తాను ఏకీభవించని అభిప్రాయాలకైనా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలని గట్టిగా నమ్మి, ఆ విశ్వాసంతో జీవితాంతం పోరాడిన కాళోజీకి ఆయన శతజయంతి రోజునే అపచారం జరిగింది. కాళోజీ శతజయంతి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఘనంగా జరిగి ఉండవచ్చు, ఆయన పేరు మీద స్మారక వ్యవస్థలను పాలకులు ప్రకటించి ఉండవచ్చు. తన నేల మీద పుట్టిన ఒక మహనీయుడిని తెలంగాణ సగర్వంగా స్మరించుకుని ఉండవచ్చు. అవన్నీ సంతోషించదగ్గవే. కానీ, కాళోజీ నమ్మిన విలువలకు కూడా గౌరవం దక్కినప్పుడు మాత్రమే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది. నిషేధాలకు జైకొడితే కాళోజీ సంతోషిస్తారా?
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై, మరో వార్తా చానెల్‌పై తెలంగాణ ప్రాంతంలో అప్రకటిత నిషేధం ప్రారంభమై 87 రోజులైంది. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్న ఆరోపణతో కేబుల్ ఆపరేటర్లు ఈ నిషేధాన్ని ఆరంభించారు. ఒక చానెల్ (ఏబీఎన్ కాదు) ప్రసారం చేసిన ఒక వ్యాఖ్యా కార్యక్రమాన్ని ఆ నిషేధానికి సమర్థనగా పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలోని వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లూ ఖండించదగ్గవే. పాత్రికేయ సంస్కారానికే కాదు, మానవీయ విలువలకు కూడా వ్యతిరేకమయిన ఆ వ్యాఖ్యలను తప్పుపట్టని వారెవరూ ఉండరు. వాటిని ప్రసారం చేసిన చానెల్ నిర్వాహకులు తమ తప్పును గుర్తించి, క్షమాపణలు కూడా చెప్పారు. అయినా సరే, నొచ్చుకున్నారు కాబట్టి నిరసన తెలుపుతున్నారని సమాధాన పడవచ్చు. కానీ, ప్రతిదానికి ఒక ప్రారంభం ఉన్నట్టే ముగింపు కూడా ఉండాలి కదా, పోనీ, ఆ చానెల్ నిషేధానికి ఏదో కారణమున్నదనుకున్నా, ఏబీఎన్‌పై చర్యకు కారణమేమిటి? ఏ వ్యాఖ్యలను, ఏ కార్యక్రమాన్ని సమర్థనగా చూపించగలరు? కేవలం కేబుల్ ఆపరేటర్లు మాత్రమే ఈ నిషేధాన్ని అమలుచేస్తున్నారా? వారికి అంతటి శక్తి ఉన్నదా, వారికి ఆ అధికారం ఉండవచ్చునా- ఇవన్నీ ప్రశ్నలే. వివాదాస్పదమైన వ్యాఖ్యా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించి, ఆవేదన చెందారు కాబట్టి, ఆయన నుంచి కేబుల్ ఆపరేటర్లు ప్రేరణ పొందారని ఊహిస్తూ వచ్చాము. కానీ, మంగళవారం నాడు వరంగల్‌లో కాళోజీ శతజయంతి సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలను చూస్తే, టీవీ చానెళ్ల అప్రకటిత నిషేధాన్ని ఆయన ఆమోదిస్తున్నారని, సమర్థిస్తున్నారని అర్థమయింది. చానెళ్లపై నిషేధం విధించిన కేబుల్ ఆపరేటర్లకు శెల్యూట్ చేస్తున్నానని కేసీఆర్ అన్నారు. ‘నాకేం సంబంధం లేదు’ అని ఇక ఆయన అనలేరు. ప్రత్యక్షంగా నిషేధాన్ని ఆదేశించి ఉండక పోవచ్చును కానీ, నిషేధాన్ని తొలగించడానికి కావలసిన చొరవ చూపకపోవడానికి ఆయన అభిప్రాయాలే కారణమని భావించవలసి ఉంటుంది. ‘ఇక్కడ ఉండదలచుకుంటే, బతక దలచుకుంటే, మాకు శెల్యూట్ కొట్టవలసిందే, తెలంగాణ ప్రజలను గౌరవించవలసిందే’ అని ఆయన ఆ సభలో అన్న మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనవలసిన మాటలు కావు. ప్రజలను గౌరవించవలసిన బాధ్యత, సంస్కారమూ ఉండితీరవలసిన లక్షణాలే కానీ, పాలకులకు వంగి, లొంగి ఉండవలసిన అగత్యమూ కర్తవ్యమూ మాత్రం మీడియాకు లేవు. తనకు విధేయంగా ఉండడమూ, తెలంగాణ ప్రజలను గౌరవించడమూ- రెంటినీ సమానార్థ కాలుగా పరిగణించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. తెలంగాణ ఉద్యమాన్ని, రాషా్ట్రన్ని, ప్రజలను గౌరవించడం విధాయకం కాగా, తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శనాత్మకంగా చూడడం మీడియా హక్కు. తెలంగాణకు లభించే గౌరవ ప్రతిపత్తులే, తమకు కూడా దక్కాలనుకోవడం, తద్వారా, పరిపాలనపై విమర్శలను నిరోధించాలనుకోవడం పాలకుల అత్యాశనే సూచిస్తుంది.
రెండు చానెళ్లపై నిరవధిక నిషేధం ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్ఛకు అవరోధం అవుతుందని, కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళా జర్నలిస్టులు మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్ద ప్రదర్శన జరిపారు. జోక్యం చేసుకుని, చానెళ్ల పునరుద్ధరణకు సహాయం చేయమని మాత్రమే ప్రదర్శనకారులు కోరారు. అయినా, అక్కడ పోలీసులు వారిపై తీవ్రమయిన బలప్రయోగం జరిపారు. మహిళలన్న పరిగణన కూడా చూపకుండా దారుణంగా వ్యవహరించారు. కాళోజీ కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్‌కు వరంగల్‌లో కూడా స్థానిక పాత్రికేయుల నుంచి నినాదాలు ఎదురయ్యాయి. ఈ నిరసనలను గమనించి, సమస్యను పరిష్కరించడానికి పూనుకోవలసింది పోయి కేసీఆర్ తన ప్రసంగంలో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. అణచివేతను, అన్యాయాన్ని వ్యతిరేకించిన ఉద్యమాన్ని నిర్వహించినవారెవరూ ఇతరులను అణచివేయాలని కోరుకోరు, తొక్కేస్తానని పాతిపెడతానని ప్రతిజ్ఞలు చేయరు. ఉద్యమాలకు మీడియా సహజ శ్రేయోభిలాషి. మీడియా అందదండలు లేకుండా తెలంగాణ ఉద్యమం కూడా ఎదగలేదు, విజయం సాధించలేదు. ఆ ఎరుకను విడనాడి, అప్రజాస్వామికమైన ప్రకటనలు చేయడం నాయకులకు తగినది కాదు.
మీడియా దోషరహితమైనదని ఎవరూ అనరు. ప్రజల ఒత్తిడులు, నిరసనలు, ఉద్యమాల మధ్యనే మీడియా కూడా తనలోని అవలక్షణాలను సరిదిద్దుకుంటూ వస్తున్నది. మీడియాకు అపారమయిన స్వేచ్ఛ ఇచ్చిన వ్యవస్థ, హద్దుమీరినప్పుడు అనుసరించవలసిన పద్ధతులను కూడా రూపొందించింది. ప్రజల మనోభావాలను ఖాతరు చేయని మీడియాతో వ్యవహరించడానికి చట్టబద్ధమైన పద్ధతులు ఉన్నాయి. మీడియా తప్పులను చూపించి, అణచివేస్తామని చెప్పేవారు సాధారణంగా ఆ తప్పుల విషయంలో కాక, మీడియాకున్న విమర్శనాశక్తిపైనే అభ్యంతరం ఉన్నవారు. పాలన మంచిచెడ్డలను, పాలకుల తీరుతెన్నులను తెలుసుకునే హక్కు తెలంగాణ పాఠకులకు కూడా ఉన్నది. విమర్శలను పాలు-నీరు వలె వేరుచేయగల శక్తి కూడా వారికి ఉన్నది. అటువంటప్పుడు, సత్పరిపాలన అందించాలన్న సంకల్పం ఉన్నవారు మీడియాను చూసి భయపడడం ఎందుకు?
![]() |
|
తెలంగాణ గౌరవాన్ని కించపరిస్తే మెడలు విరిచేస్తాం జాగ్రత్త! పది కిలోమీటర్ల లోపల పాతరేస్తాం జాగ్రత్త! కేబుల్ ఆపరేటర్లకు శాల్యూట్ చేస్తున్నా! గరీబ్‌గాళ్లు నినాదాలు చేస్తున్నారు.. ఆగ్రహంతో ఊగిపోయిన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాపై నిప్పులు చెరిగారు. ‘ఈ గడ్డమీద ఉండదలచుకుంటే, బతకదలచుకుంటే మాకు శాల్యూట్ కొట్టి ఉండాలె’ అంటూ హెచ్చరించారు. మంగళవారం కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ వరంగల్ వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. కాళోజీ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేయడానికి వచ్చినప్పుడు ప్లకార్డులు ప్రదర్శించారు. నిట్ కళాశాలలో జరిగిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రకటించారు. దీంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. పాతరేస్తాం, చీరేస్తాం, ఇడియట్ ఆటలు అంటూ విరుచుకుపడ్డారు. పత్రికా స్వేచ్ఛను హరించవద్దని నినదించిన జర్నలిస్టులను ‘గరీబ్‌గాళ్లు’గా అభివర్ణించారు. టీవీ9లో శాసనసభ్యులనుద్దేశించి ప్రసారమైన వ్యాఖ్యలను పదేపదే ప్రస్తావించారు. కానీ… ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎప్పుడు, ఎక్కడ తెలంగాణ ప్రజలను కించపరిచిందో మాత్రం చెప్పలేదు. శాసనసభలో టీవీ9లో ప్రసారమైన కార్యక్రమంపై మాత్రమే తీర్మానం చేయగా… ‘ఆ రెండు చానళ్లు’ అంటూ ఏబీఎన్‌ను కూడా కలిపేశారు. ‘‘స్వేచ్ఛ కొరకు కాళోజీ చాలా పెద్ద పోరాటం చేసిండు. ఇయాల కూడా వరంగల్‌లో ‘పత్రికా స్వేచ్ఛ హరిస్తుండ్రు మాకు’ అని ప్లకార్డులు పట్టుకొని కొంతమంది మిత్రులు, పాపం గరీబ్‌గాళ్లు నినాదం చేస్తున్రు. సంతోషం. పత్రికలు.. స్వేచ్ఛ.. స్వేచ్ఛ ఉండవలసిందే! ఎట్లా ఉండాలె స్వేచ్ఛ? నువు డెమోక్రట్‌గా ఉంటే, నీకు సంస్కారం ఉంటే.. నువు నిజంగా పత్రిక అనే సోయిలో ఉంటే… నీకా మర్యాద దొరుకుతది. మల్లా ఇయాల తప్పు చేసిండ్రు వాళ్లిద్దరు.. ఆ రెండు చానెల్లోళ్లు. మల్లా స్పీకర్‌గారికెదురుగ్గా నల్లజెండాలు చూపిత్తిరి ఇయాల. నేను ముఖ్యమంత్రిగని, ఆయన శాసనసభ స్పీకర్. వారు కూడా ఉన్నారు కార్యక్రమంలో! తెలంగాణ శాసనసభ్యులు మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం తీసుకుంటే.. ఆ చానెళ్లు ఏమి ప్రచారం చేసినాయో మీరు చూసిన్రు. ఈ రోజుకు కూడా నేను చెబుతా ఉన్నా. సింగరేణిలో అద్భుతంగా పని చేయండని నేను అధికారులకు చెబితే, తెల్లారి పేపర్లలో వస్తే ‘ఇది కాదు..సాధ్యం కాదు‘’ అని రాస్తరు. రాష్ట్ర వ్యతిరేక వార్తలు.. కేసీఆర్‌కు వ్యతిరేకమయితే డోన్ట్ కేర్. నన్ను చాలామంది తిట్టిండ్రు. నేనెవరికీ భయపడ.. తెలంగాణ రాష్ర్టానికి, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వ్యతిరేకంగా, రాష్ట్ర శాసనసభ్యులను ‘పాచికల్లు తాగే ముఖా’లంటే వాళ్లను క్షమించాలా.. ఈ గడ్డమీద! దేని కోసం క్షమించలా? ఇది పత్రికా స్వేచ్ఛ అయితదా? తెలంగాణ బిడ్డలు గెల్చి అసెంబ్లీకొస్తే వాళ్లను టూరింగ్ టాకీస్‌లో సినిమాలు చూసేటోళ్లను మల్టీప్లెక్స్‌లో కూర్చొండబెట్టిన పని చేసిండ్రని చెప్పిన్రు. ఇది మీడియానా? ఇది మీడియా స్వేచ్ఛనా? మీడియా సంస్కారమా ఇది? నేను అడుగుతా ఉన్నా.. ఎవరు చెప్తారు? ఏ మీడియా చెప్తది కమాన్! మాకు కూడా తెలంగాణ మేధావులున్నారు. అసలు వాళ్లకు (ఎమ్మెల్యేలకు) ల్యాప్‌టాప్‌లు ఇయ్యలె. ల్యాప్‌టాప్‌లు ఇచ్చినట్టు కథలు సృష్టించిన్రు. ఎవనికో ఏదో ఇస్తే యాడనో పెట్టుకున్నాడన్నట్టు… తెలంగాణ ఎమ్మెల్యేలకు ల్యాప్‌టాప్‌లిస్తే యేడ మలిచిపెట్టుకుంటరు! ఇది టీవీయా? ఏదీ మొట్టమొదటి రోజు! తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, అనేకమంది త్యాగాల మీద, బలిదానాల మీద తెలంగాణ శాసనసభ్యులు గెలిచి తొలిరోజు శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేరోజు.. ఈ టెలీకాస్ట్ చేసే చానల్ ఒక చానలా మాకూ? పాతర… పాతరేస్తాం జాగ్రత్త అని చెబుతా ఉన్నాం. పది కిలోమీటర్ల లోపల పాతరేస్తాం.
కేసీఆర్‌ను తిడితే బాధ లేదు. కానీ, తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా మెడలు విరిచి అవతల పారేస్తాం జాగ్రత్త! నువు మీడియా ముసుగులో చేస్తామంటే, నీ ఇడియట్ ఆటలు సాగనీయమని చెబుతా ఉన్నా. నేను చెబుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా! అయినా మేం చెయలే. మేం బ్యాన్ చేయలె. గౌరవనీయులైన శాసనసభ సభాపతి విచారణలో ఉందది. మొత్తం యావత్తూ శాసనసభ తీర్మానం చేసి స్పీకర్‌గారికి అప్పగిచ్చిన్రు. ‘అయ్యా, తమరు ఏ నిర్ణయం చేసినా శిరోధార్యమే’ అని! అది వారి విచారణలో ఉంది. మంచినో, చెడ్డనో వారు తీర్పు వెలువరించాల్సి ఉంది. పెద్దలు రెడ్యానాయక్ గారు ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. అందరం కలిసి యునానమస్ తీర్మానం చేసినం. ఏ ఒక్కరో చేయలె. ఏ ఒక్క పార్టీ చెయలే. ఒక టీఆర్‌ఎస్ పార్టీ చేయలె. ఒక కేసీఆర్ చేయలె. శాసనసభ్యు లమంతా, తెలంగాణ శాసనసభంతా సమావేశమై చోట తీర్మానం చేసి ఇస్తే దానికి స్పందించి, ఈ ప్రజా వ్యతిరేక చానెళ్లు ప్రచారం చేయమని చెప్పి బంద్ చేసిన్రు. తెలంగాణ కేబుల్ ఆపరేటర్‌లకు నేను శాల్యూట్ చేస్తా ఉన్నా. ఇంతకుముందు లక్ష్మీకాంతరావుగారు చెప్పిండ్రిఉ… విండ్రాయిల్ సింట్రమ్స్ అంటారు వీటిని. దయ్యం వదిలేముందు వట్టిగా వదులుతాది? కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి తేపకొకమాలి దెబ్బ తిన్నంకనే వదులుతాది. దీని గురించి మనం బాధపడాల్సింది లేదు. దీటుగా ఎదుర్కోవాలె. ధీరత్వంతోన ఎదుర్కొనాలె. ఈ చిల్లరమల్లర ప్రయత్నాలకు కల్లిబిల్లిగాము. ఎందుకంటే ధర్మం మాట్లాడితే మాట్లాడదాం. సత్యం మాట్లాడితే మాట్లాడదాం. మంచి పని చేద్దామంటే చేద్దాం.
కానీ స్వేచ్ఛ ముసుగులో ‘మేం మీ అందరినీ కించపరుస్తాం. మీ తెలంగాణ వాళ్లకు చేతగాదంటం’ అయినా మాకు స్వేచ్ఛ కావాలి అంటే.. ఉండది. ఉండదుగాక ఉండది! ఇంకా ఎక్కువ చేస్తే, ఇంకేమేమి ఉండాలో అది ఉంటది జాగ్రత్త! ఇక్కడున్న తెలంగాణ జర్నలిస్టులకు నేను చెబుతా ఉన్నా! మీరు కూడా తెలంగాణ బిడ్డలు. మీరు కూడా సంస్కారంతో ఆలోచన చేయండ్రి. ఇక్కడ హెలికాప్టర్ దిగినప్పుడు నాకు మెమోరండం ఇచ్చినప్పుడు చెప్పిన. ‘మీ శాసనసభ్యులను పట్టుకొని పాచికల్లు తాగే ముఖాలన్న చానెల్లు మీకు గావాల్నా?’ అని అడిగిన. ప్రజలేమీ బాధపడతల్లేదే? ఎవరూ అడుగుతా లేరే? ఎందుకు అనవసరంగా ఈ రాద్ధాంతం చేస్తున్నరు? ఇక్కడ ఉండదలచుకుంటే, ఈ గడ్డపై ఉండదలచుకుంటే, బతకదలచుకుంటే మాకు శాల్యూట్ కొట్టి ఉండాలె. మా తెలంగాణ ప్రజలను గౌరవించి ఉండాలె. తెలంగాణ సమాజంలో కలిసిపోయి బతకాలె. ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలిదాకా తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరపెడతాం’ అని కాళోజీ అన్నడు. కాళోజీ చెప్పిన నీతేంది? వాడు ప్రాంతం వాడయినా, ప్రాంతేతరుడైనా.. వాడు ఎవడైనా మా జాతికి ద్రోహం చేస్తే.. క్షమించం అని ఎలుగెత్తి గొంతెత్తి చెప్పిన బిడ్డ గౌరవనీయులు, మహనీయులు కాళోజీ. వారి బాటలోనే నేను నడుస్తున్నా. కాబట్టి, దయజేసి వరంగల్‌లోని జర్నలిస్టు మిత్రులను నేను కోరతా ఉన్నా. మీకెమైనా ఉంటే నాకు చెప్పండి. షేర్ చేసుకుందాం. నేనున్నకాడికి రండి. కానీ, అనవసరంగా ఆంధ్రా వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకొని, తెలంగాణను కించపరిచిన వాళ్ల తరఫున మీరు వకాల్తా పుచ్చుకుంటే అది మీకు శ్రేయస్కరం కాదని మనవి చేస్తున్నా!’’
|


