భారతీయ సినీ భీష్ముడు దాదా సాహెబ్ కు ఇచ్చే మర్యాద ఇదేనా ?ప్రశ్నించిన నట ఊర్వశి -శారద

భారతీయచిత్రసీమకు నోబెల్‌ బహుమతి లాంటిది దాదాసాహెబ్‌పాల్కే అవార్డు. తన జీవిత సర్వస్వాన్నీ సినిమాకే అంకితం చేసిన ఆ మహానుభావుని పేరు మీద నెలకొల్పిన అవార్డు దక్కితే.. అదో కీర్తికిరీటంలా ఉప్పొంగిపోయే నటులున్నారు. కాని ఏ రోజైనా పాల్కే కుటుంబం వైపు ఒక్కరైనా కన్నెత్తి చూశారా? ఆయన బతికినన్ని రోజులు ఎన్ని అగచాట్లు పడ్డారు? పాల్కే అవార్డుల వేడుకకు ఏనాడైనా ఆ కుటుంబ వారసుల్ని పిలిచిన పాపాన పోలేదెందుకు? ఈ విషయాలన్నీ ఈ మధ్య కలిసిన – పాల్కే మనుమడు కిరణ్‌ చెబుతుంటే సామాన్య ప్రేక్షకురాలిగా వింటూ విస్తుపోయారు ఊర్వశి శారద. అవన్నీ విని ఉండలేకపోయారామె. ‘నవ్య’తో పంచుకుంటే కాస్తయినా మనసు కుదుట పడుతుందని ఆరాటపడ్డారు..

‘‘గొప్పతనం ఎవరో ఇచ్చే అవార్డు కాదు. మనకు మనం సాధించుకోవాల్సిన అర్హత. నిరాడంబరత దానికి ఒక మార్గం. శారద హఠాత్తుగా నిరాడంబరత గురించి ఎందుకు చెబుతోందా? అని మీలో చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. రెండింటికీ సంబంధం లేదు. కానీ ఆ సంఘటనల వెనకున్న వ్యక్తుల స్వభావ అంతస్సూత్రం మాత్రం నిరాడంబరతే. వీరిలో ఒకరు దాదా సాహెబ్‌ ఫాల్కే మనవడు కిరణ్‌. రెండోది మన తెలుగు వెలుగు బాపుగారు. ఈ మధ్య నాకు కేరళలోని జె.జె. ఫౌండేషన్‌ జీవన సాఫల్య పురస్కారం ఇచ్చింది. ఆ ఫంక్షన్‌లోనే కిరణ్‌కు కూడా అవార్డు ఇచ్చారు. అప్పటి దాకా నాకు దాదా సాహెబ్‌ ఫాల్కే వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. కిరణ్‌ చెప్పిన వివరాలు వింటే బాధ కలిగింది. బెంగ వేసింది. మన దేశంలో సినిమాలకు సంబంధించినంత వరకూ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు- నోబెల్‌ బహుమతిలాంటిది. ప్రతి ఏడాది ప్రభుత్వం ఆ అవార్డు ఫంక్షన్‌ను చాలా ఘనంగా చేస్తుంది. కానీ ఆ వేడుకకు వారి కుటుంబానికి సంబంధించిన ఎవ్వరినీ గత 45 ఏళ్లుగా ఎప్పుడూ పిలవలేదట. పాల్కే తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసిన మనిషి. కానీ అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్రం- ఆయనను గౌరవించాలని ఎప్పుడూ భావించలేదు. సన్మానాలు, అవార్డుల మాట పక్కన పెట్టండి. నాసిక్‌లో ఆయన నివసించిన ఇల్లు ఉంది. ఆ ఇంటికి కూడా ఒక చరిత్ర ఉంది. 1920లలో ఒక వెలుగు వెలిగిన పాల్కేకు 1930లలో కష్టకాలం ప్రారంభమయింది. తనకున్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది. చివరకు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. సానుభూతి చూపించేవారే తప్ప సాయం చేసేవారు కరువయ్యారు. అప్పటికి భారతీయ సినిమాకు 25 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ దర్శకుడు శాంతారాం ఐదువేల రూపాయలను దాదాసాహెబ్‌ పాల్కేకు అవార్డుగా ఇచ్చారు. ఆ డబ్బులతో కొన్న బంగ్లానే అది. ఇంత చరిత్ర ఉన్న ఆ బంగ్లాకు కూడా ఇప్పుడు దిక్కులేదట. కూలిపోయే స్థితిలో ఉందట. అప్పుల వాళ్ల బాధపడలేక తాను వాడిన ఫోర్డ్‌ కారును కూడా ఆ సమయంలో అమ్మేశారు పాల్కే. ఆ కారు గత ఏడాది నాసిక్‌లో ఒక డంప్‌యార్డ్‌లో దొరికింది. ఆ వార్త బయటకు రాగానే అందరూ ఆ కారును బాగు చేయిస్తామన్నారు. మళ్లీ కథ షరా మామూలే! ఇన్ని కష్టాలు పడిన ఆయన కుటుంబం ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ఈ విషయాలు కిరణ్‌ చెబుతుంటే నాకు కళ్లు చెమర్చాయి. సినిమా కోసం తన జీవితాన్ని ధారపోసిన ఒక వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదా? అనిపించింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. తమను ఇటు ప్రభుత్వం కాని అటు దాదా సాహెబ్‌ పాల్కే వల్ల బాగుపడ్డవాళ్లు కాని గుర్తించలేదనే బాధ కిరణ్‌లో ఏ కోశానా లేదు. దాదాలో ఉన్న నిరాడంబరత కిరణ్‌లో కూడా అణువణువు కనిపించింది. తానో పెద్ద సినిమా కుటుంబం నుంచి వచ్చానన్న గర్వం ఏ కోశాన లేదు. ఒక సినిమా హిట్‌ అయితేనే ఎగిరెగిరి పడే వాళ్లు అలాంటి వాళ్లను చూసి నేర్చుకుంటే ఎంత బావుండనిపించింది.
బాపు నిరాడంబరత
బాపుగారు చనిపోయారని తెలిసిన వెంటనే ఎందుకో నాకు కిరణ్‌ స్వభావం గుర్తుకొచ్చింది. చాలా మందికి బాపు వ్యక్తిత్వం తెలియకపోవచ్చు. నేను బాపు-రమణలతో రెండు సినిమాలు చేశాను. ‘కలియుగ రావణాసురుడు’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేశాను. బాపు-రమణలు షూటింగ్‌లో ఉన్నప్పుడు సామాన్యుల్లా ఉండేవారు. ఫోన్లు పట్టుకొనేవారు, గొడుగులు మోసేవారు, వందిమాగతులు ఎవ్వరూ ఉండేవారు కాదు. ఎవరైనా చెబితే తప్ప బాపు డైరక్టర్‌ అనే విషయం కూడా తెలిసేది కాదు. ఆ సినిమా నాకు గుర్తుండిపోవటానికి మరో కారణం కూడా ఉంది. ఆ సమయంలో కళ్లు అంటే కాంచనమాల అందరికీ గుర్తుకు వచ్చేది. ఆమె కళ్లు అంత అందంగా ఉండేవి. బాపు కెమెరా ఎప్పుడూ హీరోయిన్‌ కళ్లను అందంగా చిత్రీకరిస్తుంది. అలాంటి బాపు నా కళ్లను ఎలా చిత్రీకరిస్తారు? అనేది అందరి ఆసక్తి. అంతే కాకుండా- ఆ సినిమాలో నా కళ్లను వర్ణిస్తూ ఒక పాట కూడా ఉంటుంది. ఈ పాట విషయం చెప్పినప్పుడు నేను ఉలిక్కిపడ్డా. చాలా ఆనందం కూడా వేసింది. ఇప్పటిలా దేనినైనా మార్చేసే గ్రాఫిక్స్‌ ఆ కాలంలో లేవు. అంతా ఒరిజినలే.. ఆ సినిమాలో బాపు నా కళ్లను ప్రత్యేకంగా చూపించారు. బాపు గారితో షూటింగ్‌ అంటే ఎంతో సౌకర్యంగా ఉండేది.
బాపుగారు, కిరణ్‌లాంటి వ్యక్తులను చూసిన తర్వాత ఇప్పుడు మన ఇండసీ్ట్ర ఏమవుతోంది? అనే బాధ కలుగుతుంది. మా తరంలో నటులు- సినిమా బాగా ఆడాలి, మాకు మంచి పేరు రావాలి, నిర్మాత లాభపడాలి అని కోరుకొనేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. అప్పుడు కథ, స్ర్కీన్‌ప్లే పూర్తిగా ఉంటే తప్ప సెట్స్‌ మీదకు వెళ్లేవారు కాదు. ఇప్పుడు చాలా సినిమాలకు కథే ఉండటం లేదు. మేము సెట్‌లోకి వెళ్లే ముందు పాత్రను అవగాహన చేసుకొనేవాళ్లం. ఆ తర్వాత నటించేవాళ్లం. అందువల్ల అప్పటి పాత్రలు సజీవంగా ఉండేవి. నటులకు రకరకాల షేడ్స్‌ ఉన్న పాత్రలు కూడా వచ్చేవి. ఇప్పుడు అలాంటి సినిమాలు లేవని చెప్పటం నా ఉద్దేశం కాదు. ఈ మధ్య ‘ఉయ్యాల జంపాల’ సినిమా చూశా. చాలా బావుంది. సాధారణంగా నేను నా సినిమాలే ఎప్పుడూ చూడను. అలాంటిది ఆ సినిమాని రెండుసార్లు చూశా. ఇలాంటి సినిమాలను ప్రొత్సహిస్తే చాలా బావుంటుంది..’’ అని చెప్పారు శారద.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.