పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు
అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు
శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సారి కంచి వరదస్వామి దర్శనానికి ఇద్దరు దేవేరులు తిరుమలదేవి చిన్నాదేవిలతో వచ్చాడు .అక్కడ ఉన్న ఒక ఆచార్యు దీక్షితుడు తిరుమల దేవి ని గురించి ఆశువుగా .’’కాన్చిత్కాంచనగౌరాంగీం –వీక్ష్య తన్వీం పురస్తితాం –వరద స్సంశయాపన్నో –వక్షస్థల మవైక్షత’’ అని శ్లోకం చెప్పాడు .అందులో భావం –వరద రాజ స్వామికి తిరుమలదేవిని చూసి ఆమెఅందం లో తన అర్ధాంగి లక్ష్మీదేవి లాగా ఉందనిపించిందట .అనుమానం వచ్చి తన వక్షస్తలాన్ని ఒక్కసారి తడిమి చూసుకోన్నాడట .సిగ్గుతో తల వంచుకోన్నాడట స్వామి .ఈ ఆశువుకు రాయల వారెంతో సంతోషం తో పొంగిపోయాడట .ఇంతకీ ఇందులో భావం ఏమిటి అంటే తిరుమల దేవి అపర లక్ష్మీ స్వరూపం గా ఉంది అని .అప్పటి నుండి ఆ ఆచార్య దీక్షితులను ‘’వక్షస్థలాచార్యుడు ‘’అని పిలిచేవారట .ఈయనకు ఇద్దరు భార్యలు .చిన్న భార్య వైష్ణవ మతానికి చెందినది .ఆ రోజుల్లో అద్వైతులు వైష్ణవులుగా,వైష్ణవులు అద్వైతులుగా మారటం ఉండేది .అప్పయ్య దీక్షితుల బంధువు ‘’విష్ణు గుణాదర్శం ‘’రాసిన వేంకటాధ్వరి వైష్ణవుడే . ఇప్పటికీ బళ్ళారి ప్రాంతం లో ద్వైతాద్వైతులకు సంబంధ బాన్ధవ్యాలున్నాయి అని పుట్టపర్తి వారు చెప్పారు .
వక్షస్థలాచార్యులకు వైష్ణవ భార్య యందు ‘’రంగ రాజాధ్వరి ‘’అనే కొడుకుపుట్టాడు .ఈయన కుమారుడే ‘’ ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ నా ల్పస్య తపసః ఫలం ‘’‘’అని తెలుగు భాషను కీర్తించిన అప్పయ్య దీక్షితులు .విజయ నగర రాజ్య కాలం లో వైదిక మతానికి అద్వైత మూల స్తంభాలు ముగ్గురు .విద్యారణ్యుడు ,సాయణుడు ,అప్పయ్య దీక్షితులు .అప్పయ్య దీక్షితులు ‘’అడయప్పాలెం ‘’అనే పల్లెటూరిలో జన్మించాడు .అయన ఎవ్వరినీ దేనినీ లెక్క చేసేవాడుకాడు ఒక్క శివుడిని తప్ప .అందుకే ‘’సర్వ తంత్ర స్వతంత్రుడు ‘’అనే బిరుదు పొండాడు .న్యాయ ,వ్యాకరణ ,మీమాంసా శాస్త్రాలలో దీక్షితులు ఉద్దండ పండితుడు .ఆయన రాసిన గ్రంధాలు నూటనాలుగు .
దీక్షితులు పుండరీక ,వాజ పేయ యాగాలు చేసిన కర్మిష్ట ఈయన తండ్రి ‘’విశ్వ జిద్యాగం ‘’చేసిన మహాత్ముడు .ఆకాలం లో భట్తోజీ దీక్షితులనే ఆయన వ్యాకరణం లో మహా పండితుడు .ఈయన మీమాంస చదవటానికి దక్షిణ దేశానికి వచ్చి అప్పయ్య దీక్షితుల వద్ద చేరాడు .అప్పటికే భట్తోజీ ‘’ప్రౌఢ మనోరమ ‘’అనే వ్యాకరణాన్ని రాసి ఉన్నాడు .దాని పఠన పాఠనాలు దేశం లో జరుగుతూనే ఉన్నాయి .భట్తోజీ వచ్చేసమయానికి అప్పయ్య దీక్షితులు భట్తోజీ రాసిన ‘’ప్రౌఢ మనోరమ ‘’పాఠాలను శిష్యులకు బోధిస్తున్నాడు .అందులో తనకు అభ్యంతరం గా ఉన్న చోట్ల ఖండిస్తున్నాడు . నిశ్చేస్టూడైన భట్టోజి అప్పయ్య దీక్షితులు తో వాదానికి దిగాడు .అప్పుడు అప్పయ్య ‘’ఇంత అభిమానం తో అభినివేశం తో వాదిస్తున్నావు .నువ్వేమైనా భట్తోజీవా?’’అన్నాడు .అప్పుడాయన ‘’అవును’’ అని సమాధానమిచ్చాడు .అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధమేర్పడింది. అప్పయ్య దగ్గర భట్టోజి మీమాంస శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు .
అప్పయ్య దీక్షితుల కీర్తి దేశమంతటా వ్యాపించింది .ఆ నాటి వేలూరి పాలకుడు బొమ్మ నాయకుడు అప్పయ్య దీక్షితులను సగౌరవం గా రాజ సభకు రప్పించి’’ కనకాభిషేకం’’చేశాడు .దీక్షితులు ఆ ధనాన్ని అంతటిని దేవాలయ నిర్మాణానికి వినియోగించాడు .దీక్షితులు యెంత పండితుడో అంతటి శివభక్తి పరాయణుడు .తనకు శివ భక్తీ యెంత ఉన్నదో పరీక్షించుకోవాలి అనిపించింది .ఉమ్మెత్త కాయలరసం తాగి పిచ్చిపట్టించుకొని ,ఆ పిచ్చి లో తానూ అనే మాటలనన్నిటిని గ్రంధస్తం చేయమని శిష్యులకు పురమాయించాడు .ఆ ఉన్మత్త స్తితిలో అయిదు శతకాలు మహా ఆశువుగా భక్తీ రసబంధురం గా చెప్పాడు నాన్ స్టాప్ గా .వాటినే ‘’ఉన్మత్త పంచ శతి ‘’అన్నారు .
దీక్షితులకు విష్ణు భక్తీకూడా శివభక్తితో పాటు సమానం గానే ఉండేది .’’శివ పారమ్యాన్ని ‘’ స్థా పించటానికి శ్రీ కంఠ భాష్యం రాశాడు .విష్ణు భక్తీ ప్రబోధకాలైన ‘’వరద రాజాస్టకం ‘’మొదలైన ఎన్నో స్తోత్రాలు రాశాడు .అలంకారశాస్త్ర గ్రంధాలు చాలా రాశాడు అందులో అర్ధ చిత్ర మీమాంస ,కువలయా నందం ప్రసిద్ధాలు .అయితే సమకాలీనుడైన మరో తెలుగు అలంకార శాస్త్రకారుడు జగన్నాధ పండిత రాయలు వీటిని ఖండించాడు .జగన్నాధుని ఖండనలో విరోధం తప్ప పాండిత్యం లేదని విమర్శకులు తేల్చారు .దీక్షితులకు’’ వేదాంత దేశికులు’’ అంటే మహా గౌరవం .ఆయన రాసిన ‘’యాదవాభ్యుదయం ‘’కు దీక్షితులు వ్యాఖ్యానం రాశాడు .ప్రబోధ చంద్రోదయం అనే మరో వ్యాఖ్య కూడా చేశాడు .
అప్పయ్య దీక్షితుల సమకాలీనుడు తిరుమల తాతాచార్యుల వారి మనుమడు కుమార తాతాచార్యులు. ఈయన కోటి మంది కన్యలకు వివాహం జరిపించినందువల్ల ‘’కోటి కన్యాదాన తాతాచార్యులు ‘’అనే బిరుడుపొందారు .దీక్షితులకు ఈయనకు పాండిత్యం లో స్పర్ధ లుండేవి .అప్పయ్య దీక్షితులను చిదంబర దీక్షితులనీ అనేవారు .ఈయనకు చిదంబర క్షేత్రం అంటే ప్రాణం .తాను చనిపోయిన తర్వాత తన చితాభస్మాన్ని చిదంబర వీధుల్లో చల్లమని ,శివ భక్తులు దానిని తొక్కి తే తనకు కైవల్యం లభిస్తుంది అని ఒక శ్లోకం లో చెప్పుకొన్నాడు .అంతటి గాఢ భక్తీ ఆయనది .దీక్షితులు ఆంద్ర దేశం వాడే .విజయ నగర కాలం లో వీరి పూర్వీకులు దక్షిణ దేశానికి తరలి వెళ్ళారు .అందుకే ఆయనకు ఆంధ్రం అంటే అంత అభిమానం ,ప్రేమ గౌరవం భక్తీను .’’ఆంధ్రుడైపుట్టటం గొప్ప అదృష్టం . ఆంద్ర భాష మాట్లాడగలగటం గొప్ప తపస్సు ‘’అని చెప్పిన అప్పయ్య దీక్షితులు ను ’’పాపం పిచ్చివాడు ‘’అన్నారు పుట్టపర్తి వారు నేటి తెలుగుకున్న ప్రాముఖ్యాన్ని చూసి బాధ పడుతూ.
దీక్షితులు వేంకటపతి రాజులూ ,రాయ వేలూరు రాజుల దగ్గర ఉండేవాడు .జింజి లో కూడా ప్రసిద్ధుడే .జింజి ఆస్థానం లో శ్రీనివాస దీక్షితులు ఉండేవాడు .అస్తమిస్తున్న సూర్యుడిని ‘’రత్నఖేటం ‘’తో ఉత్ప్రేక్షిం చాడట .అప్పటినుంచి ‘’రత్న ఖేటదీక్షితులు ‘’అయ్యాడు .ఈయన జింజి కోట కు వెళ్లి అప్పయ్య దీక్షితులతో నమస్కారం పెట్టిన్చుకొంటాను అని సవాలు చేశాడు .ఇద్దరి మధ్య వాదం భీకరం గా జరిగి .ఈయనే అప్పయ్య చేతిలో ఓడిపోయాడు .అన్నమాట నిల బెట్టుకోవాలిగా .అప్పయ్యను బతిమిలది తన కూరుర్నిచ్చి పెళ్లి చేసి మామ అయి అప్పుడు అల్లుడు అప్పయ్య దీక్షితులతో నమస్కారం పెట్టిన్చుకోన్నాడట .ఇలా ఎన్నో కధలూ గాధలు సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తవ్విపోశారు’’త్రిపుటి ‘’వ్యాసాలలో .అందులోవే మీకు అందజేశాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-14-ఉయ్యూరు

