 |
తెలుగులో వేమన పద్యాలు వినని వాళ్ళుండరు. బాపూ బొమ్మలు చూడని వాళ్ళూ లేరు. వేమన పద్యాలు నిజంగా ఎవరు రాశారో తెలియదు. కాని, బాపు బొమ్మలు వేసింది సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆయన అని చెప్పితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే బాపు అనే పేరే ఆయన నిజం పేరయిపోయింది.
వేమన పద్యాలు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో వాడుకున్నా ఎవరూ కాదనరు. వేమన, నా పద్యాలు నన్నడక్కండా వేశారేం అని కోప్పడడు. మనకాలంలో, కాపీ రైటు చట్టాలు, అనుకరణ నిషేధాలూ ఉన్నప్పుడుకూడా బాపు తనబొమ్మలని గాలి, నీరు, వెలుతురూ లాగా తెలుగుదేశం అంతటా పంచి పెట్టేశాడు. అక్కడే కాదు, తెలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దాకా తన బొమ్మలని పట్టుకుపోనిచ్చాడు.
బొమ్మ అడగడం తడవు- ఆశు కవిత్వం చెప్పే కవికన్నా వేగంగా బొమ్మలు వేసే బాపు- తన బొమ్మలని తెలుగు మాటలు బతికున్న ప్రతిచోటికీ, మాటలకన్నా వేగంగా ప్రసారం కానిచ్చాడు.
తెలుగు వాళ్ళు వేమనలాంటి కవులకి సన్మానాలు చెయ్యలేదు. వాళ్ళని తమ మామూలు మాటల్లో కలిపేసుకొని సొంతం చేసుకున్నారు, అంతే! బాపూ కూడా అలాంటి వాడైపోయాడు. చిత్రకారుడుగా అతన్ని పనికట్టు కొని ఎవరూ పొగడినట్టు లేదు. కాని, అతని బొమ్మలు లేకుండా ఎవరూ ఏ పనీ చెయ్యరు. పత్రిక పెట్టినా, ప్లైయర్ పంపినా, పుస్తకం అచ్చేసుకున్నా, బాపు గీత లేనిదే అది మనకి పూర్తి కాదు.
‘బాపు గొప్పవాడు. మనం పట్టంకట్టి నువ్వు గొప్పవాడివి అని చెప్పవలసిన అవసరం లేనంత గొప్పవాడు,’ అని నేను 1983 తెలుగువెలుగు (షికాగో) రాత పత్రికకి సంపాదకుడిగా రాశాను. మా పత్రికకి మీ బొమ్మలు కావాలి, అని అడగంగానే, పాతిక పైచిలుకు బొమ్మలు – అట ్టమీద వేసుకోడానికి గాను పెద్ద సైజు బొమ్మలు – గ్యాప్ ఫిల్లర్స్ లాగా వాడుకోటానికి మరో పాతిక చిన్న సైజు బొమ్మలు, పంపించాడు బాపు.
తరువాత, ఆ బొమ్మలన్నీ సెయింట్ లూయిస్ తానా వాళ్ళకిచ్చాను, ప్రదర్శన కోసం! అంతే! ఆ బొమ్మలే కొన్ని సంవత్సరాల పాటు అమెరికా తెలుగు పత్రికలన్నింటినీ అలంకరించాయి.
1985లో లాస్ ఏంజిల్స్ తానా సభలు అయిన తరువాత, ఒక వారం రోజులుండేట్టు చికాగో వస్తున్నానని చెప్పాడు. ఆయన్ని అప్పుడు అడిగాను, అక్కడ బొమ్మల కొలువు పెట్టారా? అని. సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేదు. వెంటనే, విశాల షికాగో తెలుగు సంస్థ ఆధ్వర్యంలో ఒక బొమ్మలకొలువు పెట్టాం. దగ్గిర దగ్గిర మూడు వందల మంది వచ్చారు, బొమ్మలు చూడటానికి!
తరువాత, ఆయన్ని చాలాసార్లు కలిశాను; భారతంలోను, అమెరికాలోనూ!
ఒకసారి ఆయన, పెమ్మరాజు వేణుగోపాలరావు, నేనూ హ్యూస్టన్లో సదస్సుకి వచ్చాం. కారులో ఆయన్ని, రావుగారినీ సదస్సుకి తీసుకెళ్ళాలి. ‘బాపు! మీరు వెనక సీటులో కూచోండి, రావు గారు ముందు కూచుంటా రు. ఆయన నాకు డైరెక్షన్లు చెప్పాలి,’ అన్నాను. ‘నేనూ డైరెక్టరునే! ఆ పని నేను చెయ్యలేననుకున్నావా?’ అన్నాడు. మాకు నవ్వాగలేదు.
ఇప్పుడు బాపు లేడు. అమెరికా తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో వేమన పద్యాల పుస్తకం ఉండక పోవచ్చు. బాపు వేసిన బొమ్మ ఉండి తీరుతుంది.
– వేలూరి వెంకటేశ్వరరావు |
|