నెదుక్కుంటూ వె ళ్ళి పోయారే..
ఏం పని మీకక్కడ…?
ఇంత మందిమి మేమంతా యేమైపోవాలిక్కడ..?
మా నామిని కతలకు బొమ్మలెవరు గీస్తారు
జీవితంలో ఒకసారన్నా మీ చేతులు తాకి,
భక్తిగా మీకు మొక్కాలనే ఆశ…
ఆశగానే మిగిలిపోయింది.. బాపూ..
వొరే బుడుగా
యింకేమాడతావురా సీగాన పెసూనాంబతో
నువ్వన్నా గుర్తు రాలేదా ఆయనకు…
వేళ్ల మధ్యలో ఏళ్ల కొద్దీ నలిగిన కుంచె
ఏం పాపం చేసింది స్వామీ…
ఇక్కడే పడేసి హడావుడిగా వెళ్లిపోయేవు
– దొండ్లవాగు శ్రీనివాస్‌, చిట్వేలి, కడప
 
బాపు -రమణాయణం 
 
బాపుది మరణం కాదు
ముళ్ళపూడి వెంకట రమణం..
బాపు మరణించలేదు
ముళ్ళపూడిని రమణించారు…
బాపుది రామాయణమే కాదు
అచ్చంగా ముళ్లపూడి రమణాయనమే..
నమో నమో బాపు
మాకు నువ్వు మార్గమే చూపు…
– వి.పి. చందన్‌రావు
నిజామాబాద్‌

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ముళ్ళపూడి & బాపు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.