పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5
శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం
శ్రీ వైష్ణవులకు వాల్మీకం పరమ ప్రమాణ గ్రంధం .శరణాగతి కావ్యం .ఇందులోని పాత్రలను వారు పిలుచుకొనే తీరే గమ్మత్తుగా ఉంటుంది .శ్రీరాముడిని ‘’పెరుమాళ్ ‘లేక ‘’తిరుముకన్ ‘’అంటారు లక్ష్మణున్ని ‘’ఇలైయ పెరుమాల్ ,అలాగే భరత శత్రుఘ్నులను భరతాళ్వాన్ ,శత్రుఘ్నాళ్వాన్ అని పిలుచుకొంటారు .నిత్య రక్షకురాలు కనుక సీతమ్మను ‘’పిరాట్టి ‘’అంటారు .సుగ్రీవుడు మహారాజర్ .జటాయువు ‘’పెరియఉడయ్యార్ ‘’.దశరధుడిని చక్రవర్తి అని ,హనుమను ‘’శిరియ తిరువడి ‘’అని పిలవటం ఉంది .గరుత్మంతుడు స్వామి అన్ని అవతారల్లోను సేవిన్చాడుకనుక ‘’పెరియ తిరువడి ‘’అయ్యాడు. హనుమకు రామావతారం తోనే సంబంధం .లక్ష్మణుడు శ్రీవైష్ణవం లోని ‘’శేషత్వానికి ‘’ప్రతీక .శేష శేషిత్వం ఈ సంప్రదాయం లో మాత్రమె ఉంటుంది .దీనికే ‘’ప్రతి తంత్రం ‘’అంటారు వారు .అంటే ఇతర సిద్ధాంతాలలో లేకుండా ఒకే ఒక్క సిద్ధాంతం లో వచ్చ్చే నియమం .భరతుడు ‘’భగవత్ పార తంత్రానికి ‘’చిహ్నం .’’భాగవత శేషత్వం ‘’శత్రుఘ్నునిలో దర్శిస్తారు .శరణాగతికి విభీషణుడు నిలు వెత్తు రూపు .హనుమ లో ‘’ఆచార్య స్వరూపం ‘’చూస్తారు .రామాయణ పాత్రలన్నీ రాముని శరణాగతి పొందినవే నని వారు భావిస్తారు .శ్రీవైష్ణవం లో పరమేశ్వర స్వరూపం నిరూపిత స్వరూప ధర్మం ,స్వరూప ని రూపక ధర్మం అని రెండు పద్ధతులున్నాయి .నిరూపిత స్వరూప ధర్మం లో శ్రీరాముని పరతత్వాన్ని శూర్పణఖ ప్రకాశింప జేసింది..స్వామి స్వరూప ధర్మం అయిన నిత్య యవ్వనం ను ఆమె దర్శించింది .స్వామి నేత్రాలను ‘’పుండరీకాక్షుడు ‘’గా చెప్పింది అన్న రావణుడితో .ఆచార్య సేవకు శబరి గొప్ప ఉదాహరణ .రాముడు ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె స్వామితో ‘’మయా తు వివిధం వన్యం సంచితం పురుషభ-తవార్దే పురుష వ్యాఘ్రః పంపా యాస్తీర సంభవం ‘’అన్నది .అంటే ‘’స్వామీ !నువ్వు పురుష శ్రేస్టూడివి .పరమ పురుషుడివి .నీకోసం ఈ ఫల పుష్పాలు సేకరించాను .’’అన్నది .గురు శుశ్రూష ఫలించిందా అని ఆమెను రాముడు ప్రశ్నిస్తే ‘’చక్షుషా తప సౌమ్యేన పూతాస్మి రఘునందన –పాద మూలం గమిష్యామి యానహం పర్య చారిషం ‘’అంటుంది .అంటే నీ ప్రసన్న దృక్కుల తో పవిత్రురాలి నయ్యాను .నీ ఆజ్ఞతో నేను నాజన్మ అంతా సేవించిన ఆచార్యుల సన్నిధికి పోతున్నాను ‘’అన్నది .శ్రీవైష్ణవం లో ఆచార్యునికి ఉన్న గౌరవం మరి దేనికీ లేదు అందుకే ఆ మాట అన్నది .పుణ్య లోకాలకో శ్రీ వైకుంఠానీకో పో తు న్నానని అనలేదామే .గురు సన్నిధికి చేరుతున్నానన్నది .అదే పరమ వైష్ణవ ధర్మ అంటారు పుట్టపర్తి వారు వ్యాఖ్యానిస్తూ .ఆచార్య పాదం చేరటమే ఉత్తమ స్తితి స వారికి .ఆచార్య పాద కైంకర్యమే బంధ మోక్షాలకు ముఖ్య ఫలం అని నారాయణా చార్యుల వారి వ్యాఖ్య
శ్రీ వైష్ణవం లో సీతాదేవి పురుష కార స్వరూపిణి .ఆమె అనుగ్రహం లేకుండా పురుశు డికి కి కారుణ్యం లభించదు .ఆమెను తిరస్కరించి నందుకే శూర్పణఖ ఇడుముల పాలైంది .రావణుడు పరమ పురుషుడిని తృణీకరించి ఫలితం అనుభ విన్చాడని వారు అంటారు .రావణ సంహారం తర్వాత రాక్షస స్త్రీలనుహనుమ చంప బోతుంటే పురుషకార స్వరూపిణి అయిన సీతాదేవి వారించింది .ఓం కారానికి వీరి సిద్ధాంతం లో అ అంటే అకార వాచ్యుడు అయిన పరమాత్మ .మ జీవుడు .మధ్యలో ఉన్న ఉకారం లక్ష్మీ స్వరూపం .లక్ష్మీదేవి పురుషకారం వల్లనే జీవుడు పరమాత్మను పొందుతాడు అని అర్ధం .దీనికి సీతారామ వన వాసం లో ఉన్న శ్లోకాన్ని ఉదహరిస్తారు –
‘’అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా –పృష్ట తస్తు ధనుష్పాణిః లక్ష్మణో నుజగామ సః’’
ముందు రాముడు మధ్యలో సీత చివర ధనుస్సు ధరించిన లక్ష్మణుడు .దీనినే తులసీదాసు తమాషాగా చెప్పాడని పుట్టపర్తివారు అంటారు .ఏమిటంటే –రాముడిని చూడాలి అని తమ్ముడికి కోరిక కలిగితే సీతాదేవికి నమస్కరిస్తాడట అప్పుడు సీత కొద్దిగా పక్కకు జరుగుతుంది. అప్పుడు రాముడిని చూసి నమస్కరిస్తాడట రామానుజుడు .విశిస్టాద్వైతుల సిద్ధాంతం లో రామాయణాన్ని వర్ణించాలంటే పెద్ద గ్రంధమే అవుతుందన్నారు ‘’కొన్వస్విన్ సాం ప్రతం లోకే ‘’అనే మూడు శ్లోకాలలో పదహారు గుణాలున్నాయని శ్రీవైష్ణవుల భావన ..ఈ గుణాలకు వారు చేసే వ్యాఖ్యానాలు అనేకం .శ్రీవైష్ణవం లో రామాయణం ‘’ద్వయ మంత్రం ‘’కు ,మూల మంత్రానికి వివరణ మాత్రమే అంటారు సరస్వతీ పుత్రులు.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-14-ఉయ్యూరు

