గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1
సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి పరిచయం చేయటానికి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’శీర్షకతో సుమారు యాభై మంది కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి చేస్తున్నాను .అమరుక కవితో ప్రారంభించి విశాఖ దత్త కవి తో ముగిసే ఈ ధారవాహికను ఆదరిస్తారని భావిస్తున్నాను .
1-శృంగార శతక కర్త -అమరుక కవి
అమరుక కవి ని గూర్చిన పూర్తీ వివరాలు తెలియ రావటం లేదు .కాని కాశ్మీర్ రాజు అమరకుడే అమరకవి అని అందరూ భావిస్తున్నారు .ఆయన రాసినవాటిని పరి శీలిస్తే అవి ఒక్కరే రాసినట్లు కనిపించదు .అమరుకుని కాలం క్రీ శ ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్యకాలం .అమరుక జీవితం పై అనేక కధలు ప్రచారం లో ఉన్నాయి .ఒక కధనం లో అద్వైత మత స్థాపకులు ఆది శంకరాచార్యుల వారు మండన మిశ్ర పండితుని తో వాదానికి దిగి ఓడిస్తే ఆయన భార్య ఉమా భారతి తనను కూడా వాదం లో జయిస్తీనే శంకరులకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదని తెలియ జేసి కామశాస్త్రం పై ప్రశ్నలు సంధించింది .ఆదిశంకరులకు అది అనుభవం లోని విషయం కదా అందుకని ఆ శాస్త్రాధ్యయనానికి వంద రోజులు గడువుకోరుతూ వాదాన్ని వాయిదా వేయించాడు .అప్పుడు కాశ్మీర రాజు అమరకుడు మరణిస్తే ,ఆయన శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి రాజాన్తః పురం లో కామశాస్త్రాన్ని వంద రోజుల్లో ఆపోసన పట్టాడు .ఒక్కో రోజు శృంగారాను భవాన్ని ఒక్కొక్క శ్లోకం లో వర్ణించి రాసిన శతకం ఇది .రాజు అమరకుడు శృంగారం లో నిష్ణాతుడు .ఈ అనుభవాన్ని భగవత్పాదులు ‘’అమరుకాస్టకం ‘’లో రాసి చిరస్మరణీయం చేశారు .
అమరుకాస్టకంపై భాష్యం రాసిన ‘’రవి చంద్రుడు’’ శంకరులు అమరకు డిని చిరంజీవినిచేయటానికే ఈ అష్టకం రాశారని ,ఇందులో రూపకాలంకారాలు విశేషం గా వాడారని చెప్పాడు .శంకరుల వింత,విపరీత ప్రవర్తనను గుర్తించిన రాణులు ఉద్యోగులు గేలి చేయటం ప్రారంభిస్తే మళ్ళీ రాజు శరీరం లో ప్రవేశించాడని తెలిపాడు .ఆధిభౌతిక శాస్త్రం లో నిష్ణాతుడైన బెంగాలు కవి విమర్శకుడు అయిన రవి చంద్రుడు అమరుకాస్టకానికి ఆధ్యాత్మిక భావాన్ని జోడించి వ్యాఖ్యానం చేశాడు .అది శంకర క్రుతమేకాని అమరుక రచన కాదన్నాడుకూడా .దీనికే అమరుక శతకం అని కూడా పేరుంది .
సంస్కృత సాహిత్యం లో ‘’అమరుకాస్టకం’’ప్రత్యెక స్థానాన్ని పొందింది. కవి ప్రతిభకు తార్కణ గా నిలిచింది .ఆమహాకవి కాళిదాసుకవిత్వానికి ,భర్తు హరి శృంగార శతకాని కి సరి సమానం గా నిలుస్తుందని తేల్చారు కూడా .తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ధ్వన్యాలోకం అనే అలంకార శాస్త్ర కారుడు ఆనంద వర్ధనుడు దీన్ని విపరీతం గా మెచ్చుకొన్నాడు .ఇందులో ఒక్క శ్లోకం చదివి అర్ధం చేసుకొంటే ప్రేమ శృంగారాల సర్వవిషయాలు అవగతం అవుతాయన్నాడు .అమరుక శ్లోకాలను ఎందరో ఉదాహరించారు. వీటితోనే ఇతరకవుల కవిత్వాలను బేరీజు వేసి నిగ్గు తేల్చారు విమర్శకులు ,విశ్లేషకులు .ఆండ్రూ షీలే అనే ప్రఖ్యాత విమర్శకుడు ‘’ఈ భూ మండలం పై ఇంతటి ప్రేమ శృంగారకవిత్వం ఉన్న గ్రంధం లేనే లేదు ‘’అని నిర్ద్వంద్వం గా ప్రకటించాడు .ప్రేమ ,మనోభావం ,విరహం ,కోరిక, వ్యామోహం ,పునస్సంధానం,ఆనందం విషాదం దుఖం మొదలైన శృంగారం విషయాలకు ఈ కావ్య శతకం అద్దం పడుతుంది .గ్రెగ్ బైలీ అనే మరో విఖ్యాత విమర్శకుడు ఇందులో ప్రేముకుడిని ప్రేమలో పడేయ్యటానికి పడే తిప్పలు ,వారి కలయికల్లో అలకలు ,ప్రేమికుల మధ్య అనుమానాలు ,మోసాలు ,ఆనాటి సమాజ స్థితి అంతా తెలుస్తోంది అని చెప్పాడు .పురుషత్వాన్ని నమ్మిమోసపోవటం ,స్వీయ సానుభూతి కూడా ఇందులో దర్శనమిస్తాయి .ప్రేమలో కలయిక కోసం వెదికే దారులు ,విరహం లో పొందే వేదనలు ,తిరిగి కలవాలనే తహ తహా ఈ శతకం లో పరమ అద్భుతం గా కవి చిత్రించాడు .
అమరుక అస్టకానికి విశ్వ వ్యాప్తం గా ఆదరణ ఉంది .ఇంగ్లీష్ లో దీన్ని ‘’ఈసోటిక్ పోయెమ్స్ ఆఫ్ ఇండియా ‘’పేరిట ఆండ్రూ షెల్లింగ్ అనువాదం చేశాడు .’’లవ్ లిరిక్స్ ‘’పేరు మీద గ్రెగ్ బైలీ మరో అనువాదం చేశాడు .
అమరక కవి అష్టకం లో రెండు శ్లోకాలు వాటి రామణీయకత చూద్దాం
‘’ నిశ్శేషచ్యుత చందనం స్తనతటం నిర్మృష్ట రాగోధరో
నేత్రే దూరమనఞ్ఝనే పులకితా తన్వీ తవేయం తనుః
మిధ్యావాదిని దూతి బాంధవజన స్యాజ్ఞాతపీడాగమే
వాపీం స్నాతుమితో గతాసి న పుంస్త స్యాథమస్యానికమ్. –
నాయకుడి దగ్గరకు నాయక దూతికను పంపింది .అది సందట్లో సడేమియా అని నాయకునితో శృంగారం లో మునిగి తేలింది .ఈ విషయం పసికట్టిన నాయిక దాన్ని వక్రోక్తి లో దూషించింది .భావం –చనులమీద గంధం జారింది ,కింది పెదవి ఎర్రదనం మాసింది ,కన్నుల కాటుక చెదిరింది .శరీరం అంతా పులకాన్కితం గా ఉంది ,బంధు పీడ తెలియటం లేదు .అబద్ధాలు ఆడు తున్నావు .బావి నీళ్ళకు వెళ్లావు .ఆ వెధవ దగ్గరికి పోలేడుకదా? –రెండో శ్లోకం –
స్విన్నం కేనముఖం? దివాకకరైస్తే రాగిణీలోచనే?
రోషాత్త్వద్వచనోదితాద్ విలులితా నీలాలకా? వాయునా
భ్రష్టం కుంకుమ? ముత్తరీయ కషణా త్క్లాంతాసి? గత్యాగతై-
ర్యుక్తం తత్సకలం కి మత్ర వద హే దూతి! క్షతాస్యాధరే. –
ఎందుకు మొహం చెమ్మగిలింది?అంటే అది ఎండకు అన్నది .కన్నుల్లో ఆ ఎరుపేమిటి ?అంటే నీ మాటలకు అని జవాబు .జుట్టు చిక్కుపడిందేమిటి?గాలికి అని జవాబు .కుంకుమ జారిందేమిటి ?పైట రాపిడికి .అలసిపోయావేమిటి?రాకా పోకా వలన అని జవాబు .అంతా బానే ఉంది కాని పెదిమపై ఆ గాట్లేమిటి?
అమరు శతకాన్ని గరిక పాటి మల్లావ దాన్లుగారు తెలుగు పద్యాలలోకి అనువాదం చేశారు .క్లాసు విద్యార్ధులకు వాటిని బోధించారట కూడా .1981లో ‘’వైజయంతి ‘’పత్రిక ‘’అనే స్వీయ కవితా సంకలనం లో వీటిని వెలువరించారట .అలానే వెంపరాల సూర్య నారాయణ శాస్త్రి గారు కూడా పద్యాలలో చెప్పారు .ఈ రెండు అనువాదాల్లో గరిక పాటి అనువాదమే ధారశుద్ధితో ఉందని వెంపరాల వారే స్వయం గా చెప్పారట .అమరుక శ్లోకాలు అనేక మంది ఉదాహరించారు .విద్యాకరుని ‘’శుభాషిత రత్న కోశం ‘’లో అనేక మంది కవుల పేర్ల తో ఈ శ్లోకాలు కనిపిస్తాయి .![]()
భర్త కోసం భార్య ఎదురు చూపు –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-14-ఉయ్యూరు

