పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2
శమీ వృక్షం
‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జునస్య ధనుర్ధారీ –రామస్య ప్రియ దర్శినీ ‘’అని విజయ దశమి నాడు శమీ పూజ చేస్తాం .శమీ పత్రిని అందరికి పంచిపెడతాం .దైవ దర్శనం చేసుకొని ,పెద్దలఆశీర్వాదాన్ని పొందుతాం .పిన్నలను ఆశీర్వదిస్తాం .బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిస్తాం .ఇది సంప్ర దాయ సిద్ధం గా వస్తున్న అలవాటు . ఈ శ్లోకం లో పుట్టపర్తి వారు రెండు లోపాలు గమనించారు .శబ్దాల మధ్య ఏ కాన్వయం లేదన్నారు . అర్జున శబ్దం ధనుస్సుతో సమన్వయము .దారీ కి కూడా .దారీ పుంలింగ శబ్దం .శమీ శబ్దానికి విశేషణం గా ఇది కుదరదు .కాని ఈ శ్లోకం పరంపరాగతం గా వస్తున్న శ్లోకం కనుక గౌరవించాలి అంటారు .
శమీ వృక్షం అర్జునుని ధనుస్సును ధరించిందే కాక శ్రీ రాముడికి సంతోషకరమైన దర్శనాన్ని కల్గించింది .అంటే త్రేతా ,ద్వాపర యుగ రామాయణ భారత కదల తో ఈ వృక్షానికి సంబంధం ఉందన్న మాట .ఆశ్వయుజ శుక్ల దశమి విజయ దశమి .ఆ రోజు సాయంకాలాన్ని ‘’విజయ కాలం ‘’అంటారు .ఈ దశమి శ్రవణా నక్షత్రం తో కలిసి ఉంటె మహా భేషుగ్గా ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది .పై శ్లోకానికి కొంత చేర్చి కూడా లోకం లో ప్రచారం ఉంది ‘’శమీ శమయతే పాపం ,శమీ లోభిత కంటకా- దారిన్ అర్జున బాణానాం –రామస్య ప్రియ వాదినీ –కరిష్య మాణయాత్రాయాం –యదాకాలం సుఖం మయా –తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం ,భవ శ్రీరామ పూజితే ‘’.ఇందులో యాత్ర అంటే యుద్ధ యాత్ర అని అర్ధం .అంటే ఈ పండగ రాజులకు సంబంధించిన ముఖ్య పండగ .వర్షాకాలం యుద్ధానికి ప్రతికూలం .కనుక చాతుర్మాస్య దినాలు అవగానే శరదృతువు లో యుద్ధానికి బయల్దేరటం ఆచారం .శమీ పూజ చేసి రాజులు యుద్ధాలకు బయల్దేరుతారు .కన్నడ దేశం లో ‘’జంబూ సవారీ ‘’అని విజయ దశమి నాడు గ్రామ పొలిమేర దాటి బండ్లలోనో బండీలమీదనో కాలి నడకలోనో గ్రామ సరిహద్దు దాటి వెళ్ళటం ఆన వాయితీ .ఇప్పటికీ చేస్తున్నారు .దీనికే ‘’సీమోల్లంఘనం ‘’అంటారు .మేము హిందూపురం లో ఉండగా ఈ జమ్బూసవారి మాకు ఏంతో ఇష్టంగా ఉదేది ఆ రోజుల్లో గుర్రపు బళ్ళే.వాళ్ళు కూడా సరదాగా డబ్బులు వసూలు చేయకుండా ప్రక్కనే ఉన్న’’ సూగూరు ‘’దాకా తీసుకొని వెళ్లి తీసుకొచ్చేవారు .అక్కడ ప్రసిద్ధ శ్రీ ఆంజ నేయ స్వామి దేవాలయం ఉంది .స్వామికి మొక్కి తిరిగి వచ్చేవాళ్ళం అదొక పెద్ద కోలాహలం. బజారులన్నీ ఇలాంటి జనాలతో కిక్కిరిసి పోయేవి .మను స్మృతిలో కూడా యాత్ర అంటే దండ యాత్ర అనే అర్ధం లోనే వాడారు అని సరస్వతీ పుత్రులు చెప్పారు .
రామాయణం లో రామ రావణ యుద్ధం అతి తీవ్రం గా జరుగు తోంది .రాముడు రావణుడి తలలు తుంపిన కొద్దీ మళ్ళీ మొలుస్తూ చీకాకు పెట్టిస్తున్నాడు . రాముడు అలసి కొంత, భయ పడి కొంత ‘’దేవీపూజ ‘’చేశాడు. ఆమె మేల్కొన్నది ఆమె మేల్కొన్న రోజే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి .ఆమె ప్రసన్న అయి శ్రీరాముడికి విజయం సిద్ధిం చ టానికి వరం అనుగ్రహించింది .అ రోజు మొదలు పది రోజుల్లో రావణ సంహారం చేస ,విజయం పొంది పుష్పకం ఎక్కి సీతా దేవితో సహా అయోధ్య చేరాడు .అయోధ్యకు బయల్దేరటానికి ముందు కూడా రాముడు శమీ పూజ చేసే బయల్దేరాడని ఆచార్యుల వారు సెలవిచ్చారు .అయితే వాల్మీకి దీన్ని చెప్పలేదన్నారు .
ఇక భారత కధకు వస్తే అర్జునుడు పాండవ ఆయుధాలన్నీ శమీ వృక్షం మీద దాచి అజ్ఞాత వాసానికి బయల్దేరాడు .వాసం పూర్తికాగానే ఇక్కడికి వచ్చి శమీ పూజ చేసి ఉత్తర గోగ్రహణం లో విజయాన్ని కురుక్షేత్ర యుద్ధం లో శత్రు సంహారాన్ని చేసి విజయం సాధించి అన్నగారిని రాజ్యాభి షిక్తుడిని చేశాడు .విజయదశమి రోజే అర్జునుడు ‘’బృహన్నల ‘’గా మారిన రోజట.తిక్కన గారు భారతం లో –
‘’బహుళాస్టమి నీతడు స-న్నాహముతో పశువు బత్తు నవమిని మనగో-హ్రహణమని నిర్ణయించిన –నహి కేతను పలుకులకు మహాహ్లాదమునన్ ‘’అని తెలిపారు .వ్యాస మహర్షి సంస్కృత శ్లోకం లో –
‘ఆదా తుమ్గాః స్సుశార్మోధ కృష్ణ పక్షస్య సప్తమీం –అపరే దివసే సర్వ్ రాజన్ సంభూయ కౌరవాః- అష్ట మ్యాంతే హ్యగ్రుహ్నంత గోకులాని సహశ్రశః ‘’అని రాశారు .బహుళ అష్టమీ ,నవమీ తిధులు ఉత్తర గోగ్రహణానికి నిర్ణయింప బడ్డాయి అని తిక్కన రాస్తే ,వ్యాసుడు సప్తమి అష్టమి తిధుల్లో అని మూలం లో చెప్పాడు .బహుళ పక్షం లో అని ఇద్దరూ అన్నరుకనుక తిధులు పెద్దగా పట్టించుకోవక్కర్లేదని ,శుక్ల పక్ష దశమి కి దీనికి సంబంధం లేదని నారాయణాచార్యుల వారి తీర్పు .దీన్ని బట్టి అభిమన్యుని వివాహ ముహూర్తాన్ని నిర్ణయించ వచ్చు అంటారు ఆచార్య శ్రీ .
శ్రీ కృష్ణుడు కర్ణుడి తో ‘’అది సూర్యదయం మైత్రీ ముహూర్తం ,కార్తీక మాసం శరత్తు వెళ్లి హేమంతం వచ్చింది .రేవతీ నక్షత్ర యుక్తం .కాలం యుద్ధానికి మంచి అనుకూలం .ఈ మాసం సౌమ్య మాసం .కట్టెలు ,పొట్టు ,ఔషధాలు అన్నీ లభించేకాలం .బురద ఉండదు .ఈగా దోమా బాధ ఉండదు ఈ రోజుకి ఏడవ రోజున అమా వాస్య వస్తుంది .ఆరోజే యుద్ధం ప్రారంభం .’’అని చెప్పాడు .శ్రీ కృష్ణ రాయ బారం కార్తీక మాసం బహుళ షష్టి నాడు ప్రారంభమైంది .అష్టమి నాటికి హస్తిన నుంచి కృష్ణుడు తిరిగి వచ్చాడు .రాయబారం మాటలన్నీ కురు సభలో అష్టమి నాడే జరిగాయి .యుద్ధం ప్రారంభమైంది కార్తీక అమావాస్య నాడు .అభిమన్యుని వధ నాటికి అతని పెళ్లి అయి ఆరు నెలలయింది .ఏడవ నెలలో మృత్యువు పాలయ్యాడు .కనుక అభిమన్యుని వివాహం వైశాఖ మాసం లో జరిగింది .పాండవులు ఆశ్వయుజ శుక్ల దశమి నాడు శమీ పూజ చేశారు .కనుక ఈ పూజ అయిన ఏడెనిమిది నెలలకే అభిమన్యు వివాహం జరిగి ఉండాలి .కనుక విజయ దశమికి రామాయణ కదా తో సంబంధమే కరెక్ట్ గా సరి పోతోందని పుట్టపర్తి వారు లెక్కలు కట్టి నిగ్గు తేల్చారు .
ఆర్య కాలం లో ‘’అపరాజిత ‘’అనే శక్తి ఉంది .యుద్ధం లో జయం కోసం ఆమెను పూజించేవారు .మౌర్య చంద్ర గుప్తులకాలం లో కూడా ఈమె కు ప్రచారం బాగానే ఉండేది .చాణక్యుడు అర్ధ శాస్త్రం లో ‘’వైజయంత ‘’అనే దేవత పేరు చెప్పాడు .విజయ దశమికి ఈదేవతను పూజించి యుద్ధానికి బయలు దేరేవారట రాజులు .వైద్య శాస్త్రం లో అపరాజిత అంటే ‘’శమీ వృక్షం ‘’అనే పేరు ఉంది .అంటే అపరాజితా దేవికి స్థానం శమీ వ్రుక్షమేమో నని పుట్టపర్తి వారు ఊహించారు క్రమం గా ఆ దేవీ పూజ స్థానం లో శమీ పూజ ప్రారంభమై ఉండ వచ్చును అన్నారు వారు .దీని రహస్యం మంత్రం శాస్త్ర వేత్తలే తేల్చాలని వారు అభిప్రాయ పడ్డారు కూడా .శమీ వృక్షానికి విజయం చేకూర్చే లక్షణం ఉండి ఉండాలని నిశ్చయం గా చెప్పారు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-14-ఉయ్యూరు

