తమిళ గడ్డపై గాయత్రి వీణ నాదం

ఆరేళ్ల ప్రాయంలోనే సరస్వతీదేవి కటాక్షించింది… తన చేతుల్లోని వీణనే ఆమెకు ఇంటిపేరుగా ప్రసాదించింది.. ఇంకేముందీ !! బాల గాయత్రి అంచెలంచెలుగా ఎదిగి, ‘వీణా’గాయత్రిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆమే ఈచంపాటి గాయత్రి. నిన్నటి తరం సినీసంగీత ప్రియులను తన మధురబాణీలతో ఉర్రూతలూగించిన సంగీత దిగ్గజం అశ్వత్థామ కుమార్తెగా కన్నా, వీణా గాయత్రిగా సంప్రదాయ సంగీత ప్రపంచంలో గుర్తింపు పొందారామె. తమిళనాడు సంగీతం, లలిత కళల విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా పదవిని చేపట్టి.. అభినందనలు అందుకుంటున్న ఆమె తెలుగింటి ఆడపడుచు.

1984 సంవత్సరంలో దివంగత భారతరత్న ఎంజీఆర్‌ చేతుల మీదుగా తమిళనాడు ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘కలైమామణి’ దక్కడం మరో ఎత్తు. అప్పటికే లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నా, కలైమామణి ఇచ్చిన సంతృప్తి ప్రత్యేకం. బీబీసీ సంస్థ వారు నా ప్రదర్శన సమర్పకులుగా వ్యవహరించడాన్ని కూడా నేను గొప్పగా భావిస్తున్నా.

ట్రిప్లికేన్‌లోని పార్థసారథి ఆలయంలో జరుగుతున్న త్యాగరాజ ఉత్సవాల్లో కచేరి ఇవ్వాల్సిందిగా పిలుపొచ్చింది. సుప్రసిద్ధ ఆలయంలో, అందునా త్యాగరాజ ఉత్సవాల్లో కచ్చేరి అంటే మాటలా..? ఆ కచ్చేరి కోసం ఎంతలా ఎదురుచూశానో.. ఎట్టకేలకు సమయం వచ్చింది. భారీ వేదిక జనాలు కిక్కిరిసి ఉన్నారు. అయినా నాలో ఏ మాత్రం భయం కానీ, బెరుకు కానీ లేవు. తన్మయత్వంలో మునిగిపోయి నేను వీణను వాయించినంత సేపు అంతా మౌనంగానే ఉన్నారు.

‘‘మా నాన్న అశ్వత్థామ ప్రముఖ సంగీత దర్శకులు. అమ్మ కమల అశ్వత్థామ సంగీత విద్యాంసురాలు. ఇంట్లోనే సంగీత వాతావరణం ఉండడంతో నేను కూడా అటువైపే ప్రయాణించానని అనుకోవడం లేదు. కాని, నా రక్తంలోనే సంగీతం ఉందని మాత్రం గట్టిగా నమ్ముతాను. మాట నేర్చిన వయస్సు నుంచే అమ్మ ఆలపించే కీర్తనలను ఆసక్తిగా విని, అందుకు తగ్గట్టుగా తాళం వేసేదాన్నని నాన్న చెబుతుండే వారు. అమ్మకు వీణావాయిద్యంలో మంచి ప్రావీణ్యం ఉండడంతో నేను కూడా వీణనే నా ప్రధాన వాయిద్యంగా ఎంచుకున్నాను. నాన్న నిత్యం సినిమా సంగీతంలో బిజీగా ఉండడంతో అమ్మతోనే సాన్నిహిత్యం పెరిగి అమ్మతోనే నా సంగీత ప్రయాణం ప్రారంభించా. ఆ రకంగా నాకు ఆది గురువులు తల్లిదండ్రులే!
ఆరేళ్ల ప్రాయంలోనే…
అతి చిన్న వయస్సు నుంచే వీణా వాద్యంతో మమేకమైన నేను సాధన చేస్తున్నప్పుడు ఎవరైనా ఆటంకం కలిగిస్తే, ఏడ్చేదాన్నట. నేను పెద్దయిన తరువాత మా నాన్న ఈ విషయం చెప్పి మరీ నవ్వించే వారు. అంతలా వీణను ప్రేమించాను కాబట్టే ఆరేళ్ల ప్రాయంలోనే తొలి ప్రదర్శనఇవ్వగలిగాను. చెన్నై రాజా అన్నామలై పురంలోని కర్పగ వినాయకర్‌ ఆలయం (గణపతి ఆలయం) నా తొలి వేదిక. ఆదిపూజలు అందుకునే గణనాథుడి ఆలయంలో ప్రదర్శన ప్రారంభం కావడం కూడా ఒకరకంగా దైవాధీనమేనని ఇప్పటికీ భావిస్తుంటా. ఆ వయస్సులోనే వీణపై నా చేతులు పలికించిన తీరు అందరినీ ముగ్ధులను చేసేదట. ఆ ప్రదర్శనతో ఆరేళ్ల వయస్సులోనే మా వీధిలో నేనో బుల్లి సెలబ్రిటీని అయ్యా. నాలో ప్రతిభను తొలుత అమ్మ గుర్తిస్తే, ఆ ప్రదర్శనతో నాన్న కూడా నేనో ప్రత్యేకమని అప్పటి నుంచే గుర్తించడం ప్రారంభించారు. ఆ రకంగా నా ధ్యాస పూర్తిగా సాధనపైనే ఉండేది.
త్యాగరాజ ఉత్సవాల్లో..
అప్పుడు నాకు సరిగ్గా తొమ్మిదేళ్లుంటాయి. అప్పటికే బాలగాయత్రిగా మా వీధి చుట్టుపక్కలకు కూడా నా పేరు పాకింది. ట్రిప్లికేన్‌లోని పార్థసారథి ఆలయంలో జరుగుతున్న త్యాగరాజ ఉత్సవాల్లో కచేరి ఇవ్వాల్సిందిగా పిలుపొచ్చింది. సుప్రసిద్ధ ఆలయంలో, అందునా త్యాగరాజ ఉత్సవాల్లో కచ్చేరి అంటే మాటలా..? ఆ కచ్చేరి కోసం ఎంతలా ఎదురుచూశానో.. ఎట్టకేలకు సమయం వచ్చింది. భారీ వేదిక జనాలు కిక్కిరిసి ఉన్నారు. అయినా నాలో ఏ మాత్రం భయం కానీ, బెరుకు కానీ లేవు. తన్మయత్వంలో మునిగిపోయి నేను వీణను వాయించినంత సేపు అంతా మౌనంగానే ఉన్నారు. సంగీత దిగ్గజం సాంబమూర్తి గారు అక్కడే ఉన్నారు. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆయన వేదికపైకి వచ్చి, ఈ చిన్నారి ‘బాల సంగీత మేధావి’ అని అభివర్ణించడం ఇప్పటికీ మరపురాని జ్ఞాపకం. ఆ సందర్భం తలచుకున్నప్పుడల్లా వందలాదిగా తరలివచ్చిన ప్రేక్షకులు కరతాళ ధ్వనులు నా చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. మరచిపోలేని అనుభూతి అది. అక్కడ నుంచి నేను వెనుదిరగాల్సిన పని లేకుండా పోయింది. అమ్మ సారథ్యంలోనే వీణా సాధన చేస్తూ వచ్చిన నేను గాత్రంలో మాత్రం సంగీత కళానిధి టి. త్యాగరాజన్‌ వద్ద శిక్షణ పొందాను. కర్ణాటక సంగీతంలోని మెళకువలు ఆయన శిక్షణలో చాలా వరకు నేర్చుకున్నా.
జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి సమక్షంలో..
ఇవన్నీ ఒక ఎత్తయితే, నా పదకొండో ఏట కంచి కామకోటి పీఠం జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం. మహామహులకు ఆయన దర్శనం దొరకని రోజుల్లో, నాకు ఆయన సమక్షంలో వీణ వాయించే అవకాశం వచ్చింది. అప్పటి నుంచే నాలో ఆధ్యాత్మిక చింతన పెరిగిందనుకుంటా. నా ప్రదర్శన ముగిసిన వెంటనే స్వామి నాకు గంధపు చెక్కతో చేసిన ‘ఓం’ ముద్రను ఇచ్చారు. ప్రదర్శన సమయంలో దీన్ని ధరించమని సూచించారు. నాకు దక్కిన అపురూపమైన బహుమతి అది. ఇప్పటి వరకు నా దగ్గర ఆ బహుమతిని పదిలంగా దాచుకున్నా.
తమిళనాడు ప్రభుత్వ గుర్తింపు…
అతి చిన్నవయస్సులోనే ప్రొఫెషనల్‌ కావడంతో చెన్నై ఆకాశవాణి కేంద్రంతో పాటు, పలు ప్రఖ్యాత వేదికలపై కచ్చేరీలు చేసే అవకాశం దక్కింది. యూఎస్‌ఏ, యూకే, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాల్లోనూ నా ప్రదర్శనలకు మంచి ఆదరణ లభించింది. సినీ పరిశ్రమలోని దాదాపు మేటి సంగీత దర్శకుల వద్ద పనిచేసిన తృప్తి కూడా మిగిలింది. రెండు దశాబ్దాల పాటు పలువురు సంగీత దర్శకుల వద్ద వీణా కళాకారిణిగా పనిచేశాను. ఇవన్నీ ఒక ఎత్తయితే,
1984 సంవత్సరంలో దివంగత భారతరత్న ఎంజీఆర్‌ చేతుల మీదుగా తమిళనాడు ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘కలైమామణి’ దక్కడం మరో ఎత్తు. అప్పటికే లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నా, కలైమామణి ఇచ్చిన సంతృప్తి ప్రత్యేకం. బీబీసీ సంస్థ వారు నా ప్రదర్శన సమర్పకులుగా వ్యవహరించడాన్ని కూడా నేను గొప్పగా భావిస్తున్నా.
వీసీ కావడం అదృష్టం.. 
రాష్ట్రంలో సంగీతానికి, లలిత కళలకు ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడు సంగీత, లలిత కళల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆమె విశ్వవిద్యాలయం కులపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొయంబత్తూరు, మధురై, తిరువైయ్యారు, తిరుచ్చి, చెన్నై ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ సంగీత కళాశాలలు ఉండగా, వీటన్నిటినీ ఒక యూనివర్శిటీ కిందకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే యూనివర్శిటీని ప్రారంభించారు. అంతకుముందు సంగీత కళాశాలలు అన్నిటికీ కలిపి నన్ను గౌరవ డైరెక్టర్‌గా ముఖ్యమంత్రి జయలలిత నియమించారు. అప్పటికే ఆమె దృష్టిలో నేను ఉండడం, సంగీత సాధనలో నా ప్రయాణాన్ని దగ్గరుండి చూడడం వల్ల ఆమె నుంచి నాకు పిలుపు వచ్చింది. ఆ రకంగా 2011 సంవత్సరంలో వర్శిటీ గౌరవ డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టాను. ఆ తర్వాత గత ఏడాది తమిళనాడు సంగీత, లలిత కళల యూనివర్శిటీ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించాను. యూనివర్శిటీ తొలి ఉపకులపతి కావడం నా అధృష్టం..’’
ఫ గొల్లపల్లి ప్రభాకర్‌, చెన్నై

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.