ప్రజాకవి కాళోజీ శత జయంతి 09. 09. 2014
‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ… ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ‘ అంటూ మార్గనిర్దేశనం చేసిన ప్రజాకవి. అవనిపై అవకతవకలకు మనసులో కలకలం.. అంకుశం ఆయన కలం. బతుకు దేశానిది. వందేళ్ళ క్రితం పుట్టి వెయ్యేళ్ళకు సరిపడా మెదళ్ళను కదలించిన కాళన్నకు శతకోటి దండాలు, శతజయంతి వందనాలు.
కాళన్న పేరు తలంపు రాగానే కవిగా నా గొడవ గుర్తుకు వస్తుంది. అది అప్పటికి సరికొత్త నామకరణం. ఆ శీర్షికలో కాళోజీ బహిరంగముఖీనంగా ఉన్న అంతరంగం నిక్షిప్తంగా ఉంది. ‘నా గొడవ’ అంటే వ్యక్తిగతమైంది కాదు. సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిని అధిక్షేపిస్తూ అవన్నీ ‘నా గొడవ’ అన్నడు.
మరాఠాల కుటుంబంలో పుట్టినా తెలంగాణ పలుకుబడి తో ప్రజల మాట, వ్యధలను వ్యక్తం చేయటంలో కాళోజీ కృషి మనందరికీ ఆదర్శప్రాయం. నా కన్నా వయసులో పదహారేళ్ళు పెద్ద అయిన ఆయనను నేను కాళన్నా అంటూ చనువుగా పలుకరించి సన్నిహితంగా మెసిలిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిజాం పాలనలో జరిగిన అరాచకాలు, ఆరళ్ళతో పాటు ఉర్దూ మాధ్యమంలోనే చదువుకోవాల్సిన తప్పనిసరి స్థితి అప్పుడు ఉండేది. ఆ పాలన ముగిసి స్వాతంత్య్ర వీచికలు, స్వేచ్ఛావాయువులు పొంగుతున్న కాలంలో లేలేత యువకుడిగా హైదరాబాద్‌లో చదువుకోవటానికి నేను వచ్చాను. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో తెలుగుతనం కోసం జరిగిన ఉద్యమాలు, వ్యవస్థలు అందరికీ కొత్త స్ఫూర్తిని అందించేలా అల్లుకుపోయాయి.
నేను ఉస్మానియా యూనివర్సిటీలో బి.ఎ.చదువు కోవటం కోసం ఆర్ట్స్‌కాలేజీలో ప్రవేశించినప్పుడు ఆ ప్రాంగణంలో సన్నిహితులైన ప్రముఖ తెలంగాణ కవులల్లో ప్రథమ అగ్రగణ్యుడు కాళన్న. ఆ తరువాత ఏడేళ్ళు పెద్దయిన దాశరథి నాతో చాలా ఆత్మీయంగా ఉండేవారు. అగ్రజులైన వారికి జన్మజన్మల కవి సౌమిత్రి నేను అంటూ పద్యాలు కూడా రాశాను. ఆ ఇరువురూ చిన్నవాడినైన నన్ను ఎంతో వాత్సల్యంతో చేరదీసి ప్రోత్సహించేవారు. తెలంగాణ రచయితల సంఘం స్థాపించినప్పుడు తొట్టతొలి అధ్యక్షుడు కాళోజీ కాగా, ఉపాధ్యక్షుడు దాశరథి. నేను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాను. చాలా కార్యక్రమాలు చురుగ్గా చేశాం. కొన్నేళ్ళ తరువాత దాశరథి అధ్యక్షతన నేను ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ప్రాంతపు అన్ని జిల్లాల్లో యువకవి సమ్మేళనాలు నిర్వహించాం. అప్పటి పెద్దల కవితా స్పూర్తికి దోహదం చేసే అవకాశం కలిగింది. అప్పటికే కాళోజీ నిజాం ముష్కర పాలనకు వ్యతిరేకంగా గళం, కలం ఎత్తిన స్వాతంత్య్ర సమరయోధుడుగా ప్రసిద్ధుడు. దాశరథి కూడా ఆ కోవలోని వాడే.
కాళోజీ ‘నా గొడవ’ ఆలంపూర్‌లో ఆవిష్కరించిన కాలంలోనే నేను యువకవిగా ‘జలపాతం’ కవితా సంపుటిని ప్రచురితం చేశాను. దాశరథీ మనోజ్ఞ కవితాశరథీ అన్న మకుటంతో అంకిత పద్యాలు రాశాను. మధ్యలో ఒక పద్యంలో వానమామలై వరదాచార్యులు, బిరుదురాజు రామరాజు, ఆళ్వార్‌స్వామి, కాళోజీలను కవితల్లో ప్రస్తుతిస్తూ ఉటంకించాను. ఆ నలుగురు నన్ గుండెలకద్దుకున్న రసమూర్తులే అంటూ పద్యకవిత రాశాను.
కాళన్న పేరు తలంపు రాగానే కవిగా నా గొడవ గుర్తుకు వస్తుంది. అది అప్పటికి సరికొత్త నామకరణం. ఆ శీర్షికలో కాళోజీ బహిరంగముఖీనంగా ఉన్న అంతరంగం నిక్షిప్తంగా ఉంది. ‘నా గొడవ’ అంటే వ్యక్తిగతమైంది కాదు. సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిని అధిక్షేపిస్తూ అవన్నీ ‘నా గొడవ’ అన్నడు. అవనిపై జరిగేటివి అవకతవకలకు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు- ప్రపంచంలో జరుగుతున్న గందరగోళాలన్నిటికి కాళోజీ కలం స్పందించి కవితలు చిందించేది. కాళోజీ కవితలు కొన్ని పంక్తులు గేయ ఛందోబద్ధంగా ఉండేవి. అంతలోనే అవి వచనకవితలుగా మారిపోయేవి. ఆ కవితల భావావేశం, ఆగ్రహం అంతా సమకాలీన సమాజం పట్ల కలిగే స్పందన ప్రతిస్పందనలతో స్ఫూర్త్తివంతంగా ఉండేవి. తెలుగుభాష పట్ల ఆ ప్రజాకవికి ఉన్న మమకారం గణనీయమైనది. ‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అంటూ పరుషంగా అన్న కాళన్నలో తెలుగు తనం పట్ల అనంతమైన అపేక్ష పరవళ్ళు తొక్కేది.
నాకు ప్రత్యక్ష ప్రమేయం లేని చారిత్రక సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు 1943 మే 26న ఆవిర్భవించింది. అప్పట్లో బూర్గుల రంగనాధరావు, భాస్కరభట్ల కృష్ణారావు, లోకనంది శంకరనారాయణ వంటి వారు గొప్ప ఉద్యమ స్ఫూర్తితో స్పందించారు. అప్పటి కార్యస్థానాలుగా గోల్కొండ పత్రిక కార్యాలయం, రెడ్డి హాస్టల్‌లో సమావేశాలు జరిగేవి. పర్సా వెంకటేశ్వర రావు స్థలం మూలధనంతో సారస్వత పరిషత్తు వెలిసింది. మొట్టమొదటి కార్యవర్గంలో కాళోజీ ఉన్నారు. వరంగల్, ఖమ్మం, జనగామ, మహబూబాబాద్, ఆలంపూర్, తోటపల్లిలో శాఖలు ఉండేవి. మా పరిషత్తు ద్వితీయ మహాసభలు 1944లో డిసెంబరు 28,29,30 తేదీల్లో జరిగాయి. ఆ ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఉదయరాజు రాజేశ్వరరావు, కార్యదర్శిగా కాళోజీ వ్యవహరించారు. అప్పటికి నేను మా గ్రామం ప్రాంతంలో మాత్రమే పెరుగుతున్న పిల్లవాడిని. ముసిపట్ల పట్టాభిరామారావు అధ్యక్షుడుగా ఆ సభలు ఓరుగల్లు కోటలో జరుగుతున్నప్పుడు ముష్కర మూకలు దాడిచేసి అవరోధం కల్పించారు. ఆ సమయంలో వారికి ఎదురొడ్డి ధైర్యంగా సారస్వత పరిషత్తు సభలు సజావుగా జరిగేలా చేశారు. అవన్నీ ఈ తరం వారు తెలుసుకోవాల్సిన చారిత్రక స్మృతులు. నారాయణరావు త్రయంగా చెప్పుకునే కోదాటి నారాయణరావు, కొమరగిరి నారాయణ రావు, కాళోజీ నారాయణ రావులు గ్రంథాల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంతంలోని పల్లెపల్లెల్లో చదువరులను పెంచటంలో ఆ తరం పెద్దలు మహత్తర కృషి చేశారు. ఆర్యసమాజ్, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు, ప్రజల సమస్యలు అన్నింటా కాళన్న ఉండేవారు. నేను, నా కార్యక్షేత్రం కేవలం సారస్వతం కావటంతో మా పరిచయాలు, సాన్నిహిత్యం అంతవరకే పరిమితం. కాళన్న స్మృతిలో అధికారికంగా శతజయంతి కార్యక్రమాలు, వరంగల్‌లో ప్రత్యేకమైన సాంస్కృతిక సదనం, గ్రంథాలయం వంటివి ఏర్పాటు చేయడం హర్షణీయం.
– డాక్టర్ సి. నారాయణ రెడ్డి (ఇంటర్వ్యూకు వ్యాసరూపం : జి.ఎల్.ఎన్.మూర్తి)
కాళోజీ శతజయంతి సమాపనోత్సవం
తెలంగాణ సాంస్కృతిక శాఖ, కాళోజీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు శతజయంతి సమాపనోత్సవం సెప్టెంబరు 9వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు రవీంద్ర భారతిలో జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి సభాధ్యక్షత వహిస్తారు. ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య విశిష్ట అతిథి. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ళ రామశాసి్త్ర గారు కీలకోపన్యాసం చేస్తారు. అంపశయ్య నవీన్, దేశపతి శ్రీనివాస్ ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు. కాళోజీ జీవితంపై బి. నరసింగరావు రూపొందించిన ‘మన కాళోజీ’ డాక్యుమెంటరీ, కాళోజీ రచనలపై ప్రయోగాత్మక నాటకం ‘నా కవితలు – నా కలలు’ ఈ సందర్భంగా ప్రదర్శితమతాయి.
– భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ |